న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్‌లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామిక ప్రగతి శూన్యం...
పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్‌లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) –0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్‌లో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో –1.4 శాతం, సెప్టెంబర్‌లో – 4.6 శాతం, అక్టోబర్‌లో –4 శాతం) నవంబర్‌లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్‌లో మళ్లీ క్షీణించడం గమనార్హం. 2018 డిసెంబర్‌లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. కీలక రంగాలను చూస్తే...
► తయారీ: 2019 డిసెంబర్‌లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్‌లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం.
► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 4.5% వృద్ధి నుంచి నుంచి –0.1%కి పడింది.
► మైనింగ్: 5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది.
► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో రేటు ఏకంగా – 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్‌లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం.
తొమ్మిది నెలల్లో ఇలా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం.
నిత్యావసర ధరల మంట
ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్ రిటైల్ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.
కట్టుదాటి...!
రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్ (4.62 శాతం), డిసెంబర్ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్‌లో తాకింది.
ఆర్‌బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్‌బీఐ తగ్గిం చింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపు లో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది.
ఆందోళనకరం...
గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్‌లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు.
– రుమ్‌కీ మజుందార్, డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త
Comments
Please login to add a commentAdd a comment