RBI policy
-
ఆర్బీఐ పాలసీ, గణాంకాలు కీలకం
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు యూఎస్ బాండ్ ఈల్డ్స్, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. దాదాపు నెల రోజుల స్థిరీకరణ తర్వాత గతవారంలో ఐటీ మినహా అన్ని రంగాల షేర్లూ రాణించాయి. ఫలితంగా ట్రేడింగ్ 3 రోజులే గతవారంలో సెన్సెక్స్ 819 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ‘‘లార్జ్ క్యాప్ షేర్ల రాణించవచ్చనే ఆశలతో స్టాక్ మార్కెట్లో సానుకూలతలు కొనసాగొచ్చు. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రభుత్వ కేంద్రీకృత షేర్లపై దృష్టి సారించవచ్చు. అలాగే మార్చి వాహన విక్ర య డేటా వెల్లడి కానునడంతో ఆటో షేర్లలో కదలికలు అధికంగా ఉండొచ్చు. అనుకున్నట్లే సానుకూలతలు కొనసాగే నిఫ్టీ 22,800 – 23,000 శ్రేణిలో కదలాడుతుంది. దిగువు స్థాయిలో 22,000 వద్ద తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీని యర్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలు మార్చి నెలకు సంబంధించిన వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం), తయారీ పీఎంఐ డేటా మంగళవారం, సేవల రంగ పీఎంఐ గణాంకాలు గురువారం వెల్లడి అవుతాయి. మార్చి 22తో ముగిసిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలతో మార్చి 29తో వారంలో ముగిసిన పాటు ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. రేట్ల కోత ఉండకపోవచ్చు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఏప్రిల్ 3న(బుధవారం) ప్రారంభమై, శుక్రవారం ముగియనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా ఐదుశాతానికి పైగా కొనసాగుతుండటంతో ఈసారీ వడ్డీరేట్ల కోతకు అవకాశాల్లేవని నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ద్రవ్య పాలసీ వెల్లడి సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ప్రపంచ పరిణామాలు చైనా, జపాన్, అమెరికా మార్చి తయారీ రంగ పీఎంఐ డేటా సోమవారం, ఇవే దేశాలకు సంబంధించిన సేవల రంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. ఇక యూరోజోన్ మార్చి తయారీ రంగ మంగళవారం విడుదల కానున్నాయి. యూఎస్ ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం బుధవారం ఉంది. యూరోజోన్ సేవల రంగ డేటా గురువారం విడుదల అవుతుంది. వారాంతపు రోజైన శుక్రవారం జపాన్ మార్చి గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ మార్చి రిటైల్ అమ్మకాలు, అమెరికా మార్చి నిరుద్యోగ గణాంకాలు విడుదల కానున్నాయి. -
ఇప్పుడు 7.2 శాతం.. వచ్చేది 7 శాతం!
దావోస్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదుచేసుకోగలదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యస్తం చేశారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న భరోసాను ఇచ్చారు. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2023–24 జీడీపీ అంచనాలు 7 శాతంకన్నా... వ్యక్తిగతంగా దాస్ అంచనా 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా గమనార్హం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఐఐ వార్షిక సమావేశంలో ‘అధిక వృద్ధి తీరు–తక్కువ స్థాయిలో ఇబ్బందులు: ది ఇండియా స్టోరీ’ అనే అంశంపై దాస్ మాట్లాడుతూ, వృద్ధి స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలకు సంబంధించి ద్రవ్యోల్బణం ప్రమాదం ఇటీవల తగ్గుముఖం పట్టిందని అన్నారు. ఇది భవిష్యత్ వృద్ధి పటిష్టతకు సంకేతమని పేర్కొన్నారు. సమావేశంలో ఇంకా ఆయన ఏమన్నారంటే... ► ఇటీవలి సంవత్సరాలలో భారత్ ప్రభుత్వం చేపట్టిన పటిష్ట నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయి. ► సవాలుతో కూడిన ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ భారత్... పటిష్ట వృద్ధి, స్థిరత్వ బాటన పయనిస్తోంది. ► ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు, మార్కెట్ల సానుకూల వాతావారణం ఉన్నప్పటికీ, భౌగోళిక ఇబ్బందులు, వాతావరణ మార్పులు ఆందోళనకు కారణమవుతున్నాయి. ► బలమైన దేశీయ డిమాండ్‌తో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇటీవలి ప్రపంచ అనిశ్చితి పరిణామాల నుంచి భారత్ మరింత బలంగా బయటపడింది. ► అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనగలిగిన స్థాయిలో భారత్ చెల్లింపుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశానికి తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ► 2022 మే నుంచి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతూ వచి్చంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య లభ్యత నిర్వహణా పరిస్థితులు ఇందుకు దోహదపడ్డాయి. (2022 మే నుంచి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటు 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.) సరఫరాల వైపు సమస్యలు కూడా తొలిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోంది. ► వచ్చే ఏడాది సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నా. ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా ఆర్బీఐ 4 శాతం లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలదనే విశ్వాసంతో ఉంది. -
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ఆదేశాలు
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఆర్బీఐ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గవర్నెన్స్ నియంత్రణలకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. రిస్క్ మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్, పనితీరు నిర్వహణ వంటి కీలకమైన అంశాల్లో ఐటీ గవర్నెన్స్ పాత్ర కీలకం. ఐటీ గవర్నెన్స్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఐటీ కార్యాకలాపాల్లో ఎలాంటి అవరోధం రాకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన సమగ్ర ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసుకోవాలి. డేటా మార్పులున్నపుడు మైగ్రేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైన డాక్యుమెంట్ పాలసీని కలిగి ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసే ప్రతి ఐటీ అప్లికేషన్ ఆడిట్ ట్రయల్స్, ఆడిట్‌ను అందించాలి. క్రిప్టోగ్రాఫిక్ నియంత్రణలపై ట్రాన్స్మిషన్ ఛానెల్‌లలో ఉపయోగించే అల్గారిథమ్‌లు, ప్రోటోకాల్‌లు పకడ్బందీగా ఉండాలని పేర్కొంది. -
ఆర్బీఐ పాలసీ, ప్రపంచ పరిణామాలు కీలకం
న్యూఢిల్లీ: వడ్డీరేట్లపై ఆర్బీఐ వెల్లడించే పాలసీ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. కాగా, బుధవారం మహావీర్ జయంతి అలాగే శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లు పని చేయవు. ట్రేడింగ్ మూడు రోజులకు మాత్రమే పరిమితం కానుంది. ఆర్బీఐ పాలసీపై ఫోకస్... ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఏప్రిల్ 6న వెలువడనుంది. దీనిపై ఈ వారం మార్కెట్ ప్రధానంగా దృష్టి పెడుతుందని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారుతున్న ఎఫ్‌పీఐల పెట్టుబడులపై అలాగే దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ)పై కూడా ఫోకస్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక గతేడాది రికార్డు స్థాయి వాహన విక్రయాలను సాధించిన ఆటోమొబైల్ రంగంపైగా మార్కెట్ దృష్టి సారిస్తుందన్నారు. ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పీఎంఐ గణాంకాలు.. ఆర్బీఐ చర్యలతో పాటు ఏప్రిల్3న ఎస్అండ్పీ గ్లోబల్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్ 5న సేవల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ‘దేశీయ అంశాలకు తోడు ప్రపంచ పరిణామాలు, విదేశీ నిధుల ప్రవాహ ధోరణులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. సమీప కాలంలో చూస్తే మార్కెట్ దృష్టి అంతా ఆర్బీఐ పాలసీపైనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఆర్బీఐ నిర్ణయం, పీఎంఐ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,462 పాయింట్లు (2.54%) దూసుకెళ్లింది. శుక్రవారం ఒక్కరోజే 1,031 పాయింట్లు ఎగబాకడం విశేషం. బ్యాంకింగ్ సంక్షోభ భయాలు నెమ్మదిగా సద్దుమణుగుతుండటంతో ఆసియా, యూరప్, అమెరికా సూచీలు సైతం గత శుక్రవారం సానుకూలంగా ముగిశాయి. -
ఆర్బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!
న్యూఢిల్లీ: ఆర్బీఐ పాలసీ, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్‌కు కీలకాంశాలని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు వాహన విక్రయ గణాంకాలు, మౌలిక, తయారీ రంగ సంబంధిత గణాంకాలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు....మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం(వచ్చే నెల2న) సెలవు కావడంతో ట్రేడింగ్ ఈ వారం నాలుగు రోజులే జరగనున్నది. మరో వైపు మంగళవారం నుంచి మూడు ఐపీఓలు–యూటీఐ ఏఎమ్‌సీ, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ఐపీఓలు మొదలు కానున్నాయి. గురువారం ఆర్బీఐ పాలసీ.. మారటోరియం రుణాలపై వడ్డీకి సంబంధించిన కేసు ఈ నెల 28న (నేడు–సోమవారం)సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. బుధవారం (ఈ నెల 30న) ఆగస్టు నెలకు సంబం«ధించిన మౌలిక రంగ గణాంకాలు వెల్లడవుతాయి. వచ్చే నెల 1(గురువారం) ఆర్బీఐ పాలసీ వెల్లడి కానున్నది. అదే రోజు వాహన కంపెనీలు సెప్టెంబర్ నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. మరోవైపు సెప్టెంబర్ నెలకు సంబంధించి తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు కూడా గురువారమే రానున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లండ్‌ల జీడీపీ గణాంకాలు, అమెరికాకు సంబంధించి పీఎమ్ఐ గణాంకాలు వెల్లడవుతాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్.... గత శుక్రవారం రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకున్నా, యూరప్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో మార్కెట్లో ఒడిదుడుకులకు అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. రూ. 476 కోట్ల విదేశీ నిధులు వెనక్కి.... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.476 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత వారంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.10,491 కోట్లు నికర అమ్మకాలు జరిపారు. యూరప్, ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల అప్రమత్తతను ఇది సూచిస్తోందని నిపుణులంటున్నారు. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ ఈక్విటీ మార్కెట్ నుంచి నికరంగా రూ.4,016 కోట్లు ఉపసంహరించుకోగా, డెట్ మార్కెట్లో నికరంగా రూ. 3,540 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద నికరంగా రూ.476 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
పరిశ్రమలు వెనక్కి.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామిక ప్రగతి శూన్యం... పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) –0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో –1.4 శాతం, సెప్టెంబర్‌లో – 4.6 శాతం, అక్టోబర్‌లో –4 శాతం) నవంబర్‌లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్లో మళ్లీ క్షీణించడం గమనార్హం. 2018 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. కీలక రంగాలను చూస్తే... ► తయారీ: 2019 డిసెంబర్లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 4.5% వృద్ధి నుంచి నుంచి –0.1%కి పడింది. ► మైనింగ్: 5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో రేటు ఏకంగా – 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం. తొమ్మిది నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం. నిత్యావసర ధరల మంట ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్ రిటైల్ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. కట్టుదాటి...! రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్ (4.62 శాతం), డిసెంబర్ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకింది. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గిం చింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపు లో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఆందోళనకరం... గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు. – రుమ్కీ మజుందార్, డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త -
మార్కెట్ అక్కడక్కడే
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకున్నా మన మార్కెట్లో మాత్రం ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, నవంబర్ నెల వాహన విక్రయాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో వాహన, బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించనుండటంతో పలువురు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 40,802 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 12,048 పాయింట్ల వద్ద ముగిశాయి. మొబైల్ చార్జీలు 40 శాతం మేర పెరగడంతో టెలికం కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయి. -
వివాదాల ‘విరాళ్’... గుడ్‌బై!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్ విరాళ్ ఆచార్య రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఇదే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్పటేల్ తర్వాత, బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఆచార్య ఉండడం గమనార్హం. ప్రభుత్వంతో పొసగకే ఆయన రాజీనామా చేశారన్న పుకార్లు షికారు చేయడం మరో విశేషం. బాధ్యతలు పూర్తవడానికి దాదాపు 9 నెలల ముందే వ్యక్తిగత కారణాలతో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినప్పుడూ, ఇదే విధమైన విశ్లేషణలు రావడం గమనార్హం. కాగా, ఉర్జిత్ పటేల్ రాజీనామా నాటినుంచే విరాళ్ ఆచార్య కూడా అదే బాటన పయనిస్తారన్న వార్తలు కొనసాగాయి. 45 సంవత్సరాల విరాళ్ ఆచార్య, ఆర్బీఐ గవర్నర్లలో అతి చిన్నవారు. మోదీ ప్రభుత్వం రెండవదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థాయిలో జరిగిన తొలి రాజీనామా ఇది కావడం మరో విశేషం. ఆర్బీఐ ప్రకటన ఏమి చెప్పిందంటే.. ఆర్బీఐ సోమవారంనాడు విడుదల చేసిన ప్రకటనను చూస్తే, ‘‘అనివార్యమైన వ్యక్తిగత పర్యవసానాల వల్ల తాను జూలై 23 తర్వాత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కొనసాగలేనని కొద్ది వారాల క్రితం డాక్టర్ విరాళ్ ఆచార్య ఒక లేఖను సమర్పించారు’’ అని ఒక క్లుప్తమైన ప్రకటన వెలువడింది. డాక్టర్ ఆచార్య రాజీనామాతో నూతన నియామకం జరిగేంతవరకూ డిప్యూటీ గవర్నర్లుగా ఇక ముగ్గురు – ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్లు ఉంటారు. కేంద్రం ఏరికోరి... ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ విరాళ్ ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గరవ్నర్‌గా 2016 డిసెంబర్లో నియమించింది. 2017 జనవరిలో ఆయన మూడేళ్ల తన బాధ్యతలను చేపట్టారు. అప్పట్లో ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, డిపాజిట్లు, విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి నిబంధనలనూ తరచూ మార్చుతూ ఆర్బీఐ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన డిప్యూటీ గవర్నర్ బాధ్యతలను చేపట్టారు. ద్రవ్యఅంశాల విభాగాన్ని ఆయన ఆర్బీఐలో పర్యవేక్షించారు. రాజీనామా అనంతరం విరాళ్ ఆచార్య ఏమిచేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రానున్నప్పటికీ, ఆయన తిరిగి ప్రొఫెసర్‌గానే వెళ్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. పాలసీపై విభేదాలు? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి సమీక్షా కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా కూడా ఉన్నారు. జూన్‌లో ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయాలతో విరాళ్ ఆచార్య కొంత విభేదించినట్లు సంబంధిత మినిట్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటుపై ఆయన తాజా పాలసీ సమీక్షలో ఆందోళన వెలిబుచ్చారు. గడచిన ఐదు బడ్జెట్లలో మూడుసార్లు ద్రవ్యలోటు కట్టుతప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2013 నుంచీ ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల ద్రవ్యలోటు పరిస్థితి దిగజారుతూ వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాకేష్ మోహన్ తరువాత... ‘ఫారిన్ ట్రైన్డ్’ ఎకనమిస్ట్‌గా రిజర్వ్ బ్యాంక్‌లో పనిచేసి బాధ్యత కాలం పూర్తికాకుండానే తప్పుకున్న రెండో డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య. ఇంతక్రితం 2009 మే నెలలో అప్పటి డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ తన బాధ్యతలకు ముందుగానే రాజీనామా చేశారు. అప్పట్లో జూలై 23తో ఆయన పదవీకాలం పూర్తికావాల్సి ఉంది. జలాన్ కమిటీ నివేదిక నేపథ్యం... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల అదనపు నిధుల్లో కొంత మొత్తాన్ని కేంద్రానికి బదలాయించాలన్న విషయమై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన ఆరుగురు సభ్యుల కమిటీ తన నివేదికను మరో నెల రోజుల్లో సమర్పించనున్న నేపథ్యంలో విరాళ్ రాజీనామా మరో విశేషం. నిజానికి జూన్ చివరికల్లా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉన్నా, అది అసాధ్యమని వార్తలు వస్తున్నాయి. పలు అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వివాదాల్లో... స్వతంత్ర నిర్ణయాలు, ఆలోచనలు కలిగిన ఆర్థికవేత్తగా విరాళ్ ఆచార్య పేరుంది. ఇది ఆయనను పలు దఫాలు వివాదాల్లోకీ నెట్టింది. పలు సందర్భాల్లో ఆయన ప్రత్యక్షంగా కేంద్రంపై, ఆర్థిక మంత్రిత్వశాఖపై తన నిరసన గళం వినిపించారు. ప్రత్యేకించి సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృషించాయి. అందులో కొన్ని అంశాలు చూస్తే... ► గత ఏడాది అక్టోబర్‌లో ఆయన ఏడీ షరోఫ్ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయ రూపకల్పన దీర్ఘకాలం దృష్టితో కాకుండా, స్వల్పకాల ప్రయోజనాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడుకుని ఉంటోందని పేర్కొన్నారు. పలు అంశాలపై ప్రభుత్వం–ఆర్బీఐ మధ్య ఉన్న విభేదాలను కూడా ఆయన ఈ ప్రసంగంలో పేర్కొన్నారు. ► మరో సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని తక్కువచేస్తే, అది క్యాపిటల్ మార్కెట్లలో విశ్వాస సంక్షోభాన్ని తీసుకువస్తుందని అన్నారు. అలాగే సెంట్రల్‌బ్యాంక్ సమర్థతపైనా ఆయా అంశాల ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ► మొండిబకాయిలకు సంబంధించి కొన్ని బ్యాంకులపై ప్రయోగించిన ‘దిద్దుబాటు చర్యల ప్రక్రియ’ (పీసీఏ)ను కూడా ఆయన పలు సందర్భాల్లో గట్టిగా సమర్థించారు. -
ఆర్బీఐ బూస్ట్ : స్థిరంగా మార్కెట్లు
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమావేశాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును పావు శాతంమేర తగ్గించడంతో తొలుత మార్కెట్లు జోరందుకున్నాయి. తదుపరి కాస్త వెనకడుగు వేశాయి. తిరిగి పుంజుకుని సెన్సెక్స్ 109 పాయింట్ల లాభంతో 37వేలకు ఎగువన, నిప్టీ 36 పాయింట్లు ఎ గిసి 11098 వద్ద కొనసాగుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ నేతృత్వంలో రెపో రేటు 6.25 శాతానికి దిగిరాగా.. రివర్స్ రెపో 6 శాతానికి చేరింది. అలాగు బ్యాంక్ రేటు 6.5 శాతంగా అమలుకానుంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్వెస్టర్లు కొనుళ్ల జోరందుకున్నాయి. వీటితో పాటు ఫార్మా, ఆటో 1.6 శాతం చొప్పున ఎగశాయి. సన్ ఫార్మా 5.25 శాతం జంప్‌చేయగా, బజాజ్ ఆటో, ఇన్ఫ్రాటెల్, జీ, యస్ బ్యాంక్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, హీరో మోటో, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్, గెయిల్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, వేదాంతా, టైటన్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
ఆరో రోజూ కొనసాగిన లాభాలు
ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా, స్టాక్మార్కెట్లో సోమవారం కూడా లాభాలు కొనసాగాయి. వరుసగా ఆరో రోజూ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడినా, జీడీపీ గణాంకాలు నిరుత్సాహపరిచినా మార్కెట్ ముందుకే సాగింది. అయితే చివరకు ఆరంభ లాభాలు ఆవిరై, స్వల్ప లాభాలతో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు లాభపడి 36,241 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 10,884 పాయింట్ల వద్ద ముగిశాయి. కుదిరిన సంధి...! అమెరికా–చైనాల మధ్య వాణిజ్య సుంకాల విషయమై తాత్కాలికంగా సంధి కుదరడంతో ప్రపంచమార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగానూ లోహ షేర్లు మంచి లాభాలు సాధించాయి. వేదాంత, హిందాల్కో, తదితర లోహ షేర్లు 4 శాతం వరకూ ఎగిశాయి. అయితే రూపాయి క్షీణించడం స్టాక్ మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు ఎగియడంతో రూపాయి 73 పైసలు క్షీణించి 70.31 స్థాయికి (ఇంట్రాడేలో) పతనమైంది. బ్యారెల్ బ్రెంట్ చమురు 4 శాతం ఎగసి 61.72 డాలర్లకు పెరిగింది. ఈ క్యూ2లో 8.2 శాతంగా ఉన్న జీడీపీ ఈ క్యూ2లో 7.1 శాతానికి తగ్గింది. ఈ మూడు అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత ఒడిదుడుకులకు గురైంది. ఒక దశలో 252 పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 95 పాయింట్ల వరకూ నష్టపోయింది.మొత్తం మీద 347 పాయింట్ల రేంజ్లో కదలాడింది. స్టాక్ సూచీలు లాభ, నష్టాల మధ్య సయ్యాటలాడాయని జియోజిత్ ఫైనా న్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే ఒప్పందం కుదరడం సానుకూల ప్రభావం చూపించినా, ముడి చమురు ధరలు ఎగియడం, రూపాయి బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపించాయని వివరించారు. మరోవైపు ఈ వారంలో వెలువడే ఆర్బీఐ పాలసీలో ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గవచ్చని, రేట్ల కోతలో యథాతథ స్థితి కొనసాగవచ్చని, లిక్విడిటీ మెరుగుకు చర్యలు ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. సన్‌ఫార్మా 7 శాతం డౌన్ గతంలో మూసేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును సెబీ తిరిగి తెరిచే అవకాశాలున్నాయన్న వార్తలు సన్‌ఫర్మా షేర్‌ను పడగొట్టా యి. ఇంట్రాడేలో10% పతనంతో రూ.442కు క్షీణించిన సన్ ఫార్మా షేర్ చివరకు 7.5 శాతం నష్టంతో రూ.455 వద్ద ముగిసింది. నవంబర్ నెల వాహన విక్రయాలు అంచనాల మేరకు లేకపోవడంతో అశోక్ లేలాండ్ షేర్ 4.5 శాతం నష్టపోయి రూ.107 వద్ద ముగిసింది. ఫ్లె్లయిర్ రైటింగ్ ఐపీఓకు సెబీ అనుమతి నెక్కన్ పవర్ కంపెనీకి కూడా.. పెన్నుల తయారీ సంస్థ ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు అసోంకు చెందిన నెక్కన్ పవర్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. దీంతో ఈ ఏడాది సెబీ ఇచ్చిన ఐపీఓ ఆమోదాల సంఖ్య 75కు పెరిగింది. ఐపీఓలో భాగంగా ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ.330 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద మరో 120 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. ఇక నెక్కన్ పవర్ కంపెనీ ఐపీఓలో భాగంగా 1.27 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. -
ఆర్బీఐ పాలసీ : వడ్డీరేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లను పెంచింది. నేటి నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘10 బేసిస్ పాయింట్ల మేర రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచుతున్నాం. నేటి నుంచే ఈ పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి’ అని హెచ్డీఎఫ్సీ స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపింది. దీంతో ఈఎంఐ మరింత భారంగా మారనుంది. ఆగస్టులో కూడా 20 బేసిస్ పాయింట్ల గృహ రుణాల వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను పెంచడంతో, హెచ్డీఎఫ్సీ కూడా వడ్డీరేట్లను పెంచింది. తాజాగా మరోసారి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైపాక్షిక మానిటరీ పాలసీ సమీక్ష మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, హెచ్డీఎఫ్సీ ఈ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ఈ సారి పాలసీలో కూడా రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్‌ధరలు పెరగడంతో, రూపాయి విలువ క్షీణించడంతో, ద్రవ్యోల్బణం మరింత పెరిగే భయాందోళనలు ఉండటంతో, కీలక రెపోను మరోసారి పెంపుకే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని మెజార్టీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఆర్బీఐ పాలసీ సమీక్ష అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ సమీక్ష జరగనుంది. గత నెలలో దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ కూడా మూడేళ్ల వరకు ఉన్న అన్ని కాల వ్యవధిలపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. -
ఇంటి రుణం.. ఇప్పుడేం చేద్దాం?
వడ్డీ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగున్నరేళ్ల తర్వాత ఆర్బీఐ గత నెలలో రెపో రేటును పావు శాతం పెంచింది. నిజానికి ఆర్బీఐ రేట్లు పెంచడానికి ముందే పలు బ్యాంకులు రుణాలపై రేట్లను పెంచేశాయి. డిపాజిట్లపై ప్రస్తుతానికి పెంచకపోయినా... మున్ముందు పెంచే అవకాశం లేకపోలేదు. దీనివల్ల వడ్డీ ఆదాయంపై ఆధారపడ్డ వారికి కొంత లాభమే. వారికిది ఊరటే!. మరి రుణాలు తీసుకున్నవారు..? ముఖ్యంగా దీర్ఘకాలానికి గృహ రుణాలు తీసుకున్నవారి సంగతో..? కచ్చితంగా వారిపై వడ్డీ భారం పడుతుంది. మరి ఆ భారాన్ని అధిగమించేందుకు మార్గాలేమైనా ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు..? ఆయా ఈ వివరాల సమాహారమే... ఈ ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ కథనం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం త్వరలో మరో విడత పాలసీ రేట్ల పెంపు ఉంటుందనేది మార్కెట్ నిపుణుల అంచనా. దీంతో ఇంటి రుణాలు తీసుకున్న వారు పెరిగే రేట్ల భారాన్ని మోయాల్సి వస్తుంది. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలను గమనిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత వడ్డీ రేట్లు మరింత కఠినంగా మారతాయనే అంచనాలున్నాయి. దీంతో రానున్న ఆరేడు నెలల కాలంలో ఇంటి రుణాలపై 25– 30 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెరగొచ్చని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ శంకర్ త్రిపాఠి చెప్పారు. రూ.50 లక్షల రుణాన్ని 20 ఏళ్లకి 8.5% వడ్డీ రేటుపై తీసుకుంటే.. కేవలం 10 బేసిస్ పాయింట్ల మేర రేటు పెంపుతో ఈఎంఐ రూ.317 మేర అధికమవుతుంది. అందుకే వడ్డీ రేట్ల పెంపుతో పరిస్థితి కఠినంగా మారుతుంది. అయితే, ఆందోళన కలిగించే అంశమేంటంటే... రేట్ల పెరుగుదల ఇక నుంచి నిటారుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి రుణగ్రహీతల కోణంలో చూస్తే ప్రస్తుతానికి వడ్డీ రేట్లు కొంత పెరిగాయి. అందుకే వడ్డీ రేటు భారం పెరగకుండా నిరోధించలేం. కాకపోతే దాన్ని అధిగమించే మార్గాలపై దృష్టి పెట్టడం మేలు. ఈఎంఐ లేదా కాల వ్యవధి పెంపు చాలా సంస్థలు వడ్డీ రేట్లను పెంచినప్పుడు ఈఎంఐ పెరగకుండా చెల్లింపుల కాలాన్ని పెంచేస్తుంటాయి. దీంతో పెంచిన మేర బ్యాంకులు సర్దుబాటు చేసుకుంటాయి. దీనివల్ల రుణంపై అధికంగా వడ్డీ చెల్లించినట్లే లెక్క. కానీ, నెలవారీగా భారం పెరిగిపోదు. కాల వ్యవధి పెరగడం ఇష్టం లేకపోతే పెరిగిన వడ్డీ మేర ఈఎంఐని పెంచి చెల్లించాల్సి వస్తుంది. ఇలా చేస్తేనే రుణం తీసుకున్న వారికి లాభసాటి అనేది మోర్ట్గేజ్ వరల్డ్ వ్యవస్థాపకుడు విపుల్ పటేల్ మాట. రుణం బదిలీ చేసుకుంటే..! రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకోవడం మరో ఆప్షన్. తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని ఆఫర్ చేసే సంస్థకు ప్రస్తుత రుణాన్ని బదిలీ చేసుకోవడం వల్ల పెరిగిన భారాన్ని కొంతయినా తగ్గించుకోవచ్చు. ఫ్లోటింగ్ రేటు రుణాలను ముందస్తుగా చెల్లించేస్తే దానిపై చార్జీలను బ్యాంకులు విధించడం లేదు. కాకపోతే రుణం చెల్లింపునకు ఎంత కాలం మిగిలి ఉందన్న దానిపైనే అది ప్రయోజనమా, కాదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇటీవలే గృహ రుణం తీసుకున్నారనుకోండి. కనీసం 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) మేర వడ్డీ రేటు పెరిగినప్పుడే దాన్ని మార్చుకోవడం వల్ల ప్రయోజనం పొందొచ్చు. ఒకవేళ రుణాన్ని కొన్నేళ్ల క్రితం తీసుకుని ఉంటే, వడ్డీ రేట్ల పెంపు కొంచెమే అయినా రుణాన్ని బదిలీ చేసుకునే ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. కాకపోతే రుణం చెల్లింపుల కాల వ్యవధి ముగిసే దశలో ఉన్న వారికి దీనితో పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఉదాహరణకు... ఇంటి రుణం తీసుకుని ఇంకా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటే, వడ్డీ రేటు 9 శాతం, కాల వ్యవధి 22 ఏళ్లు ఉందనుకుంటే... వెంటనే తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే సంస్థకు మారిపోవచ్చు. ఎందుకంటే వడ్డీ రేటు అర శాతం తక్కువ అయినా మొత్తం కాల వ్యవధిలో మారడం వల్ల రూ.11.08 లక్షలు ఆదా అవుతాయి. ప్రాసెసింగ్ చార్జీల వంటి నామమాత్రపు చార్జీలను పట్టించుకోనక్కర్లేదు. రుణాలిచ్చే కొన్ని సంస్థలు మాత్రం ఆర్బీఐ రేట్లను పెంచినప్పటికీ, కస్టమర్లను ఆకర్షించేందుకు వడ్డీరేట్లు పెంచుకుండా అలానే కొనసాగిస్తున్నాయి. అయితే, స్వతంత్ర ఆర్థిక సలహాదారుడు వీఎన్ కులకర్ణి మాత్రం రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవాలంటే కనీసం ఒక శాతం మేర అయినా తక్కువ రేటు ఉండాలని సూచించారు. పాక్షికంగా చెల్లించొచ్చు కూడా... రుణ గ్రహీతలు పరిశీలించాల్సిన మరో అవకాశం ఏంటంటే... రుణాన్ని పాక్షికంగా ముందుగానే చెల్లించటం ద్వారా వడ్డీ భారాన్ని కొంతయినా తగ్గించుకోవటం. తక్కువ వడ్డీ రేటుంటే బ్యాంక్ డిపాజిట్లలోనో, మరోచోటో ఇన్వెస్ట్ చేసే కంటే... ఆ సొమ్మును పాక్షికంగా ఇంటి రుణం చెల్లించడానికి ఉపయోగించుకోవటం మంచిదేనంటారు కులకర్ణి. ఎందుకంటే సేవింగ్స్‌పై మీకు వచ్చే వడ్డీ కన్నా... రుణంపై మీరు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువ కనక!! ఈ తప్పులు మాత్రం చేయొద్దు.. చివరిగా చెప్పేదేంటంటే... వడ్డీ రేట్లు పెరుగుతున్నాయన్న ఒకే ఒక్క కారణంతో హడావుడిగా రుణం తీసుకోవటమో, లేక రుణం తీసుకోవటాన్ని మానేయటమో, బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోవటమో చేయొద్దు. మీరు కొత్తగా రుణం తీసుకునే వారైనా, ఇప్పటికే రుణం తీసుకున్న వారైనా... సాధారణంగా రుణ గ్రహీతలు చేసే తప్పులు చేయొద్దు. ♦ ఏదో కొంత వడ్డీ పెరిగిందని చాలామంది స్థిర వడ్డీ రుణాలు తీసుకోవటానికి మొగ్గు చూపుతుంటారు. అది సరికాదు. ఈ చిన్న పెంపుతో పోలిస్తే చిరకాలం మీరు చెల్లించే అధిక వడ్డీ మొత్తం చాలా ఎక్కువ. ‘‘స్థిర వడ్డీ రేట్లపై రుణాలు తీసుకున్న వారు ఇరుక్కుపోతుంటారు. వారు ఒకవేళ రుణాన్ని బదిలీ చేసుకుందామనుకున్నా అది ఆకర్షణీయంగా కనిపించదు. ఎందుకంటే స్థిర రుణాన్ని బదిలీ చేయాలనుకుంటే ముందస్తు క్లోజింగ్ చార్జీలు చెల్లించాలి. అవి చాలా ఎక్కువ’’ అని పాటిల్ వివరించారు. ♦ మీరు గనక నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ కొనాలనుకుంటే మీ ప్రయోజనాల్ని కాపాడే నిబంధనలున్న రుణదాతనే ఎంచుకోండి. ♦ నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా బిల్డరుకు రుణం చెల్లించే రుణదాతనే ఎంపిక చేసుకోవాలి. ‘‘నేనైతే నిర్మాణంలో ఉన్న వాటికి అగ్రిమెంట్ విలువను బట్టి పూర్తి పేమెంట్ చేసే రుణదాతను ఎంచుకోవాలని ఎవ్వరికీ చెప్పరు’’ అని త్రిపాఠీ వ్యాఖ్యానించారు. ♦ చివరిగా చెప్పాలంటే... మీ ఆదాయం, కుటుంబ ఖర్చులు, ఇతర బాధ్యతలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నాకే రుణం ఎంత తీసుకోవాలో నిర్ణయించుకోండి. అంతేకానీ బ్యాంకు ఆమోదించింది కదా అని భారీ రుణాన్ని తీసుకోవటం సరికాదు. తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మళ్లీ మళ్లీ ఎందుకు పరిశీలించుకోవాలంటే ఇది దీర్ఘకాలిక రుణం. పన్నులు పోను వచ్చే ఆదాయంలో 35–40 శాతాన్ని మాత్రమే ఇంటి రుణ వాయిదా చెల్లించడానికి ఉపయోగిస్తే మంచిది. -
ఇక 'వడ్డిం'పు షూరూ..!
వడ్డీరేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మరోసారి అందరి అంచనాలను తలకిందులు చేసింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత అనూహ్యంగా కీలక పాలసీ రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా అంతకంతకూ పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం పొంచి ఉండటమే వడ్డీరేట్ల పెంపునకు ప్రధాన కారణంగా పేర్కొంది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు కూడా పెరగనున్నాయి. ఖాతాదారులు చెల్లించే నెల వాయిదాలు (ఈఎంఐ) భారం కానున్నాయి. కాగా, మోదీ సర్కారు హయాంలో ఇది ఆర్బీఐ మొట్టమొదటి రేట్ల పెంపు కావడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేస్తాం... రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మధ్యకాలికంగా 4 శాతానికి (రెండు శాతం అటు ఇటుగా) కట్టడి చేయాలన్నదే తమ లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. వృద్ధి ఊతమిస్తూనే ఈ లక్ష్యానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతానికి తటస్థ పాలసీనే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ‘దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కొద్ది నెలలుగా పుంజుకున్నాయి. ఉత్పాదకతకు సంబంధించిన తగ్గుముఖం ధోరణి దాదాపు ముగిసినట్లే. కార్పొరేట్ల పెట్టుబడుల్లో కూడా మెరుగైన రికవరీయే కనబడుతోంది. దివాలా చట్టంతో మొండిబకాయిలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. భౌగోళిక–రాజకీయ రిస్కులు, ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, రక్షణాత్మక వాణిజ్య విధానాలు దేశీ ఆర్థిక వ్యవస్థ రికవరీకి అడ్డంకులు సృష్టించే ప్రమాదం పొంచి ఉంది’ అని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులపై ఆర్బీఐ అప్రమత్తత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.7%కి(ఏడు క్వార్టర్ల గరిష్టం), పూర్తి ఏడాదికి 6.7%కి వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఎగవేతదారులపై మరో అస్త్రం.. పీసీఆర్! రుణ ఎగవేతదారులను గుర్తించడం ప్రధాన లక్ష్యంగా ‘పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ (పీసీఆర్)’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. రుణ గ్రహీతల సమాచారం అంతా పీసీఆర్‌లో నమోదవుతుంది. వారి రుణ చరితను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ... అప్రమత్తం చేయడం రిజిస్ట్రీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. యశ్వంత్ ఎం దేవస్థాలి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా పీసీఆర్‌ను ఏర్పాటుచేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. రిజిస్ట్రీ విధివిధానాలు, పనితీరు వంటివి ఖరారుకు తొలిదశలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఐటీఎఫ్) ఏర్పాటవుతుంది. ప్రస్తుతం దేశంలో పలు క్రెడిట్ సమాచార విభాగాలున్నా.. కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు, లక్ష్యాల మేరకే ఇవి పనిచేస్తున్నాయి. చిన్న బ్యాంకులుగా సహకార బ్యాంకులు! సహకార బ్యాంకులకు త్వరలో చిన్న తరహా బ్యాంకుల హోదా(స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్) లభించే అవకాశాలు ఉన్నాయి. చిన్న బ్యాంకులుగా పట్టణ సహకార బ్యాంకుల(యూసీబీ) మార్పిడికి సంబంధించి ఆర్బీఐ త్వరలో ఒక పథకాన్ని ఆవిష్కరిస్తుందని డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ సూచించారు. దీనికి సంబంధించి కొన్ని వర్గాల నుంచి ఆర్బీఐకి విజ్ఞప్తులు వస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి, ఇందులో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం సేకరణకుగాను సెప్టెంబర్ 30న ఆర్బీఐ ఒక విధాన పత్రాన్ని విడుదల చేస్తుందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. ఆర్థిక వృద్ధికి విఘాతం: పరిశ్రమ వర్గాలు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై పారిశ్రామిక రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలకు గండిపడుతుందని పేర్కొన్నారు. ‘సరఫరాపరమైన అడ్డంకులే ప్రస్తుత ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం. రేట్ల పెంపుతో వృద్ధికి విఘాతం కలుగుతుంది. రానున్న కాలంలో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నాం’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ‘పరిశ్రమతోపాటు చాలా మందికి ఆర్బీఐ కఠిన వైఖరి రుచించకపోవచ్చు. అయినా, స్వల్పకాలానికి ఆర్బీఐ వడ్డీరేట్లలో పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీరేట్ల ధోరణి, క్రూడ్ ధరల జోరు, అధిక ద్రవ్యోల్బణం వల్లే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. రియల్టీ రంగంపై (ఇళ్ల కొనుగోళ్లు) ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. దీర్ఘకాలంలో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది’ అని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హిరనందాని వ్యాఖ్యానించారు. ముఖ్యాంశాలు ఇవీ... ►బ్యాంక్ రేటు 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగుతాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 6.5 శాతంగా ఉంటుంది. ►కార్పొరేట్ పెట్టుబడుల్లో రికవరీ మెరుగ్గానే ఉంది. దివాలా చట్టంతో మొండిబకాయిల పరిష్కారానికి తోడ్పాటు. ►ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పిత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన విధంగానే 7.4 శాతంగా ఉంటుంది. ►అంతర్జాతీయంగా పొంచిఉన్న రాజకీయ–భౌగోళికపరమైన రిస్కులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో కుదుపులు, అమెరికాతో సహా పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ►తదుపరి పాలసీ సమీక్ష నిర్ణయం ఆగస్టు 1న వెలువడుతుంది. సరైన దిశలో చర్యలు.. అందుబాటు గృహాలకిచ్చే రుణాలకు పరిమితులను పెంచడం, ఎంఎస్ఎంఈ సంస్థలు సంఘటిత రంగంలో భాగమయ్యేలా ప్రోత్సహించే చర్యలు సరైన దిశలో తీసుకున్నవే. ఎస్డీఎల్ వేల్యుయేషన్ నిబంధనల్లో మార్పులు.. దీర్ఘకాలికంగా సానుకూలమైనవి. ఎఫ్ఏఎల్ఎల్సీ నిష్పత్తిని పెంచడం వల్ల బ్యాంకులకు మరింత లిక్విడిటీ లభిస్తుంది. – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటు ఆర్బీఐ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. ద్రవ్యోల్బణ అంచనాలు స్థిరంగా ఉండేలా చూసేందుకు తోడ్పడతాయి. ఇవి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఉపయోగపడగలవు. – చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్ ద్రవ్యోల్బణ కట్టడి.. రేట్ల పెంపు నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4%స్థాయిలో కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. పెరుగుతున్న ముడి చమురు రేట్లు వంటి అంశాలతో అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగానే రేట్ల పెంచి ఉంటారని భావిస్తున్నా. – రాణా కపూర్, ఎండీ, యస్ బ్యాంక్ -
ఆర్బీఐ నిర్ణయం... మార్కెట్లకు మార్గదర్శకం!
న్యూఢిల్లీ: ఆర్బీఐ పాలసీ కమిటీ సమీక్షా సమావేశం నిర్ణయాలు, అంతర్జాతీయ అంశాలు ఈ వారం మార్కెట్లను నడిపించనున్నాయి. అలాగే, స్థూల ఆర్థిక అంశాల ప్రభావం కూడా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘‘అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్, చమురు ధరలు, వాణిజ్య ఘర్షణలపై మార్కెట్ దృష్టి ఉంటుంది. అలాగే, అధిక చమురు ధరల ప్రభావం, ద్రవ్యోల్బణంపై కనీస మద్దతు ధరల ప్రభావం నేపథ్యంలో దేశీయంగా పాలసీ రేట్లపై ఆర్బీఐ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. వరుసగా మూడో ఏడాది సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనాలు ప్రకటించింది. అయితే, సకాలంలో సరైన వర్షపాతం అన్నది కీలకాంశంగా చూడాల్సి ఉంటుంది’’అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాణి తెలిపారు. ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం ఈ నెల 6న వెలువడనుంది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో 2017 ఆగస్ట్ నుంచి ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. ఇక, సేవల రంగం పీఎంఐ డేటా కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ‘‘అధిక చమురు ధరల ప్రభావంతో ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఎంపీసీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ రేట్ల పెంపు భయాలు ఈ వారం మార్కెట్లను నియంత్రించొచ్చు’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ తెలిపారు. ‘మే’లో ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.29,714 కోట్లను ఉపసంహరించుకెళ్లారు. 18 నెలల్లో ఈ స్థాయిలో నిధులు వెనక్కి వెళ్లిపోవడం మే నెలలోనే జరిగింది. ఏప్రిల్ నెలలోనూ రూ.15,561 కోట్లను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకోవడం గమనార్హం. మేనెలలో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు రూ.10,060 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. డెట్ మార్కెట్ నుంచి రూ.19,654 కోట్లను తీసేసుకున్నారు. 2016 నవంబర్‌లో ఎఫ్‌పీఐలు మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో రూ.39,396 కోట్లను వెనక్కి తీసేసుకున్న తర్వాత మరోసారి గరిష్ట స్థాయి అవుట్‌ఫ్లో ఈ మే నెలలో చోటు చేసుకుంది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ.2,100 కోట్లు కాగా, డెట్ మార్కెట్లో రూ.30,000 కోట్లుగా ఉన్నాయి. చమురు ధరలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాఫిట్ బుకింగ్, సెబీ నిబంధనల మేరకు అదనపు పత్రాలను సమర్పించాల్సి రావడం వంటి అంశాలు ఎఫ్‌పీఐలు అధికంగా ఉపసంహరించుకోవడానికి కారణాలుగా ‘గ్రో’ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు. -
ఆర్బీఐ రూటు ఎటు..?
ముంబై: ఒకపక్క అంతకంతకూ ఎగబాకుతున్న ముడిచమురు ధరలు... మరోపక్క దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఆర్బీఐకి ఈసారి పాలసీ నిర్ణయం కత్తిమీద సాముగా మారనుంది. నేటి నుంచి మూడురోజుల పాటు జరగనున్న పరపతి విధాన సమీక్ష కమిటీ(ఎంపీసీ) భేటీలో పాలసీ రేట్ల నిర్ణయంలో ఈ రెండే కీలకం కానున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 6న(బుధవారం) పాలసీ సమీక్ష నిర్ణయం వెలువడనుంది. కాగా, తాజాగా వెలువడిన నాలుగో త్రైమాసికం(క్యూ4) స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రికవరీ బాటలో పయనిస్తోందన్న సంకేతాలు బలపడ్డాయి. 2017–18 క్యూ4లో జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతానికి ఎకబాకిన సంగతి తెలిసిందే. గడిచిన ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇదిలాఉంటే... ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు ఇక ఆస్కారం లేదనేది నిపుణుల అభిప్రాయం. ఆగస్టు నుంచీ అక్కడే... 2017 నవంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం పైనే నమోదవుతూ వస్తోంది. వృద్ధికి ఊతమిచ్చే విధంగా ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి(2 శాతం అటూఇటుగా) కట్టడి చేయాలని ఆర్బీఐకి ప్రభుత్వం నిర్ధేశించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల కారణంగానే 2017 ఆగస్టు నుంచీ ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగానే కొనసాగిస్తూ వస్తోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.58 శాతానికి, టోకు ద్రవ్యోల్బణం 3.18 శాతానికి ఎగబాకాయి. ప్రధానంగా ఇంధన ధరల పెరుగుదల దీనికి ఆజ్యం పోసింది. ప్రస్తుతం రెపో రేటు(బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు) 6 శాతం, రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధుల పరిమాణం) 4 శాతంగా ఉన్నాయి. కాగా, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ప్రతిసారీ రెండు రోజుల పాటు భేటీ అవుతుంది. ఈసారి సమీక్షను మాత్రం మూడు రోజులు నిర్వహిస్తుండటం విశేషం. పెంపు సంకేతాలు...! తాజాగా పలు ప్రధాన బ్యాంకులు ఈ నెల 1 నుంచి రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా మరికొన్ని బ్యాంకులు డిపాజిట్ రేట్లను కూడా ఇటీవలే పెంచాయి. ఇవన్నీ రానున్న కాలంలో ఆర్బీఐ రేట్ల పెంపునకు సంకేతాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘మార్కెట్లో రేట్ల పెంపు సంకేతాలు ఉన్నప్పటికీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే సరిపోతుందని మేం భావిస్తున్నాం’ అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. జీడీపీ గణంకాలు పటిష్టంగానే ఉన్నప్పటికీ, ప్రైవేటు వినియోగం ఇంకా పడిపోతూనే ఉండటాన్ని(2016–17లో 7.3 శాతం నుంచి 2017–18లో 6.6 శాతానికి తగ్గింది) ఇందుకు ప్రధాన కారణంగా ప్రస్తావించింది. కాగా, ఇప్పటివరకూ అనుసరిస్తున్న సరళ పాలసీ విధానానికి ఇక తెరదించాల్సి ఉందంటూ గత పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య కూడా సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. గత భేటీలో మరో ఎంపీసీ సభ్యుడు మైఖేల్ పాత్రా అయితే రెపో రేటు పెంపునకు ఓటు వేశారు కూడా. అయితే, ఐదుగురు సభ్యులు యథాతథానికే ఓటు వేయడంతో రేట్లలో ఎలాంటి మార్పులూ జరగలేదు. కాగా, ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరిగినప్పటికీ.. తక్షణం రేట్ల పెంపు ఉండకపోవచ్చ ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఎండీ, సీఈఓ నరేశ్ టక్కర్ అభిప్రాయపడ్డారు. వృద్ధి అంచనాలను మించి పుంజుకుంటుండటం, ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో రానున్న కాలంలో రేట్ల పెంపునకు ఆస్కారం ఉందని చెప్పారు. పాలసీ సమీక్షలో ఈ సంకేతాలు ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు. -
ఆర్థిక వ్యవస్థకు ధరల సెగ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై ధరల తీవ్రత ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జూన్ 4–5 తేదీల్లో 2018–19 రెండవ ద్వైవార్షిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. దీంతో కీలక రేట్లు పెరిగే అవకాశాలూ ఉన్నాయని కొందరి విశ్లేషణ. టోకు ద్రవ్యోల్బణం 3.18 శాతం ♦ టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.18 శాతంగా నమోదయ్యింది. ఇంధన ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ♦ మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 2.47%గా ఉంటే, గత ఏడాది ఏప్రిల్‌లో 3.85 శాతంగా ఉంది. ♦ ఫుడ్ ఆర్టికల్స్ ధరల పెరుగుదల రేటు ఈ ఏడాది మార్చిలో పెరక్కపోగా –0.28 శాతం క్షీణతలో ఉంది. ఏప్రిల్‌లో 0.87 శాతంగా నమోదయ్యింది. 2017 ఏప్రిల్‌లో ఈ రేటు 0.58 శాతం. ♦ తయారీ రంగంలో ద్రవ్యోల్బణం రేటు వార్షికంగా యథాతథంగా 3.11 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ట్రెండ్ రివర్స్... ♦ మూడు నెలలుగా తగ్గుతూ వస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో పెరిగింది. 4.58%గా ఉంది. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.28%కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో 2.99 శాతంగా నమోదయ్యింది. ♦ ప్రొటీన్ రిచ్ ఐటమ్స్– మాంసం, చేపల ధరలు ఏప్రిల్‌లో 3.59 శాతం, 3.17 శాతం చొప్పున పెరిగాయి. గుడ్ల ధరలు 6.26 శాతం ఎగశాయి. ♦ పండ్ల బాస్కెట్ ధరల పెరుగుదల రేటు మార్చిలో 5.78% ఉంటే, ఏప్రిల్‌లో 9.65%కి ఎగసింది. ♦ కూరగాయల ధరలు మాత్రం 11.7 శాతం నుంచి 7.29 శాతానికి తగ్గాయి. మొత్తం ఫుడ్ బాస్కెట్ ధర దాదాపు నిశ్చలంగా 2.8 శాతంగా ఉంది. ♦ రిటైల్ ధరల విషయంలో మొత్తం ఐదు విభాగాలను పరిశీలించి చూస్తే– ఆహారం, పానీయాల ధరలు పెరుగుదల రేటు 3 శాతం. పాన్, పొగాకు, ఇతర హానికారక ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 7.91 శాతం. దుస్తులు, పాదరక్షల ధరల పెరుగుదల రేటు 5.11 శాతం. హౌసింగ్‌లో ద్రవ్యోల్బణం 8.50 శాతం. ఇక చివరిగా ఫ్యూయల్, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 5.24 శాతంగా నమోదయ్యింది. ఒక్క పెట్రోల్‌ను చూస్తే, మార్చిలో పెరుగుదల రేటు 2.55 శాతం ఉంటే, ఏప్రిల్‌లో ఏకంగా 9.45 శాతానికి ఎగసింది. ఇదే కాలంలో డీజిల్ ధర పెరుగుదల రేటు 6.12 శాతం నుంచి 13.01 శాతానికి చేరింది. -
ఆర్బీఐ పాలసీ : భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
-
ఆర్బీఐ పాలసీ : భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పాలసీ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా, చైనాల మధ్య సుంకాల యుద్ధం మరో స్థాయికి చేరడంతో నిన్న భారీగా పతనమైన ప్రపంచ మార్కెట్లు, నేటి ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా భారీగా లాభపడుతున్నాయి. ప్రారంభంలో 350 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 347 పాయింట్ల లాభంలో 33,366 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల లాభంలో 10,239 వద్ద ట్రేడవుతున్నాయి. నేటి ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే నడుస్తున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ప్రారంభంలో 1.6 శాతం ర్యాలీ జరిపింది. నిఫ్టీ ఐటీ 1.3 శాతం, పీఎస్‌యూ బ్యాంకు 1.6 శాతం లాభపడ్డాయి. మెటల్, రియాల్టీ అయితే ఏకంగా 2 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు నేడు మధ్యాహ్నం ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరపు తొలి ద్వైమాసిక పరపతి సమీక్షను ప్రకటించనుంది. రెండు రోజుల నేపథ్యంలో మానిటరీ పాలసీ కమిటీ నిన్న(బుధవారం) భేటీ అయింది. ప్రారంభంలో టాటా స్టీల్, యూపీఎల్, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, అదానీ పవర్, కొటక్ మహింద్రా బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐటీసీ, ఎస్బీఐ 3 శాతం వరకు లాభపడ్డాయి. -
ఆర్బీఐ పాలసీపైనే ఇన్వెస్టర్ల దృష్టి...
ఆర్బీఐ పాలసీ ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నదని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే తయారీ, సేవల రంగాల గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, ఐసీఐసీఐ బ్యాంక్ సంక్షోభం తదతర అంశాలు స్టాక్ మార్కెట్‌పై తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఆర్బీఐ పరపతి ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఈ నెల 4న ప్రారంభమై, 5న ముగుస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ద్రవ్య పాలసీని 5వ తేదీన ఆర్బీఐ ప్రకటిస్తుంది. తయారీ, సేవల రంగాల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలు వెలువడతాయి. నేడు తయారీ రంగం, బుధవారం సేవల రంగం పీఎమ్ఐ గణాంకాలు వస్తాయి. ఇక గత నెలకు సంబంధించిన వాహన విక్రయ వివరాల వెల్లడి కారణంగా వాహన షేర్లు వెలుగులోకి రావచ్చు. మెల్లగా పుంజుకోనున్న మార్కెట్..! ఈ నెలలో మార్కెట్ మెల్లమెల్లగా పుంజుకోగలదని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో మార్కెట్ ప్రస్తుతమున్న స్థాయిల నుంచి పెరిగే అవకాశాలున్నాయని వివరించారు. ఇక నిఫ్టీ సూచీలో అంబుజా సిమెంట్స్, అరబిందో ఫార్మా, బాష్ షేర్ల స్థానాల్లో బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీలను చేరుస్తున్నారు. నేటి నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. సగానికి తగ్గిన విదేశీ ఈక్విటీ పెట్టుబడులు... విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో బాగా తగ్గాయి. మన షేర్ల వేల్యూయేషన్లు అధికంగా ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాల కంటే త్వరితంగానే రేట్ల పెంపు చేపట్టవచ్చన్న అంచనాల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సగానికి తగ్గాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.55,700 కోట్లుగా ఉన్న విదేశీ పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లకు పడిపోయాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు రూ.14,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డెట్ మార్కెట్లో మాత్రం పెట్టుబడులు జోరుగా వచ్చాయి. 2016–17లో డెట్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,300 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.1.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. రూపాయి నిలకడగా ఉండడం, ద్రవ్యోల్బణ పరిగణనాంతర రాబడులు అధికంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో మన క్యాపిటల్ మార్కెట్లో (ఈక్విటీ, డెట్ మార్కెట్లు కలిపి)విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నికరంగా 1.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యుత్తమ నికర పెట్టుబడులు. మన క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను అనుమితించినప్పటి (1992) నుంచి చూస్తే, మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లోకి రూ.8.86 లక్షల కోట్లకు, డెట్ మార్కెట్లోకి రూ.4.2 లక్షల కోట్లకు, మొత్తం క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లకు చేరాయి. -
ఆర్బీఐ ఈ‘సారీ’..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈసారి కూడా కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు ఎగబాకుతుండటం, దేశీయంగా ద్రవ్యోల్బణం రిస్కులు పొంచిఉండటమే దీనికి ప్రధాన కారణమనేది వారి అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ఈ నెల 4–5 తేదీల్లో ఆర్బీఐ చేపట్టనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) దీన్ని నిర్వహిస్తుంది. 5న విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. మరోపక్క, బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం కాస్త కుదించిన(ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పడం) నేపథ్యంలో ఆర్బీఐ పాలసీలో ఎలాంటి చర్యలు చేపడుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కత్తిమీద సామే... రిటైల్ ద్రవ్యోల్బణం దిగొస్తుండటంతో వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా వడ్డీరేట్లను తగ్గించాలంటూ ఆర్బీఐపై కార్పొరేట్లు తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. డిసెంబర్లో 5.2 శాతానికి ఎగబాకిన రిటైల్ ద్రవ్యోల్బణం... జనవరిలో మళ్లీ కాస్త శాంతించి 5.02 శాతానికి, ఫిబ్రవరిలో మరింత తగ్గి 4.4 శాతానికి దిగొచ్చింది. అయితే, ఒకపక్క క్రూడ్ ధర పెరుగుదల ధోరణి(ఇటీవలే బ్రెంట్ క్రూడ్ 70 డాలర్లను తాకింది), ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు ఎగబాకుతుండటంతో పాలసీ నిర్ణయం విషయంలో ఆర్బీఐకి సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజా సమీక్షలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మరో పావు శాతం వడ్డీరేటును పెంచడంతోపాటు(1.75 శాతానికి) ఈ ఏడాది మరో రెండు సార్లు పెంచుతామన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెపోరేటు(బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక నిధులపై వసూలు చేసే వడ్డీరేటు) 6 శాతం, రివర్స్ రెపో రేటు(బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(బ్యాంకుల తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతున్నాయి. ఎవరేమంటున్నారు... బ్రోకరేజి సంస్థలు: ఆర్బీఐ పాలసీ సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ.. తటస్థ వైఖరిని అవలంభించే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజి దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు అంచనా వేశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ–ఎంఎల్) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే, వర్షాలు బాగా కురిస్తే... ఆగస్టులో రేట్ల కోతకు ఆస్కారం ఉందని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతంగా నమోదుకావచ్చని... ఆర్బీఐ అంచనా(5.1 శాతం) కంటే ఇది తక్కువేని తెలిపింది. బ్యాంకర్లు: 2018–19 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు వడ్డీరేట్లలో మార్పులు ఉండకపోవచ్చని కోటక్ మహీంద్రా బ్యాంక్ అభిప్రాయపడింది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో కుదుపులు, ముడిచమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రుతుపవనాలపై స్పష్టత వచ్చే వరకూ ఆర్బీఐ వడ్డీరేట్లపై యథాతథ ధోరణిని అవలబించవచ్చు’ అని పేర్కొంది. పారిశ్రామిక మండళ్లు: అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరుగుదలతో పాటు రైతులకు ఉత్పాదక వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధరను(ఎంఎస్పీ) అందిస్తామంటూ బడ్జెట్లో కేంద్రం ప్రకటించడం కూడా ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు ఆజ్యం పోస్తుందని పారిశ్రామిక మండళ్లు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం లేదని, ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చని అసోచామ్ పేర్కొంది. -
వృద్ధి రేటు పెరిగి... పడిపోతుంది: మెరిల్లించ్
ముంబై: రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ 7.5 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని, దీనికి తక్కువ బేస్ కారణమని, ఆ తర్వాతి ఆరు నెలల్లో 7 శాతానికి తగ్గిపోతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ పేర్కొంది. వృద్ధి రేటు పుంజుకున్నా గానీ, వాస్తవ సామర్థ్యం కంటే ఒక శాతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. ‘‘2017–18లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలతో వృద్ధి కనిష్టానికి (తక్కువ బేస్) చేరినందున 2018–19 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో జీడీపీ 7.5 శాతానికి పుంజుకుంటుంది. అయితే, రెండో అర్ధభాగంలో 7 శాతానికి తగ్గుతుంది. అయినప్పటికీ పాత జీడీపీ సిరీస్ ఆధారంగా మా అంచనాల కంటే ఒక శాతం తక్కువే’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ పేర్కొంది. సేవల రంగం స్పీడ్ జనవరిలో 3 నెలల గరిష్టం: పీఎంఐ దేశంలో సేవల రంగం జనవరి నెలలో మంచి పనితీరును కనబరిచింది. నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ప్రకారం, జనవరిలో సూచీ 51.7గా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో సూచీ ఈ స్థాయిలో నమోదు కావటం ఇదే తొలిసారి. కొత్త ఆర్డర్లు పెరగడం దీనికి కారణమని సర్వే పేర్కొంది. డిసెంబర్లో సూచీ 50.9గా ఉంది. నవంబర్‌లో క్షీణతలో 48.5 వద్ద సూచీ ఉంది. నికాయ్ సూచీ 50 పైన ఉంటే వృద్ధిగా ఆ దిగువన క్షీణతగా భావించడం జరుగుతుంది. రేపు ఆర్బీఐ పాలసీ నిర్ణయం ధరల పెరుగుదల రిస్క్ నేపథ్యంలో ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు లేవు. ఈ నెల 7న జరిగే సమావేశంలో యథాతథ స్థితినే కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత డిసెంబర్లో ద్రవ్యోల్బణం 5.2 శాతానికి చేరగా, జనవరిలో ఇది 5 శాతానికి చల్లబడుతుందని భావిస్తున్నారు. మధ్యకాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కొనసాగించాలన్నది ఆర్బీఐ, కేంద్రలక్ష్యం. -
ఆర్బీఐ పాలసీ, గణాంకాలు కీలకం
ఆర్బీఐ ద్రవ్య, పరపతి పాలసీ, తయారీ, సేవల రంగ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై తగినంత ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు.. తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్‌పై తగినంతగా ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. నేడు (సోమవారం) గాంధీ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. రేట్ల కోత ఉండకపోవచ్చు..! ఆర్బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఈ నెల 3(మంగళ వారం) ప్రారంభమై. 4న(బుధవారం) ముగియనున్నది. ఈసారి రేట్ల కోత అవకాశాల్లేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, రుణాలకు డిమాండ్ బలహీనంగా ఉండడం వల్ల రేట్ల విషయమై యథాతథ స్థితి కొనసాగవచ్చని వారంటున్నారు. రెపో రేటు6 శాతం స్థాయిలో ఉందని, మరింత తగ్గించడానికి అవకాశాలున్నాయని, అయితే రానున్న నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుండటంతో రేట్ల కోత ఉండకపోవచ్చని ఇక్రా ఎండీ నరేశ్ టక్కర్ చెప్పారు. కాగా ఈ ఏడాది జూలైలో 2.36 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టులో 5 నెలల ›గరిష్ట స్థాయి, 3.36 శాతానికి పెరిగింది. ముందుంది మరింత పతనం...! స్టాక్ మార్కెట్‌పై పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయని, మరింత క్షీణత తప్పదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. అయితే పతనం నెమ్మదిగా ఉంటుందని, అయితే ట్రేడర్లకు మాత్రం మరింత దెబ్బ తప్పదని వివరించారు. మార్కెట్ పెరిగినప్పుడల్లా విక్రయాలు జరపడం మేలని, తాత్కాలిక ట్రేడింగ్ కోసం సూచీ ప్రధాన షేర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దేశీయంగా ఆర్థిక సంబంధిత గణాంకాలు ఆశావహంగా లేవని, జీఎస్టీ సమస్యలు మరికొంత కాలం కొనసాగుతాయని ఫలితంగా స్టాక్ సూచీల కన్సాలిడేషన్ మరి కొంత కాలం కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం కూడా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నట్లు ఇప్పటిదాకా అనిపించిందని, ఇక నుంచి పరిస్థితులు తల్లకిందులు కాబోతున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. మార్కెట్ పడిన ప్రతిసారీ కొనుగోళ్లు చేయాలని, పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్ చేసుకోవాలని ఐసీఐసీఐ డైరెక్ట్డాట్కామ్ రీసెర్చ్ హెడ్ ధర్మేశ్ షా పేర్కొన్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి మొదలయ్యే సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు బాగా ఉంటేనే మార్కెట్ కోలుకుంటుందని విశ్లేషకులంటున్నారు. గణాంకాలు.. తయారీ రంగానికి సంబంధించిన నికాయ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు మంగళవారం(3న) వస్తాయి. సేవల రంగ పీఎంఐ గణాంకాలు 5న (గురువారం) వెల్లడవుతాయి. గత నెలలో వాహన విక్రయాలు బాగా ఉండటంతో వాహన షేర్లు ఎగబాకే అవకాశాలున్నాయి. అమ్మకాలు బాగా ఉంటాయనే అంచనాలతోనే గత శుక్రవారం వాహన సూచీ 1% లాభపడింది. కొనసాగుతున్న విదేశీ విక్రయాలు.. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. గత వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.9,079 కోట్ల విలువైన పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కంపెనీల క్యూ2 ఫలితాలు బాగా ఉంటే మళ్లీ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయని అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ హోల్‌టైమ్ డైరెక్టర్ అనితా గాంధీ చెప్పారు. మంగళవారం ఎస్బీఐ లైఫ్ లిస్టింగ్.. ఈ నెల 3న(మంగళవారం) ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఈ ఐపీఓకు ఇష్యూ ధరగా కంపెనీ రూ.700ను నిర్ణయించింది. గత నెల 20–22 మధ్య వచ్చిన ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.8,400 కోట్లు సమీకరించింది. రూ.1,157 కోట్ల గోద్రేజ్ ఆగ్రోవెట్ ఐపీఓ ఈ నెల 4న ప్రారంభం కానున్నది. రూ.450–460 ధర శ్రేణిగల ఈ ఐపీఓ ఈ నెల 6న(శుక్రవారం) ముగియనున్నది. ఇక ఈ నెల 6న ఆరంభమయ్యే మాస్ ఫైనాన్షియల్సర్వీసెస్ ఐపీఓ ఈ నెల 10న ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.456–459 గా ఉంది. -
భారీగా బలపడిన రూపాయి
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ ప్రకటనకు ముందుకు రూపాయి భారీగా బలపడింది. ఏకంగా రెండేళ్ల గరిష్టంలోకి ఎగిసింది. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ రెండేళ్ల గరిష్టంలో 63.82 వద్ద ట్రేడైంది. రూపాయి బలపడటానికి ప్రధాన కారణం.. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ)లు భారీగా నగదును దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లలోకి మరలించడమేనని విశ్లేషకులు చెప్పారు. ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.12గా నమోదైంది. అనంతరం 2015 ఆగస్టు 10 నాటి స్థాయి 63.82 వద్ద గరిష్ట స్థాయిలను నమోదుచేసింది. ప్రస్తుతం 23 పైసలు బలపడి 63.85 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ 6.12 శాతం మేర లాభపడింది. మరోవైపు ఆర్బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 57.38 పాయింట్ల నష్టంలో 32,517 వద్ద, నిఫ్టీ 25.50 పాయింట్ల నష్టంలో 10,089 వద్ద కొనసాగుతున్నాయి. ఈసారైనా ఆర్బీఐ రేట్ల కోతను చేపడుతుందా? లేదా? అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఫలితాలు, ఆర్బీఐ పాలసీ కీలకం
♦ రేట్ల కోతపై మార్కెట్ దృష్టి ♦ కంపెనీల ఫలితాలూ కీలకమే.. ♦ మార్కెట్‌పై నిపుణుల అంచనా... ఆర్బీఐ పాలసీ, ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈవారంలో వెలువడే ఆర్థిక గణాంకాలు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. నేడు రిలయన్స్ పవర్ ఫలితాలు.. నేడు (సోమవారం) రిలయన్స్ పవర్, శ్రీ సిమెంట్, సీమెన్స్ తదితర కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం (ఆగస్టు 1న) టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మ్యారికో, పిరమళ్ ఎంటర్ప్రైజెస్, పవర్‌గ్రిడ్ కంపెనీలు, ఆగస్టు 2న(బుధవారం) లుపిన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బాటా ఇండియా, గోద్రెజ్ ప్రోపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, గురువారం(ఆగస్టు 3న) ఇండియన్ ఆయిల్ కార్పొ, కాల్గేట్ పామోలివ్, టైటాన్ కంపెనీలు, ఆగస్టు 4న (శుక్రవారం) మహీంద్రా, డాబర్ ఇండియా కంపెనీలు తమ తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. ఆర్బీఐ పాలసీపై అందరి కళ్లు.. ఈ బుధవారం ఆర్బీఐ పాలసీ వెలువడనున్నది. ఈ పాలసీలో రేట్ల కోత విషయమై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడి చెప్పారు. మరోవైపు మంగళవారం(ఆగస్టు 1న) తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వస్తాయి. గురువారం (ఆగస్టు 3న) సేవల రంగానికి సంబంధించి పీఎంఐ గణాంకాలు వెలువడుతాయి. జూలైలోనూ జోరు తగ్గని విదేశీ పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) జూలైలోనూ భారత క్యాపిటల్ మార్కెట్లో జోరుగానే పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో మన ఈక్విటీ మార్కెట్లో రూ.7,611 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.18,599 కోట్లు వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.26,210 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే మన దేశంలోనే వృద్ధి అవకాశాలు ఉత్తమంగా ఉండటంతో ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఫండ్స్ ఇండియాడాట్‌కామ్ రీసెర్చ్ హెడ్ విద్యా బాల పేర్కొన్నారు. -
ఆర్బీఐ పాలసీ: లాభాల్లో మార్కెట్లు
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపాలసీ సందర్భంగా స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంలో 31,256 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 17.10 పాయింట్ల లాభంలో 9,650పైన ట్రేడవుతోంది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అయిన ద్రవ్యవిధాన కమిటీ నేడు వడ్డీరేట్లపై తమ నిర్ణయం ప్రకటించనుంది. ఆర్బీఐ నిర్ణయంపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. మెజార్జీ విశ్లేషకులు ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయదని అంచనావేస్తున్నారు. దీంతో మార్కెట్లు కూడా సాధారణంగానే ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో గెయిల్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎం అండ్ ఎం, హీరో మోటార్ కార్ప్, వేదంత, భారతీ ఇన్ ఫ్రాటెల్ లాభాలు పండించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, టీసీఎస్, సిప్లా, టాటా మోటార్స్, బీపీసీఎల్, టాటా పవర్ ఒత్తిడిలో కొనసాగాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 7 పైసలు పడిపోయి 64.49 వద్ద ప్రారంభమైంది. యూకే ఎన్నికల నేపథ్యంలో ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. -
ఆఖరికి ఫ్లాట్‌గా ముగింపు
ముంబై : ఆర్బీఐ పాలసీ ప్రకటనాంతరం ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న మార్కెట్లు చివరిలో కొంత తేరుకున్నాయి. 180 పాయింట్ల మేర పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ సెషన్ ముగింపులో కొంత కోలుకుని 45.24 పాయింట్ల నష్టంలో 28,289.92 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా నష్టాల నుంచి తేరుకుని స్వల్పంగా 0.75 పాయింట్ల లాభంలో 8769.05 వద్ద పరిమితమైంది. మార్కెట్లకు షాకిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బుధవారం వెలువరించిన పాలసీ ప్రకనటలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు పేర్కొంది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పాలసీ ప్రకటనాంతరం బ్యాంకు స్టాక్స్ ఢమాల్ మన్నాయి. కానీ ఆఖరిలో బ్యాంకు స్టాక్స్ కూడా రికవరీ అయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడాలు నష్టాల నుంచి తేరుకుని స్వల్పంగా 0.2 శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్లు మాత్రం నష్టాల్లోనే ముగిశాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటనతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 186 పాయింట్లు కోల్పోయి 28,149 వద్ద కనిష్టంగా ట్రేడయింది. నిఫ్టీ కూడా కనిష్టంగా 53 పాయింట్ల నష్టంలో 8715 వద్ద నమోదైంది. అనంతరం రికవరీ అయ్యాయి. ''మెజార్టీ సభ్యులు వడ్డీరేట్ల కోతకు ఆశపడ్డారు. కానీ వడ్డీరేట్లలో ఆర్బీఐ కోత పెట్టలేదు. ఇది మార్కెట్లకు పాజిటివ్‌నే. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం రూపాయి విలువను స్థిరంగా ఉంచుతుంది. ఒకవేళ రేటు కోత పెట్టుంటే రూపాయి విలువ పడిపోయేది దీంతో అవుట్‌ఫ్లోస్ పెరిగేవ'' అని ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. మార్కెట్లు రికవరీకి కారణమిదేనని పేర్కొన్నారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు లాభపడి 67.30 వద్ద ముగిసింది. -
పాలసీ.. బ్లూచిప్స్ ఫలితాలు కీలకం!
న్యూఢిల్లీ: ఆర్బీఐ పాలసీ, కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి కదలికలు.. తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. ఈ నెల 8న(బుధవారం) జరిగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ(మోనిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) రేట్లను తగ్గించాలా, వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకుంటుంది. ఆర్బీఐ పాలసీతో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల ఆర్థిక ఫలితాలపై కూడా మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందిన ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జరిగే పరిణామాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల ప్రభావం ఎలా ఉంటుందో నిర్ధారించడానికి ఈ వారంలో వెలువడే కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు ముఖ్యమని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. పలు కీలక కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను వెల్లడించాల్సి ఉందని, ఈ ఫలితాలను బట్టి స్టాక్ సూచీల కదలికలు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ రీసెర్చ్ హెడ్ అబ్నిశ్ కుమార్ సుధాంశు చెప్పారు. ఈ వారంలో టాటా స్టీల్, భెల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిప్లా, హీరో మోటొకార్ప్, ఎన్టీపీసీ, లుపిన్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్లు తమ తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. పంజాబ్, గోవా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ట్రెండ్.. మార్కెట్ ఎటు కదలాలో నిర్దేశిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10న ఐఐపీ గణాంకాలు.., ఈ నెల 10న(శుక్రవారం) గత ఏడాది డిసెంబర్‌కు సంబంధించి పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెలువడుతాయి. మళ్లీ విదేశీ కొనుగోళ్ల జోరు... గత నాలుగు నెలలుగా అమ్మకాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకూ(మూడు ట్రేడింగ్ సెషన్లలో) విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.2,300 కోట్లు పెట్టుబడులు పెట్టారు. స్టాక్ మార్కెట్లో రూ.1,246 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.1,098 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశారు. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించి పన్ను అంశాల్లో ఊరట లభించడమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. -
లాభాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఆర్ బీఐ రివ్యూ పాలసీ అంచనాలతో దలాల్ స్ట్రీట్ పాజిటివ్ గా స్పందిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 45 పాయింట్లు బలపడి 26438వద్ద, , నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 8162 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, మెటల్ రంగాలు లాభాల్లోనూ. ఫార్మా బలహీనంగాను కొనసాగుతున్నాయి. అంబుజా సిమెంట్ టాప్ గెయినర్ గా ఉంది. బీపీసీఎల్, హీరోమోటో, లుపిన్, అదానీ పోర్ట్స్, మారుతి, బాష్ లాభాల్లో, సన్ ఫార్మా , అరబిందో ఫార్మా, జీ, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టాల్లోను ఉన్నాయి. మరోవైపు దేశీ సూచీల్లో ఎఫ్ఐఐలు అమ్మకాల జోరుకు మంగళవారం బ్రేక్ పడింది. దాదాపు రూ. 162 కోట్ల మేర కొనుగోళ్లు నమోదయ్యాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి బాగా బలంగా కొనసాగుతోంది. ద్రవ్యపరపతి విధానం సమీక్ష అంచనాల నేపథ్యంలో 36పైసలు పైకి ఎగబాకింది. దీంతో రూ. 68 స్థాయి నుంచి ఎగిసి 67.86 వద్ద కొనసాగుతోంది. -
ప్రస్తుతానికి 0.25% తగ్గింపే!
ముంబై: అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత 25 బేసిస్ పాయింట్ల వరకే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మాత్రం మరిన్ని రేట్ల తగ్గింపులుంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని మానిటరీ పాలసీ కమిటీ 0.25 శాతం మేర రెపో రేటును తగ్గిస్తుందని మెజారిటీ విశ్లేషకులు, బ్యాంకర్లు అంచనా వేస్తుండగా... కొద్ది మంది మాత్రం అర శాతం వరకూ తగ్గించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు.. ద్రవ్యోల్బణం 4 శాతం పరిధిలోనే ఉన్నప్పటికీ ఆర్బీఐ చెప్పుకోతగ్గ స్థాయిలో రేట్లను తగ్గించకపోవచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది. రేట్ల కోత ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడానికి తోడ్పడుతుందని, డీమోనిటైజేషన్ కారణంగా పడే ప్రభావాన్ని తట్టుకునేందుకు ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫెడ్ రేట్ల పెంపు అంచనాలు, దాని కారణంగా బాండ్ల రాబడులపై పడే ప్రభావం, యూరోజోన్‌లో రాజకీయ అనిశ్చితి, చమురు ఉత్పత్తి తగ్గించాలన్న ఓపెక్ నిర్ణయం ఫలితంగా కరెన్సీపై పడే ప్రభావం ఆర్బీఐని రేట్ల కోత విషయంలో కట్టడి చేస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది. ఆందోళనలన్నీ సమసిపోతే మానిటరీ పాలసీ కమిటీ ఫిబ్రవరి సమీక్షలో రేట్లను తగ్గించవచ్చని అంచనా వేసింది. బ్రోకరేజీ సంస్థ బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తదుపరి రేట్ల కోత కోసం ఆర్బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఆగవచ్చని అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ బుధవారం 0.25% మేర పాలసీ రేట్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5% దిగువన ఉన్నందున ఆర్బీఐ 0.25% వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స తెలిపింది. బ్యాంకర్ల అభిప్రాయాలు..: ద్రవ్యోల్బణం తేలికపడినందున ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించవచ్చని కెనరా బ్యాంకు ఎండీ రాకేశ్ శర్మ అన్నారు. అక్టోబర్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టగా... పెద్ద నోట్ల రద్దుతో ఇది మరింత తేలిక పడనున్నందున 0.25 శాతం రెపో రేటు తగ్గింపు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు బంధన్ బ్యాంకు ఎండీ చంద్రశేఖర్ ఘోష్, తెలిపారు. ఫెడ్ రేట్ల పెంపుపై అనిశ్చితి ఉన్నందున 0.50 శాతం తగ్గింపు ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చన్నారు. మానిటరీ పాలసీ కమిటీ భేటీ ఆర్బీఐ వడ్డీ రేట్లను కనీసం 0.25 శాతమైనా తగ్గిస్తుందన్న భారీ అంచనాల నడుమ ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మంగళవారం సమావేశమైంది. ద్రవ్య, పరపతి విధానంపై చర్చించింది. ఈ కమిటీ బుధవారం తన నిర్ణయాలను ప్రకటించనుం ది. గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఇది రెండో సమీక్ష. పెద్ద నోట్లు రద్దయ్యాక భేటీ అవడం మాత్రం తొలిసారి. తొలి సమీక్షలో 0.25% కోతతో ఉర్జిత్ మురిపించిన విషయం తెలిసిందే. -
స్వల్ప లాభాలతో సరి!
ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో అప్రమత్తత 44 పాయింట్ల లాభంతో 26,393 పాయింట్లకు సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 8,143కు నిఫ్టీ ఆర్బీఐ రేట్ల కోత అంచనాలతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 26,393 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 8,143 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో ప్రైవేట్ బ్యాంక్, ఆర్థిక రంగ, వాహన షేర్లలో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ సోమవారం అమెరికా స్టాక్ సూచీలు రికార్డ్ స్థాయిల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండడం, రూపాయి 31 పైసలు లాభపడడం మంగళవారం నాడు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించాయి. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో కొందరు ఇన్వెస్టర్లు తమ పొజిషన్లు పెంచుకున్నారని, స్టాక్ మార్కెట్ లాభపడటానికి ఇదీ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐపాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే ఇంట్రాడేలో ఒక దశలో 153 పాయింట్లు లాభపడింది. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా ఈ లాభాలను నిలుపులేకపోయింది. చివరకు 44 పాయింట్ల లాభంతో 26,393 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడింది. పావు శాతం రేట్ల కోత ఉంటుందని మార్కెట్ ఇప్పటికే అంచనా వేస్తోందని, ఒకవేళ ఆర్బీఐ ఆశ్చర్యకరంగా 50 శాతం కోత విధిస్తే మార్కెట్ మరింత పెరుగుతుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. స్టాక్ మార్కెట్ డేటా... టర్నోవర్ (రూ. కోట్లలో) బీఎస్ఈ 2,202 ఎన్ఎస్ఈ (ఈక్విటీ విభాగం) 13,676 ఎన్ఎస్ఈ (డెరివేటివ్స్) 1,93,271 ఎఫ్ఐఐ 162 డీఐఐ 165 -
31 పైసలు బలపడ్డ రూపాయి
మూడు వారాల గరిష్ట స్థాయి ముంబై: ఆర్బీఐ రేట్ల కోత అంచనాలతో డాలర్‌తో రూపాయి మారకం మంగళవారం 31 పైసలు బలపడి 67.90 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. నేటి(బుధవారం) పాలసీలో ఆర్బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గిస్తుందనే అంచనాలతో డాలర్ల విక్రయం జోరుగా జరిగిందని నిపుణులు పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉండడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపించిందని వారంటున్నారు. ఫారెక్స్ మార్కెట్లో సోమవారం నాటి ముగింపు(68.21)తో పోల్చితే మంగళవారం రూపాయి మారకం 68.14 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67.86 గరిష్ట స్థాయిని తాకి చివరకు 31 పైసల లాభంతో 67.9 వద్ద ముగిసింది. గత నెల 16 తర్వాత రూపాయి ఈ స్థాయిలో బలపడపడం ఇదే మొదటిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం వచ్చే వారంలో జరగనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డాలర్ స్వల్పంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. -
రేపటి పాలసీలో ఉర్జిత్ ముందున్న సవాళ్లివే!
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండో మానిటరీ పాలసీ ప్రకటన బుధవారం వెలువడబోతోంది. రేపటి పాలసీ సమీక్షలో కీలక రెపో రేటును ఆర్బీఐ 0.25 శాతం కోత విధిస్తుందని పలువురు అంచనావేస్తుండగా.. ఈ కోత 0.50 శాతం వరకు ఉంటుందని మరి కొంతమంది అంటున్నారు. పాత నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన అనంతరం వెలువడతున్న మొదటి పాలసీ ఇదే కావడంతో, రేట్ల కోతపై అంచనాలు భారీగానే ఉన్నాయని వెల్లడవుతోంది.. దీంతో పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో రోజుల భేటీ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేటి నుంచి ప్రారంభమైంది. రేపు మధ్యాహ్నం 2.30లకు రేట్ల కోతపై ఆర్బీఐ నిర్ణయం వెలువరుస్తుంది. ఈ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని మానిటరీ పాలసీ కమిటీ ముందున్న సవాళ్లేమిటో ఓ సారి చూద్దాం.... 1. ఆర్థికవేత్తల ప్రకారం డీమానిటైజేషన్ కనీసం వచ్చే రెండో త్రైమాసికాల్లో కచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవస్థను ఊపందుకునేలా చేయడానికి మానిటరీ పాలసీ కమిటీ ఏ మేరకు రేట్లలో కోత విధించాలో నిర్ణయించాల్సి ఉంటుంది. అది పావు శాతమో, అరశాతమో వచ్చే రెండో క్వార్టర్లలో పడబోయే నెగిటివ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వారు అంచనావేయనున్నారు. 2. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వు నుంచి ఈ నెలలో షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల చివరిలో ప్రకటించబోయే ఫెడ్ పాలసీలో కచ్చితంగా రేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా క్షీణిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న రేట్ల కోత నిర్ణయం కూడా రూపాయిపై ప్రతికూలం ప్రభావం చూపనుంది. 3. అదేవిధంగా 2008 తర్వాత మొదటిసారి చమురు మార్కెట్ సమతుల్యం కోసం ఆయిల్ ఉత్పత్తిలో కోత విధించనున్నట్టు ఒపెక్ సభ్యులు ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయంతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే ఈ ధర పెరుగుదలను మానిటరీ పాలసీ కమిటీ పరిగణలోకి తీసుకోనుంది. 4. డీమానిటైజేషన్ తర్వాత మొదటిసారి ఆర్బీఐ చీఫ్ ఉర్జిత్ పటేల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో పాత నోట్ల రద్దు ప్రక్రియలో ఆర్బీఐ పాత్ర, పెద్ద నోట్ల రద్దుకు ఆర్బీఐ ముందస్తుగా ఎలాంటి ప్లానింగ్ చేపట్టిందనే పలు ప్రశ్నలను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. 5. గత పాలసీలో ఆరుగురు సభ్యుల మానిటరీ కమిటీ ఏకగ్రీవంగా 25 బేసిక్ పాయింట్ల రెపో రేటు కోతకు అంగీకరించింది. కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈసారి కూడా ఏకగ్రీవంగా రేట్ల కోతకు మొగ్గుచూపుతారా? లేదా? అనేది సందిగ్థత నెలకొంది. -
ఆశగా ఎదురుచూస్తున్న ఆ రంగాలు!
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పాత నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణాలు ఈ సెక్టార్లను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. రేట్ కోతపై ఆధారపడిన ఈ రంగాల షేర్లు గత మానిటరీ పాలసీ నుంచి 30 శాతం క్రాష్ అయ్యాయి. అమ్మకాల ఒత్తిడి భారీగా కొనసాగుతోంది. దీంతో రేపు విడుదల కానున్న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్షపై ఈ రంగాలు ఎక్కువగా దృష్టిసారించాయి. ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ద్రవ్యవిధాన కమిటీ విడుదల చేయబోయే రెండో సమీక్షలో కచ్చితంగా రెపో రేటు కోత ఉంటుందని ఓ వైపు విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన నగదు కొరత సమస్యకు ఉపశమనంగా ఉర్జిత్ శుభవార్త చెబుతారా? లేదా? అని ఈ రంగాల మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగ ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పదవిలోకి వచ్చిన తర్వాత తన నేతృత్వంలో విడుదలైన మొదటి పాలసీలో మార్కెట్ వర్గాలకు ఆశ్చర్యకరంగా పాలసీ రేట్లలో కోత విధించి దీపావళి గిప్ట్ను అందించిన సంగతి తెలిసిందే. అనంతరం పాత నోట్ల చలామణి రద్దు అయింది. దీంతో రియల్ ఎస్టేట్, ఆటో మొబైల్ పరిశ్రమ కుప్పకూలింది. బుధవారం విడుదల చేయనున్న పాలసీలో రేట్ల కోత పెడితే, ఈ రంగాలు కోలుకునే అవకాశముందని, ఈ రంగాల్లో సెంటిమెంట్ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్టోబర్ 4 నుంచి బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 20 శాతం కుప్పకూలింది. గత ఆరు పాలసీ సమీక్ష కాలాల్లో కూడా ఈ రంగం వరస్ట్ ఫర్ఫార్మెన్స్ను నమోదుచేసింది. బ్లాక్‌మనీ ఎక్కువగా ప్రవహించే సెక్టార్లో ఇదీ ఒకటి కావడం గమనార్హం. అదేవిధంగా ఆటో, కన్సూమర్, బ్యాకింగ్ ఇండెక్స్‌లు పడిపోయాయి. ఈ ఇండెక్స్‌లు ఎక్కువగా రేట్ కోతను దృష్టిలో పెట్టుకుని పనితీరును కనబరుస్తుంటాయి. డిమానిటైజేషన్ తర్వాత ద్రవ్యోల్బణానికి, వృద్ధికి పొంచి ఉన్న ముప్పుల నుంచి కాపాడటానికి రేపటి పాలసీలో రేట్లపై కోత విధిస్తుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆర్బీఐ పాలసీ: లాభాల్లో మార్కెట్లు
ఆర్బీఐ పాలసీ బుధవారం విడుదల కానున్న నేపథ్యంలో వరుసగా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ పాజిటివ్ నోట్‌గా ముగిసినా.. 8150 లెవల్‌కు దిగువకే నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 43.66 పాయింట్ల లాభంలో 26392.76వద్ద, నిఫ్టీ 14.40 పాయింట్ల వద్ద 8143.15వద్ద క్లోజ్ అయ్యాయి. 8000వేల దిగువకు పడిపోయిన మార్కెట్లు రెపో రేటు కోత నేపథ్యంలో రికవరీ చెందుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారులు ఆర్బీఐ కామెంటరీపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. ఒకవేళ రేటు 50 పాయింట్ల కోత విధిస్తే మార్కెట్లు పెంపు కొనసాగుతుందని చెప్పారు. ఇంట్రాడేలో సగం శాతం ఎగిసిన నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. ఎస్బీఐ 1 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.17 శాతం పెరుగగా.. హెచ్డీఎఫ్సీ 0.2 శాతం, యాక్సిస్ బ్యాంకు 1 శాతం పడిపోయాయి. ఆటో ఇండెక్స్ కూడా తన లాభాలను కోల్పోయింది. మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, హిరో మోటార్ కార్పొ, మహింద్రా అండ్ మహింద్రాలు 0.3-1.2 శాతం పడిపోయాయి. టాటా మోటార్స్ మాత్రం 0.4 శాతం ఎగిసింది. -
పాలసీ, గణాంకాలు.. కీలకం!
వెలుగులో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు న్యూఢిల్లీ: ఆర్బీఐ పాలసీ, తయారీ, సేవల రంగానికి సంబంధించిన గణాంకాలు, భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మంగళవారం(ఈ నెల 4న) జరిగే ద్రవ్య విధాన సమావేశంలో రేట్ల కోత ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు వెలుగులో ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. సెప్టెంబర్ నెల వాహన విక్రయ వివరాలు వెల్లడైనందున వాహన షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని వివరించారు. స్వల్పకాలంలో మార్కెట్ కదలికలకు ఆర్బీఐ పాలసీ దిశా నిర్దేశం చేస్తుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీతీ మోది చెప్పారు. సోమవారం(ఈ నెల 3న)వెలువడే తయారీ రంగ పర్ఛేజింగ్ మేనేజర్ ఇండెక్స్(పీఎంఐ), బుధవారం(ఈ నెల 5న)వెలువడే సేవల రంగ పీఎంఐ గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి కూడా ట్రేడింగ్‌పై ప్రభావం చూపుతాయి. డాయిష్ బ్యాంక్ షేర్ ధర, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం మార్కెట్ కదలికలపై ప్రభావం చూపుతుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని వివరించారు. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, అమెరికాలో వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాలు శుక్రవారం(ఈ నెల 7న) వస్తాయి. విదేశీ పెట్టుబడులు.. 11 నెలల గరిష్టం: విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో రూ.20,233 కోట్లు మన క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. గత 11 నెలల్లో ఇదే గరిష్ట స్థాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.10,443 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.9,789 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. కార్పొరేట్ బాండ్లలో నేరుగా పెట్టుబడుల పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లను సెబీ అనుమతించడంతో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతుందని నిపుణులంటున్నారు. జీఎస్టీ అమలులో పురోగతి, కంపెనీలు ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం, గత నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచకపోవడం, కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం వంటి కారణాల వల్ల విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని వారంటున్నారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.51,293 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.2,441 కోట్లు పెట్టుబడులు పెట్టారు. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు
ముంబై : ఏడాది గరిష్ట లాభంలో ముగిసిన సోమవారం నాటి మార్కెట్లు నేటి ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొన్ని గంటల్లో ఆర్బీఐ గవర్నర్ తన తుది ద్రవ్యవిధాన పరపతి సమీక్ష ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 25.19 పాయింట్ల నష్టంతో 28,157 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 11.80 పాయింట్ల నష్టంతో 8,699గా ట్రేడ్ అవుతోంది. లుపిన్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, మహింద్రా అండ్ మహింద్రా, కోల్ ఇండియా టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో, టీసీఎస్, హీరో మోటార్ కార్పొ, రిలయన్స్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్లుగా నష్టాలను చవిచూస్తున్నాయి. నిరాశపర్చిన క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఐడియా 4శాతం మేర డౌన్ అయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. -
15 నెలల గరిష్టానికి నిఫ్టీ ఆర్బీఐ పాలసీ నేడు
♦ ఈ నేపథ్యంలో ఆశావహ కొనుగోళ్లు ♦ కలసివచ్చిన సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ♦ 104 పాయింట్ల లాభంతో 28,183కు సెన్సెక్స్ ♦ 28 పాయింట్ల లాభంతో 8,711కు నిఫ్టీ ఆర్బీఐ పాలసీ మంగళవారం వెలువడనుండటంతో ఇన్వెస్టర్ల ఆశావహ కొనుగోళ్ల కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కూడా కలసి రావడంతో బీఎస్ఈ సెన్సెక్స్28వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,700 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 28,183 పాయింట్లకు, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 పాయింట్లకు చేరాయి. నిఫ్టీకి ఇది 15 నెలల గరిష్ట స్థాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 485 పాయింట్లు లాభపడింది. రోజంతా లాభాల్లోనే శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో అమెరికా సూచీలు రికార్డ్ స్థాయిలో ముగిశాయి. చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ, అమెరికా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో ముగియడంతో సోమవారం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడంతో స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ వెల్లడించే నేటి పాలసీలో రేట్లు యథాతథంగానే ఉంటాయన్న అంచనాలున్నాయి. అయినప్పటికీ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పొజిషన్లు బిల్డప్ చేసుకుంటున్నారని విశ్లేషకులంటున్నారు. హీరో మోటొకార్ప్ నికర లాభం ఈ క్యూ1లో 18 శాతం పెరగడం, విదేశీ పెట్టుబడులు జోరు కొనసాగుతుండడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది. హిందాల్కో 4 శాతం వరకూ అప్..:అమెరికా అనుబంధ కంపెనీ నొవాలిస్ మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో హిందాల్కో షేర్4 శాతం వరకూ పెరిగి రూ. 149 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.152ను తాకింది. నికర లాభం 9 శాతం పెరగడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ 9 శాతం పెరిగి రూ. 3,152 వద్ద ముగిసింది. కోల్గేట్ పామోలివ్ నికర లాభం 9 శాతం వృద్ధి చెందడంతో ఈ షేర్ 6 శాతం లాభపడి రూ.1,016 కు చేరింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,032ను తాకింది. -
ఏడు నెలల తర్వాత 27 వేలకు..
♦ అంచనాలకనుగుణంగానే ఆర్బీఐ పాలసీ ♦ కలిసొచ్చిన జానెట్ వ్యాఖ్యలు ♦ 232 పాయింట్ల లాభంతో 27,010కు సెన్సెక్స్ ♦ 65 పాయింట్లు లాభపడి 8,266కు నిఫ్టీ ముంబై: కీలక రేట్ల విషయంలో సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలన్న ఆర్బీఐ నిర్ణయం స్టాక్ మార్కెట్‌కు మంగళవారం లాభాలు తెచ్చిపెట్టింది. రేట్ల పెంపు ఈ నెలలో ఉండకపోవచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్పర్సన్ జానెట్ యెలెన్ సూచనప్రాయంగా వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా పెరిగింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు, ముడి చమురు ధరలు పెరగడం వంటి సానుకూలతలు కూడా తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 27 వేల పాయింట్లపైన, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,250 పాయింట్ల పైన ముగిశాయి. స్టాక్ సూచీలు రెండూ ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరటం గమనార్హం. సెన్సెక్స్ 232 పాయింట్లు లాభంతో 27,010 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 8,266 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల నిఫ్టీ సూచీలూ లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్, రియల్టీ షేర్లు జోరుగా పెరిగాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోవడం, ట్రేడింగ్ చివర్లో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో లాభాలకు కళ్లెం పడింది. యథాతథ రేట్లు... ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా బ్యాంక్ రేటు(7 శాతం), రెపో రేటు(6.5 శాతం), రివర్స్ రెపో రేటు(6 శాతం), నగదు నిల్వల శాతం(సీఆర్ఆర్-4 శాతం)ల్లో అంచనాలకనుగుణంగానే యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ద్రవ్యోల్బణం రిస్క్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అంచనాలకనుగుణంగా వర్షాలు కురిసి ద్రవ్యోల్బణం దిగొస్తే రేట్లను తగ్గిస్తామని చెప్పారు. -
రేట్లలో కోత లేదు.. రెపో 6.5శాతమే
ముంబై: మెజారిటీ విశ్లేషకులు అంచనా వేసిన మాదిరిగానే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయం వెలువడింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 6.5 శాతంగానే ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఈ రేటుపై ఎలాంటి కోత విధించలేదని పేర్కొన్నారు. అలాగే సీఆర్ఆర్ 4 శాతంగా ఉంది. మంగళవారం జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజన్ వెలువరిచిన ఈ పాలసీని విశ్లేషకులు, మార్కెట్ వర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సెప్టెంబర్ తో రాజన్ పదవి ముగియనుండటం, మరో మారు ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ నే కొనసాగించాలని చర్చనీయాంశాలు జోరు అందుకోవడంతో, ఆర్ బీఐ పాలసీ ఎలా ఉండబోతుందనే దానిపై ఎక్కువగా దృష్టిసారించారు. 2013 సెప్టెంబర్ లో ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ మూడేళ్ల బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ రాజన్ పదవిని కొనసాగించకపోతే నేడు వెలువరించిన పాలసీనే రాజన్ కు ఆఖరిదని విశ్లేషకులంటున్నారు. రాజన్ మూడేళ్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న రెపో రేటును ఏ మాత్రం మార్పుల చేయలేదు. నేడు వెలువరిచిన ఆర్ బీఐ ద్రవ్యపరపతి సమీక్ష సందర్భంగా తెలుసుకోవాల్సిన అంశాలు... ఈ రేటును ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ, విశ్లేషకులు నిర్ణయించారు. తర్వాతి పాలసీ ఆగస్టులో వెలువడే వరకూ ఈ రేట్లే అమలుల్లో ఉండనున్నాయి. ఈ రేటుపై నిర్ణయం తీసుకున్న ద్రవ్యవిధాన కమిటీ ఏర్పాటు బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీలో ముగ్గురిని కేంద్రప్రభుత్వం నామినేట్ చేస్తోంది. మరో ముగ్గురు ఆర్ బీఐకి చెందిన వ్యక్తులుంటారు. ఆర్ బీఐ గవర్నర్ ఓటింగ్ అధికారం కలిగి ఉంటారు. నేడు వెలువరించిన ద్రవ్యవిధాన పాలసీలో ఎక్కువగా ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ నే కొనసాగిస్తారా..? అనే అంశంపైనే అందరూ దృష్టిసారించారు. ప్రతి ఆర్ బీఐ గవర్నర్ పదవి ముగుస్తుందనగా.. వారికి పదవిని రెండేళ్లు పొడిగించేవారు. మరి రాజన్ కు ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నదే చర్చనీయాంశం. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేత సుబ్రహ్మణ్య స్వామి, రాజన్ పదవి కొనసాగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వడ్డీరేట్లు తగ్గించకపోవడం వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మానసికంగా రాజన్ భారతీయుడు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా జారీచేసిన గ్రీన్ కార్డ్ ను ఆయన ఇంకా రెన్యూవల్ చేప్పించుకుంటున్నారని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. సెప్టెంబర్ లో రాజన్ పదవి ముగుస్తుండటంతో, అప్పుడే దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై ఎలాంటి చర్చ వద్దని మోదీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రాజన్ పదవి పొడిగింపుకు మోదీకి ఎలాంటి అభ్యతరం లేదని సంకేతాలు వెలువడుతున్నాయి. నెట్ సిటిజన్లు, మెజార్టి విశ్లేషకుల నుంచి కూడా రాజన్ కు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. బ్యాంకులకు ఆర్ బీఐ ఇచ్చే రుణాలపై రేటు.. రెపోను 6.50గానే ఉంచుతుందని మెజార్టి విశ్లేషకులు భావించారు. మార్చిలో 4.83శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 5.39శాతంగా పెరగడం దీనికి కారణంగా చూపారు. 2017 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావడమే ఆర్ బీఐ ప్రధాన లక్ష్యం. ఇటీవల ఆయిల్ ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 7వ వేతన సంఘ సిఫారసులను అమలుచేయడం వల్ల, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు పెరిగాయని, దీంతో ధరలు ఎగబాకాయని చెబుతున్నారు. రేట్లలో కోత విధింపు అంశం రుతుపవనాల వల్ల కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటుందని, రాజన్ కూడా రేటు కోత విధించకుండా రుతుపవనాల కోసం వేచిచూస్తున్నారని ఈ నిర్ణయంతో వెల్లడైంది.. వాతావరణ నిపుణులు ఈ ఏడాది రుతుపవనాలు బాగుంటాయని అంచనావేస్తున్నారు. రెండేళ్ల కరువు అనంతరం ఈ ఏడాది రుతుపవనాలు ఆర్థికవ్యవస్థకు మేలు చేకూర్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మంచి రుతుపవనాలు, గ్రామీణ వినియోగాన్ని పెంచుతుందంటున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటుపై ఈ నెల 15-16 తేదీల్లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా సమీక్ష జరుగుతుండటం విశేషం. -
ఆర్బీఐ పాలసీకి ‘ముందు జాగ్రత్త’
♦ 66 పాయింట్ల నష్టంతో 26,777కు సెన్సెక్స్ ♦ 20 పాయింట్లు క్షీణించి 8,201కు నిఫ్టీ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నేడు (మంగళవారం) ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 66 పాయింట్లు నష్టపోయి 26,777 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8,201 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, ఆయిల్, గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్‌లు, టెలికం షేర్లు నష్టపోగా, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, కొన్ని మౌలిక రంగ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. లాభాల స్వీకరణ.. బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో మరింతగా పెరిగింది. గత రెండు వారాల్లో స్టాక్ సూచీలు 6 శాతం వరకూ లాభపడటంతో ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే కీలకమైన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం, యూరోజోన్‌లో బ్రిటన్ కొనసాగే విషయమై రిఫరెండమ్.. ఈ రెండు కీలక అంతర్జాతీయ అంశాలు ఈ నెలలోనే జరగనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాగా వర్షాలు సాధారణం కంటే అధికంగానే కురుస్తాయన్న అంచనాలు, జీడీపీ జోరుగా ఉండడం వంటి సానుకూలాంశాలు నష్టాలను పరిమితం చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం జీడీపీ సాధించడంతో ఆర్బీఐ కీలక రేట్లలో యథాతథ స్థితి కొనసాగించే అవకాశాలున్నాయని పలువురు స్టాక్ బ్రోకర్లు అంచనా వేస్తున్నారు. లాభాల్లో ప్రభుత్వ బ్యాంక్ షేర్లు... మొండి బకాయిల సెటిల్మెంట్కు బ్యాంక్‌లకు మరిన్ని అధికారాలు, మరిన్ని నిధులు ఇస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడంతో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు 2.85 శాతం వరకూ లాభపడ్డాయి. రూ.2,161 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించడంతో లార్సెన్ అండ్ టుబ్రో షేర్ 0.5 శాతం పెరిగింది. నష్టాల్లో టెలికం షేర్లు..: నెట్వర్క్ ట్రయల్స్ కోసం ఆసక్తి ఉన్నవాళ్ల పేర్లను రిలయన్స్ జియో తీసుకోవడం ప్రారంభించడంతో టెలికం షేర్లు-భారతీ ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2 శాతం వరకూ తగ్గాయి. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా, ఇప్కా ల్యాబొరేటరీస్, ఐనాక్స్ విండ్, పంజ్ లాయిడ్, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ అండ్ యాక్సెసరీస్, జేపీ ఇన్ఫ్రాటెక్, సన్‌రైజ్ ఏషియన్ తదితర షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. డాలర్ బలహీనపడడంతో టీసీఎస్, విప్రో వంటి ఐటీ షేర్లు నష్టపోయాయి. -
సెన్సెక్స్ 247 పాయింట్లు డౌన్
- 25,617 పాయింట్ల వద్ద ముగింపు - 73 పాయింట్ల నష్టంతో 7,796కు నిఫ్టీ ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం ప్రభావం చూపాయి. చివరి గంటన్నరలో అమ్మకాలు పోటెత్తాయి. నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. అక్టోబర్ సిరీస్ తొలిరోజున బీఎస్ఈ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 25,617 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 7,796 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక దశలో 25,937 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 247 పాయింట్ల నష్టపోయింది. కాగా ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 49 శాతానికి తగ్గనుందన్న వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 30 శాతం వరకూ పెరిగింది. 7శాతం లాభంతో రూ.79 వద్ద ముగిసింది. ఆసిడిటీ చికిత్సలో ఉపయోగపడే ఆస్ట్రాజెనెకా నెక్సియమ్‌కు జనరిక్ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ బీఎస్ఈలో 5.3 శాతం పెరిగి రూ.4,185 వద్ద ముగిసింది. -
రాజన్వైపు మార్కెట్ చూపు
ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఆధారంగా ట్రెండ్ * నిపుణుల అంచనా న్యూఢిల్లీ: సెప్టెంబర్ 29నాటి రిజర్వుబ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష వైపు మార్కెట్ చూపు వుందని, వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. కీలక రెపో రేటును పావుశాతం తగ్గించవచ్చన్న మెజారిటీ అంచనాలు మార్కెట్లో వున్నాయని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.66 శాతం కనిష్టస్థాయికి తగ్గడం, జీడీపీ వృద్ధి 7 శాతానికి పరిమితం కావడం వంటి అంశాలవల్ల రేట్ల కోత అంచనాలు ఊపందుకున్నాయని ఆయన వివరించారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గతవారం వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదావేయడం, స్థానికంగా ద్రవ్యోల్బణం తగ్గడం వంటి అంశాలతో ఇక్కడ ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఆర్బీఐ పాలసీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి మారకపు విలువ హెచ్చుతగ్గులు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని క్యాపిటల్‌వయా రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. గాంధీ జయంతి కారణంగా వచ్చే శుక్రవారం మార్కెట్లకు సెలవు. దాంతో ఈ వారం మార్కెట్లో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితమవుతుంది. కాగా, సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకూ దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 6,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి రికార్డుస్థాయిలో రూ. 17,000 కోట్లకుపైగా పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గతవారం మార్కెట్.. గతవారం యూరప్ మార్కెట్లు బాగా క్షీణించడంతో ఇక్కడ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ 355 పాయింట్లు తగ్గింది. చివరకు 25,863 పాయింట్ల వద్ద ముగిసింది. -
హెచ్చుతగ్గుల మార్కెట్
- ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త - 40 పాయింట్ల లాభంతో 25,864కు సెన్సెక్స్ - 23 పాయింట్ల లాభంతో 7,869కు నిఫ్టీ ముంబై: వచ్చే వారం ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో గురువారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. బీఎస్ఈ సెనెక్స్ 40 పాయింట్ల లాభంతో 25,864 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7,869 పాయింట్ల వద్ద ముగిశాయి. సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టు ముగింపు ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, కొన్ని లోహ షేర్లు పతనమయ్యాయి. రోల్ ఓవర్స్ సానుకూల ప్రభావం... సెన్సెక్స్ 279 పాయింట్ల రేంజ్లో కదలాడింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల రోల్ ఓవర్లు అక్టోబర్‌కు స్వల్పంగా పెరగడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. కాగా ఈ వారంలో సెన్సెక్స్ 355 పాయింట్లు(1.35 శాతం), నిఫ్టీ 113 పాయింట్లు(1.42%) చొప్పున నష్టపోయాయి. గత మూడు వారాల్లో ఈ రెండు సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి. లాభ నష్టాలు... నొముర, క్రెడిట్ సూచీ బ్రోకరజ్ సంస్థలు లుపిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో లుపిన్ షేర్ 3.5 శాతం ఎగిసి రూ. 1,990 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే, 30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,442 షేర్లు లాభాల్లో, 1,245 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,567 కోట్లుగా, ఎన్ఎస్ఈ ఈక్విటీ విభాగంలో రూ.19,830 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,58,242 కోట్లుగా నమోదైంది. నేడు మార్కెట్లకు సెలవు బక్రీద్ పర్వదినం సందర్భంగా స్టాక్‌మార్కెట్‌కు నేడు(శుక్రవారం) సెలవు. బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఫారెక్స్, మనీ, ప్రధాన కమోడిటీ మార్కట్లు పనిచేయవు. -
వడ్డీ రేట్ల కోతకు చాన్స్..!
పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఉండొచ్చు.. రేపటి పరపతి విధాన సమీక్షపై బ్యాంకర్ల అంచనా న్యూఢిల్లీ: ఆర్బీఐ రేపు(మంగళవారం) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడులకు ఊతమిచ్చి.. తద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత జోరందుకునేలా చేయడంపై ఆర్బీఐ దృష్టిపెట్టొచ్చనేది వారి అభిప్రాయం. గత కొద్ది నెలలుగా మైనస్‌లోనే కొనసాగుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం... ఏప్రిల్‌లో కొత్త కనిష్టాన్ని(మైనస్ 2.65%) తాకిన సంగతి తెలిసిందే. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ నెలలో 4.87 శాతానికి తగ్గింది. మరోపక్క, ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో(2014-15) ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి కట్టడి చేయడంతో పాలసీ సమీక్షలో ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు ఆస్కారం కలిగించే అంశమని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రెపో రేటు 7.5 శాతం, రివర్స్ రెపో 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా ఉన్నాయి. గత సమీక్ష(ఏప్రిల్7న)లో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించిన విషయం విదితమే. సీఆర్ఆర్ తగ్గిస్తే బెటర్.. ద్రవ్యోల్బణం మైనస్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో పాలసీ రేట్లలో మార్పులకు అవకాశాలున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్ టీఎం భాసిన్ పేర్కొన్నారు. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ పి. శ్రీనివాస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఇప్పుడు చాలా తగ్గింది. దీంతో రెపో రేటు పావు శాతం తగ్గించేందుకు వీలుంది. వృద్ధికి చేయూతనివ్వాలంటే ఆర్బీఐ సానుకూల నిర్ణయం అవసరం. ఇప్పుడు గనుక వడ్డీరేట్లను తగ్గించకపోతే.. ఎల్‌నినో ప్రభావంవల్ల వర్షాలు సరిగ్గా కురవని పక్షంలో రానున్న నెలల్లో రేట్లకోత కష్టతరంగా మారొచ్చు’ అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాగా, సీఆర్ఆర్ కోత వల్ల కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ముందుకొచ్చే అవకాశం ఉందని భాసిన్ చెప్పారు. ‘ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో అవసరానికి మించి ద్రవ్యలభ్యత(లిక్విడిటీ) ఉంది. రుణ వృద్ధి తగినంతగా లేకపోవడమే దీనికి కారణం. బ్యాంకుల నుంచి ఇప్పుడు మేం స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రెపో విండో(సదుపాయం) వల్ల బ్యాంకులకు అదనపు ప్రయోజనం ఉండదు. సీఆర్ఆర్ తగ్గింపు ద్వారానే బ్యాంకుల వ్యయం దిగొచ్చేందుకు దోహదం చేస్తుంది. కనీసం సీఆర్ఆర్ను అర శాతం తగ్గించాలనేది మా విజ్ఞప్తి. దీనివల్ల వ్యవస్థలోకి రూ.40 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది’ అని భాసిన్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలుండటంతో పావు శాతానికి మించి ఆర్బీఐ రేట్ల కోతకు ఆస్కారం లేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, ఎండీ వీఆర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. -
పాలసీకి అటూ..ఇటూ హెచ్చుతగ్గులు
మెప్పించని ఆర్బీఐ పాలసీ వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు కుదేల్ 12 పాయింట్ల లాభంతో 28,517కు సెన్సెక్స్ 8,660 పాయింట్లకు చేరిన నిఫ్టీ ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష వెలువడకముందు స్టాక్ మార్కెట్ ఎలాగైతే ఒడిదుకులకు గురైందో, పాలసీ వెలువడిన తర్వాత కూడా అంతే స్థాయి ఒడిదుడుకులకు గురైంది. మొత్తం మీద కొంచెం సేపు లాభాల్లో, మరికొంచెం సేపు నష్టాల్లో తారాట్లాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 12 పాయింట్ల లాభంతో 28,517 పాయింట్ల వద్ద ముగిసింది. కీలక రేట్లను తగ్గించకపోవడంతో ఆర్బీఐ పాలసీ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. సెన్సెక్స్ ట్రేడింగ్ లాభంతోనే మొదలైంది. ఆ తర్వాత 105 పాయింట్ల లాభంతో 28,641 పాయింట్లకు ఎగసింది. ఆర్బీఐ పాలసీలో మెరుపులేమీ లేకపోవడంతో 28,274 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆర్బీఐ నిర్ణయాన్ని మార్కెట్ ముందుగానే అంచనా వేసిందని, ఈ ప్రభావం ఇప్పటికే డిస్కౌంట్ అయిందని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. చివర్లో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ స్వల్పంగా 12 పాయంట్లు లాభపడింది. నిఫ్టీ 8,694-8,587 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి 0.4 పాయింట్ల లాభంతో 8,660 పాయింట్ల వద్ద ముగిసింది. ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ సూక్ష్మ రుణ సంస్థలు రుణ గ్రహీతలకు ఇచ్చే రుణాల పరిమితులను రూ.50,000 నుంచి లక్షకు పెంచడంతో ఈ రంగంలో ఉన్న ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ 8.5 శాతం, ఎస్ఈ ఇన్వెస్ట్మెంట్స్ 8 శాతం చొప్పున పెరిగాయి. ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ, వాహన షేర్లు కుదేలయ్యాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. కీలక రేట్లను తగ్గించకపోవడంతో వడ్డీరేట్లు తగ్గవని, ఫలితంగా గృహ రుణ వృద్ధి కుంటుపడుతుందన్న అంచనాలతో హౌసింగ్ ఫైనాన్స్, రియల్టీ షేర్లు పతనమయ్యాయి. ఎన్బీసీసీ, ఒబెరాయ్ రియల్టీ, ఫీనిక్స్, గోద్రేజ్ ప్రోపర్టీ, యూనిటెక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, శోభా డెవలపర్స్, డీఎల్ఎఫ్, ప్రెస్జీజ్ ఎస్టేట్స్ 3 -2 శాతం రేంజ్లో తగ్గాయి. బ్యాంక్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 1.6 శాతం క్షీణించింది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.2 శాతం, ఎస్బీఐ 0.9 శాతం చొప్పున నష్టపోయాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 16 లాభాల్లో, 13 నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ షేర్ సోమవారం నాటి ధరకే ముగిసింది. టాటా స్టీల్ 4.8 శాతం, సెసా స్టెరిలైట్ 3.1 శాతం, బజాజ్ ఆటో 3.1 శాతం, బజాజ్ ఆటో 3 శాతం, ఎన్టీపీసీ 2.7 శాతం, భారతీ ఎయిర్టెల్ 2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.9శాతం, హిందాల్కో 1.6 శాతం, టాటా పవర్ 1.6 శాతం చొప్పున పెరిగాయి. ఇక క్షీణించిన షేర్ల విషయానికొస్తే సన్ ఫార్మా 1.42 శాతం, టాటా మోటార్స్ 1.3 శాతం, ఐసీఐసీఐ బ్యాంఖ్ 1.2 శాతం, హీరో మోటొకార్ప్1.19 శాతం, చొప్పున తగ్గాయి. 1,653 షేర్లు లాభాల్లో, 1,096 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,304 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.18,094 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,45,728 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.144 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.326 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడంతో అన్ని ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. యూరోప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. క్యాపిటల్ మార్కెట్లో లావాదేవీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ట్రేడింగ్ విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ డీఐఐ : 07-04 1,260 1,586 -326 06-04 1,667 1,837 -170 ఎఫ్ఐఐ: 07-04 3,719 3,575 144 06-04 4,438 3,501 937 (విలువలు రూ.కోట్లలో) -
మార్కెట్‌కు ‘ఆర్బీఐ పాలసీ’ బూస్ట్..!
దూసుకుపోయిన ఫార్మా షేర్లు 244 పాయింట్ల లాభంతో 28,504కు సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 8,660కు నిఫ్టీ రోజులో సగభాగం దశ, దిశా లేకుండా చలించిన స్టాక్ మార్కెట్ చివరి రెండు గంటల ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టింది. ఆర్బీఐ విధాన సమీక్ష నేపథ్యంలో మార్కెట్ లాభపడడం గమనార్హం. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ స్టాక్‌ల ర్యాలీతో బీఎస్ఈ సెన్సెక్స్ 244 పాయింట్ల లాభంతో 28,504 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 8,660 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ నేటి ముగింపు రెండు వారాల గరిష్ట స్థాయి. మార్చిలో కొత్త ఆర్డర్ల కారణంగా తయారీ రంగం జోరు పెరగడం కూడా ప్రభావం చూపింది. గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగాల గణాంకాలు బలహీనంగా ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను జూన్‌లో కూడా తగ్గించకపోవచ్చన్న అంచనాలు కూడా ట్రేడింగ్‌పై సానుకూల ప్రభావం చూపాయి. కాగా అమెరికాకు చెందిన ద మెడిసిన్స్ కంపెనీతో యాంజియోమ్యాక్స్ ఔషధానికి సంబంధించిన వివాదం పరిష్కారమైన నేపధ్యంలో సన్ ఫార్మా షేర్ దూసుకుపోయింది. సన్ ఫార్మా 8.3 శాతం లాభపడి రూ.1,168.5 వద్ద ముగిసింది. ఇది ఈ షేర్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. రక్తపోటు ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో టొరంట్ ఫార్మా 4 శాతం, అధిక రక్తపోటు ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో అరబిందో ఫార్మా 9 శాతం చొప్పున లాభపడ్డాయి. సిప్లా 3.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ 4.3 శాతం చొప్పున పెరిగాయి. కీలక రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తుందన్న అంచనాల కారణంగా బ్యాంకింగ్ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. సన్ టీవీకి చెందిన దయానిధి మారన్, కళానిధి మారన్‌లకు చెందిన రూ.743 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అటాచ్‌తో ఈ షేర్ 9.4 శాతం క్షీణించింది. 30 షేర్ల సెన్సెక్స్‌లో 19 షేర్లు లాభాల్లో, 11 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,938 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.17,040 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,53,504 కోట్లుగా నమోదైంది. క్యాపిటల్ మార్కెట్లో లావాదేవీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ట్రేడింగ్ విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ డీఐఐ : 06-04 1,667 1,837 -170 ఎఫ్ఐఐ: 06-04 4,438 3,501 937 (విలువలు రూ.కోట్లలో) యాడ్‌ల్యాబ్స్‌కు లిస్టింగ్ లాభాలు 6 శాతం లాభంతో రూ.191 వద్ద ముగింపు ముంబై: థీమ్ పార్క్ నిర్వహించే యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ షేరు లిస్టింగ్ మొదటి రోజే మెరుపులు మెరిపించింది. నష్టంతో స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటికీ, చివరకు ఇష్యూ ధర(రూ.180తో) పోల్చితే బీఎస్ఈలో 6.2 శాతం లాభంతో రూ.191.25 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోల్చితే 6.6 శాతం నష్టంతో రూ.167.95 వద్ద లిస్టయిన ఈ షేర్ రూ.156.4, రూ.199 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. బీఎస్ఈలో 29 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 90 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. గత నెల 10న ఐపీఓకు వచ్చిన ఈ ఇష్యూ 1.1 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ రూ.376 కోట్లు సమీకరించింది. మొదటగా రూ.221-230 గా నిర్ణయమైన ప్రైస్‌బ్యాండ్‌ను ఇన్వెస్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో రూ.180-215కు తగ్గించింది. -
ఆర్బీఐ పాలసీ, ఐఐపీ డేటాలతో తీవ్ర హెచ్చుతగ్గులు
న్యూఢిల్లీ: రిజర్వుబ్యాంక్ వెల్లడించబోయే పరపతి విధానం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని, ఈ మూడు అంశాలు మార్కెట్‌ను తీవ్ర హెచ్చుతగ్గులకు గురిచేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7న వెలువడబోయే ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష మార్కెట్‌కు కీలకమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఆర్బీఐ పాలసీ తర్వాత ఏప్రిల్ 10న వెలువడబోయే ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను శాసించవచ్చన్నది అంచనా. ఈ రెండు ఘటనలతో వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీలకు చెందిన షేర్లు భారీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటాకు తొలుత ఈ సోమవారం మన మార్కెట్లు స్పందిస్తాయి. మార్చి నెలలో అమెరికాలో ఉద్యోగాల సంఖ్య 1.5 లక్షలకు తగ్గినట్లు డేటా వెలువడింది. ఈ సంఖ్య అక్కడి అంచనాలకంటే బాగా తక్కువ. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినట్లు ఈ డేటా సూచిస్తోంది. తదుపరి ట్రిగ్గర్ కార్పొరేట్ ఫలితాలు. అటు తర్వాత మార్కెట్ ట్రెండ్‌ను కార్పొరేట్ల క్యూ4 ఆర్థిక ఫలితాలు నిర్దేశిస్తాయి. 2015 మార్చితో ముగిసే త్రైమాసికపు ఆర్థిక ఫలితాలకు ఐటీ దిగ్గజం టీసీఎస్ ఏప్రిల్ 16న శ్రీకారం చుడుతుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఏప్రిల్ 24న ఫలితాలు వెల్లడిస్తుంది. ఇటీవల వరుసగా కేంద్ర బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాల తర్వాత ర్యాలీకి అవసరమైన ట్రిగ్గర్ల కోసం మార్కెట్ వేచి చూస్తున్నదని అషికా స్టాక్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోథురా చెప్పారు. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 2.91 శాతం ర్యాలీ జరిపింది. -
బుల్లిష్‌గానే మార్కెట్!
* వచ్చే ఆర్బీఐ పాలసీపై ఆశలు * ఈసీబీ సమావేశంవైపు చూపు * కార్పొరేట్ ఫలితాల ప్రభావం కూడా న్యూఢిల్లీ: ఈ వారం కూడా భారత్ స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గానే వుండవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. రిజర్వుబ్యాంక్ అనూహ్యంగా రెపో రేటును తగ్గించడంతో గతవారం ఈక్విటీలు ర్యాలీ సాగించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి తొలివారంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష వున్నందున, ఆ సమావేశంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మరిన్ని చర్యల్ని కేంద్ర బ్యాంక్ తీసుకోవొచ్చన్న అంచనాలతో రానున్న ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు. అలాగే ఇటీవలి రేటు తగ్గింపు ప్రభావంతో వచ్చే కొద్దిరోజుల్లో వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు మరింత పెరుగుతాయని బ్రోకర్లు భావిస్తున్నారు. అయితే ఈ వారం వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నది అంచనా. హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కెయిర్న్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ జింక్ తదితర కార్పొరేట్లు ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ కారణంగా స్వల్పకాలంలో నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, కానీ మొత్తంమీద అప్‌ట్రెండ్ మాత్రం కొనసాగుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 663 పాయింట్ల పెరుగుదలతో 28,122 పాయింట్ల వద్ద ముగిసింది. 2014, అక్టోబర్ 31 తర్వాత ఒకేవారంలో ఇంత భారీ పెరుగుదల ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా ఈ వారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చు. ఈసీబీ ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు గత కొద్దికాలంగా మార్కెట్లో కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐల నికర పెట్టుబడులు రూ. 244 కోట్లు... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 244 కోట్లు మాత్రమే నికరంగా పెట్టుబడి చేశారు. అయితే రుణ మార్కెట్లో మాత్రం వీరు జనవరి 1-16 తేదీల మధ్య భారీగా రూ. 11,300 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు. ద్రవ్యోల్బణం బాగా క్షీణించడంతో పాటు వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా ఎఫ్ఐఐలు రుణ పత్రాల్లో భారీ పెట్టుబడులు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీ ఫండ్స్‌లో పెరుగుతున్న ఖాతాలు... స్టాక్ మార్కెట్ ర్యాలీ ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-2015) ఏప్రిల్- డిసెంబర్ మధ్య తొమ్మిదినెలల కాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 12 లక్షల కొత్త ఖాతాలను ఆకర్షించాయి. దేశంలోని మొత్తం 45 మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద ఈక్విటీ ఫోలియో ఖాతాల సంఖ్య గత నెలాఖరునాటికి 3,03,92,991కు పెరిగింది. 2014 మార్చి చివరినాటికి ఈ సంఖ్య 2,91,80,922. నాలుగేళ్ల తర్వాత 2014 ఏప్రిల్ నెలలో తొలిసారిగా ఖాతాల సంఖ్య పెరిగింది. అంతకుముందు 2009 మార్చి నుంచి ప్రతినెలా ఖాతాలు మూతపడుతూ వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రూ. 50,000 కోట్ల నికర పెట్టుబడుల్ని ఆకర్షించింది. -
ఇంటి రుణం మార్చుకోవచ్చు..
ఆర్బీఐ పాలసీ రేట్లు పెరిగినప్పుడల్లా వేగంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచేసే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు.. పాలసీ రేట్లు తగ్గినప్పుడు మాత్రం అంతే వేగంగా వడ్డీరేట్లు తగ్గించవు. దీంతో ముందు తక్కువ వడ్డీకే రుణం తీసుకున్నప్పటికీ.. క్రమక్రమంగా ఈఎంఐలు కొండంతయి కూర్చుంటాయి. ఓవైపు భారీ ఈఎంఐలు కట్టలేక సతమతమవుతుంటే.. మరోవైపు మన పక్క బ్యాంకు చౌక రేటుకే రుణాలు అంటూ ఊదరగొట్టేస్తుంటుంది. అలాగని, రుణాన్ని దానికి మార్చుకుందామా అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలియక చిరాకు పెరిగిపోతుంటుంది. పోనీ తెలిసినా రోజూ బ్యాంకు చుట్టూ తిరిగేంత సమయం, ఓపిక లేక.. కష్టమయినా భారీ ఈఎంఐల భారాన్ని మోసుకుంటూ తిరగాల్సి వస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే .. లోన్ బదలాయించుకోవడానికి కావల్సిన సర్వీసులు అందించేందుకు స్పెషలిస్టు సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. స్విచ్మిడాట్ఇన్, మైలోన్కేర్డాట్ఇన్, డెస్టిమనీ అడ్వైజరీ సర్వీసెస్ లాంటివి ఆ కోవకి చెందినవే. సాధారణంగా ఇలా రుణాన్ని మరో బ్యాంకుకు బదలాయించుకునే ప్రక్రియకి కొన్ని సార్లు చాలా సమయం పట్టేయొచ్చు. మరో దానికి మారుతున్నామంటే...మన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి కొన్ని సార్లు రుణాలిచ్చిన సంస్థలు జాప్యం చేయొచ్చు. ఒకోసారి లేని,పోని కొంగొత్త చార్జీలు కట్టాలంటూ కండీషన్లూ పెట్టొచ్చు. ఈ తలనొప్పులన్నీ ఎందుకులే అనుకుని అనేక ప్రయోజనాలున్నప్పటికీ మొత్తానికి బదలాయింపు ఆలోచననే మనం పక్కన పడేసే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు స్పెషలిస్టు సర్వీస్ సంస్థలు అక్కరకొస్తాయి. పాత లోన్‌ను బదలాయించి కొత్త లోన్ మంజూరు అయ్యే దాకా మొత్తం ప్రక్రియను ఈ కంపెనీలు చూసుకుంటాయి. దరఖాస్తు ఫారంలను నింపడం, డాక్యుమెంటేషన్, బ్యాంకు వారితో మాట్లాడించడం, లోన్ మంజూ రయ్యే దాకా చూస్తాయి. ఎక్కడ ఎవర్ని కలిస్తే పని అవుతుందన్నది ఈ స్పెషలిస్టు సంస్థలకి తెలుస్తుంది. బ్యాంకుల చుట్టూ తిరిగే పని అవి చూసుకుంటాయి కాబట్టి మనకు సమయం ఆదా అవుతుంది. అయితే, ఈ తరహా ప్రొఫెషనల్ సంస్థలు తమ సర్వీసులకు కొంత ఫీజులు వసూలు చేస్తుంటాయి. అవి ఎంత ఉంటాయో తెలుసుకోవాలి. అలాగే, బదలాయించేటప్పుడు వడ్డీ రేట్ల ప్రయోజనం ఎంత, ఇంకా ఎంత కాలం కట్టాలి, కొత్త బ్యాంకు సర్వీసు ప్రమాణాలు ఎలా ఉన్నాయి లాంటివి చూసుకోవాలి. చెప్పుకోతగ్గ స్థాయిలో భారం తగ్గుతుందనుకుంటేనే మారాలి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: వడ్డీ రేట్లను మార్పు చేయకుండా ఉంచాలని, ద్రవ్య మార్కెట్ లో లిక్విడిటీ పెంచేందుకు ఎస్ఎల్ఆర్ ను 0.53 శాతం తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంతో 25605 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 7651 వద్ద ముగిసింది. ఎస్ఎల్ఆర్ తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని స్టాక్ మార్కెట్ బ్రోకర్లు తెలిపారు. ఎస్ఎల్ఆర్ ను అరశాతం తగ్గించడం వలన 40 వేల కోట్లు ద్రవ్యమార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ భావిస్తోంది. అల్ట్రా టెక్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, గ్రాసీం కంపెనీలు రెండు శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, భెల్, ఐడీఎఫ్ సీ కంపెనీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
డేగలు.. గుడ్లగూబ పోలికలు వద్దు...
ముంబై: ప్రజా ప్రయోజనాల కోసమే రెపో రేటును పావుశాతం పెంచినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన విశ్లేషకులతో సాంప్రదాయక పాలసీ సమీక్ష అనంతర సమావేశంలో మాట్లాడారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను 8 శాతానికి పెంచడాన్ని ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. తాను అనుసరిస్తున్న ద్రవ్యవిధానాన్ని ‘యుద్ధోన్మాద డేగ’తో పోల్చుతున్న విశ్లేషకులు, ఆర్థికవేత్తలను ఈ సందర్భంగా తప్పుపట్టారు. ఆర్థిక రంగానికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు... క్లుప్తంగా ఆయన మాటల్లోనే... అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ద్రవ్యోల్బణం గురించి మాట్లాడడమే కాదు. దీని కట్టడికి సైతం మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. {దవ్యోల్బణం కట్టడిని మాత్రమే ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుందనడం సరికాదు. వృద్ధికి సైతం ప్రాముఖ్యత నిస్తుంది. అయితే ద్రవ్యోల్బణం కట్టడి ద్వారానే వృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం ప్రజాప్రయోజనాలకు కీలకం. ద్రవ్యోల్బణం కట్టడి ద్వారా దేశీయ కరెన్సీ విలువను పటిష్టంగా ఉంచడం మా ధ్యేయం. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తే- పెట్టుబడిదారు విశ్వాసం కూడా దానంతనే అదే బలపడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి అటు ద్రవ్యపరంగా, ఇటు రాజకీయ పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పాలసీ విధానాన్ని డేగతోనో లేక పావురంతోనో పోల్చడాన్ని పక్కనపెట్టండి. ముఖ్యమైన అంశం ఏమిటంటే- బలహీన ఆర్థిక వ్యవస్థలో తగిన బాటను వేయడానికి మేము ప్రయత్నిస్తున్నామన్నది ఇక్కడ ముఖ్యం. విస్తృతశ్రేణిలో ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మొత్తంగా చూస్తే మామీద ఒక ముద్ర వేసేయడానికి ప్రయత్నించకండి. ఆర్థిక వ్యవస్థకు ఏమికావాలో అదే చేస్తున్నాం. పాలసీ సమీక్ష రోజున విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు రాజన్ సమాధానం చెబుతూ... ‘ మేం డేగలం, పావురాలము కాదు. ఒక రకంగా చెప్పాలంటే గుడ్లగూబలం’ అని అన్నారు. గుడ్లగూబ వివేకానికి గుర్తని డిప్యూటీ గవర్నర్ ఇన్చార్జ్ (పరపతి విధానం) ఉర్జిత్ పటేల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఇకపైనా ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఐఐపీ వంటి ఆర్థిక గణాంకాలతోపాటు, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆర్ఐఎల్ వంటి బ్లూచిప్స్ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇకపై మార్కెట్లను క్యూ3 ఫలితాలే నడిపిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అక్టోబర్-డిసెంబర్ కాలానికి(క్యూ3) మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, క్యాపిటల్ గూడ్స్ దిగ్గజం ఎల్అండ్టీ పనితీరు ఈ వారంలో వెల్లడికానుంది. కాగా, ఈ నెల 28న రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. ఈ అంశాల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించే అవకాశమున్నదని నిపుణులు పేర్కొన్నారు. గత వారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ గత నాలుగు వారాల్లోలేని విధంగా 305 పాయింట్లు(1.5%) ఎగసి 21,064 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం కొంతమేర లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టే అవకాశాలున్నాయనేది కొందరు నిపుణుల అభిప్రాయం. 6,350 వద్ద అమ్మకాలు! విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు ఈ వారం కీలకంగా నిలవనున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు అంతర్జాతీయ సంకేతాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాల పనితీరును నిశితంగా గమనించాల్సి ఉన్నదని రెలిగేర్ సెక్యూరిటీస్‌కు చెందిన రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ వివరించారు. మార్కెట్లు స్థిరీకరణ దిశలో కదులుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,350 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి(రెసిస్టెన్స్) ఎదురుకావచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే 6,150-6,100 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి పటిష్ట మద్దతు లభించవచ్చునని తెలిపారు. ఈ స్థాయిలో కొనుగోళ్లు పుంజుకుంటాయని చెప్పారు. సాంకేతికంగా నిఫ్టీ బుల్లిష్ ధోరణిని కనబరుస్తున్నదని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. 6,360 స్థాయి వద్ద ఎదురయ్యే అమ్మకాల ఒత్తిడి(రెసిస్టెన్స్)ని తట్టుకుని ముందుకెళ్తే మరింత ఊపందుకుంటుందని అంచనా వేశారు. ఈ నెలాఖరున ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కనిపిస్తుందని వెరాసిటీ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. గత పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణం ఉపశమనంతో ఇదే స్థితిని కొనసాగించే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఈ నెల 28 నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న రెండు రోజుల సమావేశంపై ట్రేడర్లు దృష్టి పెడతారని నిపుణులు పేర్కొన్నారు. ఈ వారంలో ప్రధాన ఫలితాలు హెచ్డీఎఫ్సీ ఎల్ అండ్ టీ అల్ట్రాటెక్ సిమెంట్ కెయిర్న్ ఇండియా గ్లెన్‌మార్క్ ఫార్మా అశోక్ లేలాండ్ సెన్సెక్స్ షేర్లలో ఎఫ్ఐఐల జోరు మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించే అత్యధిక శాతం కంపెనీలలో ఎఫ్ఐఐల పెట్టుబడులు పుంజుకున్నాయి. క్యూ3లో 21 సెన్సెక్స్ షేర్లలో విదేశీ పెట్టుబడుల జోరు పెరిగింది. సెన్సెక్స్‌లో 30 బ్లూచిప్ కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బజాజ్ ఆటో, భెల్, ఓఎన్జీసీ, గెయిల్, టాటా పవర్, సెసా స్టెరిలైట్, హీరో మోటో, టాటా మోటార్స్, మారుతీ, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ఎం తదితరాల్లో ఎఫ్ఐఐల వాటా పెరిగింది. పెట్టుబడులు తగ్గిన వాటిలో హెచ్‌యూఎల్, ఐటీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. కాగా, కొత్త ఏడాదిలో ఎఫ్ఐఐలు డెట్ మార్కెట్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జనవరి 1-17 మధ్య నికరంగా రూ. 16,152 కోట్ల(260 కోట్ల డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొన్నారు. షేర్లలో రూ. 2,148 కోట్ల(34.8 కోట్ల డాలర్లు) నికర పెట్టుబడులు పెట్టారు. -
టాపరింగ్ భయాల్లో మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ పడిపోయాయి. వచ్చే వారం రానున్న ఆర్బీఐ పాలసీపై ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రభావం చూపే అవకాశం ఉండడం వల్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోళ్లు ఆపేస్తుందన్న (టాపరింగ్) అంచనాలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, స్టాక్ మార్కెట్లు గరిష్టస్థాయిలకు చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కొనసాగుతుండడం, రూపాయి పతనం వంటి అంశాల కారణంగా గురువారం స్టాక్ మార్కెట్లు 246 పాయింట్లు నష్టపోయి 20,926 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాల్లో ఇదే అతి భారీ క్షీణత. వరుస మూడు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం సెన్సెక్స్ 400 పాయింట్లు పతనమయింది. 21 వేల పాయింట్లకు దిగువకు సెన్సెక్స్ క్షీణించింది. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 6,237 పాయింట్ల వద్ద ముగిసింది. 26 సెన్సెక్స్ షేర్లు పతనం: మొత్తం 12 బీఎస్ఈ రంగ సూచీల్లో ఒక్క విద్యుత్ రంగ సూచీ మాత్రమే పెరిగింది. మిగిలిన 11 రంగ సూచీలు పతనబాటలోనే కొనసాగాయి. వాహన, ఐటీ, మెటల్, మైనింగ్, బ్యాంక్ తదితర రంగ షేర్లన్నీ క్షీణించాయి. టాటా మోటార్స్‌తో సహా మొత్తం 26 సెన్సెక్స్ షేర్లు పడిపోయాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి 3-2 శాతం రేంజ్లో నష్టపోయాయి. టాటా పవర్ 3.84 శాతం, హెచ్డీఎఫ్సీ 1.15 శాతం పెరిగాయి. బుధవారం రూ.1,749 కోట్లుగా ఉన్న మొత్తం టర్నోవర్ గురువారం రూ.1,835 కోట్లకు పెరిగింది. ఈ నెల 18 (బుధవారం)న ఆర్బీఐ మధ్యకాలిక త్రైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్నది. ఇక 17-18 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు జరుగుతాయి. ఈ రెండు అంశాలపై స్టాక్ మార్కెట్ల భవిష్యత్ గమనం ఆధారపడే అవకాశం ఉంది. ఎస్బీఐ ఇష్యూ ధర రూ.1,783 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద ప్రభుత్వానికి జారీ చేసే షేరు ధరను రూ.1,782.74 నిర్ణయించారు. బ్యాంకు వ్యాపార విస్తరణ కోసం రూ.2,000 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం సమకూరుస్తుండగా, ఆ మేరకు ఎస్బీఐ ప్రభుత్వానికి 1.12 కోట్ల షేర్లను కేటాయిస్తోంది. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రూ.1,782.74 ప్రీమియం ధరకు కేటాయించడానికి బ్యాంకు సెంట్రల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. గతేడాది కేంద్రం రూ.3,004 కోట్లు సమకూర్చింది. -
చేయాల్సింది చేశాం... ఫలితానికి వేచిచూస్తాం
ముంబై: ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆరు వారాల వ్యవధిలో రెండుసార్లు రెపోరేట్ల పెంపు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం స్పందించారు. దేశ ఆర్థికరంగం పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరపతి, ద్రవ్య విధాన పాలసీ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఫలితంపై వేచిచూస్తామని తెలిపారు. పాలసీ అనంతరం సాంప్రదాయకంగా ఆర్థిక విశ్లేషకులతో జరిగే సమావేశంలో మాట్లాడుతూ రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రూపాయిపై ఇలా... రూపాయి స్థిరత్వంపై ఆయన మాట్లాడుతూ, చమురు కంపెనీల నుంచి డాలర్ల డిమాండ్ మామూలు మార్కెట్ పరిస్థితులకు చేరినప్పుడే మన కరెన్సీ స్థిరత్వాన్ని ఆపాదించుకుందని చెప్పడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రూపాయి ఈ స్థాయివద్ద ఉండాలనే విషయంలో ఒక నిర్దిష్ట అభిప్రాయాన్నేదీ లేదన్నారు. ద్రవ్యలభ్యతపై విశ్లేషణ లిక్విడిటీ తగిన స్థాయికి వస్తే, రుణాలకు బ్యాంకులు ఎంఎస్ఎఫ్ నుంచి రెపోకు మారే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇప్పటికీ వ్యవస్థ ఎంఎస్ఎఫ్ విండో ద్వారా బ్యాంకింగ్ రుణాలను తీసుకుంటున్న విషయాన్ని రాజన్ పేర్కొన్నారు. ద్రవ్య లభ్యత వ్యవస్థలో పెరగడానికి పలు మార్గాలు ఉన్నాయని సైతం ఆయన వివరించారు. ప్రభుత్వ వ్యయాల పెంపు, ఓఎంఓ (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్- బాండ్ల కొనుగోళ్లు), డిపాజిట్ల వృద్ధి వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కఠిన పాలసీపై వివరణ ప్రస్తుత అంతర్జాతీయ అస్పష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ద్రవ్య విధాన కొనసాగింపునకు ఒక కాల వ్యవధిని నిర్దేశించుకోలేమని ఆయన అన్నారు. ఒకవేళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక చర్యలను వెనక్కు తీసుకునేట్లయితే, ఆ పరిస్థితిని ఎదుర్కొనే స్థాయిలో భారత్ ఉందని మాత్రం ఆయన సందర్భంగా భరోసాను ఇచ్చారు. క్యాడ్, ఆహార భద్రతపై కామెంట్: కరెంట్ అకౌంట్ లోటు కట్టడిలోనే ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఆహార భద్రతా బిల్లు అమలు గురించి ఆయన మాట్లాడారు. ఆహార సబ్సిడీ భారం ప్రస్తుతం జీడీపీలో ఒకశాతం ఉందన్నారు. ఆహార భద్రతా బిల్లు కూడా అమల్లోకి వస్తే ఇది 1.5 శాతానికి చేరుతుందని వివరించారు. అయితే ఇంధన సబ్సిడీల భారం తగ్గింపు ద్వారా ఈ అదనపు భారాన్ని అధిగమించే అవకాశం ఉందని సూచించారు. -
359 పాయింట్ల ర్యాలీ...
రిజర్వుబ్యాంక్ పరపతి విధానం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వుండటంతో మంగళవారం స్టాక్ సూచీలు పెద్ద ఎత్తున ర్యాలీ జరిపాయి. వాస్తవానికి ఆర్బీఐ వడ్డీరేట్లను పావుశాతం పెంచినప్పటికీ, వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, రియల్టీ, ఆటోమొబైల్ షేర్లు జోరుగా పెరగడం విశేషం. వడ్డీ రేట్లు అరశాతం పెరగవచ్చనే అనుమానంతో కొద్దిరోజుల నుంచి విక్రయిస్తున్న ఇన్వెస్టర్లు, పాలసీ వెల్లడి తర్వాత ఆ రంగాల షేర్లలో షార్ట్ కవ రింగ్ జరపడంతో ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గత ఐదు రోజుల నష్టాల్ని ఒక్కరోజులో పూడ్చుకుని 359 పాయింట్ల పెరుగుదలతో మూడేళ్ల గరిష్టస్థాయి 20,929 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 2010 నవంబర్ 9 తర్వాత ఇంత గరిష్టస్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. తాజా ర్యాలీతో ఈ ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ. లక్ష కోట్లు పెరిగింది. మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 67.50 లక్షల కోట్లకు చేరింది. బీఎస్ఈలో టర్నోవర్ రూ. 1,685 కోట్ల నుంచి రూ. 2,243 కోట్లకు చేరగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో టర్నోవర్ రూ. 8,917 కోట్ల నుంచి రూ. 12,427 కోట్లకు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ సిరీస్‌లో లాంగ్ బిల్డప్... నవంబర్ సిరీస్‌లో లాంగ్ రోలోవర్స్ ఎన్ఎస్ఈ ముఖ్య సూచి సీఎన్ఎక్స్ నిఫ్టీ 2 శాతం పెరగడానికి ప్రధాన కారణమైన బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో మంగళవారం లాంగ్ బిల్డప్ జరిగింది. ఈ నెల డెరివేటివ్ సిరీస్ ముగియడానికి మరో రెండురోజులే సమయం వున్నప్పటికీ, తాజా లాంగ్ బిల్డప్ ఏర్పడటం విశేషం. బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 45 వేల షేర్లు (3 శాతం) యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 16.02 లక్షల షేర్లకు పెరిగింది. అలాగే ఈ కాంట్రాక్టు నవంబర్ సిరీస్‌కు పెద్ద ఎత్తున లాంగ్ రోలోవర్స్ కూడా జరిగాయి. దాంతో నవంబర్ ఫ్యూచర్ ఓఐ రెట్టింపై 8.57 లక్షల షేర్లకు పెరిగింది. తాజాగా 4.29 లక్షల షేర్ల రోలోవర్ జరిగింది. లాంగ్ పొజిషన్లను సూచిస్తూ నవంబర్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్‌తో పోలిస్తే రూ. 100 ప్రీమియంతో ముగిసింది. ఆర్బీఐ పాలసీ వెల్లడించిన తర్వాత ఇతర రంగాల సూచీలతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ భారీగా పెరగడంతోపాటు 52 వారాల గరిష్టస్థాయి వద్ద క్లోజయ్యింది. ఇక ప్రధాన బ్యాంకింగ్ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, యూక్సిస్,ఎస్బీఐ నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో రోలోవర్స్ పటిష్టంగా వున్నాయి. ఈ మూడింటిలోనూ తాజాగా 52 శాతం, 62 శాతం, 47 శాతం చొప్పున షేర్లు నవంబర్ సిరీస్‌లో యాడ్ అయ్యాయి. నిఫ్టీలో కొనసాగిన లాంగ్ రోలోవర్స్: సీఎన్ఎక్స్ నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ ఆఫ్లోడింగ్తో పాటు షార్ట్ కవరింగ్ జరగడంతో ఓఐ నుంచి మరో 13 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో అక్టోబర్ ఓఐ 1.28 కోట్ల షేర్లకు తగ్గింది. నవంబర్ సిరీస్‌కు వరుసగా రెండోరోజు పెద్ద ఎత్తున లాంగ్ రోలోవర్స్ జరగడంతో తాజాగా 53.14 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో మొత్తం ఓఐ 1.61 కోట్ల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ధర పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలుచేసే కాంట్రాక్టును లాంగ్ పొజిషన్ అంటారు. -
పరిశ్రమల నిరాశ-రియల్టర్ల పెదవి విరుపు
ఆర్బీఐ రెపో రేటు పెంపు నిర్ణయం పట్ల పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రియల్టర్లు సైతం ఈ ప్రభావం పరిశ్రమపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ సీజన్లో హౌసింగ్ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేటు పెంచకుండా ఉండాల్సిందన్నారు. మరోవైపు, ఆర్బీఐ నిర్ణయం తీవ్రంగా నిరాశపర్చేదిగా ఉందని పార్శ్వనాథ్ డెవలపర్స్ చైర్మన్ ప్రదీప్ జైన్ తెలిపారు. రెపో రేటు పెంపు వల్ల డెవలపర్ల ఫైనాన్స్ వ్యయాలు పెరిగి, వారి లాభాల మార్జిన్‌పై ప్రభావం పడుతుందని కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె ఇండియా చైర్మన్ అనుజ్ పురి అభిప్రాయపడ్డారు. వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణం కట్టడికి విధాన నిర్ణేతలు తగిన చర్యలు తీసుకోవాలని క్రెడాయ్ డిమాండ్ చేసింది. పెట్టుబడులకు, వృద్ధికి రెపోరేటు పెంపు విఘాతం కలిగిస్తుందని ఫిక్కీ, సీఐఐ పేర్కొన్నాయి. -
రాజన్.. రెండో 'సారీ'!
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వరుసగా రెండో విడత వడ్డీరేట్ల వాతపెట్టారు. ధరల కట్టడికే అధిక ప్రాధాన్యం ఇస్తూ... కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచారు. దీంతో వాహన, గృహ, కార్పొరేట్ రుణాలు మరింత భారమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీరేట్ల పెంపు సంకేతాలు-డిమాండ్ తగ్గింపు-తద్వారా ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ మంగళవారంనాటి రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకుంది. రెపోరేటును పావుశాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.75 శాతానికి చేరింది. అదే సమయంలో వృద్ధికి కావాల్సిన నిధులు వ్యవస్థలో అందుబాటులో ఉండే చర్యలనూ తీసుకుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్) రేటును పావుశాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 8.75%కి దిగివచ్చింది. తద్వారా లిక్విడిటీ(ద్రవ్య లభ్యత)కి ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా చర్యలుంటాయని సంకేతాలు ఇచ్చింది. దీనితోపాటు వ్యవస్థలో ఎటువంటి ద్రవ్యలభ్యత సమస్యా తలెత్తకుండా 7, 14 రోజుల రెపోలకు సంబంధించి తమ నగదు పొజిషన్లపై (ఎన్‌డీటీఎల్) బ్యాంకుల రుణ పరిమితిని రెట్టింపు (0.5%కి) చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రేట్లు, నిష్పత్తుల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. అంచనాలకు అనుగుణంగానే...: మొత్తంమీద దాదాపు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ పాలసీ విధానం కొనసాగింది. సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి అదేనెల 20న నిర్వహించిన మధ్యంతర పాలసీ సమీక్ష సందర్భంగా అందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఆర్బీఐ రెపోరేటును పావుశాతం పెంచింది. వరుసగా రెండవసారి రాజన్ రెపో రేటు పెంపునకే ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యాంశం. ఇది ఆయనకు పూర్తిస్థాయి త్రైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష. కాగా తాజా ఆర్బీఐ చర్యల వల్ల కార్పొరేట్, వినియోగ రుణ రేట్లు రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చనేది విశ్లేషకుల అంచనా. ముఖ్యాంశాలు ఇవీ... స్వల్పకాలిక రుణ రేటు రెపో పావుశాతం పెంపు. దీనితో బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 7.75%కి పెరిగింది. బ్యాంకులపై రుణ భారం పెరగడం వల్ల అవి ఖాతాదారుల నుంచి వసూలుచేసే వడ్డీరేట్లూ పెరిగే అవకాశాలు ంటాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 0.25% తగ్గింపు. దీనితో ఇది 8.75 శాతానికి చేరిక. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్య తలెత్తకుండా చూసే పరిస్థితులను ఇది కల్పిస్తుంది. వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. ప్రస్తుతస్థాయికన్నా అధికంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ- సెప్టెంబర్‌లో 6.46%) ఆధారిత ద్రవ్యోల్బణం ఉంది. దీని కట్టడికి తగిన పాలసీ చర్యలు అవసరమే. రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతం స్థాయిలో కొనసాగుతుంది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన పరిమాణం...నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4%లో మార్పులేదు. కొత్త బ్యాంక్ లెసైన్సులపై జలాన్ కమిటీ నవంబర్ 1 వతేదీన మొదటి సమావేశం. దేశీయ బ్యాం కుల హోదాతో దాదాపు సమానంగా విదేశీ బ్యాంకులూ కార్యకలాపాల నిర్వహణకు త్వరలో మార్గదర్శకాలు. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యం.. పెరుగుతున్న ధరల ఒత్తిడిని నియంత్రించడమే విధాన చర్యల వైఖరి, లక్ష్యం. వృద్ధి బలహీన పరిస్థితుల నేపథ్యంలో ఈ పాలసీ చర్యలు తీసుకుంటున్నాం. స్థూల ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ, వృద్ధి వాతావరణాన్ని పటిష్టం చేయడానికి ఈ చర్యలు దోహదపడతాయి. వృద్ధి అవకాశాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుంటూ, ద్రవ్యోల్బణం ఇబ్బందులను రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పరిస్థితులు మెరుగుపడవచ్చు. - రఘురామ్ రాజన్, ఆర్బీఐ గవర్నర్ -
ఆర్బీఐ పాలసీ రేట్ల తీరు ఇదీ..
ఆర్బీఐ అస్త్రాలు ఇవీ... బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) నియంత్రించడానికి ఆర్బీఐ అనుసరించే విధానాల్లో కీలకమైన నాలుగు అంశాలను పరిశీలిస్తే... రెపో రేటు: ఆర్బీఐ నుంచి తాము తీసుకున్న రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు. మనీ నిర్వహణలో భాగంగా నగదు అత్యవసరమైనప్పుడు బ్యాంకులు స్వల్పకాలికంగా రెపో విండో ద్వారా ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంటాయి. దీనికి చెల్లించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. రివర్స్ రెపో రేటు : పైన చెప్పుకున్న దానికి ఇది భిన్నం. బ్యాంకులు తన దగ్గర ఉంచే నిధులపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు ఇది. సాధారణంగా బ్యాంకులు వాటి దగ్గర అధిక నగదు ఉన్నప్పుడు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేస్తాయి. దానిపై ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. దీనినే రివర్స్ రెపో రేటు అంటారు. ఎంఎస్ఎఫ్: స్వల్పకాలిక రుణాల వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులను నివారించేందుకు ఆర్బీఐ 2011 మే 3 పాలసీ సమీక్ష సందర్భంగా ఈ ఎంఎస్ఎఫ్ను ప్రవేశపెట్టింది. సీఆర్ఆర్: బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తి. -
ఒక్క రోజులో మారిన కథ
-
ఆర్బీఐ, ఫెడ్ చర్యలే కీలకం..!
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లను అత్యంత ప్రభావితం చేయగల రెండు ప్రధాన ఈవెంట్లకు తెరలేవనుంది. కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ తొలిసారి చేపట్టనున్న మధ్యంతర పాలసీ సమీక్ష ఒకవైపు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెర్నాంకీ నిర్వహించనున్న ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సమావేశం మరోైవె పు దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 17-18న సమావేశాలను నిర్వహిస్తుండగా, రిజర్వ్ బ్యాంక్ 20న పరపతి విధానాన్ని ప్రకటించనుంది. సహాయక ప్యాకేజీలలో భాగంగా బాండ్ల కొనుగోలు ద్వారా నెలకు 85 బిలియన్ డాలర్లను ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థలోకి పంప్చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు బలపడుతుండటంతో బాండ్ల కొనుగోళ్లను తగ్గించే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. సహాయక ప్యాకేజీలలో కోత లేదా వీటిని నిలుపుదల చేస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా ప్రభావం అవుతాయని అత్యధిక శాతం నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది జరిగితే సమీపకాలంలో విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ద్వారా మార్కెట్లు బలహీనపడే అవకాశమున్నదని తెలిపారు. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి విలువ కూడా పతనమవుతుందని అంచనా వేశారు. కరెంట్ ఖాతా లోటు పెరగకుండా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఉపయోగపడుతుంటాయని తెలిపారు. ఎఫెక్ట్ తక్కువే....: ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీలలో కోత పెడుతుందన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లను ప్రభావితం చేశాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. ఫెడ్ తీసుకునే నిర్ణయాలు మార్కెట్ అంచనాలకు సరిపోలితే ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశాలు తక్కువేనని చెప్పారు. ఈ ఏడాది మే 22న ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ సహాయక ప్యాకేజీల నిలిపివేతపై మాట్లాడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమైన విషయం విదితమే. ఇక ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ గ తంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ఆర్థిక విశ్లేషకుడిగా పనిచేశారు. బాధ్యతలు చేపట్టడంతోనే ఆయన పాలసీ సమీక్ష తేదీని ఈ నెల 18 నుంచి 20కు మార్చారు. ఫెడ్ నిర్ణయాలు, మార్కెట్లపై వాటి ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునేందుకే సమావేశాన్ని రెండు రోజులు వెనక్కు జరపడం విశేషం! అందరీ కళ్లూ రాజన్పైనే తొలిసారి పరపతి విధానాలను ప్రకటించనున్న రాజన్పైనే అందరి కళ్లూ నిలుస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఓపక్క పెట్టుబడులు, మరోవైపు వినియోగం మందగించిన నేపథ్యంలో ఆర్బీఐ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, ఏప్రిల్ 30 నుంచి రూపాయి 18% పతనమైంది. రూపాయికి బలాన్ని చేకూర్చే బాటలో ఆర్బీఐగతంలో కఠిన లిక్విడిటీ చర్యలను చేపట్టింది. కాగా, సోమవారం టోకు ధరల ఆధారిత ద్ర వ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. రూపాయి, ద్రవ్యోల్బణం నేపథ్యంలో రేట్లలో కోత విధించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంచనా వేశారు. రూపాయి విలువ ఆగస్ట్ 28న 68.85ను తాకినప్పటికీ, గడిచిన శుక్రవారానికి కొంత కోలుకుని 63.48 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్ల వెనకడుగు వరుసగా మూడో వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గత వారం సెన్సెక్స్ 463 పాయింట్లు పుంజుకుని 19,733 వద్ద నిలిచింది. ఇందుకు రాజన్ చర్యలు కొంత దోహదపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 20,000 పాయింట్ల సమీపంలోకి వచ్చినప్పటికీ ఆర్బీఐ, ఫెడ్ సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ పొజిషన్లు తీసుకునేందుకు వెనకాడుతున్నారని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం కనిపిస్తున్న అప్‌ట్రెండ్ కొనసాగాలంటే రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల అంశాలు జతకలవాల్సి ఉంటుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. భారీ ఒడిదుడుకులు తప్పవని, మార్కెట్లలో ఇప్పటికే కొంత గందరగోళం నెలకొందని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ చైర్మన్ నాగ్జీ కె.రీటా వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న ఎఫ్ఐఐల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఈ నెల తొలి రెండు వారాల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ క్యాపిటల్ మార్కెట్లో దాదాపు రూ. 6,000 కోట్లను (92.2 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2-13 మధ్య ఈక్విటీలలో రూ. 6,372 కోట్లను (96.6 కోట్ల డాలర్లు) నికరంగా ఇన్వెస్ట్‌చేయగా, డెట్ సెక్యూరిటీల నుంచి మాత్రం రూ. 382 కోట్ల (38.4 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా రాజన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈక్విటీలలో ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు పెరగడం గమనార్హం. కాగా, ఆగస్ట్‌లో దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు నికరంగా రూ. 16,000 కోట్ల (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
ఏం చేసినా లాభం లేదు...: డీబీఎస్
ముంబై: ప్రభుత్వం తాజాగా చేపడుతున్న విధాన చర్యల వల్ల రూపాయి విలువ పుంజుకోవడం అసాధ్యమని, అయితే పతనం స్పీడ్‌కు కొంత అడ్డుకట్టపడొచ్చని సింగపూర్‌కు చెందిన ప్రముఖ బ్యాంక్ డీబీఎస్ పేర్కొంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బ్యాంక్ ఒక నోట్‌ను విడుదల చేసింది. ఇందులో రూపాయి 75కు కూడా పడిపోతుందని డీబీఎస్ పేర్కొనడం గమనార్హం. గడచిన కొద్దిరోజులుగా కొనసాగుతున్న పతనం మరింత తీవ్రతరం అవుతుందనికూడా చెప్పింది. కరెన్సీ విలువ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం చేసే ఏ ప్రయత్నమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిష్ఫలమేనని కూడా తేల్చిచెప్పింది.