‘షాపింగ్‌’కు రూపీ షాక్‌! | Prices of fridges, TVs and washing machines rise up | Sakshi
Sakshi News home page

‘షాపింగ్‌’కు రూపీ షాక్‌!

Published Sat, Aug 25 2018 12:50 AM | Last Updated on Sat, Aug 25 2018 9:29 AM

Prices of fridges, TVs and washing machines rise up - Sakshi

న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత సగటు వినియోగదారుడిపై భారాన్ని మోపుతోంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు తదితర ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోగా... ధరలు తగ్గుతాయని ఆశపడిన వినియోగదారులకు రూపాయి రూపంలో నిరాశే ఎదురైంది. విలువను కోల్పోయిన రూపాయి ఈ ప్రయోజనం అందకుండా చేసింది. అంతేకాదు, రూపాయి బలహీనతతో కంపెనీలు ఉత్పత్తుల ధరలను 3–6 శాతం స్థాయిలో పెంచేందుకు సిద్ధపడడం గమనార్హం. శామ్‌సంగ్, ఎల్‌జీ కంపెనీలు రేట్లను పెంచుతూ, అవి ఈ వారం చివరి నుంచే అమల్లోకి వస్తాయని తమ విక్రయ చానళ్లకు సమాచారం ఇచ్చాయి.

ధరల పెంపు ఏ మేర...  
ఎల్‌జీ, శామ్‌సంగ్‌ దేశీయ ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌లో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తుల ధరల్ని 3–5.5 శాతం మేరకు పెంచుతూ ఈ వారం చివరి నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. ఇక ఇతర కంపెనీలు కూడా పెంపునకు సంబంధించి నూతన ధరలను ఖరారు చేసే పనిలో ఉన్నట్టు పరిశ్రమకు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరు తెలిపారు. లెనోవో తన కంప్యూటర్‌ ఉత్పత్తుల ధరల్ని 3–4 శాతం మేర పెంచాలని నిర్ణయించింది.

అంటే రూ.700 నుంచి రూ.3,000 వరకు ఉత్పత్తులను బట్టి ధరల పెంపు ఉండనుంది. ప్యానాసోనిక్‌ ఇండియా సీఈవో మనీష్‌ శర్మ స్పందిస్తూ... ‘‘పండుగల సీజన్‌ నేపథ్యంలో ధరల పెంపును సాధ్యమైనంత తక్కువకే పరిమితం చేయాలన్నది మా ప్రయత్నం. వినియోగదారుల సెంటిమెంట్‌ను సానుకూలంగా ఉంచడమే మా ఉద్దేశం’’ అని చెప్పారు. ప్యానాసోనిక్‌ 2–3 శాతం స్థాయిలో ధరల్ని పెంచాలని భావిస్తుండడం గమనార్హం. గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ ఈ నెలాఖరున నిర్ణయం తీసుకోనుంది.

రూపాయిని గమనిస్తున్నాం..: క్షీణిస్తున్న రూపాయి విలువపై ఎల్‌జీ ఇండియా బిజినెస్‌ హెడ్‌ విజయ్‌బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ... ఈ పరిస్థితి తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికిప్పుడు అయితే ధరల పెంపు లేదని స్పష్టం చేశారు. శామ్‌సంగ్‌ ఇండియా మాత్రం స్పందించలేదు. ఇక ఆన్‌లైన్‌ విక్రయాలకే పరిమితమైన కొడాక్, థామ్సన్‌తోపాటు బీపీఎల్‌ సంస్థ 32 అంగుళాలు, అంతకంటే పెద్ద తెరల టీవీల ధరల్ని రూ.1,000–2,200 శ్రేణిలో పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి.

ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ కొంత మేర విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్‌ చేసి విక్రయిస్తున్నాయి. వీటిల్లో టెలివిజన్‌ ప్యానళ్లు, కంప్రెషర్లు, మ్యాగ్నెట్రాన్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి బెంచ్‌మార్క్‌ ధరను 66–67 స్థాయిలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ధరల్ని అమలు చేస్తున్నాయి. కానీ, ఇటీవల డాలర్‌తో రూపాయి విలువ 70కి దిగజారడం తెలిసిందే. దీంతో ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, వాక్యూమ్‌ క్లీనర్లు, మరికొన్ని ఉత్పత్తులపై ఇటీవలి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం తాజా ధరల పెంపుతో సగం మేర తరిగిపోనుంది.  


అమ్మకాలపై ప్రభావం...
ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ప్రముఖ రిటైల్‌ సంస్థ ‘గ్రేట్‌ ఈస్టర్న్‌ రిటైల్‌’ డైరెక్టర్‌ పులకిత్‌బెయిద్‌ జీఎస్టీ రేట్ల మార్పు అనంతరం డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు. కానీ, తాజా రేట్ల పెంపు జీఎస్టీ రేట్ల తగ్గింపు సానుకూలతను నిరర్థకం చేయడంతోపాటు కొనుగోళ్లను ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘రూపాయి విలువ క్షీణతను పరిశ్రమ సర్దుబాటు చేసుకోలేదు. కనుక పర్సనల్‌ కంప్యూటర్‌ ధరలు పెరగడం తథ్యం. వ్యయాలను సర్దుబాటు చేసుకునే విధంగా కచ్చితమైన ధరల పెంపుపై దృష్టి సారించాం. రేట్ల పెంపు పీసీ డిమాండ్‌పై పెద్దగా ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదు’’ అని లెనోవో ఇండియా సీఈవో రాహుల్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఇక దిగుమతి చేసుకుని ఉత్పత్తులను విక్రయించే పర్సనల్‌కేర్, కాస్మాటిక్స్, ప్రీమియం వస్త్రాల తయారీ కంపెనీలు తాత్కాలికంగా రూపాయి క్షీణత ప్రభావాన్ని సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. ‘‘పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదు. మూడు శాతం పెంపు అన్నది ధరలపై ప్రభావం చూపదు’’ అని అరవింద్‌ బ్రాండ్స్‌ అండ్‌ లైఫ్‌స్టయిల్‌ సీఈవో జే సురేష్‌ తెలిపారు. ఈ సంస్థ గ్యాప్, యూఎస్‌ పోలో, సెఫోరా, చిల్డ్రన్స్‌ ప్లేస్‌ తదితర అంతర్జాతీయ బ్రాండ్ల వస్త్రాలను విక్రయిస్తోంది. అయితే, ఇవి ధరల పరంగా సున్నితమైన ఉత్పత్తులు కావన్న సురేష్, ఒకవేళ రూపాయి డాలర్‌తో 75 స్థాయికి పడిపోతే కొన్ని విభాగాల్లో ధరల పెంపు ఉంటుందని చెప్పారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement