ప్రస్తుతానికి 0.25% తగ్గింపే!
ప్రస్తుతానికి 0.25% తగ్గింపే!
Published Wed, Dec 7 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
ముంబై: అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత 25 బేసిస్ పాయింట్ల వరకే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మాత్రం మరిన్ని రేట్ల తగ్గింపులుంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని మానిటరీ పాలసీ కమిటీ 0.25 శాతం మేర రెపో రేటును తగ్గిస్తుందని మెజారిటీ విశ్లేషకులు, బ్యాంకర్లు అంచనా వేస్తుండగా... కొద్ది మంది మాత్రం అర శాతం వరకూ తగ్గించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
అంతర్జాతీయ పరిణామాలు..
ద్రవ్యోల్బణం 4 శాతం పరిధిలోనే ఉన్నప్పటికీ ఆర్‌బీఐ చెప్పుకోతగ్గ స్థాయిలో రేట్లను తగ్గించకపోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది. రేట్ల కోత ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడానికి తోడ్పడుతుందని, డీమోనిటైజేషన్ కారణంగా పడే ప్రభావాన్ని తట్టుకునేందుకు ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫెడ్ రేట్ల పెంపు అంచనాలు, దాని కారణంగా బాండ్ల రాబడులపై పడే ప్రభావం, యూరోజోన్‌లో రాజకీయ అనిశ్చితి, చమురు ఉత్పత్తి తగ్గించాలన్న ఓపెక్ నిర్ణయం ఫలితంగా కరెన్సీపై పడే ప్రభావం ఆర్‌బీఐని రేట్ల కోత విషయంలో కట్టడి చేస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది.
ఆందోళనలన్నీ సమసిపోతే మానిటరీ పాలసీ కమిటీ ఫిబ్రవరి సమీక్షలో రేట్లను తగ్గించవచ్చని అంచనా వేసింది. బ్రోకరేజీ సంస్థ బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తదుపరి రేట్ల కోత కోసం ఆర్‌బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఆగవచ్చని అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ బుధవారం 0.25% మేర పాలసీ రేట్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5% దిగువన ఉన్నందున ఆర్‌బీఐ 0.25% వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్టు ఫిచ్ రేటింగ్‌స తెలిపింది.
బ్యాంకర్ల అభిప్రాయాలు..: ద్రవ్యోల్బణం తేలికపడినందున ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించవచ్చని కెనరా బ్యాంకు ఎండీ రాకేశ్ శర్మ అన్నారు. అక్టోబర్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టగా... పెద్ద నోట్ల రద్దుతో ఇది మరింత తేలిక పడనున్నందున 0.25 శాతం రెపో రేటు తగ్గింపు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు బంధన్ బ్యాంకు ఎండీ చంద్రశేఖర్ ఘోష్, తెలిపారు. ఫెడ్ రేట్ల పెంపుపై అనిశ్చితి ఉన్నందున 0.50 శాతం తగ్గింపు ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చన్నారు.
మానిటరీ పాలసీ కమిటీ భేటీ
ఆర్‌బీఐ వడ్డీ రేట్లను కనీసం 0.25 శాతమైనా తగ్గిస్తుందన్న భారీ అంచనాల నడుమ ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మంగళవారం సమావేశమైంది. ద్రవ్య, పరపతి విధానంపై చర్చించింది. ఈ కమిటీ బుధవారం తన నిర్ణయాలను ప్రకటించనుం ది. గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఇది రెండో సమీక్ష. పెద్ద నోట్లు రద్దయ్యాక భేటీ అవడం మాత్రం తొలిసారి. తొలి సమీక్షలో 0.25% కోతతో ఉర్జిత్ మురిపించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement