
ఏప్రిల్‌లో 2.7 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ: తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాల పేలవ పనితీరు కారణంగా దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్‌లో నెమ్మదించింది. 2.7 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో కూడా ఇది 2.7 శాతంగానే ఉండటం గమనార్హం. పరిశ్రమల పనితీరును సూచించే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది ఏప్రిల్‌లో 5.2 శాతంగా నమోదైంది.
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మార్చి గణాంకాలను గతంలో ప్రకటించిన 3 శాతం నుంచి 3.9 శాతానికి ఎన్‌ఎస్‌వో పెంచింది. తాజా గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్‌లో మైనింగ్ కార్యకలాపాలు 6.8 శాతం వృద్ధి చెందగా తాజాగా మైనస్‌లో 0.2 శాతానికి పడిపోయాయి. ఇక తయారీ రంగం వృద్ధి రేటు 4.2 శాతం నుంచి 3.4 శాతానికి, విద్యుదుత్పత్తి 10.2 శాతం నుంచి 1 శాతానికి నెమ్మదించింది.