
ప్రపంచ ముడి చమురు ధరలు ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ 2025 ప్రారంభంలో బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది 2021 డిసెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. ముడి చమురు అవసరాల్లో 87 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు ఈ తగ్గుదల సైద్ధాంతికంగా ఇంధన ధరలను సైతం తగ్గించాలి. కానీ అందుకు భిన్నంగా తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచుతున్నట్లు ప్రకటించింది.
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ తగ్గుదల కనిపిస్తున్నా ఏప్రిల్ 7, 2025 నాటికి ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.77, డీజిల్ లీటరుకు రూ.87.67 వద్దే కొనసాగుతుంది. మార్చి నుంచి ఇదే ధరలు అమలవుతున్నాయి. 2024 నుంచి ముడి చమురు ధరలు 20 శాతానికి పైగా పడిపోయినప్పటికీ ఇంధన ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. పైగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున కేంద్రం సోమవారం పెంచుతున్నట్లు తెలిపింది. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
క్రూడ్ డిమాండ్ అంచనాలు సవరణ
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 2024 మధ్య నుంచి తగ్గుముఖం పట్టాయి. అమెరికా, చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక వృద్ధి మందగించడంపై నెలకొన్న ఆందోళనలు డిమాండ్ అంచనాలను దెబ్బతీశాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) ఇటీవల 2024, 2025 సంవత్సరాలకు చమురు డిమాండ్ వృద్ధి అంచనాను రోజుకు 2.11 మిలియన్ బ్యారెల్స్ నుంచి 2.03 మిలియన్లకు సవరించింది. ఇది బలహీనమైన ప్రపంచ వినియోగాన్ని ప్రతిబింబిస్తుంది. అదనంగా యునైటెడ్ స్టేట్స్ వంటి ఒపెక్ యేతర ఉత్పత్తిదారుల నుంచి బలమైన సరఫరా, చైనా వంటి మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడం క్రూడ్ ధరలు మరింత తగ్గేలా చేశాయి.
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం, సెప్టెంబర్ 2024 నాటికి దుబాయ్, ఒమన్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 71 డాలర్లకు పడిపోయింది. రాయిటర్స్ డేటా ప్రకారం, 2025 ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 76.58 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ప్రకారం జనవరి చివరి నాటికి బ్యారెల్ 72.62 డాలర్ల వద్ద స్థిరపడింది. 2024 సెప్టెంబరులో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతల తరువాత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు 2025 ప్రారంభం నుంచి 14.94% పడిపోయాయి.
భారీ పన్నుల వ్యవస్థ
భారతదేశంలో ఇంధన ధరలు క్రూడాయిల్ క్షీణతకు అనుగుణంగా ఉండకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ పన్నుల వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రిటైల్ ఇంధన ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) నిర్ణయించిన బేస్ ధర, ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), డీలర్ కమిషన్లపై ఇంధన ధరలు ఉంటాయి. ఇంధనం రిటైల్ ధరలో పన్నులే సుమారు 50-60% వాటాను కలిగి ఉంటాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ వినియోగదారులకు పెద్దగా ఫలితం లేకుండా పోతుంది.
ఇదీ చదవండి: ‘మైక్రోసాఫ్ట్‌లో డిజిటల్ ఆయుధాల తయారీ’
చమురు బాండ్లు
2005-2010 మధ్య కాలంలో ముడిచమురు ధరలు అధికంగా ఉన్న సమయంలో ఇంధన ధరలను కట్టడి చేసేందుకు ఓఎంసీలకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేసింది. అందుకు వెచ్చించిన సుమారు రూ.1.3 లక్షల కోట్లు 2025-26 నాటికి తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం అధిక ఇంధన పన్నులను కొనసాగిస్తోంది. క్రూడాయిల్ బ్యారెల్‌కు 62-64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ ఆర్థిక అవసరాలతో ఇంధన ధరలను స్థిరంగా ఉంచుతోంది.