ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా, స్టాక్‌మార్కెట్లో సోమవారం కూడా లాభాలు కొనసాగాయి. వరుసగా ఆరో రోజూ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడినా, జీడీపీ గణాంకాలు నిరుత్సాహపరిచినా మార్కెట్ ముందుకే సాగింది. అయితే చివరకు ఆరంభ లాభాలు ఆవిరై, స్వల్ప లాభాలతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు లాభపడి 36,241 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 10,884 పాయింట్ల వద్ద ముగిశాయి.
కుదిరిన సంధి...!
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య సుంకాల విషయమై తాత్కాలికంగా సంధి కుదరడంతో ప్రపంచమార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగానూ లోహ షేర్లు మంచి లాభాలు సాధించాయి. వేదాంత, హిందాల్కో, తదితర లోహ షేర్లు 4 శాతం వరకూ ఎగిశాయి. అయితే రూపాయి క్షీణించడం స్టాక్ మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు ఎగియడంతో రూపాయి 73 పైసలు క్షీణించి 70.31 స్థాయికి (ఇంట్రాడేలో) పతనమైంది. బ్యారెల్ బ్రెంట్ చమురు 4 శాతం ఎగసి 61.72 డాలర్లకు పెరిగింది. ఈ క్యూ2లో 8.2 శాతంగా ఉన్న జీడీపీ ఈ క్యూ2లో 7.1 శాతానికి తగ్గింది. ఈ మూడు అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత ఒడిదుడుకులకు గురైంది. ఒక దశలో 252 పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 95 పాయింట్ల వరకూ నష్టపోయింది.మొత్తం మీద 347 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
స్టాక్ సూచీలు లాభ, నష్టాల మధ్య సయ్యాటలాడాయని జియోజిత్ ఫైనా న్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే ఒప్పందం కుదరడం సానుకూల ప్రభావం చూపించినా, ముడి చమురు ధరలు ఎగియడం, రూపాయి బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపించాయని వివరించారు. మరోవైపు ఈ వారంలో వెలువడే ఆర్‌బీఐ పాలసీలో ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గవచ్చని, రేట్ల కోతలో యథాతథ స్థితి కొనసాగవచ్చని, లిక్విడిటీ మెరుగుకు చర్యలు ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్‌లో నెలకొన్నాయి.
సన్‌ఫార్మా 7 శాతం డౌన్
గతంలో మూసేసిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసును సెబీ తిరిగి తెరిచే అవకాశాలున్నాయన్న వార్తలు సన్‌ఫర్మా షేర్‌ను పడగొట్టా యి. ఇంట్రాడేలో10% పతనంతో రూ.442కు క్షీణించిన సన్ ఫార్మా షేర్ చివరకు 7.5 శాతం నష్టంతో రూ.455 వద్ద ముగిసింది. నవంబర్ నెల వాహన విక్రయాలు అంచనాల మేరకు లేకపోవడంతో అశోక్ లేలాండ్ షేర్ 4.5 శాతం నష్టపోయి రూ.107 వద్ద ముగిసింది.
ఫ్లె్లయిర్ రైటింగ్ ఐపీఓకు సెబీ అనుమతి
నెక్కన్ పవర్ కంపెనీకి కూడా..
పెన్నుల తయారీ సంస్థ ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు అసోంకు చెందిన నెక్కన్ పవర్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. దీంతో ఈ ఏడాది సెబీ ఇచ్చిన ఐపీఓ ఆమోదాల సంఖ్య 75కు పెరిగింది. ఐపీఓలో భాగంగా ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ.330 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద మరో 120 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. ఇక నెక్కన్ పవర్ కంపెనీ ఐపీఓలో భాగంగా 1.27 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది.
Comments
Please login to add a commentAdd a comment