
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 592.93 పాయింట్లు లేదా 0.78 శాతం పెరిగి 76,617.44 వద్ద స్థిరపడింది. సూచీ 76,680.35 - 76,064.94 రేంజ్‌లో ట్రేడ్ అయింది.
జొమాటో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు 4.75 శాతం వరకు లాభపడటంతో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు 1.36 శాతం వరకు నష్టపోయాయి.
సెన్సెక్స్‌కు అద్దంపడుతూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 166.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 23,332.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 23,350 వద్ద గరిష్టాన్ని, 23,158.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.61 శాతం లాభపడటంతో మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.12 శాతం లాభంతో ముగిసింది.
ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ అత్యధికంగా 3.61 శాతం లాభపడింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 2.51 శాతం వరకు లాభపడ్డాయి.