ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ ప్రకటనకు ముందురోజు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడొచ్చనే ఆశలతో బుధవారం స్టాక్ సూచీలు ఆరునెలల గరిష్టంపై ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి బలోపేతం అంశాలు కలిసొచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సెన్సెక్స్ 403 పాయింట్లు దూసుకెళ్లి 63,196 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 18,739 వద్ద గరిష్టాలను నమోదు చేశాయి. చివర్లో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 63,143 వద్ద స్థిరపడింది. ఆరు నెలల తర్వాత ఈ సూచి తొలి సారి 63 వేల స్థాయికి చేరుకుంది. అలాగే ఇందులోని 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 18,726 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకిది 6 నెలల గరిష్టం కావడం విశేషం. ముఖ్యంగా మెటల్, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment