న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలోనూ క్షీణతలోనే కొనసాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం జూలైలో మైనస్ 10.4 క్షీణత నమోదయ్యింది. అంటే 2019 జూలైతో పోల్చితే వృద్ధిలేకపోగా, భారీ క్షీణత నమోదయ్యిందన్నమాట. అయితే జూన్‌తో పోల్చితే ( మైనస్ 15.77 శాతం క్షీణత) జూన్ నెలలో క్షీణ రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం.
కీలక విభాగాలూ నేలచూపే...
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగం మైనస్ 11.1 శాతం క్షీణతను నమోదుచేసుకుంది.
మైనింగ్: భారీగా 13 శాతం క్షీణతను చవిచూసింది.
విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి మైనస్ 2.5 శాతం పడిపోయింది.
► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, పెట్టుబడులకు సంబంధించిన ఈ విభాగం భారీగా మైనస్ 22.8 శాతం
క్షీణించింది.
► డ్యూరబుల్స్ గూడ్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ల వంటి దీర్ఘకాలం వినియోగ వస్తువులకు సంబంధించి ఈ విభాగంలో క్షీణ రేటు 23.6 శాతంగా నమోదయ్యింది.
► నాన్–డ్యూరబుల్స్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించి ఈ
విభాగంలో మాత్రం 6.7 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం.
నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్
ఉత్పత్తిలో క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా సూచీ గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్‌లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. తాజా సమీక్షా నెల– జూలైలో 118.1కి చేరింది.
నాలుగు నెలల్లో...
కాగా పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో చూస్తే, 29.2 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి
నమోదయ్యింది.
పోల్చిచూడ్డం సరికాదు: గణాంకాల శాఖ
సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కోవిడ్–19 ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇప్పటికీ పలు విభాగాలు సరిగా పనిచేయని పరిస్థితులు, గణాంకాలు తగిన విధంగా అందని వాతావరణం ఉందని శుక్రవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా తెలిపింది.
మౌలిక రంగం 9.6 శాతం క్షీణత
ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం– మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న మౌలిక పరిశ్రమల గ్రూప్ వరుసగా ఐదవ నెల– జూలైలోనూ అసలు వృద్ధిలేకపోగా 9.6 శాతం క్షీణతనే నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే.
ఎరువులు (6.9 శాతం వృద్ధి రేటు) మినహా మిగిలిన ఏడు రంగాలు– స్టీల్ (–16.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–13.9 శాతం), సిమెంట్ (–13.5 శాతం), సహజ వాయువు (–10.2 శాతం), బొగ్గు (–5.7 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.9 శాతం), విద్యుత్ (–2.3 శాతం) క్షీణరేటును నమోదుచేసుకున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలాన్ని చూస్తే, ఎనిమిది రంగాల ఉత్పత్తి మైనస్ 20.5 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో ఈ విభాగంలో వృద్ధి రేటు 3.2 శాతం.
పరిశ్రమలు మైనస్‌లోనే..
Published Sat, Sep 12 2020 4:56 AM | Last Updated on Sat, Sep 12 2020 5:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment