rupee depreciation
-
రూపాయి మళ్లీ పతన బాట
రూపాయి మళ్లీ పతన బాట -
క్రూడ్ షాక్... రూపీ క్రాష్!!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 76 పైసలు బలహీనపడింది. 76.93 స్థాయికి రూపాయి పతనమైంది. రూపాయి ఈ కనిష్ట స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఒక దశలో రూపాయి 84పైసలు నష్టంతో 77.01 స్థాయిని సైతం చూసింది. కదలికలు ఇలా... దేశీయ కరెన్సీ ముగింపు శుక్రవారం 76.17. సోమవారం ట్రేడింగ్‌లో తీవ్ర బలహీన స్థాయిలో 76.85 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రతి దశలోనూ బలహీనంగానే కదలాడింది. కారణాలు ఇవీ... ► రష్యాపై ఉక్రెయిన్ దాడులు. నాటో దళాలు కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా యుద్ధంలోకి వస్తాయన్న వదంతులు. ► దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం. బంగారం, వెండి వంటి సురక్షిత సాధనల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల మొగ్గు. ► క్రూడాయిల్ ధరల పెరుగుదల. ఇది దేశంలో ఆయిల్ సంక్షోభానికి తద్వారా పెట్రో ధరల మంటకు వెరసి ద్రవ్యోల్బణం, వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య ఉన్న నికర వ్యత్యాసం) తీవ్రతకు, కరెంట్ అకౌంట్ (ఒక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యాన్ని ప్రతిబింబించే గణాంకాలు)భారీ లోటుకు దారితీస్తాయన్న ఆందోళనలు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి.. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రూపాయికిపైగా బలహీనతతో 76.91 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిప దికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 99 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. 79 దిశగా పయనం..! అంతర్జాతీయ క్రూడ్ ధరల తీవ్రత రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇన్వెస్ట్మెంట్ కన్సల్టి ంగ్ సంస్థ–మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సీఈఓ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. క్రూడ్ ధరలు మరింత పైకి ఎగసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది రూపాయిని సమీప కాలంలో 79 దిశగా బలహీనపరుస్తాయన్నది తమ అంచనా అని తెలిపారు. 2020 ఏప్రిల్ తర్వాత... రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కరోనా సవాళ్లు, ఆందోళనలు, లాక్డౌన్ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం వంటి అంశాలు దీనికి నేపథ్యం. 130 డాలర్లు దాటిన క్రూడాయిల్ ధర 2008 తరువాత గరిష్ట స్థాయి న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులుసహా పలు కీలక పరిణామాల నేపథ్యంలో సరఫరాలపై తలెత్తిన ఆందోళనలు సోమవారం క్రూడాయిల్ ధరలను 2008 గరిష్ట స్థాయిలకు చేర్చాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 2 శాతం పైగా లాభంతో 121.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 117.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ రెండు విభాగాల్లో ధరలు 130 డాలర్లు చూడ్డం గమనార్హం. 2008 తరువాత ఇంత తీవ్రస్థాయిలో క్రూడ్ ధరలు చూడ్డం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. ఐదు ప్రధాన కారణాలు..! ► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించే అవకాశాలను అమెరికా, యూరోపియన్ భాగస్వామ్య దేశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటన చేశారు. రోజుకు దాదాపు 7 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తి లేదా ప్రపంచ సరఫరాలో 7 శాతం (ఉత్పత్తిలో 10%) ఎగుమతులతో ఇందుకు సంబంధించి రష్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. అమెరికా మంత్రి తాజా ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలకు సవాళ్లు తప్పవన్న ఆందోళనలు నెలకొన్నాయి. ► ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా నౌకాశ్రయాల నుంచి కజికిస్తాన్‌కు చెందిన చమురు ఎగుమతులకు కూడా తీవ్ర విఘాతం కలుగుతోంది. ► దీనికి తోడు లిబియా చేసిన ఒక కీలక ప్రకటన చమురు ధర తీవ్రత కారణమైంది. ఒక సాయు« ద సమూహం రెండు కీలకమైన చమురు క్షేత్రాలను మూసివేసిందని లిబియా జాతీయ చమురు కంపెనీ ప్రకటించింది. ఈ చర్య వల్ల దేశం రోజువారీ చమురు ఉత్పత్తి 3,30,000 బ్యారళ్లకు పడిపోయిందని ప్రకటించింది. ► ఇరాన్‌పై 2015 ఆంక్షల ఎత్తివేత చర్చల్లోకి ‘ఆ దేశంతో రష్యా వాణిజ్య సంబంధాలను లాగొద్దని’ అమెరికాకు రష్యా డిమాండ్ చమురు ధర భారీ పెరుగుదలకు కారణమైంది. దీనితో ఈ చర్చలపై అనిశ్చితి నెలకొంది. -
రూపాయికి క్రూడ్ సెగ
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో వరుసగా రెండవ రోజు 18 పైసలు బలహీనపడి 74.52 వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో రూపాయి 50 పైసలు నష్టపోయింది. అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం భయాలు, సరళతర ద్రవ్య విధానానికి ముగింపు పడుతోందన్న సంకేతాలు, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలోపేత ధోరణి వంటి అంశాలు తాజాగా రూపాయి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 74.44 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 74.59 గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివరకు బుధవారం ముగింపుతో పోల్చితే 18 పైసలు బలహీనపడి (బుధవారం ముగింపు 74.34) 74.52 వద్ద ముగిసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అమెరికాలో 1990 తర్వాత ఎన్నడూ లేనంత పెరగడంతో, వడ్డీరేట్లు పెరుగుదల అంచనాలు అధికమయ్యాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా డాలర్ పెట్టుబడులు వెనక్కు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల బలహీనతకు దారితీస్తోంది. చైనాలో కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించి ద్రవ్య్లోల్బణం అంచనాకు మించి (12.03 శాతం) 26 ఏళ్ల గరిష్ట స్థాయి 13.05 %కి పెరగడం గమనార్హం. కాగా, డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 95పైన ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర 82 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ర్రూడ్ 83 డాలర్ల పైన ఉంది. -
రూపాయి పతనంతో నష్టాలే... నష్టాలు
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం– ఎగుమతిదారులకు ప్రయోజనకరమన్న వాదన ఉంది. దిగుమతులు తగ్గుతాయన్న విశ్లేషణలూ ఉన్నాయి. అయితే వాస్తవంలో ఇలా జరగాలేదని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధ్యయనం ఒకటి విశ్లేషించింది. వివరంగా చూస్తే... ఎగుమతుల కోణంలో...: ఎగుమతిదారులు తమ ఎగుమతుల విలువను డాలర్లలో సంపాదించుకుంటారు. ఈ డాలర్లను దేశంలో మార్చుకుంటే, ఎక్కువ రూపాయలు వారి చేతికి అందుతాయి. డాలర్ మారకంలో రూపాయి బలహీనత దీనికి కారణం. దేశీయంగా గిట్టుబాటు ధర ఉంటుంది కనక, అంతర్జాతీయంగా భారత్ ఎగుమతిదారులు కొంత తక్కువ ‘డాలర్ల’ౖMðనా కాంట్రాక్టులు కుదుర్చుకునే పరిస్థితి ఉంటుందని, దీనివల్ల ప్రపంచ విపణిలో భారత ఎగుమతిదారుకు పోటీతత్వం పెరుగుతుందని, ఆయా పరిస్థితులు దేశం నుంచి ఎగుమతులు మరింత పెరగటానికి దారి తీస్తాయనేది ఒక విశ్లేషణ. దిగుమతుల పరంగా..: ఇక ఏదన్నా ఉత్పత్తి మన దేశానికి దిగుమతి చేసుకుంటే, డాలర్లలో అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల దిగుమతులూ నెమ్మదించే అవకాశం ఉందన్నది అంచనా. పై రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఎస్బీఐ చేసిన అధ్యయనం... కీలక అంశాలను వెల్లడించింది. రూపాయి బలహీనత వల్ల అటు ఎగుమతులూ పెరగలేదని, ఇటు దిగుమతులూ మందగించలేదని ‘ఇకోరాప్’ పేరుతో విడుదలైన ఈ అధ్యయనంలో పేర్కొంది. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) వాణిజ్య లోటు (ఎగుమతులూ– దిగుమతుల మధ్య నికరవ్యత్యాసం) అదనంగా 4 బిలియన్ డాలర్లు పెరిగిందని వివరించింది. ‘‘దీనర్ధం ఎగుమతులు తగ్గాయని. దిగుమతులు పెరిగాయని’’ అని పేర్కొంది. సిద్ధాంతం ప్రకారం– ఒక దేశ కరెన్సీ బలహీనపడితే, ఆ దేశ ఎగుమతులు పెరిగే అవకాశం ఉండడం సహజమే. అయితే రూపాయికన్నా ఎక్కువగా ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడుతుండడం వల్ల తాజా పరిస్థితి (రూపాయి పతనం) నుంచి భారత్ ప్రయోజనం పొందలేకపోతోంది. పైగా ముడిచమురు సహా కొన్ని ఉత్పత్తులను భారత్ తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐదు నెలల తర్వాత మొదటిసారి సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా, –2.15 శాతం క్షీణత నమోదుకావడం మరో అంశం. నిన్న రికవరీ... నేడు నీరసం! న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం రూపాయి విలువ బలపడితే, గురువారం మళ్లీ కిందకు జారింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం 13 పైసలు బలహీనపడి, 73.61 వద్ద ముగిసింది. బలహీన దేశీయ ఈక్విటీ మార్కెట్లు, అమెరికన్ డాలర్ ఇండెక్స్ కీలక నిరోధ స్థాయి 95ను దాటడం వంటివి దీనికి నేపథ్యం. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది. అయితే సోమవారం (15వ తేదీ) ట్రేడింగ్‌లో మళ్లీ 26 పైసలు పడిపోయింది. మంగళవారం అంతకుమించి 35 పైసలు లాభపడ్డం గమనార్హం. -
హీరో మోటో వాహన ధరల పెంపు
సాక్షి, ముంబై : ప్రపంచ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఫెస్టివ్ సీజన్లో వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. సంస్థకు చెందిన అన్ని మోటార్ సైకిల్స్, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. దేశీయ కరెన్సీ విలువ క్షీణత, కమోడిటీ వస్తువల ధర పెరుగుదల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ పెంపు అక్టోబర్ 3వ తేదీని అమల్లోకి రానున్నట్టు తెలిపింది. 900 రూపాయల దాకా ఈ పెంపు ఉంటుందని, ఆయా మార్కెట్లు, మోడళ్ళ ఆధారంగా సవరించిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. -
బంగారం కాదు..ఎలక్ట్రానిక్ వస్తువులపై
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా-చైనా ట్రేడ్‌వార్, రోజు రోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ వస్తువుల దిగుమతులను అడ్డుకునేందుకు కొన్నివస్తువులపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచాలనే ప్రతిపాదను పరిశీలిస్తోంది. ముఖ్యంగా విలువైన మెటల్ బంగారంపై ఈ పెంపు ఉండవచ్చని ఎనలిస్టులు అంచనావేశారు. అయితే ఇపుడు దీనికి భిన్నంగా బంగారాన్ని దిగుమతి సుంకం పెంపు నించి మినహాయింపునిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బంగారంపై కుండా విలువైన రాళ్లను, కొన్ని రకాల ఉక్కు, ఎలక్ర్టానిక్ వస్తువులపై దిగుమతి సుంకం వేయాలని కేంద్ర నిర్ణయించింది. అక్రమ రవాణాను నివారించడానికి బంగారంను ఈ పెంపు నుంచి మినహాయించనున్నాని ఆర్థిక శాఖ అధికారి సోమవారం విలేకరులకు చెప్పారు. వీటితో పాటు విలువైన రాళ్ళపై కూడా ఈ పన్ను విధించే అవకాశముందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి ఒకరు తెలిపారు. జాబితా తయారవుతోందని, త్వరలోనే తుది రూపం ఇచ్చి విడుదల చేస్తామని ఈ వర్గాలు తెలిపాయి. డాలర్‌తో రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు అంటే నిత్యావసరం కాని విలువౌన వస్తువులపై దిగుమతి సుంకం వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇదే సమయంలో బంగారంపై కూడా సుంకం వేయాలని ప్రతిపాదనను పరిశీలించింది. మరోవైపు చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఈరోజు(సెప్టెంబరు 24, 2018) నుంచి అమెరికా సుంకం అమలువుతున్న సంగతి తెలిసిందే. -
పెట్రో షాక్ : ఆల్ టైం హైలో ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ముడిచమురు ధరల భారంతో గురవారం పెట్రో ధరలు ఆల్ టైం హైకి చేరాయి. దేశ వాణిజ్యరాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రికార్డు స్ధాయిలో రూ. 86.91కు ఎగబాకింది. డీజిల్ లీటర్‌కు రూ. 75.96కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 21 పైసలు పెరిగి రూ. 84.30కు చేరింది. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 79.51, రూ. 71.55కు పెరిగాయి. అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ అత్యంత కనిష్టస్ధాయిలో రూ. 71కు పడిపోయిన ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరలు భారమవుతున్నాయి. మరోవైపు రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రూపాయిని స్ధిరీకరించేందుకు ఆర్బీఐ జోక్యంపై జైట్లీ మాట్లాడుతూ రూపాయి బలోపేతానికి ఆర్బీఐ అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పుకొచ్చారు. -
‘షాపింగ్’కు రూపీ షాక్!
న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత సగటు వినియోగదారుడిపై భారాన్ని మోపుతోంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషిన్లు తదితర ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా... ధరలు తగ్గుతాయని ఆశపడిన వినియోగదారులకు రూపాయి రూపంలో నిరాశే ఎదురైంది. విలువను కోల్పోయిన రూపాయి ఈ ప్రయోజనం అందకుండా చేసింది. అంతేకాదు, రూపాయి బలహీనతతో కంపెనీలు ఉత్పత్తుల ధరలను 3–6 శాతం స్థాయిలో పెంచేందుకు సిద్ధపడడం గమనార్హం. శామ్సంగ్, ఎల్జీ కంపెనీలు రేట్లను పెంచుతూ, అవి ఈ వారం చివరి నుంచే అమల్లోకి వస్తాయని తమ విక్రయ చానళ్లకు సమాచారం ఇచ్చాయి. ధరల పెంపు ఏ మేర... ఎల్జీ, శామ్సంగ్ దేశీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తుల ధరల్ని 3–5.5 శాతం మేరకు పెంచుతూ ఈ వారం చివరి నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. ఇక ఇతర కంపెనీలు కూడా పెంపునకు సంబంధించి నూతన ధరలను ఖరారు చేసే పనిలో ఉన్నట్టు పరిశ్రమకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరు తెలిపారు. లెనోవో తన కంప్యూటర్ ఉత్పత్తుల ధరల్ని 3–4 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. అంటే రూ.700 నుంచి రూ.3,000 వరకు ఉత్పత్తులను బట్టి ధరల పెంపు ఉండనుంది. ప్యానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ స్పందిస్తూ... ‘‘పండుగల సీజన్ నేపథ్యంలో ధరల పెంపును సాధ్యమైనంత తక్కువకే పరిమితం చేయాలన్నది మా ప్రయత్నం. వినియోగదారుల సెంటిమెంట్‌ను సానుకూలంగా ఉంచడమే మా ఉద్దేశం’’ అని చెప్పారు. ప్యానాసోనిక్ 2–3 శాతం స్థాయిలో ధరల్ని పెంచాలని భావిస్తుండడం గమనార్హం. గోద్రేజ్ అప్లయన్సెస్ ఈ నెలాఖరున నిర్ణయం తీసుకోనుంది. రూపాయిని గమనిస్తున్నాం..: క్షీణిస్తున్న రూపాయి విలువపై ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ విజయ్‌బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ... ఈ పరిస్థితి తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికిప్పుడు అయితే ధరల పెంపు లేదని స్పష్టం చేశారు. శామ్సంగ్ ఇండియా మాత్రం స్పందించలేదు. ఇక ఆన్లైన్ విక్రయాలకే పరిమితమైన కొడాక్, థామ్సన్‌తోపాటు బీపీఎల్ సంస్థ 32 అంగుళాలు, అంతకంటే పెద్ద తెరల టీవీల ధరల్ని రూ.1,000–2,200 శ్రేణిలో పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కొంత మేర విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తున్నాయి. వీటిల్లో టెలివిజన్ ప్యానళ్లు, కంప్రెషర్లు, మ్యాగ్నెట్రాన్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి బెంచ్‌మార్క్ ధరను 66–67 స్థాయిలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ కంపెనీలు ధరల్ని అమలు చేస్తున్నాయి. కానీ, ఇటీవల డాలర్‌తో రూపాయి విలువ 70కి దిగజారడం తెలిసిందే. దీంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లు, మరికొన్ని ఉత్పత్తులపై ఇటీవలి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం తాజా ధరల పెంపుతో సగం మేర తరిగిపోనుంది. అమ్మకాలపై ప్రభావం... ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రముఖ రిటైల్ సంస్థ ‘గ్రేట్ ఈస్టర్న్ రిటైల్’ డైరెక్టర్ పులకిత్‌బెయిద్ జీఎస్టీ రేట్ల మార్పు అనంతరం డిమాండ్ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు. కానీ, తాజా రేట్ల పెంపు జీఎస్టీ రేట్ల తగ్గింపు సానుకూలతను నిరర్థకం చేయడంతోపాటు కొనుగోళ్లను ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘రూపాయి విలువ క్షీణతను పరిశ్రమ సర్దుబాటు చేసుకోలేదు. కనుక పర్సనల్ కంప్యూటర్ ధరలు పెరగడం తథ్యం. వ్యయాలను సర్దుబాటు చేసుకునే విధంగా కచ్చితమైన ధరల పెంపుపై దృష్టి సారించాం. రేట్ల పెంపు పీసీ డిమాండ్‌పై పెద్దగా ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదు’’ అని లెనోవో ఇండియా సీఈవో రాహుల్ అగర్వాల్ తెలిపారు. ఇక దిగుమతి చేసుకుని ఉత్పత్తులను విక్రయించే పర్సనల్‌కేర్, కాస్మాటిక్స్, ప్రీమియం వస్త్రాల తయారీ కంపెనీలు తాత్కాలికంగా రూపాయి క్షీణత ప్రభావాన్ని సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. ‘‘పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదు. మూడు శాతం పెంపు అన్నది ధరలపై ప్రభావం చూపదు’’ అని అరవింద్ బ్రాండ్స్ అండ్ లైఫ్‌స్టయిల్ సీఈవో జే సురేష్ తెలిపారు. ఈ సంస్థ గ్యాప్, యూఎస్ పోలో, సెఫోరా, చిల్డ్రన్స్ ప్లేస్ తదితర అంతర్జాతీయ బ్రాండ్ల వస్త్రాలను విక్రయిస్తోంది. అయితే, ఇవి ధరల పరంగా సున్నితమైన ఉత్పత్తులు కావన్న సురేష్, ఒకవేళ రూపాయి డాలర్‌తో 75 స్థాయికి పడిపోతే కొన్ని విభాగాల్లో ధరల పెంపు ఉంటుందని చెప్పారు. -
పెట్రోలు, డీజిల్ ధరల పెంపు నిలిపివేత!
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలపై బుధవారం జరగాల్సిన సమీక్షను ప్రభుత్వ సూచనల మేరకు చమురు కంపెనీలు వాయిదా వేసినట్టు తెలిసింది. ఏప్రిల్ 1, 15న నిర్వహించిన సమీక్షల్లో పెట్రోల్ ధరలను స్వల్పంగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని రోజులుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తున్న క్రమంలో లీటరు పెట్రోలుకు 40 నుంచి 50 పైసలు పెంచాలని పెట్రోలియం కంపెనీలు నిర్ణయించాయి. అదేవిధంగా డీజిల్ ధరను కూడా పెంచాలని కంపెనీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే, ఎన్నికలు జరుగుతున్నందున ధరలను పెంచితే వ్యతిరేకత వస్తుందని భావించిన సర్కారు పెంపును వాయిదా వేయానిలని కోరింది. -
రూపాయి భారీ పతనం
ముంబై: దేశీ కరెన్సీ మళ్లీ భారీ కుదుపునకు గురైంది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 73 పైసలు క్షీణించి 62.66కు పడిపోయింది. ఇది రెండు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 11(77 పైసలు పతనం) తర్వాత రూపాయి ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పటిష్టమైన డిమాండ్ కారణంగా రూపాయిపై ఒత్తిడి నెలకొందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోవడం కూడా ప్రభావం చూపినట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ నీరసించినా కూడా రూపాయికి మద్దతు లభించలేదని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. చైనా జీడీపీ, పారిశ్రామిక గణాంకాలు నిరుత్సాహపరచడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల్లో కోత(ట్యాపరింగ్) అంశాలవల్ల రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్లో కొనుగోలులో 10 బిలియన్ డాలర్లను(ఈ నెల నుంచే) కోత పెడుతూ గత నెలలో ఫెడ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) పాలసీ సమీక్ష జరగనుంది. 28న ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్వహించనుంది. ఈ రెండింటిలో తీసుకోబోయే నిర్ణయాలు రూపాయి కదలికలకు కీలకం కానున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. -
మారుతి ధరలకు రెక్కలు
గువహటి: మారుతి సుజుకి కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.3,000 నుంచి రూ.10,000 వరకూ పెంచుతోంది. ఈ పెరిగిన ధరలు వచ్చే నెల మొదటి వారం నుంచి అమల్లోకి వస్తాయని మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) సీఓఓ(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయంక్ పరీక్ చెప్పారు. రూపాయి పతనం కారణంగా ధరలు పెంచుతున్నామని పేర్కొన్నారు. ధరలు ఎప్పుడో పెంచాల్సిందని, కానీ భరించగలిగే స్థాయి వరకూ భరించగలిగామని, ఇక భరించలేని స్థాయికి చేరడంతో ధరలు పెంచక తప్పడం లేదని వివరించారు. మారుతి కంపెనీ రూ. 2.35 లక్షల నుంచి రూ.10.21 లక్షల రేంజ్లో ఉన్న వాహనాలను విక్రయిస్తోంది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ఈ ఏడాది జనవరిలోనే ఈ కంపెనీ ధరలను రూ.20,000 వరకూ పెంచింది. ఒక్క మారుతీ కంపెనీయే కాకుండా పలు వాహన కంపెనీలు కూడా రూపాయి పతనం కారణంగా ధరలను పెంచాయి. హ్యుందాయ్, టయోటా, జనరల్ మోటార్స్ తదితర కంపెనీలు ధరలను పెంచాయి. టాటా మోటార్స్ కంపెనీ కూడా ధరలను పెంచాలని యోచిస్తోంది. -
బంగారంపై మోజు తగ్గించుకోండి: ప్రధాని
రూపాయి పతనం ఆందోళనకర పరిణామమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఊహించని అంతర్జాతీయ పరిణామాలతోనే రూపాయి రికార్డు స్థాయికి పడిపోయిందని ఆయన తెలిపారు. లోక్‌సభలో దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ప్రకటన చేశారు. ప్రపంచ దేశాల కరెన్సీ బలహీనపడడానికి అమెరికా ఫెడరల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలే కారణమని మన్మోహన్ సింగ్ అన్నారు. బంగారంపై వ్యామోహం తగ్గించుకోవాలని, చమురు ఉత్పత్తులను పొదుపుగా వాడుకోవాలని దేశ ప్రజలను ప్రధాని కోరారు. పసిడి కొనుగోళ్లకు ఎగబడవద్దని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటును 70 బిలియన్ డాలర్లకు తగ్గిస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. రూపాయి పతనంతో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉందని తెలిపారు. రూపాయి విలువ తగ్గడం, ముడి చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమయిందని వివరించారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నాయని చెప్పారు.