గణాంకాలవైపు చూపు..! | we have to concentrate on statistics | Sakshi
Sakshi News home page

గణాంకాలవైపు చూపు..!

Published Mon, Mar 10 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

గణాంకాలవైపు చూపు..!

గణాంకాలవైపు చూపు..!

 12న ఐఐపీ, సీపీఐ వివరాలు
 14న డబ్ల్యూపీఐ గణాంకాలు
  ఎఫ్‌ఐఐల పెట్టుబడులకూ ప్రాధాన్యం
  స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనాలు

 
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలతోపాటు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు ఈ వారం స్టాక్ మార్కెట్ల నడకను నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలకుతోడు, సంస్కరణల అమలు వేగవంతం కావచ్చునన్న ఆశలు ఎఫ్‌ఐఐలకు జోష్‌నిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇటీవల దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులను పెంచారని వెరసి మార్కెట్లు గత వారం కొత్త చరిత్రను లిఖించాయని వివరించారు. గడిచిన వారంలో బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు జమ చేసుకుని కొత్త చరిత్రాత్మక గరిష్టమైన 21,920 వద్ద ముగియగా, 250 పాయింట్లు జంప్ చేసిన  నిఫ్టీ 6,527 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇక వారాంతం రోజున ఇంట్రాడేలో సెన్సెక్స్ 21,961ను తాకగా, నిఫ్టీ 6,538ను చేరుకోవడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పాయి కూడా! డిసెంబర్ క్వార్టర్‌లో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 0.9%కు దిగిరావడానికితోడు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉపశమిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న సంకేతాలు బలపడుతున్నాయని నిపుణులు విశ్లేషించారు.
 
 యూఎస్ ఉద్యోగాల ఎఫెక్ట్

 దేశీ మార్కెట్లు ముగిశాక గడిచిన శుక్రవారం విడుదలైన అమెరికా ఉద్యోగ గణాంకాలు ఈ సోమవారం(10న) సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలకు అంచనాలను మించుతూ వ్యవసాయేతర కొలువులు(పేరోల్స్) 1,75,000కు పుంజుకోవడంతో తొలుత ఆసియా మార్కెట్లపై ఆ ప్రభావం కనిపించనుందని విశ్లేషించారు. పేరోల్స్ పెరగడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలలో మరింత కోత పడే అవకాశముందన్న అంచనాలు బలపడ్డాయని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో పెట్టేందుకు వీలుగా నెలకు 80 బిలియన్ డాలర్లతో అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలో ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే 20 బిలియన్ డాలర్లమేర కోతను విధించింది. కాగా, ఉద్యోగ గణాంకాలు అనూహ్యంగా పుంజుకోవడంతో ప్యాకేజీని మరింత తగ్గించే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
 
 వరుస గణాంకాలు...: జనవరి నెలకు ఐఐపీ డేటాతోపాటు, ఫిబ్రవరి నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు బుధవారం(12న) వెలువడనున్నాయి. ఇక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు శుక్రవారం(14న) వెల్లడికానున్నాయి. ఈ అంశాల ఆధారంగా వచ్చే నెల మొదట్లో (ఏప్రిల్1న) నిర్వహించనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ అంచనాలు సమీప కాలంలో మార్కెట్ల ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక గత వారంలో రూ. 5,045 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు కూడా మార్కెట్లపై తగిన ప్రభావాన్ని చూపగలరని తెలిపారు.
 
రాజకీయ పరిణామాలు...
ఆర్థిక గణాంకాలు, విదేశీ సంకేతాలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులేకాకుండా దేశ రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్లను నిర్దేశిస్తాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రయివేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే వ్యాఖ్యానించారు. కంపెనీల తదుపరి దశ ఆర్థిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాన్ని కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లింపులు వెల్లడిస్తాయని ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ఆపై వచ్చే రెండు నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికల  ఫలితాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement