పరిశ్రమలు ట్రాక్‌లోకి..!
నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 3.8 శాతం
⇒ఐదు నెలల గరిష్ట స్థాయి ఇది...
⇒తయారీ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్ దన్ను
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో రికవరీ ఆశలకు ఊతమిచ్చింది. వృద్ధి రేటు 3.8 శాతంగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా ఈ రేట్లను లెక్కిస్తారు. 2013 నవంబర్‌లో ఈ సూచీలో అసలు వృద్ధిలేకపోగా 1.3% (మైనస్) క్షీణించింది.
2014 అక్టోబర్‌లో (2013 అక్టోబర్‌తో పోల్చితే) అసలు వృద్ధి లేకపోగా 4.2 శాతం క్షీణించిన ఈ రేటు, నవంబర్‌లో ఐదు నెలల గరిష్ట స్థాయిలో నమోదుకావడం పట్ల ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తయారీ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ వంటి రంగాల సానుకూల ఫలితాలు మొత్తం ఐఐపీ సంతృప్తికర వృద్ధికి కారణమైంది. కేంద్ర గణాంకాల కార్యాలయం తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్య రంగాలను చూస్తే...
తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ రంగం వృద్ధి రేటు నవంబర్‌లో 3 శాతంగా ఉంది. 2013 ఇదే నెలలో ఈ రేటులో అసలు వృద్ధి లేకపోగా -0.4 శాతం క్షీణించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 నవంబర్‌లో సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి.
క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు ప్రతిబింబంగా, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ రంగం వృద్ధి రేటు 1.6 శాతం నుంచి 3.4 శాతానికి చేరింది.
విద్యుత్: ఈ రంగం మంచి ఫలితాలను నమోదుచేసుకుంది. నెలవారీగా ఈ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 10 శాతానికి చేరింది.
వినియోగ వస్తువులు: వినియోగ వస్తు ఉత్పత్తి క్షీణతలోనే (-2.2%) కొనసాగుతోంది. అయితే 2013 ఇదే నెలతో పోల్చితే క్షీణ రేటు తగ్గడం (-8.9%) కొం తలో కొంత ఊరట.
ఆరు నెలల్లో: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 2.2% నమోదయ్యింది. 2013-14 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 0.1 శాతం.
దీర్ఘకాలం కొనసాగాలి.. పరిశ్రమలు: నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఇదే ధోరణి ఇకముందూ కొనసాగాలని ఆకాం క్షించాయి. ఇందుకు ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుత ధోరణి మరింత స్థిరపడ్డానికి, పెట్టుబడులు పెరగడానికి, వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డానికి పాలసీరేటు తగ్గింపును కోరుతున్నట్లు సీఐఐ సెక్రటరీ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్, ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరీ తదితరులు తెలిపారు.