
గతేడాది చివర్లో మందగించిన ప్రైమరీ మార్కెట్ మళ్లీ జోరందుకుంటోంది. కొద్ది రోజులుగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి వరుసగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. తాజాగా 5 కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: ఇటీవల పలు కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ మళ్లీ ఊపందుకుంటోంది. తాజాగా ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకరేజీ సంస్థ ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఈ బాటలో ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్, రన్వాల్ ఎంటర్‌ప్రైజెస్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, ప్రోజీల్ గ్రీన్ ఎనర్జీ సైతం ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి.
రూ.745 కోట్లు
గతేడాది డిసెంబర్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ జనవరిలో తిప్పి పంపిన నేపథ్యంలో ఆనంద్ రాఠీ షేర్ మరోసారి సవరించిన ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. వీటి ప్రకారం తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ.745 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. నిధుల్లో రూ.550 కోట్లు దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఆనంద్ రాఠీ బ్రాండుతో బ్రోకింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్టుల పంపిణీ తదితర ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తోంది. 2024 సెపె్టంబర్30కల్లా ఆరు నెలల్లో రూ.442 కోట్ల ఆదాయం, రూ.64 కోట్ల నికర లాభం సాధించింది.
రూ.2,000 కోట్లు
ఐపీవో ద్వారా నాన్‌ఫెర్రస్ మెటల్ ప్రొడక్టుల తయారీ సంస్థ జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ రూ.2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇష్యూకింద రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ.1,500 కోట్ల విలువైన వాటాలను ప్రస్తుత ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. నాన్‌ఫెర్రస్ మెటల్ రద్దు రీసైక్లింగ్ ద్వారా కంపెనీ అలాయ్, కాపర్ ఇన్‌గాట్స్, అల్యూమినియం అలాయ్స్ తదితర ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఐకాన్ స్క్వేర్‌తో భాగస్వామ్యంతో షార్జాలో గోల్డ్ రిఫైనింగ్ యూనిట్‌ను నెలకొల్పుతోంది.
రూ.1,000 కోట్లు
ఐపీవోలో భాగంగా రియల్టీ రంగ సంస్థ రన్వాల్ ఎంటర్‌ప్రైజెస్ తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. నిధుల్లో రూ.200 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ.450 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టుల కొనుగోలుకి వెచి్చంచనుంది. 2024 సెపె్టంబర్ 30 కల్లా ఆరు నెలల్లో దాదాపు రూ.271 కోట్ల ఆదాయం, రూ.25 కోట్లకుపైగా నికర లాభం సాధించింది.
రూ.600 కోట్లు
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ సర్వీసులందించే ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ లిమిటెడ్ మళ్లీ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. కంపెనీ ఇంతక్రితం 2021 సెప్టెంబర్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ లిస్టింగ్‌కు వెళ్లలేదు. ఈక్విటీ నిధుల్లో రూ.481 కోట్లు క్లౌడ్ కంప్యూటింగ్ ఇనస్టలేషన్‌సహా, డేటా సెంటర్ల కోసం పరికరాల కొనుగోళ్లకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. నెక్స్‌డిగ్ నివేదిక ప్రకారం దేశీయంగా కమ్యూనిటీ క్లౌడ్ సరీ్వసులను ప్రవేశపెట్టిన తొలి కంపెనీ ఈఎస్‌డీఎస్‌కాగా.. 2024 సెప్టెంబర్30కల్లా ఆరు నెలల్లో దాదాపు రూ.172 కోట్ల ఆదాయం, రూ.24 కోట్ల నికర లాభం సాధించింది.
రూ.700 కోట్లు
పునరుత్పాదక ఇంధన సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్రోజీల్ గ్రీన్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ.700 కోట్ల సమీకరించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ.350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్లు మరో రూ.350 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.250 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.19.53 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది.
ఇండిక్యూబ్ ఐపీవోకు ఓకే
సెబీ గ్రీన్ సిగ్నల్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఐపీవో చేపట్టేందుకు మేనేజ్‌డ్ వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ కంపెనీ ఇండిక్యూబ్ అనుమతి పొందింది. ఈ బాటలో ఆగ్రోకెమికల్ సంస్థ జీఎస్‌పీ క్రాప్ సైన్స్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ నిధుల సమీకరణకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్‌లో దరఖాస్తు చేసిన ఈ 3 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,260 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. అయితే ఎడిల్‌వీజ్ అనుబంధ సంస్థ ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్ లిమిటెడ్, నీల్‌కాంత్ రియల్టర్స్ ప్రాస్పెక్టస్‌లను సెబీ తిప్పి పంపింది. మరోపక్క జీఎన్‌జీ ఎల్రక్టానిక్స్, అన్లాన్ హెల్త్‌కేర్ దరఖాస్తులను వెనక్కి తీసుకుంది.
రూ.850 కోట్లు
ఐపీవోలో భాగంగా ఇండిక్యూబ్ రూ.750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ నిధుల్లో రూ.427 కోట్లు పెట్టుబడి వ్యయాలకు, రూ.100 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. జీఎస్‌పీ క్రాప్ సైన్స్ ఐపీవోలో భాగంగా రూ.280 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జత గా మరో 60 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ నిధుల్లో రూ.200 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. ఐపీవోలో భాగంగా గణేశ్ కన్జూమర్ రూ.130 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.24 కోట్ల షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు ఆఫర్ చేయనున్నారు.
ఇదీ చదవండి: జీఎస్‌టీ వసూళ్ల రికార్డు