ఆర్‌బీఐ, ఫెడ్ చర్యలే కీలకం..!
ఆర్‌బీఐ, ఫెడ్ చర్యలే కీలకం..!
Published Mon, Sep 16 2013 12:35 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లను అత్యంత ప్రభావితం చేయగల రెండు ప్రధాన ఈవెంట్లకు తెరలేవనుంది. కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ తొలిసారి చేపట్టనున్న మధ్యంతర పాలసీ సమీక్ష ఒకవైపు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెర్నాంకీ నిర్వహించనున్న ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సమావేశం మరోైవె పు దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 17-18న సమావేశాలను నిర్వహిస్తుండగా, రిజర్వ్ బ్యాంక్ 20న పరపతి విధానాన్ని ప్రకటించనుంది. సహాయక ప్యాకేజీలలో భాగంగా బాండ్ల కొనుగోలు ద్వారా నెలకు 85 బిలియన్ డాలర్లను ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థలోకి పంప్‌చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు బలపడుతుండటంతో బాండ్ల కొనుగోళ్లను తగ్గించే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. సహాయక ప్యాకేజీలలో కోత లేదా వీటిని నిలుపుదల చేస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా ప్రభావం అవుతాయని అత్యధిక శాతం నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది జరిగితే సమీపకాలంలో విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ద్వారా మార్కెట్లు బలహీనపడే అవకాశమున్నదని తెలిపారు. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి విలువ కూడా పతనమవుతుందని అంచనా వేశారు. కరెంట్ ఖాతా లోటు పెరగకుండా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఉపయోగపడుతుంటాయని తెలిపారు.
ఎఫెక్ట్ తక్కువే....: ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీలలో కోత పెడుతుందన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లను ప్రభావితం చేశాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. ఫెడ్ తీసుకునే నిర్ణయాలు మార్కెట్ అంచనాలకు సరిపోలితే ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశాలు తక్కువేనని చెప్పారు. ఈ ఏడాది మే 22న ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ సహాయక ప్యాకేజీల నిలిపివేతపై మాట్లాడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమైన విషయం విదితమే. ఇక ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ గ తంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ఆర్థిక విశ్లేషకుడిగా పనిచేశారు. బాధ్యతలు చేపట్టడంతోనే ఆయన పాలసీ సమీక్ష తేదీని ఈ నెల 18 నుంచి 20కు మార్చారు. ఫెడ్ నిర్ణయాలు, మార్కెట్లపై వాటి ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునేందుకే సమావేశాన్ని రెండు రోజులు వెనక్కు జరపడం విశేషం!
అందరీ కళ్లూ రాజన్‌పైనే
తొలిసారి పరపతి విధానాలను ప్రకటించనున్న రాజన్‌పైనే అందరి కళ్లూ నిలుస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఓపక్క పెట్టుబడులు, మరోవైపు వినియోగం మందగించిన నేపథ్యంలో ఆర్‌బీఐ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, ఏప్రిల్ 30 నుంచి రూపాయి 18% పతనమైంది. రూపాయికి బలాన్ని చేకూర్చే బాటలో ఆర్‌బీఐగతంలో కఠిన లిక్విడిటీ చర్యలను చేపట్టింది. కాగా, సోమవారం టోకు ధరల ఆధారిత ద్ర వ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. రూపాయి, ద్రవ్యోల్బణం నేపథ్యంలో రేట్లలో కోత విధించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంచనా వేశారు. రూపాయి విలువ ఆగస్ట్ 28న 68.85ను తాకినప్పటికీ, గడిచిన శుక్రవారానికి కొంత కోలుకుని 63.48 వద్ద నిలిచింది.
ఇన్వెస్టర్ల వెనకడుగు
వరుసగా మూడో వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గత వారం సెన్సెక్స్ 463 పాయింట్లు పుంజుకుని 19,733 వద్ద నిలిచింది. ఇందుకు రాజన్ చర్యలు కొంత దోహదపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 20,000 పాయింట్ల సమీపంలోకి వచ్చినప్పటికీ ఆర్‌బీఐ, ఫెడ్ సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ పొజిషన్లు తీసుకునేందుకు వెనకాడుతున్నారని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం కనిపిస్తున్న అప్‌ట్రెండ్ కొనసాగాలంటే రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల అంశాలు జతకలవాల్సి ఉంటుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. భారీ ఒడిదుడుకులు తప్పవని, మార్కెట్లలో ఇప్పటికే కొంత గందరగోళం నెలకొందని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ చైర్మన్ నాగ్‌జీ కె.రీటా వ్యాఖ్యానించారు.
కొనసాగుతున్న
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ నెల తొలి రెండు వారాల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీయ క్యాపిటల్ మార్కెట్లో దాదాపు రూ. 6,000 కోట్లను (92.2 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2-13 మధ్య ఈక్విటీలలో రూ. 6,372 కోట్లను (96.6 కోట్ల డాలర్లు) నికరంగా ఇన్వెస్ట్‌చేయగా, డెట్ సెక్యూరిటీల నుంచి మాత్రం రూ. 382 కోట్ల (38.4 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా రాజన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈక్విటీలలో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు పెరగడం గమనార్హం. కాగా, ఆగస్ట్‌లో దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 16,000 కోట్ల (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
Advertisement