
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో కీలక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వరుసగా ఆరవనెల కూడా క్షీణతలోనే కొనసాగింది. ఆగస్టులో మైనస్ 8.5 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. అంటే 2019 ఆగస్టులో జరిగిన ఉత్పత్తితో పోల్చిచూస్తే, 2020 ఆగస్టులో ఈ రంగాల ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 8.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40.27 శాతం వెయిటేజ్ ఉన్న ఎనిమిది రంగాల పనితీరును వేర్వేరుగా పరిశీలిస్తే....
► బొగ్గు (3.6 శాతం), ఎరువులు (7.3 శాతం) వృద్ధి బాటన నిలిచాయి.
► క్రూడ్ ఆయిల్ (–6.3%), సహజ వాయువులు (–9.5 %), రిఫైనరీ ప్రొడక్టులు (19.1%), స్టీల్ (–6.3 %), సిమెంట్ (–14.6 శాతం) విద్యుత్ (–2.7 శాతం) క్షీణతలో ఉన్నాయి.
ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ...: కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో చూస్తే, ఈ గ్రూప్ ఉత్పత్తి 17.8 శాతం క్షీణతలోనే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కనీసం 2.5 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పట్లో అంత తక్కువ వృద్ధి తీరుకు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ప్రధాన కారణం. 2019 ఆగస్టులో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ 0.2 శాతం క్షీణతలో ఉండడం గమనార్హం.