నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: వడ్డీ రేట్లను మార్పు చేయకుండా ఉంచాలని, ద్రవ్య మార్కెట్ లో లిక్విడిటీ పెంచేందుకు ఎస్ఎల్ఆర్ ను 0.53 శాతం తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంతో 25605 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 7651 వద్ద ముగిసింది.
ఎస్ఎల్ఆర్ తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని స్టాక్ మార్కెట్ బ్రోకర్లు తెలిపారు. ఎస్ఎల్ఆర్ ను అరశాతం తగ్గించడం వలన 40 వేల కోట్లు ద్రవ్యమార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ భావిస్తోంది.
అల్ట్రా టెక్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, గ్రాసీం కంపెనీలు రెండు శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, భెల్, ఐడీఎఫ్ సీ కంపెనీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.