టాపరింగ్ భయాల్లో మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ పడిపోయాయి. వచ్చే వారం రానున్న ఆర్‌బీఐ పాలసీపై ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రభావం చూపే అవకాశం ఉండడం వల్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోళ్లు ఆపేస్తుందన్న (టాపరింగ్) అంచనాలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, స్టాక్ మార్కెట్లు గరిష్టస్థాయిలకు చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కొనసాగుతుండడం, రూపాయి పతనం వంటి అంశాల కారణంగా గురువారం స్టాక్ మార్కెట్లు 246 పాయింట్లు నష్టపోయి 20,926 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాల్లో ఇదే అతి భారీ క్షీణత. వరుస మూడు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం సెన్సెక్స్ 400 పాయింట్లు పతనమయింది. 21 వేల పాయింట్లకు దిగువకు సెన్సెక్స్ క్షీణించింది. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 6,237 పాయింట్ల వద్ద ముగిసింది.
26 సెన్సెక్స్ షేర్లు పతనం: మొత్తం 12 బీఎస్‌ఈ రంగ సూచీల్లో ఒక్క విద్యుత్ రంగ సూచీ మాత్రమే పెరిగింది. మిగిలిన 11 రంగ సూచీలు పతనబాటలోనే కొనసాగాయి. వాహన, ఐటీ, మెటల్, మైనింగ్, బ్యాంక్ తదితర రంగ షేర్లన్నీ క్షీణించాయి. టాటా మోటార్స్‌తో సహా మొత్తం 26 సెన్సెక్స్ షేర్లు పడిపోయాయి. ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి 3-2 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. టాటా పవర్ 3.84 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.15 శాతం పెరిగాయి. బుధవారం రూ.1,749 కోట్లుగా ఉన్న మొత్తం టర్నోవర్ గురువారం రూ.1,835 కోట్లకు పెరిగింది. ఈ నెల 18 (బుధవారం)న ఆర్‌బీఐ మధ్యకాలిక త్రైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్నది. ఇక 17-18 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు జరుగుతాయి. ఈ రెండు అంశాలపై స్టాక్ మార్కెట్ల భవిష్యత్ గమనం ఆధారపడే అవకాశం ఉంది.
ఎస్‌బీఐ ఇష్యూ ధర రూ.1,783
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద ప్రభుత్వానికి జారీ చేసే షేరు ధరను రూ.1,782.74 నిర్ణయించారు. బ్యాంకు వ్యాపార విస్తరణ కోసం రూ.2,000 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం సమకూరుస్తుండగా, ఆ మేరకు ఎస్‌బీఐ ప్రభుత్వానికి 1.12 కోట్ల షేర్లను కేటాయిస్తోంది. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రూ.1,782.74 ప్రీమియం ధరకు కేటాయించడానికి బ్యాంకు సెంట్రల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. గతేడాది కేంద్రం రూ.3,004 కోట్లు సమకూర్చింది.