రూపాయి భారీ పతనం
ముంబై: దేశీ కరెన్సీ మళ్లీ భారీ కుదుపునకు గురైంది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 73 పైసలు క్షీణించి 62.66కు పడిపోయింది. ఇది రెండు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 11(77 పైసలు పతనం) తర్వాత రూపాయి ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పటిష్టమైన డిమాండ్ కారణంగా రూపాయిపై ఒత్తిడి నెలకొందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోవడం కూడా ప్రభావం చూపినట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ నీరసించినా కూడా రూపాయికి మద్దతు లభించలేదని ఫారెక్స్ డీలర్లు చెప్పారు.
చైనా జీడీపీ, పారిశ్రామిక గణాంకాలు నిరుత్సాహపరచడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల్లో కోత(ట్యాపరింగ్) అంశాలవల్ల రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్‌లో కొనుగోలులో 10 బిలియన్ డాలర్లను(ఈ నెల నుంచే) కోత పెడుతూ గత నెలలో ఫెడ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) పాలసీ సమీక్ష జరగనుంది. 28న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్వహించనుంది. ఈ రెండింటిలో తీసుకోబోయే నిర్ణయాలు రూపాయి కదలికలకు కీలకం కానున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.