ముంబై: ప్రభుత్వం తాజాగా చేపడుతున్న విధాన చర్యల వల్ల రూపాయి విలువ పుంజుకోవడం అసాధ్యమని, అయితే పతనం స్పీడ్‌కు కొంత అడ్డుకట్టపడొచ్చని సింగపూర్‌కు చెందిన ప్రముఖ బ్యాంక్ డీబీఎస్ పేర్కొంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బ్యాంక్ ఒక నోట్‌ను విడుదల చేసింది. ఇందులో రూపాయి 75కు కూడా పడిపోతుందని డీబీఎస్ పేర్కొనడం గమనార్హం. గడచిన కొద్దిరోజులుగా కొనసాగుతున్న పతనం మరింత తీవ్రతరం అవుతుందనికూడా చెప్పింది. కరెన్సీ విలువ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం చేసే ఏ ప్రయత్నమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిష్ఫలమేనని కూడా తేల్చిచెప్పింది.