Industrial production
-
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
పరిశ్రమలు రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు నెలలో ప్రతికూలానికి పడిపోయింది. మైనస్ 0.1 శాతంగా నమోదైంది. పరిశ్రమల ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపీ) వృద్ధి జూలై నెలకు 4.7 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్టు నెలలోనూ ఐఐపీ 10.9 వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా మైనింగ్, విద్యుదుత్పత్తి రంగంలో క్షీణత ఐఐపీ పడిపోవడంలో కీలకంగా పనిచేసింది. అదే సమయంలో తయారీ రంగంలోనూ ఉత్పాదకత పుంజుకోలేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు (ఐదు నెలల్లో) ఐఐపీ వృద్ధి 4.2 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన 6.2 శాతం కంటే తక్కువ. వృద్ధి రేటు మైనింగ్ రంగంలో మైనస్ 4.3 శాతానికి పడిపోయింది. విద్యుదుత్పత్తి రంగంలో మైనస్ 3.7 శాతంగా నమోదైంది. తయారీలో 0.1 శాతంగా ఉంది. ఆగస్ట్ నెలలో అధిక వర్షాలు మైనింగ్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణమని ఎన్ఎస్వో తెలిపింది. చివరిగా 2022 అక్టోబర్ నెలలో ఐఐపీ వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం గమనార్హం. -
ద్రవ్యోల్బణం దారికి...పరిశ్రమ పక్కకు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి మంగళవారం మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం. అలాగే గరిష్ట లక్ష్యానికన్నా (6 శాతం) దిగువన ఉండడం హర్షణీయ పరిణామం. కాగా, జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ధర, సమీక్షా నెల ఫిబ్రవరిలో 8.66 శాతానికి ఎగసింది. ఇక పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 2024 జనవరిలో 3.8 శాతానికి మందగించింది. 2023 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీసహా మైనింగ్, విద్యుత్ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు గణాంకాలు ,కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కలు తెలిపాయి. 2023 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 4.2 శాతంకాగా, నవంబర్‌లో 2.4 శాతం. -
మందగించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: తయారీ రంగ పేలవ పనితీరు కారణంగా దేశీయంగా 2023 నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి మందగించింది. 8 నెలల కనిష్ట స్థాయి 2.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే తక్కువ స్థాయి వృద్ధి. చివరిసారిగా 2023 మార్చిలో అత్యంత తక్కువగా 1.9% స్థాయిలో ఐఐపీ వృద్ధి నమోదైంది. గతేడాది నవంబర్‌లో ఇది 7.6%. 2023–24 ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 6.4%. అంతక్రితం ఆర్థిక సంవత్సరం అదే వ్యవధిలో వృద్ధి 5.6%. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం నవంబర్‌లో ఇది 6.7%గా ఉంది. విద్యుదుత్పత్తి వృద్ధి కూడా 12.7% నుంచి 5.8 శాతానికి నెమ్మదించింది. మైనింగ్ రంగ ఉత్పత్తి వృద్ధి 9.7% నుంచి 6.8 శాతానికి తగ్గింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 5.4% మేర క్షీణించింది. అంతక్రితం నవంబర్‌లో 5% వృద్ధి నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 3.6 శాతం క్షీణించింది. గత నవంబర్‌లో 10% వృద్ధి నమోదైంది. మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం స్వల్పంగా 1.5% వృద్ధి చెందింది. -
నవంబర్‌లో ‘మౌలికం’ పురోగతి 7.8 %
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ నవంబర్‌లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 42 శాతం. -
నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెలవారీగా చూస్తే సెపె్టంబర్లో మందగించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.8 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 10.3 శాతంగా ఉంది. గతేడాది సెపె్టంబర్లో ఐఐపీ 3.3 శాతంగా నమోదైంది. తాజాగా తయారీ, మైనింగ్ రంగాలు మెరుగుపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సమీక్షాకాలంలో ఐఐపీ 6 శాతానికి పరిమితమైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం.. ► తయారీ రంగ వృద్ధి 4.5 శాతంగా (గత సెప్టెంబర్‌లో రెండు శాతం) నమోదైంది. ► విద్యుదుత్పత్తి వృద్ధి గత సెపె్టంబర్లో 11.6 %గా ఉండగా ఈసారి 9.9%కి పరిమితమైంది. ► మైనింగ్ ఉత్పత్తి గతేడాది సెపె్టంబర్లో మైనస్ 5.2 శాతంగా ఉండగా ఈ ఏడాది సెపె్టంబర్లో 11.5 శాతం పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ వృద్ధి 7.4 శాతంగా (గత సెపె్టంబర్లో 11.4 శాతం) నమోదైంది. కన్జూమర్ డ్యూరబుల్స్ వృద్ధి గత సెపె్టంబర్లో మైనస్ 5.5 శాతంగా ఉండగా ఈసారి ఒక్క శాతం మేర నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి మైనస్ 5.7 శాతం నుంచి 2.7 శాతానికి చేరింది. ► మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తుల వృద్ధి 7.5% గా ఉంది. గత సెపె్టంబర్లో ఇది 8.2 శాతం. -
ఎకానమీ శుభ సంకేతాలు!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీకి సంబంధించి వెలువడిన తాజా గణాంకాలు ఆశాజనక పరిస్థితిని సృష్టించాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించి సూచీ– ఐఐపీ 2022 నవంబర్‌లో (2021 నవంబర్‌తో పోల్చి) ఐదు నెలల గరిష్ట స్థాయి 7.1 శాతంగా నమోదయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక పాలసీ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఈ సూచీ వరుసగా రెండవనెల ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువన 5.72 శాతంగా నమోదయ్యింది. 2022 అక్టోబర్‌లో ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.2 శాతం క్షీణించింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం ఈ గణాంకాల ముఖ్యాంశాలు... కీలక రంగాల పురోగతి ► తయారీ: సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్‌లో 6.1 శాతంగా నమోదయ్యింది. ► మైనింగ్: ఈ రంగంలో 9.7 శాతం పురోగతి ఉంది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి వృద్ధి భారీగా 12.7 శాతం నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉ త్పత్తి, డిమాండ్‌ను సూచించే ఈ విభాగం ఏకంగా 20.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► డ్యూరబుల్స్: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ఉత్పత్తికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 5.1 శాతం వృద్ధి నమోదుకాగా, సబ్సులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎఫ్ఎంసీజీ విభాగానికి సంబంధించిన కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా, నిర్మాణం: వృద్ధి 12.8 శాతంగా నమోదయ్యింది. ► తొమ్మిది నెలల్లో..: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 5.5 శాతంగా ఉంది. తగ్గిన ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ తగ్గడం మొత్త రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా, 2022 అక్టోబర్ వరకూ వరుసగా 10 నెలలు ఆ పైన కొనసాగింది. నవంబర్‌లో 5.88 శాతంగా నమోదుకాగా, మరుసటి నెల డిసెంబర్లో మరింత తగ్గి 5.72 శాతానికి (2021 డిసెంబర్‌తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చే అంశం. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం, ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ నవంబర్‌లో 4.67 శాతం ఉండగా, డిసెంబర్లో మరింత తగ్గి 4.19 శాతానికి చేరింది. కూరగాయల ధరల స్పీడ్ వార్షికంగా 15 శాతానికి పైగా పడిపోయింది. పండ్ల ధరల స్పీడ్ 2 శాతంగా ఉంది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం 20 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 14 శాతం ఎగశాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల రేటు 11 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా 2022 మే తర్వాత ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోన 2.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి చేరింది. కొన్ని కమోడిటీల ఎగుమతుల నిషేధంసహా ధరల కట్టడికి కేంద్రం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. -
నష్టాల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి. తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీయస్సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
పరిశ్రమలు.. పరుగు..పారిశ్రామిక ఉత్పత్తిలో కొత్త జోష్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి విషయంలో మే నెలకు సంబంధించి సూచీ ఎకానమీకి ఊరటనిచ్చింది. 2022లో 19.6 శాతం పురోగతిని (2021 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాలు మే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి పురోగతికి ఊతం ఇచ్చినట్లు మంగళవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం వివిధ రంగాల పనితీరును పరిశీలిస్తే... ♦ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగం భారీగా 20.6 శాతం పురోగతి సాధించింది. ♦ విద్యుత్ రంగం ఉత్పత్తి 23.5 శాతం పెరిగింది. ♦ మైనింగ్ రంగంలో పురోగతి 10.9 శాతం, ♦ పెట్టుబడులకు, భారీ యంత్రసామగ్రి డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు ఏకంగా 54%గా నమోదైంది. ♦ రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 58.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ మరోవైపు 2022 ఏప్రిల్ ఐఐపీ తొలి అంచనాను 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. తొలి రెండు నెలల్లో ఇలా..: 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలలు.. ఏప్రిల్, మేలో ఐఐపీ వృద్ధి రేటు 12.9%గా నమోదైంది. రూపాయి : 79.59 ముంబై: సెంట్రల్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా విధాన నిర్ణయాలు డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని నిలువరించలేకపోతున్నాయి. మంగళవారం రూపాయి డాలర్ మారకంలో మరో కొత్త చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు పతనమై, 79.59కి రూపాయి బలహీనపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 79.66కు కూడా పడిపోయింది. -
పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్‌లో రయ్!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 7.1 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఏప్రిల్ నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో ఉత్పత్తి 7.1 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టులో 13 శాతం పెరుగుదల తర్వాత) ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. విద్యుత్, మైనింగ్ రంగాలు మంచి ఫలితాలను అందించినట్లు శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన లెక్కలు వెల్లడించాయి. కొన్ని ముఖ్య విభాగాలను పరిశీలిస్తే... ► తయారీ: ఐఐపీలో దాదాపు 70 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో 6.3 శాతం పురోగతి నమోదయ్యింది. ► విద్యుత్: ఈ రంగం 11.8 % వృద్ధి సాధించింది. ► మైనింగ్: మైనింగ్‌లో 7.8% వృద్ధి నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులు, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ విభాగంలో భారీగా 14.7% వృద్ధి నమోదుకావడం హర్షణీయం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేట్లర్ల వంటి దీర్ఘకాల వినియోగ వస్తువులకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 8.5 శాతంగా ఉంది. ► నాన్–కన్జూమర్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కి సంబంధించిన నాన్–కన్జూమర్ గూడ్స్ విభాగంలో స్వల్పంగా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ప్రైమరీ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నిర్మాణ) గూడ్స్ ఉత్పత్తి వృద్ధి రేట్లు వరుసగా 10.1 శాతం, 7.6 శాతం, 3.8 శాతాలుగా ఉన్నాయి. -
ఆరు నెలల తర్వాత వృద్ధిబాటకు పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆరు నెలల క్షీణత తర్వాత తిరిగి వృద్ధిబాటకు మళ్లింది. 2020 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 0.2 శాతం స్వల్ప స్థాయి వృద్ధిని చూసింది (2019 సెపెంబర్ గణాంకాలతో పోల్చి). మైనింగ్, విద్యుత్ రంగాల్లో అధికోత్పత్తి దీనికి కారణమని గురువారం కేంద్రం వెలువరించిన గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన ఈ విభాగం ఇంకా క్షీణతలోనే ఉంది. సెప్టెంబర్‌లో 0.6 శాతం క్షీణత నమోదయ్యింది. మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 1.4 శాతంగా ఉంది. విద్యుత్: 4.9 శాతం వృద్ధిరేటు వచ్చింది. క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికాల ఉత్పత్తి, డిమాండ్‌కు సంకేతమైన క్యాపిటల్ గూడ్స్‌లో ఉత్పత్తి సెప్టెంబర్‌లో 3.3 శాతం క్షీణతలో ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీ షనర్లు వంటి దీర్ఘకాల కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 2.8% వృద్ధి నమోదవడం కీలకాంశం. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక సానుకూల అంశం. కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, టూత్‌పేస్టులు వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ (ఎఫ్ఎంసీజీ) విషయంలో ఉత్పత్తి భారీగా 4.1 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో క్షీణతే... కాగా, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ భారీగా 21.1 శాతం క్షీణతలోనే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 1.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. తక్కువ బేస్‌రేటే కారణమా? పారిశ్రామిక ఉత్పత్తిలో తాజాగా వృద్ధి రేటు కనబడ్డానికి తక్కువ బేస్‌రేటే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 2019 సెప్టెంబర్‌లో ఐఐపీ భారీ క్షీణతలో మైనస్ 4.6 శాతంగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదయ్యింది. అటు తర్వాత మార్చి (–18.7 శాతం), ఏప్రిల్ (–57.3 శాతం), మే (–33.4 శాతం), జూన్ (–16.6 శాతం), జూలై (–10.8 శాతం) ఆగస్టులో (–8 శాతం) క్షీణ రేటు నమోదయ్యింది. అయితే కఠిన లాక్డౌన్ నెల ఏప్రిల్‌లో భారీ క్షీణత తర్వాత మైనస్రేట్లు క్రమంగా తగ్గుతుండడం పరిగణనలోకి తీసుకోవాల్సిన సానుకూల అంశం. 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) లాక్డౌన్ జరిగింది. లాక్డౌన్ నిబంధనల సడలింపుల వల్ల వివిధ రంగాల్లో క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు పునరుత్తేజం అవుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
పట్టాలెక్కని ‘పరిశ్రమ’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మూలంగా రాష్ట్రం లో పారిశ్రామిక వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోయినట్లు రాష్ట్ర అర్థ గణాంక విభాగం నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, క్వారీ విభాగాల్లో ఉత్పత్తి తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సిబ్బంది, కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతోంది. వ్యవసాయ, సేవా రంగాల తర్వాత పారిశ్రామిక రంగం ఎక్కువ మందికి (సుమారు 18 శా తం) ఉపాధి కల్పిస్తుండగా, కోవిడ్ మూలం గా పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50– 60 శాతమే ఉత్పత్తి రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే కేవలం 50 నుంచి 60 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్‌తో పాటు ఆటోమొబైల్, మైన్స్, మినరల్స్, టెక్స్టైల్స్, స్టీలు, సిమెంట్ తదితర పరిశ్రమలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో ఫార్మా, బల్క్ డ్రగ్ మినహా ఇతర కేటగిరీలకు చెందిన పరిశ్రమలు అన్నీ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అన్‌లాక్ ప్రక్రియ తొలి విడతలోనే పరిశ్రమలకు నిబంధనలు సడలింపు ఇచ్చినా వివిధ కారణాలతో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కడం లేదు. ముడిసరుకుల కొరత, రవాణా, మార్కెటింగ్ సమస్యలతో పాటు కొన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమల్లో కార్మికుల కొరత వల్ల పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం లేదు. సిబ్బంది, కార్మికుల ఉపాధికి దెబ్బ లాక్డౌన్ మూలంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో అరకొర వేతనాలు చెల్లించిన పరిశ్రమల యాజమాన్యాలు ఆ తర్వాత ఉత్పత్తి తగ్గడాన్ని కారణంగా చూపిస్తూ సిబ్బంది, కార్మికుల సంఖ్యను తగ్గించాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌లో కాంట్రాక్టు కార్మికులను రెన్యువల్ చేస్తూ వచ్చిన పరిశ్రమలు కోవిడ్ మూలంగా రెన్యువల్ ఊసెత్తకపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. వీరిలో అవసరమైన వారిని మాత్రమే తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుంటుండగా, మరికొందరి వేతనాల్లో భారీగా కోత విధించారు. రూ.15వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారిని మినహాయించి, ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులు, సిబ్బంది వేతనాల్లో పరిశ్రమలు కోత విధిస్తున్నాయి. వేతన ఒప్పందాల్లో ‘డిఫర్మెంట్’ మూడేళ్లకు ఒకసారి వేతన ఒప్పందం జరగా ల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరో రెండేళ్లపాటు నూతన ఒప్పందాలు వాయిదా వేస్తామని యాజమాన్యాలు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల్లోనూ డిఫర్‌మెంట్‌ను కోరుతూ కార్మిక సంఘాలు, సిబ్బందికి యాజమాన్యా లు లేఖలు రాస్తున్నాయి. ఒప్పందం మేరకు సిబ్బందిని పర్మినెంట్ చేయాల్సి ఉండగా వేచి చూడాలని చెప్తున్నాయి. తిరిగి వస్తున్న వలసకార్మికులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో సుమారు లక్షన్నర మందిని రాష్ట్ర ప్రభుత్వం స్వస్థలాలకు తరలించింది. ప్రస్తుతం పరిస్థితులు కొంత మేర కుదుటపడటంతో వీరు తిరిగి గతంలో తాము పనిచేసిన ప్రదేశాలకు చేరకుంటున్నారు. లోహ, ఫ్యాబ్రికేషన్, వాటి అనుబంధ పరిశ్రమల్లో వలస కార్మికులను రప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో ఆరు నెలల్లో సాధారణ పరిస్థితి పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారం భించేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. వలస కార్మికులు తిరిగి ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇటీవలి వర్షాలతో పారిశ్రామిక ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోనస్ డిఫర్మెంట్ కోసం యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమలు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటేనే కార్మికులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు, బోనస్ ఇవ్వడం సాధ్యమవుతుంది. – కె. సుధీర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అసంఘటిత కార్మికులకు భద్రతలేదు అసంఘటిత కార్మికుల ఉపాధి, ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిం ది. ఉత్పత్తి తగ్గడా న్ని కారణంగా చూపుతూ వేతన ఒప్పందాలు మొదలుకుని, అన్ని రకాలైన డిఫర్మెంట్లకు యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగులను తొలగించొద్దని ప్రభుత్వం చెప్తున్నా పరిస్థితి భిన్నంగా ఉంది. –బి.మల్లేశం, అధ్యక్షులు, సీఐటీయూ, సంగారెడ్డి జిల్లా -
6వ నెలా... మైనస్‌లోనే మౌలిక రంగం
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో కీలక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వరుసగా ఆరవనెల కూడా క్షీణతలోనే కొనసాగింది. ఆగస్టులో మైనస్ 8.5 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. అంటే 2019 ఆగస్టులో జరిగిన ఉత్పత్తితో పోల్చిచూస్తే, 2020 ఆగస్టులో ఈ రంగాల ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 8.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40.27 శాతం వెయిటేజ్ ఉన్న ఎనిమిది రంగాల పనితీరును వేర్వేరుగా పరిశీలిస్తే.... ► బొగ్గు (3.6 శాతం), ఎరువులు (7.3 శాతం) వృద్ధి బాటన నిలిచాయి. ► క్రూడ్ ఆయిల్ (–6.3%), సహజ వాయువులు (–9.5 %), రిఫైనరీ ప్రొడక్టులు (19.1%), స్టీల్ (–6.3 %), సిమెంట్ (–14.6 శాతం) విద్యుత్ (–2.7 శాతం) క్షీణతలో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ...: కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో చూస్తే, ఈ గ్రూప్ ఉత్పత్తి 17.8 శాతం క్షీణతలోనే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కనీసం 2.5 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పట్లో అంత తక్కువ వృద్ధి తీరుకు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ప్రధాన కారణం. 2019 ఆగస్టులో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ 0.2 శాతం క్షీణతలో ఉండడం గమనార్హం. -
పరిశ్రమలు మైనస్‌లోనే..
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలోనూ క్షీణతలోనే కొనసాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం జూలైలో మైనస్ 10.4 క్షీణత నమోదయ్యింది. అంటే 2019 జూలైతో పోల్చితే వృద్ధిలేకపోగా, భారీ క్షీణత నమోదయ్యిందన్నమాట. అయితే జూన్‌తో పోల్చితే ( మైనస్ 15.77 శాతం క్షీణత) జూన్ నెలలో క్షీణ రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కీలక విభాగాలూ నేలచూపే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగం మైనస్ 11.1 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. మైనింగ్: భారీగా 13 శాతం క్షీణతను చవిచూసింది. విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి మైనస్ 2.5 శాతం పడిపోయింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, పెట్టుబడులకు సంబంధించిన ఈ విభాగం భారీగా మైనస్ 22.8 శాతం క్షీణించింది. ► డ్యూరబుల్స్ గూడ్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ల వంటి దీర్ఘకాలం వినియోగ వస్తువులకు సంబంధించి ఈ విభాగంలో క్షీణ రేటు 23.6 శాతంగా నమోదయ్యింది. ► నాన్–డ్యూరబుల్స్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించి ఈ విభాగంలో మాత్రం 6.7 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్ ఉత్పత్తిలో క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా సూచీ గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్‌లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. తాజా సమీక్షా నెల– జూలైలో 118.1కి చేరింది. నాలుగు నెలల్లో... కాగా పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో చూస్తే, 29.2 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదయ్యింది. పోల్చిచూడ్డం సరికాదు: గణాంకాల శాఖ సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కోవిడ్–19 ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికీ పలు విభాగాలు సరిగా పనిచేయని పరిస్థితులు, గణాంకాలు తగిన విధంగా అందని వాతావరణం ఉందని శుక్రవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా తెలిపింది. మౌలిక రంగం 9.6 శాతం క్షీణత ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం– మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న మౌలిక పరిశ్రమల గ్రూప్ వరుసగా ఐదవ నెల– జూలైలోనూ అసలు వృద్ధిలేకపోగా 9.6 శాతం క్షీణతనే నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎరువులు (6.9 శాతం వృద్ధి రేటు) మినహా మిగిలిన ఏడు రంగాలు– స్టీల్ (–16.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–13.9 శాతం), సిమెంట్ (–13.5 శాతం), సహజ వాయువు (–10.2 శాతం), బొగ్గు (–5.7 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.9 శాతం), విద్యుత్ (–2.3 శాతం) క్షీణరేటును నమోదుచేసుకున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలాన్ని చూస్తే, ఎనిమిది రంగాల ఉత్పత్తి మైనస్ 20.5 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో ఈ విభాగంలో వృద్ధి రేటు 3.2 శాతం. -
క్యూ4 ఫలితాలే దిక్సూచి
ముంబై: కోవిడ్–19పై యుద్ధంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఆదివారం లాక్డౌన్ 4.0ను ప్రకటించింది. మే 31 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ అంశాలకు తోడు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఈవారం మార్కెట్ గమనం ఉండనుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్థార్ధఖేమ్కా విశ్లేషించారు. మంగళవారం జపాన్ పారిశ్రామికోత్పత్తి వెల్లడికానుండగా.. గురువారం అమెరికా తయారీ, సేవల రంగాల పీఎంఐ వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు మార్కెట్‌ను నడిపించనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. ఈవారంలోనే 80 కంపెనీల ఫలితాలు.. భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, యూపీఎల్, బాష్, అల్ట్రాటెక్ సిమెంట్, అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి–మార్ట్), జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, కోల్గేట్ పామోలివ్, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో టైర్స్, టొరంట్ పవర్ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్, అలెంబిక్ ఫార్మా, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మా, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, డీసీబీ బ్యాంక్ ఫలితాలు వెల్లడికానున్నాయి. -
పరిశ్రమలు వెనక్కి.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామిక ప్రగతి శూన్యం... పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) –0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో –1.4 శాతం, సెప్టెంబర్‌లో – 4.6 శాతం, అక్టోబర్‌లో –4 శాతం) నవంబర్‌లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్లో మళ్లీ క్షీణించడం గమనార్హం. 2018 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. కీలక రంగాలను చూస్తే... ► తయారీ: 2019 డిసెంబర్లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 4.5% వృద్ధి నుంచి నుంచి –0.1%కి పడింది. ► మైనింగ్: 5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో రేటు ఏకంగా – 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం. తొమ్మిది నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం. నిత్యావసర ధరల మంట ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్ రిటైల్ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. కట్టుదాటి...! రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్ (4.62 శాతం), డిసెంబర్ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకింది. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గిం చింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపు లో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఆందోళనకరం... గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు. – రుమ్కీ మజుందార్, డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త -
దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వృద్దిపై మరింత ఆందోళన రేపుతున్నాయి తాజా ఐఐపీ గణాంకాలు. ఉత్పత్తి రంగంలో నెలకొన్న సంక్షోభంతో పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) 0.3 శాతానికి పడిపోయింది. 2018 డిసెంబర్లో ఇది 2.5 శాతం. ప్రధానంగా చైనాలో వ్యాపించిన కోవిడ్-2019 (కరోనా వైరస్) బాగా ప్రభావం చూసినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రభుత్వం ఐఐపీ గణాంకాలను బుధవారం విడదుల చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం, ఏడాది క్రితం ఇదే నెలలో 2.9 శాతం వృద్ధితో పోలిస్తే ఉత్పాదక రంగాల ఉత్పత్తి 1.2 శాతం క్షీణించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా 0.1 శాతం తగ్గింది. 2018 డిసెంబర్లో 4.5 శాతం వృద్ధిని సాధించింది. అయితే మైనింగ్ రంగ ఉత్పత్తి 5.4 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ఐఐపి వృద్ధి 0.5 శాతానికి క్షీణించింది. 2018-19 ఇదే కాలంలో 4.7 శాతం పెరిగింది. చదవండి : ధరల మంట: రీటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టం కోవిడ్-19 : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మూత -
మౌలిక రంగం డౌన్
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా నాలుగో నెలా క్షీణించింది. 2019 నవంబర్‌లో వృద్ధి 1.5 శాతం తగ్గింది. 2018 నవంబర్‌లో ఈ ఎనిమిది పరిశ్రమలు 3.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. తాజాగా ఎనిమిదింట అయిదు పరిశ్రమలు ప్రతికూల వృద్ధి నమోదు చేయడంతో మొత్తం గ్రూప్ వృద్ధి మందగించింది. నవంబర్‌లో బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించింది. 2018 నవంబర్‌లో సిమెంటు ఉత్పత్తి వృద్ధి 8.8 శాతంగా ఉండగా.. 2019 నవంబర్‌లో 4.1 శాతానికి పరిమితమైంది. రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి 3.1 శాతం, ఎరువుల ఉత్పత్తి 13.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో మౌలిక పరిశ్రమలు అంతక్రితం ఏడాది ఇదే వ్యవధి స్థాయిలోనే 5.1 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇన్ఫ్రా గ్రూప్ వృద్ధి ఆగస్టు నుంచి మందగిస్తూనే ఉంది. -
పరిశ్రమలు మళ్లీ మైనస్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –3.8 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలకన్నా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన తయారీరంగంసహా విద్యుత్, మైనింగ్ వంటి కీలక రంగాలన్నింటిలో క్షీణరేటే నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో పారిశ్రామిక ఉత్పత్తి 8.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. గురువారం విడుదలైన గణాంకాల్లో కీలక విభాగాలను చూస్తే... తయారీ రంగం: సూచీలో దాదాపు 60 శాతంపైగా వెయిటేజ్ ఉన్న ఈ రంగంలో –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో ఈ విభాగం 8.2 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఆరి్థక సంవత్సరం (ఏప్రిల్ నుంచి)లో అక్టోబర్ వరకూ చూస్తే, వృద్ధి రేటు 5.8% నుంచి 0.5%కి పడింది. విద్యుత్: ఈ విభాగం కూడా 10.8 శాతం వృద్ధి బాట నుంచి (2018 అక్టోబర్‌లో) –12.2 శాతం క్షీణతలోకి జారింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో వృద్ధి 6.8 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. మైనింగ్: ఈ విభాగంలో 7.3 శాతం వృద్ధి రేటు – 8 శాతం క్షీణత (2019 అక్టోబర్)లోకి పడింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ తీసుకున్నా ఈ విభాగం 3.9 శాతం వృద్ధిబాట నుంచి –0.4 శాతం క్షీణతలోకి జారింది. క్యాపిటల్ గూడ్స్: ఇక భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ రంగంలో భారీగా –21.9% క్షీణించింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగం భారీగా 16.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. రసాయనాలు: 31.8% వృద్ధి నమోదయ్యింది. ఏడు నెలల్లో... ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదయ్యింది. అదుపు తప్పిన ధరలు ►నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతం ►మూడేళ్ల గరిష్ట స్థాయి ఇది... న్యూఢిల్లీ: రిటైల్ ధరలు అదుపుతప్పాయి. ఈ సూచీ నవంబర్‌లో మూడేళ్ల గరిష్టం 5.54 శాతానికి చేరింది. అంటే 2018 నవంబర్‌తో పోలి్చచూస్తే, 2019 నవంబర్‌లో నిత్యావసరాల వినియోగ వస్తువుల బాస్కెట్ ధర మొత్తంగా 5.54 శాతం పెరిగిందన్నమాట. 2016 జూలై (6.07 శాతం) తరువాత ధరల పెరుగుదల తీవ్రత ఇంత స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 2.33 శాతం. అక్టోబర్‌లో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 4.62 శాతం నమోదయ్యింది. -
పరిశ్రమలు.. కకావికలం!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఐఐపీ –1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత తాజా సమీక్షా నెల (2019 ఆగస్టు)లో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను రంగాల వారీగా చూస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాలేదు. –1.2 శాతం క్షీణత నెలకొంది. ఈ కీలక విభాగంలో ఇలాంటి ఫలితం చూడ్డం ఐదేళ్ల తరువాత (2014 అక్టోబర్‌లో –1.8 శాతం క్షీణత) తొలిసారి. 2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ► విద్యుత్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా –21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా –9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా/నిర్మాణం: పేలవ పనితనాన్ని ప్రదర్శించిన రంగాల్లో ఇది ఒకటి. ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు –4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. ► ఐదు నెలల్లోనూ డౌన్: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్–ఆగస్టు మధ్య 2.4%గా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతం. రెండవ త్రైమాసికంపై నీలినీడలు... ‘ఏప్రిల్–జూన్ క్వార్టర్లో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5%కి పyì ంది. రెండో క్వార్టర్లో వృద్ధి మెరుగుపడకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి’ అని ఆర్థికవేత్త అదితి నయ్యర్ పేర్కొన్నారు. -
జీడీపీ వృద్ధి రేటు కోత!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మంగళవారం తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకాగా, దీనిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వృద్ధిరేటు కోత అంచనాలకు కారణమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ గ్రూప్ విభాగం అయిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ►పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ, విద్యుత్ రంగాల పనితీరు పేలవంగా ఉంది. ►దివాలా చట్టం 2016 కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదిస్తున్న కేసుల విచారణ మందగమనంలో ఉంది. ఒకచోటు నిరర్థకంగా ఉండిపోయిన మూలధనాన్ని తిరిగి ఉత్పత్తి ప్రక్రియలోకి తీసుకురావడం కష్టంగా మారుతున్న తరుణంలో ఈ అంశం కూడా వృద్ధితీరుపై ప్రభావం చూపే వీలుంది. ►పెట్టుబడుల వ్యయ వృద్ధి రేటు అంచనాలను 10.3% నుంచి 9.2%కి తగ్గించింది. ►వ్యవసాయ రంగం వృద్ధి అంచనాను 3 శాతం నుంచి 2.5 శాతానికి కుదించింది. 2018–19లో ఈ రేటు 2.7 శాతం. ►సేవల రంగం కొంత మెరుగైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. -
ఎన్నికల ముందస్తు ర్యాలీకి చాన్స్!
ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. మార్కెట్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముందుస్తు ర్యాలీకి అవకాశం మెండుగా ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, కాపిటల్ మార్కెట్స్ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ‘షెడ్యూల్ ఖరారు కావడం వల్ల మార్కెట్లో అనిశ్చితి ముగింపు దశకు చేరకుందని భావిస్తున్నాం. అయితే, ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాం’ అని అన్నారయన. నేటి నుంచే మార్కెట్లో సాధారణ ఎన్నికల వేడి మొదలుకానుండగా.. ప్రీ–పోల్ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ప్రధాన అంశాలు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఒపీనియన్స్ పోల్స్ సర్వే ఆధారంగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ వార్తలు సంస్కరణల కొనసాగింపునకు ఊతం ఇచ్చేవి అయినందున మార్కెట్ ప్రీ ఎలక్షన్ ర్యాలీకి సహకరిస్తాయని అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలైన యూబీఎస్, సీఎల్ఎస్ఏ భావిస్తున్నాయి. ఇక ఎవరు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. సంస్కరణల కొనసాగింపు ఉంటుందనే అంచనాలతో ర్యాలీకి అవకాశం ఉందని ప్రభుదాస్ లీలాధర్ సీఈఓ అజయ్ బోడ్కే అన్నారు. గణాంకాలపై దృష్టి.. మంగళవారం(12న) జనవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. గతేడాది డిసెంబర్ ఐఐపీ 2.4%గా నమోదైంది. ఇక ఈఏడాది జనవరిలో ఈ రేటు ఏవిధంగా ఉండనుందనే అంశంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘సీపీఐ, ఐఐపీ డేటాపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక అంశాల్లో.. సోమవారం వెల్లడికానున్న అమెరికా రిటైల్ అమ్మకాలు, చైనా పారిశ్రామిక ఉత్పత్తి మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి’ అని కాపిటల్ ఎయిమ్ పరిశోధనా విభాగం హెడ్ దేబబ్రత భట్టాచార్జీ విశ్లేషించారు. ఇక బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. మంగళవారం జరిగే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురైతే సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈ అంశంతో పాటు అమెరికా–చైనా వాణిజ్య చర్చల అంశంపై కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. 10,900–11,300 శ్రేణిలో నిఫ్టీ.. సాధారణ ఎన్నికలు, డాలరుతో రూపాయి మార కం విలువ కదలికలు, పలు ఎంపికచేసిన షేర్లలో ర్యాలీ మార్కెట్ దిశను నిర్ధేశించనున్నాయని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ చైర్మన్ డీకే అగర్వాల్ అన్నారు. నిఫ్టీ శ్రేణి 10,900–11,300 పాయింట్ల మధ్యలో ఉండవచ్చని అంచనావేసిన ఆయన.. బ్యాంక్ నిఫ్టీ 27,500–28,000 పాయింట్ల స్థాయి లో కదలాడవచ్చని అంచనావేశారు. ఒకసారి నిఫ్టీ బ్రాడ్ రేంజ్‌ని అధిగమిస్తే.. అక్కడ నుంచి మేజర్ ట్రెండ్‌ను నమోదుచేస్తుందని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. ఇక 11,009–10,998 పాయింట్ల శ్రేణి కీలక మద్దతుగానూ.. 11,094–11,118 శ్రేణి కీలక నిరోధంగానూ పనిచేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటై ల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని అభిప్రాయపడ్డారు. ముడిచమురు ధరలు సానుకూలం.. వారాంతాన క్రూడ్ ధర దిగొచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒక శాతం నష్టాన్ని నమోదుచేశాయి. ఉత్పత్తి కోత నిర్ణయాలకు ఒపెక్ తలవంచే అవకాశాలు ఉన్నందున ముడిచమురు ధరలు శాంతించే సూచనలు కనిపిస్తున్నాయని కమోడిటీ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశం మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని భావిస్తున్నారు. -
పారిశ్రామిక ఉత్పత్తి ఉసూరు!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్‌లో అంతంతమాత్రంగానే నమోదయ్యింది. వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 4.5 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్ రంగం, అలాగే భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ పనితీరు సెప్టెంబర్‌లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2017 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 4.1 శాతం. ఆగస్టులో ఈ రేటు 4.6 శాతం. జూన్‌లో ఈ రేటు 6.9 శాతంకాగా, జూలైలో 6.5 శాతం. ఈ ఏడాది మేలో వృద్ధి రేటు 3.8 శాతం. ♦ సెప్టెంబర్‌లో మైనింగ్ రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.2 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రంగం 7.6% వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ♦ అలాగే క్యాపిటల్స్ గూడ్స్ విషయంలోనూ ఇదే జరిగింది. సమీక్షా నెలలో 8.7 శాతం వృద్ధి రేటు–5.8 శాతం క్షీణ బాటకు మళ్లింది. మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు మాత్రం 3.8 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 సానుకూలంగా ముగిశాయి. ప్రత్యేకించి ‘ఫర్నిచర్’ విభాగంలో వృద్ధి భారీగా 32.8 శాతం నమోదయ్యింది. 20.9 శాతంతో తదుపరి స్థానంలో దుస్తుల విభాగం ఉంది. అయితే ప్రింటింగ్ అండ్ రీప్రొడక్షన్ ఆప్ రికార్డెడ్ మీడియా విభాగంలో వృద్ధి భారీగా –12.9 శాతం క్షీణించింది. పొగాకు ఉత్పత్తుల విభాగంలో క్షీణత –7.3 శాతంగా ఉంది. ♦ విద్యుత్ ఉత్పత్తి సైతం 3.4 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. ♦ కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ వృద్ధిరేట్లు వరుసగా 5.2 శాతం, 6.1 శాతంగా నమోదయ్యాయి. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఫర్వాలేదు... కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య (గత ఏడాది ఇదే కాలంతో పోల్చి) ఐఐపీ వృద్ధి రేటు 2.6 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. మౌలికరంగం నెమ్మది! మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) దాదాపు 40.27 శాతం వాటా ఉన్న ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మందగించింది. 4.3 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 4.7 శాతం. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోవడం మొత్తం గ్రూప్‌పై ప్రభావం చూపింది. ఈ నెల ప్రారంభంలో వచ్చిన ఈ గణాంకాల అనంతరం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే తాజా సెప్టెంబర్ ఐఐపీ ఫలితాలు వచ్చాయి. మొత్తం ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల్లో ఎరువులు (2.5 శాతం), సిమెంట్ (11.8 శాతం), విద్యుత్ (8.2 శాతం), బొగ్గు (6.4 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (2.5 శాతం), స్టీల్ (3.2 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.2 శాతం), సహజవాయువు (–1.8 శాతం) ఉన్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఈ రంగాల వృద్ధి రేటు 3.2 శాతం నుంచి 5.5 శాతానికి పెరగడం గమనార్హం. అక్టోబర్‌లో రిటైల్ ధరలు... కూల్! 3.31 శాతంగా నమోదు ఏడాది కనిష్ట స్థాయి న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్‌తో పోల్చితే 2018 అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.31 శాతం పెరిగిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం గడచిన ఏడాది కాలంలో ఇదే తొలిసారి. కొన్ని నిత్యావసరాలు, పండ్లు, ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాలను క్లుప్తంగాచూస్తే... ♦ 2018 సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.7 శాతం. 2017 అక్టోబర్‌లో ఈ రేటు 3.58%. ♦ తాజా సమీక్షా నెలలో ఫుడ్ బాస్కెట్ ధర పెరక్కపోగా 0.86% క్షీణించింది. సెప్టెంబర్‌లో 0.51% పెరుగుదల నమోదయ్యింది. ♦ కూరగాయల ధరలు సెప్టెంబర్‌లో 4.15% పెరిగితే, అక్టోబర్‌లో – 8.06% తగ్గాయి. ♦ ఫ్రూట్ బాస్కెట్ ధర సెప్టెంబర్‌లో 1.12 శాతం పెరిగితే, అక్టోబర్‌లో –0.35 శాతానికి తగ్గింది. ♦ గుడ్లు, పాలు సంబంధిత ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలూ తగ్గాయి. ♦ ఇక ఫ్యూయల్, లైట్ విభాగానికి వస్తే, సెప్టెంబర్‌లో ఈ ద్రవ్యోల్బణం 8.47 శాతం ఉంటే, అక్టోబర్‌లో 8.55 శాతానికి పెరిగాయి. -
పారిశ్రామికం నేల చూపు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం– ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మే నెలలో పేలవ పనితీరును ప్రదర్శించింది. కేవలం 3.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గత ఏడాది మే నెలలో వృద్ధి 2.9 శాతమే కావడం గమనార్హం. తయారీ, విద్యుత్ రంగాల పేలవ పనితీరును ప్రదర్శించాయి. కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలను చూస్తే (ఏప్రిల్, మే) పారిశ్రామిక రంగం వృద్ధి 3.1 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు మే నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగింది. 2017 మే నెలలో 2.6 శాతం వృద్ధి రేటు ఉంటే ఇది 2018 మే నెలలో 2.8 శాతంగా మాత్రమే నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఈ వృద్ధి 2.8 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. విద్యుత్: నెలవారీగా వృద్ధి 8.3 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోగా, ఏప్రిల్, మే నెలలను కలిపిచూస్తే, ఈ రేటు 6.9 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది. మైనింగ్: మేలో వృద్ధి రేటు 0.3 శాతం నుంచి భారీగా 5.7 శాతానికి ఎగిసింది. రెండు నెలలను కలిపిచూస్తే, రేటు 1.6 శాతం నుంచి 4.9 శాతానికి చేరింది. ఎఫ్ఎంసీజీ: అసలు వృద్ధిలేకపోగా – 2.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2017 మే నెలలో ఈ రంగం వృద్ధి రేటు 9.7 శాతం. కన్జూమర్ గూడ్స్: కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధిలేకపోగా –2.6 క్షీణత నెలకొంది. -
ఐదు నెలల దిగువకు పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు మార్చిలో 4.4 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదుకాలేదు. క్యాపిటల్ గూడ్స్, మైనింగ్ పనులు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఏప్రిల్‌లో ఈ రేటు 4.4 శాతంకాగా, గత ఏడాది ఇదే నెల్లో 4.4%ఉండటం గమనార్హం. ముఖ్యాంశాలివీ... ♦ సూచీలో దాదాపు 77 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి రేటు మార్చిలో 3.3 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. ♦ ఇదే నెలలో మైనింగ్ రంగం వృద్ధి రేటు 10.1% నుంచి 2.8 శాతానికి పతనమైంది. ♦ ఇక విద్యుత్ రంగంలో వృద్ధి 6.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. ♦ భారీ ఉత్పత్తుల తయారీ, డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 9.4% నుంచి 1.8 శాతానికి పడింది. ♦ ఫ్రిజ్‌లు, టీవీల వంటి కన్జూమర్ డ్యూరబు ల్స్ వృద్ధి 0.6% నుంచి 2.9%కి పెరిగింది. ♦ సబ్బులు, టూత్‌పేస్టుల వంటి ఎఫ్ఎంసీజీ విభాగంలో వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 10.9 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరంలోనూ తగ్గిన వృద్ధి 2017–18 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.6 శాతం (2016–17) నుంచి 4.3 శాతానికి పడిపోయింది. 2017–18 మొత్తంగా చూస్తే, తయారీ రంగం వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగింది. మైనింగ్ రంగంలో వృద్ధిరేటు 5.3% నుంచి 2.3 శాతానికి తగ్గింది.