ముడి చమురు ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉన్నా అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు మాత్రం 4 రెట్లు పెరిగాయి!
పశ్చిమాసియాలో అడపాదడపా ఉద్రిక్తతలు పెరిగి, వెంటనే చల్లబడుతున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇప్పటికీ గట్టిగానే నడిపిస్తున్న ముడి చమురు ధరలు ఈ కారణంగా గత రెండేళ్లుగా పెద్ద మార్పులకు గురికాకుండా నిలకడగా ఉన్నాయి. ఫలితంగా దేశంలో శిలాజ ఇంధన మార్కెట్లో మూడొంతులకు పైగా వాటా కలిగి ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్సీలు) లాభాలు మాత్రం 2023–2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయని వార్తలొస్తున్నాయి.
ఓఎమ్సీలకు లాభాలొస్తే వాటిలో అత్యధిక వాటాలున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు అందుతాయనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఇతర సరకులు, సేవల ధరలు పెరుగుతున్న ఇలాంటి సమయంలోనైనా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన ఈ ప్రభుత్వరంగ కంపెనీలకు రావడం లేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరలు బాగా పైకి ఎగబాగినప్పుడు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచేసే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ఓఎమ్సీలు దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు అవకాశం వచ్చినప్పుడైనా మేలు చేసే నిర్ణయాలు తీసుకోవచ్చు.
ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరలను శాసించే పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఒపెక్ దేశాలు జూన్ 1న సమావేశమై ఈ విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది. దేశం లోపల అత్యధిక మొత్తాల్లో చమురు నిక్షేపాలు ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వాటిని వెలికితీయకుండా పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలపై అమెరికా ఆధారపడేది. అయితే, ఇటీవల ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీసి వాడుకుంటోంది అమెరికా. దానికి తోడు కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఏకైక అగ్రరాజ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం, నిరుద్యోగం మామూలు స్థాయికి ఇంకా పడిపోకపోవడంతో ముడి చమురుకు డిమాండ్ రెండేళ్ల క్రితంలా లేదు.
దీనికి తోడు మరో ప్రపంచ ఆర్థికశక్తి చైనా వేగం తగ్గడం కూడా శిలాజ ఇంథనాల వాడకం తగ్గిపోవడానికి మరో పెద్ద కారణం. దాదాపు 45 నెలలుగా క్రూడాయిల్ టోకు ధరలు నిలకడగా ఉన్నా భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ఆ నిష్పత్తిలో ప్రయోజనం అందించకపోవడం సబబు కాదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వెల్లడవుతోంది.
- విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment