మళ్లీ మార్కెట్ల దూకుడు
- కొత్త రికార్డుల వెల్లువ
- 136 పాయింట్లు ప్లస్
- 22,765 వద్దకు సెన్సెక్స్
- 6,800 అధిగమించిన నిఫ్టీ
- ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఓకే
మార్కెట్ల దూకుడు కొనసాగుతోంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయ్. దీంతో సంస్కరణలు జోరందుకుంటాయన్న ఆశలు సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయి. వెరసి మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. తద్వారా మరోసారి కొత్త రికార్డులకు తెరలేపాయి.
సెన్సెక్స్ 136 పాయింట్లు పుంజుకుని 22,765 వద్ద ముగియగా, 38 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 6,818 వద్ద నిలిచింది. ఈ బాటలో ఇంట్రాడేలో సెన్సెక్స్ 22,795ను తాకగా, నిఫ్టీ 6,825కు చేరింది. ఇవన్నీ కొత్త రికార్డులే కావడం విశేషం! గురువారం రూ. 433 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 213 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ రూ. 218 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం మెజారిటీ సాధిస్తుందన్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేషకుల తెలిపారు.
క్యాపిటల్ గూడ్స్ జోరు
బీఎస్‌ఈలో ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు 3-1.5% మధ్య లాభపడ్డాయి. గోవాలో ముడిఇనుము మైనింగ్‌పై ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీం కోర్టు తొలగించడంతో సెసాస్టెరిలైట్ దాదాపు 5% ఎగసింది.
చిన్న షేర్లకు డిమాండ్
ట్రేడైన షేర్లలో 1,761 లాభపడితే, కేవలం 1,029 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో బోనస్ షేర్ల జారీ అంచనాలతో బయోకాన్ 10% జంప్ చే యగా..ప్రమోటర్లకు ప్రిఫరెన్స్ షేర్ల జారీ వార్తలతో షషున్ ఫార్మా 20% దూసుకెళ్లింది. ఇక కోపగ్జోన్ జనరిక్ ఔషధాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువడటంతో నాట్కో ఫార్మా 7.5% ఎగసింది. ప్రోత్సాహకర ఫలితాలతో లిబర్టీ షూస్ 14% జంప్‌చేయగా, హెచ్ సీఎల్ ఇన్ఫో, జిందాల్ సౌత్, కల్పతరు పవర్, సింఫనీ, డిష్‌మ్యాన్, ఐవీఆర్‌సీఎల్, సుజ్లాన్, జేబీ కెమ్, నవభారత్, ఆర్కిడ్ కెమ్ 11-6% మధ్య ఎగశాయి.