
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఆర్‌బీఐ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గవర్నెన్స్ నియంత్రణలకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. రిస్క్ మేనేజ్‌మెంట్, రిసోర్స్ మేనేజ్‌మెంట్, పనితీరు నిర్వహణ వంటి కీలకమైన అంశాల్లో ఐటీ గవర్నెన్స్ పాత్ర కీలకం.
ఐటీ గవర్నెన్స్‌కు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఐటీ కార్యాకలాపాల్లో ఎలాంటి అవరోధం రాకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన సమగ్ర ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసుకోవాలి. డేటా మార్పులున్నపుడు మైగ్రేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైన డాక్యుమెంట్ పాలసీని కలిగి ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసే ప్రతి ఐటీ అప్లికేషన్ ఆడిట్ ట్రయల్స్, ఆడిట్‌ను అందించాలి. క్రిప్టోగ్రాఫిక్ నియంత్రణలపై ట్రాన్స్‌మిషన్ ఛానెల్‌లలో ఉపయోగించే అల్గారిథమ్‌లు, ప్రోటోకాల్‌లు పకడ్బందీగా ఉండాలని పేర్కొంది.