electronic products
-
‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు పెరుగుతుండడం వల్ల దేశీయ సంస్థల ఉత్పత్తి ప్రమాదంలో పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హెచ్చరించింది. దీనివల్ల స్థానిక కంపెనీల స్థిరత్వంపై ప్రభావం పడుతుందని నివేదికలో పేర్కొంది.సీఐఐ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. దిగుమతి ఆధారిత ఉత్పత్తులు పెరుగుతున్నాయి. విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఉత్పత్తులను తయారుచేసుకునేందుకు బదులుగా దేశీయంగా తయారవుతున్న పరికరాలను వినియోగించుకోవాలి. ఈ రంగంలో దేశీయ విలువ జోడింపు 15% వద్దే ఉంది. దీన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ పరిశ్రమ ఊపందుకునేందుకు ఏటా 6-8% చొప్పున వృద్ధి నమోదవ్వాలి. ఎంపిక చేసిన విడిభాగాలను స్థానిక కంపెనీలు వినియోగించేలా, అందుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందించేలా పథకాలను రూపొందించాలి. 25-40% సబ్సిడీతో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే మాడ్యూల్స్ తయారీకి అవసరమయ్యే కాంపోనెంట్స్ దిగుమతి సుంకాలను తగ్గించాలి. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.కోట్లు సంపాదించిన శ్రేయో ఘోషల్.. ఆమె భర్త ఏం చేస్తారో తెలుసా?‘చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు గత నాలుగేళ్లలో 15 బిలియన్ డాలర్ల (రూ.1.2లక్షల కోట్లు) మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. దాంతో పాటు 1,00,000 కొలువులపై ప్రభావం పడింది. కొన్ని చైనా కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు పెంచుతున్నాయి. అయితే ఆయా ఉత్పత్తుల్లో ఇతర దేశాల్లో తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను వినియోగిస్తున్నారు. దానివల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చైనాతో వాణిజ్య సంబంధాలను సమీక్షించాలి. యురోపియన్ యూనియన్, ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలి’ అని సీఐఐ తెలిపింది. -
ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి ఊతం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీని దేశీయంగా పెంచేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలను (పీఎల్ఐ) ప్రకటించిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు ఎల్రక్టానిక్ విడిభాగాల స్థానిక తయారీని సైతం ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త పథకాలపై కసరత్తు చేస్తున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ ఎస్.కృష్ణన్ వెల్లడించారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో 99% స్థానికంగానే తయారవుతున్నట్టు చెప్పారు. ‘‘అసెంబ్లీ యూనిట్లకు అదనంగా 10–15 శాతం విలువ జోడింపుపైనే ఆధారపడకూడదు. మనం ఇంకా ఏమి చేయగలమో, విలువ ఆధారిత సరఫరాలో మరింత ముందుకు ఎలా వెళ్లగలమో ఆలోచించాలి’’అని సూచించారు. ఏ దేశం కూడా మొత్తం వ్యాల్యూచైన్‌లో ఆధిపత్యం చూపించలేదన్నారు. చైనా విషయానికొస్తే వ్యాల్యూచైన్‌లో 40–45% వాటా కలిగి ఉన్నట్టు చెప్పారు. భారత్ 35–40% సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఎల్రక్టానిక్ ఉత్పత్తుల విడిభాగాలకు సంబంధించి రెండో విడత పీఎల్ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. -
పాత ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్లు (పునరి్వనియోగ), ఎల్రక్టానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రానున్న పండుగల సీజన్లో గతేడాదితో పోలిస్తే ఈ విభాగం నుంచి ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో కొత్త ఫోన్ల విభాగంలో 7 శాతం వృద్ధిని పునరి్వనియోగ ఫోన్ల మార్కెట్ అధిగమించనుంది. క్యాషిఫై, రీఫిట్ గ్లోబల్ ఈ రెండూ రీఫర్బిష్డ్ ఫోన్లు, రీఫర్బిష్డ్ ఎల్రక్టానిక్ ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ సంస్థలు కాగా, వచ్చే పండుగల సందర్భంగా అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే అంచనాలతో ఉన్నాయి. ముఖ్యంగా ఖరీదైన రీఫర్బిష్డ్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ‘‘మా ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2021–22 రికార్డు ఆదాయన్ని డిసెంబర్ నాటికే అధిగమించనున్నాం’’అని రీఫిట్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు సాకేత్ సౌరవ్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలతో రిఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి ఈ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. యాపిల్, వన్‌ప్లస్ బ్రాండ్ల రీఫర్బిష్డ్ ఫోన్లకు పెద్ద పట్టణాల్లో మంచి ఆదరణ ఉన్నట్టు సౌరవ్ తెలిపారు. గత 8–10 నెలల్లో యాపిల్, వన్‌ప్లస్ నుంచి సరఫరాలు పెరిగినట్టు చెప్పారు. గతంలో ఈ రెండు బ్రాండ్లు మొత్తం అమ్మకాల్లో 3–3.5 శాతం వాటా కలిగి ఉండేవని, ఇప్పుడు 9–10 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. బలమైన అంచనాలు.. దేశంలో రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి కంపెనీ క్యాషిఫై దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో రెండింత విక్రయాలను అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఓమ్నిచానల్ నమూనాను క్యాషిఫై అనుసరిస్తోంది. 2,000కు పైగా రిటైల్ స్టోర్లలోను ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు నకుల్ కుమార్ తెలిపారు. రీఫర్బిష్డ్ స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల విభాగాలనూ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. యాపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్ ఉత్పత్తులను రూ.18,000–22,000 శ్రేణిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రానున్న పండుగల సమయంలో రీఫర్బిష్డ్ విభాగం వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 18 శాతం వృద్ధి నమోదు కా>వచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. ఐఫోన్ 12, ఐఫోన్ 11, గెలాక్సీ ఎస్21ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్21, రెడ్మీ నోట్ 10 తదితర ఉత్పత్తులు ఈ వృద్ధిని నడిపిస్తాయన్నారు. దేశీయంగా సరఫరా తక్కువగా ఉండడం రీఫర్బిష్డ్ విభాగంలో ఐఫోన్లకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. -
రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై అత్యుత్తమ డీల్స్‌తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 7.5 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.1000 విలువైన డిస్కౌంట్ కూపన్స్ ఇస్తుంది. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) టీవీలు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ వాచీలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఈ ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకూ డిజిటల్ డిస్కౌంట్ డేస్ కొనసాగుతాయని, రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ ఆఫర్లు.. భలే ఉందిగా!
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన క్రోమా దీపావళి పండగ సందర్భంగా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 20% వరకూ క్యాష్‌బ్యాక్, రెండేళ్ల కాలపరిమితితో అతి సులభమైన ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. పలు బ్యాంక్ కార్డులపై పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా క్రోమా స్టోర్లతో పాటు కంపెనీ వెబ్సైట్లో ఈ ఆఫర్లు అక్టోబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
బాబోయ్, నకిలీ బ్రాండెడ్ ఉత్పత్తులు.. ఆందోళనలో పెద్ద కంపెనీలు
పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌కు దేశంలో బలమైన డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు బ్రాండెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. బ్రాండెడ్ ఉత్పత్తులతో సమాంతరంగా నకిలీలు, దొంగిలించిన, చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకున్న ప్రొడక్ట్స్‌తో ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్కెట్ వృద్ధి చెందడం ఇందుకు కారణం. నకిలీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, చైనా నుండి తక్కువ ధరలకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు వెల్లువెత్తుతుండడం కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిసారిస్తూనే మరోవైపు నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆహోరాత్రులూ శ్రమించాల్సిన పరిస్థితి బ్రాండెడ్ కంపెనీలది. 2019 సెప్టెంబర్‌లో ఫిక్కీ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌తోసహా అయిదు రంగాల్లో నకిలీ ఉత్పత్తులు, అక్రమ రవాణా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏటా రూ.1.17 లక్షల కోట్లు నష్టపోతోంది. పట్టుపడుతూనే ఉన్నాయి.. ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో ఇయర్‌ఫోన్స్, చార్జర్స్, అడాప్టర్స్, యూఎస్బీ కేబుల్స్ వంటి రూ.73.8 లక్షల విలువైన 9 వేల పైచిలుకు నకిలీ ఉత్పత్తులను సీజ్ చేసినట్టు షావొమీ ప్రకటించింది. 2020లో కంపెనీ రూ.33.3 లక్షల విలువైన సుమారు 3 వేల ఉత్పత్తులను సీజ్ చేసింది. దీనినిబట్టి చూస్తే నకిలీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఈ నకిలీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయని షావొమీ అంటోంది. కోవిడ్ రాకతో ఈ ఉత్పత్తులను ఏకంగా ఆన్లైన్ వేదిక ద్వారా విక్రయిస్తున్నారని వెల్లడించింది. జేబీఎల్, ఇన్ఫినిటీ బ్రాండ్ నకిలీ ఉత్పత్తులను ఢిల్లీలో ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్టు శామ్సంగ్ అనుబంధ కంపెనీ హర్మాన్ తెలిపింది. కాగా, ఐడీసీ గణాంకాల ప్రకారం భారత మార్కెట్లో 2022 జనవరి–జూన్ కాలంలో 3.8 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. నియంత్రణ లేక.. చిన్న గ్యాడ్జెట్స్‌లో నకిలీలను సులువుగా తయారు చేయవచ్చని, వీటిని చైనా నుంచి సులభంగా తీసుకు రావొచ్చని టెక్ఆర్క్ ఫౌండర్ ఫైజల్ కవూసా తెలిపారు. ‘ఆఫ్‌లైన్ మార్కెట్లు ప్రధాన విక్రయ కేంద్రంగా ఉన్నప్పటికీ.. ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లో కఠినమైన తనిఖీలు లేకపోవడం వల్ల నకిలీ ఉత్పత్తుల చెలామణి పెరిగింది. ఆన్లైన్లో ఎవరైనా ఉత్పత్తులను నమోదు (లిస్ట్) చేసి విక్రయించవచ్చు. ఇది నకిలీలను విక్రయించడాన్ని సులభతరం చేసింది’ అని వివరించారు. ఐఎంఈఐ నంబర్‌తో స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయడానికి, గుర్తింపునకు ఆస్కారం ఉంది. యాక్సెసరీస్‌కు ఇటువంటి సౌకర్యం లేదు. యాపిల్‌ఎయిర్‌పాడ్స్‌ను ఫోన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు
సాక్షి, ముంబై: ప్రముఖ సంస్థ నోకియా వ్యాపార విస్తరణలో దూకుడును ప్రదర్శిస్తోంది. భారతదేశంలో, నోకియా స్మార్ట్ టీవీలు, ఏసీలు ల్యాప్‌టాప్‌ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో భాగస్వామ్యాన్ని ఇటీవల ప్రకటించిన నోకియా తాజాగా మరికొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. త్వరలో రిఫ్రిజరేటర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు లాంటి వంటి ఉపకరణాలను మార్కెట్లో ప్రారంభించనుంది. ఈ మేరకు నోకియా బ్రాండ్ పార్ట్నర్షిప్స్ హెడ్ విపుల్ మెహ్రోత్రా ధృవీకరించారు. మైక్రోసాఫ్ట్ నుండి బయటపడిన తరువాత, నోకియా మరింత విస్తరిస్తోంది. తన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు లైసెన్సులతో రీబ్రాండ్ అవుతూ పూర్వ వైభవాన్ని దక్కించుకునేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలోనే నోకియా స్మార్ట్ఫోన్లు మొదలు, నోకియా టెలివిజన్లు, నోకియా స్ట్రీమింగ్ పరికరాలు, నోకియా ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిజ్‌లను, డిష్ వాషర్ల వరకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో నోకియా భాగస్వామ్యంపై మెహ్రోత్రా మాట్లాడుతూ, దేశంలో, ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి నోకియా బ్రాండెడ్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీని గత సంవత్సరం విడుదల చేసిందనీ, ఆ తర్వాత ఆరు నెలల క్రితం మీడియా స్ట్రీమర్లు, గత రెండు నెలల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలను ఆవిష్కరించినట్టు తెలిపారు. అంతేకాదు ఇటీవలి పండుగ సీజన్ అమ్మకాలలో, నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐదు టీవీలలో ఒకటని వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆలస్యం జరిగినప్పటికీ ఇంకా వాక్యూమ్ క్లీనర్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, స్మార్ట్ లైట్లు, స్మార్ట్ ప్లగ్స్ వంటి స్మార్ట్ ఉపకరణాలను కూడా తీసుకొస్తామన్నారు. -
కొత్త కస్టమర్లకు ఆచితూచి రుణాలు
సాక్షి, హైదరాబాద్ : స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రుణ సంస్థలు పోటీపడుతుంటాయి. ఇందుకోసం వడ్డీ లేని రుణాలను జీరో డౌన్‌పేమెంట్‌తో ఆఫర్ చేయడం చూశాం. కోవిడ్–19 పుణ్యమాని ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇబ్బడిముబ్బడిగా రుణాలను అందించిన ఈ సంస్థలు పాత బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టిసారించాయి. దీంతో నూతన వినియోగదార్లకు రుణం దొరకడం కష్టంగా మారింది. వీరి విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కస్టమర్ ట్రాక్ రికార్డు ఆధారంగానే తాజాగా రుణాలను జారీ చేస్తున్నాయి. కీలకంగా సిబిల్ స్కోరు.. వినియోగదారులకు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు సిబిల్ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. సిబిల్ స్కోరు కనీసం 750 ఉంటే లోన్ మంజూరు చేసేవి. నూతన మార్పుల ప్రకారం లోన్ కోసం వచ్చే కొత్త కస్టమర్‌కు ఇప్పుడీ స్కోరు కనీసం 775 ఉండాల్సిందే. లేదంటే సింపుల్‌గా నో అని చెప్పేస్తున్నాయి. పాత కస్టమర్ల విషయంలో సిబిల్ స్కోరు కనీసం 750 ఉంటేచాలని ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గతంలో వారు తీసుకున్న రుణాల తాలూకు చెల్లింపులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్లలో 35 శాతంగా ఉన్న ఈఎంఐల వాటా ఇప్పుడు 10 శాతానికి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కస్టమర్లకు సౌకర్యంగా.. బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం 18 నెలల వరకు రుణాన్ని చెల్లించే సౌకర్యాన్ని ఆఫర్ చేస్తున్నాయి. గతంలో ఇది 6–10 నెలల వరకే ఉండేదని ఓ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించా రు. ‘కోవిడ్–19 తర్వాత వినియోగదార్ల కొనుగోలు శక్తి తగ్గింది. ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. అందుకే వారి సౌలభ్యం కోసం వాయిదాల సంఖ్యను పెంచాం’ అని ఆయన అన్నారు. అయితే గతంలో జీరో డౌన్‌పేమెంట్ ఉండేది. ఇప్పుడు కనీసం 30–35 శాతం ముందుగా చెల్లించాల్సిందే. బ్రాండ్, రుణ సంస్థనుబట్టి కస్టమర్ల నుంచి స్వల్ప వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. కొన్ని రుణ సంస్థలు ప్రాసెసింగ్ ఫీజు చార్జీ చేస్తున్నాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. -
టీవీ చూస్తూ 65 వేలు సంపాదించొచ్చు!
లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇటీవల లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో మరో కొత్త పని కోసం వెతుకున్నారు. ప్రస్తుతం కొన్ని కోట్ల మంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించే ఓ ఉద్యోగం కావాలా? దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు టెలివిజన్ చూడటం ఇష్టం అయితే చాలు. కేవలం టీవీ చూడటమే ఒక ఉద్యోగం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా అలాగే ఒక టెక్ సంస్థ టెలివిజన్ చూడటాన్ని ఆనందించే వారి కోసం వెతుకుతోంది. ఇందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మీకు కేవలం మంచి రచనా శైలితోపాటు ఇంగ్లీష్‌లో నైపుణ్యం ఉంటే చాలు. వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఎక్కువ ఫీజులు, ఆన్లైన్ చదువులు.. నో జాబ్స్!) ఉద్యోగం ఏంటి.. ఈ ఉద్యోగాన్ని టెక్ టెస్టర్ అని పిలుస్తారు. దీనిలో టీవీలు, కెమెరాలు, స్మార్ట్ పరికరాలు, హెడ్ఫోన్లు, హెమ్ సిస్టమ్స్ వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై అభిప్రాయం అందించాలి. ఆన్బై అందిస్తున్న ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే.. ప్రతి నెల ప్రొడక్ట్ పేజీని అభివృద్ధి పరచడానికి కొన్ని ఉత్పత్తులను అందజేస్తారు. వాటి డిజైన్‌ను, పని తీరును, మన్నికను, సౌండ్, డబ్బుకు తగిన విలువను కలిగి ఉన్నాయో లేదో పరీక్షించాలి. అనంతరం దానికి సంబంధించిన 200 పదాల సమీక్ష రాయాల్సి ఉంటుంది.(పరీక్షల తేదీలు ఖరారు చేసిన ఏపీపీఎస్సీ) జీతం ఎంత గంటకు 3,281 రూపాయల చొప్పున పొందవచ్చు. వారానికి కనీసం 20 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి వారం మీరు 65,600 వేల రూపాయలు సంపాదించవచ్చు. (1.25 కోట్ల ఉద్యోగాలు.. యోగి సర్కారు భేష్!) కస్టమర్లకు ఖచ్చితమైన సమాచారం, మంచి అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ జాబ్‌ను అందిస్తున్నామని ఆన్బై వ్యవస్థాపకుడు ని కాస్ పాటన్ కోట్ తెలిపారు. ఇందుకు సాంకేతిక నిపుణుల నుండి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా వినియోగదారులకు తమ వస్తువులకు సంబంధించి లోతైన సమాచారాన్ని అందించగలమని పేర్కొన్నారు. తమ మొదటి టెక్ టెస్టర్ అందుకు సహకరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. పనిచేసే వ్యక్తికి ఎలక్ట్రానిక్ వస్తువులపై అవగాహన ఉండాలని, ప్రతిరోజు ఓ ఔత్సాహికుడిగా పనిచేయాలని తెలిపారు. వినియోగదారులు ఎలాంటి వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారో తెలిసి ఉండాలన్నారు. -
పేటీఎం ఫెస్టివల్ సెలబ్రేషన్స్ : ఆఫర్ల వెల్లువ
బెంగళూరు : పేటీఎం మాల్లో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి(సెప్టెంబర్ 20) మూడు రోజుల పాటు ఫెస్టివల్ సీజన్ సేల్‌ను నిర్వహించబోతుంది పేటీఎం మాల్. ఈ సేల్‌లో తన సైట్లో ఆఫర్ చేసే స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు సుజుకి జిక్సర్ బైక్‌ను గెలుపొందే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. ఈ సేల్‌లో ఆఫర్లో ఉన్న స్మార్ట్ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్, శాంసంగ్ గెలాక్సీ జే8, మోటో జీ6, రెడ్మి నోట్ 5 ప్రొ, హానర్ 9 లైట్, హానర్ ప్లేలు. పలు స్మార్ట్ఫోన్లపై పేటీఎం 50 శాతం డిస్కౌంట్‌తో మురిపిస్తుంది. గెలాక్సీ నోట్ 9 128జీబీ వేరియంట్‌ను రూ.67,900కే కొనుగోలు చేయొచ్చు. నోట్9 అనే కోడ్‌ను వాడి ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదేవిధంగా హానర్ 9 లైట్‌ను 23 శాతం డిస్కౌంట్, 2000 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ.13,945కే విక్రయిస్తుంది పేటీఎం మాల్. మోటో జీ6పై 12 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్లో రూ.15,814కే అందుబాటులోకి వస్తుంది. ఎంఓబీ1500 ప్రోటో కోడ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ఫెస్టివ్ సేల్ నిర్వహించే రోజుల్లో ఆఫర్లు మారే అవకాశం కనిపిస్తుంది. కేవలం స్మార్ట్ఫోన్లపైనే కాకుండా.. కెమెరాలు, హెడ్ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా 70 శాతం తగ్గింపు లభిస్తుంది. డెల్ ఇన్సిరాన్ 3000 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్ 12 శాతం తగ్గింపు అందిస్తుంది పేటీఎం మాల్. దీనిపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. పేటీఎం ఫెస్టివ్ సీజన్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతోంది. -
‘షాపింగ్’కు రూపీ షాక్!
న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత సగటు వినియోగదారుడిపై భారాన్ని మోపుతోంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషిన్లు తదితర ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా... ధరలు తగ్గుతాయని ఆశపడిన వినియోగదారులకు రూపాయి రూపంలో నిరాశే ఎదురైంది. విలువను కోల్పోయిన రూపాయి ఈ ప్రయోజనం అందకుండా చేసింది. అంతేకాదు, రూపాయి బలహీనతతో కంపెనీలు ఉత్పత్తుల ధరలను 3–6 శాతం స్థాయిలో పెంచేందుకు సిద్ధపడడం గమనార్హం. శామ్సంగ్, ఎల్జీ కంపెనీలు రేట్లను పెంచుతూ, అవి ఈ వారం చివరి నుంచే అమల్లోకి వస్తాయని తమ విక్రయ చానళ్లకు సమాచారం ఇచ్చాయి. ధరల పెంపు ఏ మేర... ఎల్జీ, శామ్సంగ్ దేశీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తుల ధరల్ని 3–5.5 శాతం మేరకు పెంచుతూ ఈ వారం చివరి నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. ఇక ఇతర కంపెనీలు కూడా పెంపునకు సంబంధించి నూతన ధరలను ఖరారు చేసే పనిలో ఉన్నట్టు పరిశ్రమకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరు తెలిపారు. లెనోవో తన కంప్యూటర్ ఉత్పత్తుల ధరల్ని 3–4 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. అంటే రూ.700 నుంచి రూ.3,000 వరకు ఉత్పత్తులను బట్టి ధరల పెంపు ఉండనుంది. ప్యానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ స్పందిస్తూ... ‘‘పండుగల సీజన్ నేపథ్యంలో ధరల పెంపును సాధ్యమైనంత తక్కువకే పరిమితం చేయాలన్నది మా ప్రయత్నం. వినియోగదారుల సెంటిమెంట్‌ను సానుకూలంగా ఉంచడమే మా ఉద్దేశం’’ అని చెప్పారు. ప్యానాసోనిక్ 2–3 శాతం స్థాయిలో ధరల్ని పెంచాలని భావిస్తుండడం గమనార్హం. గోద్రేజ్ అప్లయన్సెస్ ఈ నెలాఖరున నిర్ణయం తీసుకోనుంది. రూపాయిని గమనిస్తున్నాం..: క్షీణిస్తున్న రూపాయి విలువపై ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ విజయ్‌బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ... ఈ పరిస్థితి తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికిప్పుడు అయితే ధరల పెంపు లేదని స్పష్టం చేశారు. శామ్సంగ్ ఇండియా మాత్రం స్పందించలేదు. ఇక ఆన్లైన్ విక్రయాలకే పరిమితమైన కొడాక్, థామ్సన్‌తోపాటు బీపీఎల్ సంస్థ 32 అంగుళాలు, అంతకంటే పెద్ద తెరల టీవీల ధరల్ని రూ.1,000–2,200 శ్రేణిలో పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కొంత మేర విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తున్నాయి. వీటిల్లో టెలివిజన్ ప్యానళ్లు, కంప్రెషర్లు, మ్యాగ్నెట్రాన్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి బెంచ్‌మార్క్ ధరను 66–67 స్థాయిలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ కంపెనీలు ధరల్ని అమలు చేస్తున్నాయి. కానీ, ఇటీవల డాలర్‌తో రూపాయి విలువ 70కి దిగజారడం తెలిసిందే. దీంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లు, మరికొన్ని ఉత్పత్తులపై ఇటీవలి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం తాజా ధరల పెంపుతో సగం మేర తరిగిపోనుంది. అమ్మకాలపై ప్రభావం... ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రముఖ రిటైల్ సంస్థ ‘గ్రేట్ ఈస్టర్న్ రిటైల్’ డైరెక్టర్ పులకిత్‌బెయిద్ జీఎస్టీ రేట్ల మార్పు అనంతరం డిమాండ్ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు. కానీ, తాజా రేట్ల పెంపు జీఎస్టీ రేట్ల తగ్గింపు సానుకూలతను నిరర్థకం చేయడంతోపాటు కొనుగోళ్లను ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘రూపాయి విలువ క్షీణతను పరిశ్రమ సర్దుబాటు చేసుకోలేదు. కనుక పర్సనల్ కంప్యూటర్ ధరలు పెరగడం తథ్యం. వ్యయాలను సర్దుబాటు చేసుకునే విధంగా కచ్చితమైన ధరల పెంపుపై దృష్టి సారించాం. రేట్ల పెంపు పీసీ డిమాండ్‌పై పెద్దగా ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదు’’ అని లెనోవో ఇండియా సీఈవో రాహుల్ అగర్వాల్ తెలిపారు. ఇక దిగుమతి చేసుకుని ఉత్పత్తులను విక్రయించే పర్సనల్‌కేర్, కాస్మాటిక్స్, ప్రీమియం వస్త్రాల తయారీ కంపెనీలు తాత్కాలికంగా రూపాయి క్షీణత ప్రభావాన్ని సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. ‘‘పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదు. మూడు శాతం పెంపు అన్నది ధరలపై ప్రభావం చూపదు’’ అని అరవింద్ బ్రాండ్స్ అండ్ లైఫ్‌స్టయిల్ సీఈవో జే సురేష్ తెలిపారు. ఈ సంస్థ గ్యాప్, యూఎస్ పోలో, సెఫోరా, చిల్డ్రన్స్ ప్లేస్ తదితర అంతర్జాతీయ బ్రాండ్ల వస్త్రాలను విక్రయిస్తోంది. అయితే, ఇవి ధరల పరంగా సున్నితమైన ఉత్పత్తులు కావన్న సురేష్, ఒకవేళ రూపాయి డాలర్‌తో 75 స్థాయికి పడిపోతే కొన్ని విభాగాల్లో ధరల పెంపు ఉంటుందని చెప్పారు. -
కంపెనీలకు ‘పండుగ’!
► 40 శాతం అధిక విక్రయాలపై ఆశలు ► ఉచిత తాయిలాలతో వినియోగదారులకు గాలం ► వినియోగ వస్తువుల తయారీ కంపెనీల ప్రణాళికలు న్యూఢిల్లీ: దసరా పండుగ దగ్గర పడుతోంది. ఆ తర్వాత దీపావళి. తర్వాత ఇంకో నెల గడిస్తే క్రిస్మస్, ఆ వెంటే కొత్త సంవత్సరం, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలే. ఈసారి విక్రయాల ‘పండుగ’ మరింత భారీగా జరుపుకునేందుకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు పూర్తిగా సిద్ధమయ్యాయి. గతేడాది కంటే విక్రయాలు 40 శాతం అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి. పండుగల సందడిలో భాగంగా వీలైనంత ఆదాయం రాబట్టుకునేందుకు గాను కస్టమర్లకు ఉచిత తాయిలాలు ఇచ్చేందుకూ సిద్ధమయ్యాయి.జీఎస్టీకి ముందు పన్ను పరమైన అనిశ్చితితో విక్రయదారులు, కంపెనీలు భారీ ఆఫర్లతో ఉన్న స్టాక్‌ను తగ్గించుకోవడంతో ఆ తర్వాత డిమాండ్ తగ్గింది. అయితే, పండుగల సందర్భంగా డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని సోనీ, ఎల్జీ, పానాసోనిక్, హయర్ తదితర కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం, మార్కెటింగ్‌పై భారీగా వ్యయం చేయనున్నాయి. ఒక్క సోనీయే రూ.250 కోట్లను ఇందుకు కేటాయించగా, పానాసోనిక్ ఈ సీజన్లో 1.4 రెట్లు అధికంగా బ్రాండింగ్, మార్కెటింగ్‌పై వెచ్చించాలని నిర్ణయించింది. 30–40 శాతం అధిక విక్రయాలు నమోదు చేయాలన్న తలంపుతో ఉంది. ఇక హయర్ గత ఏడాది ఈ సీజన్‌తో పోల్చుకుంటే ఈ విడత 70 శాతం అధికంగా ఖర్చు చేయనుంది. 50 శాతం అధిక విక్రయాలు నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉంది. సంప్రదాయ రిటైల్ దుకాణాలతోపాటు ఆన్లైన్ విక్రయాలపైనా దృష్టి పెట్టింది. 25 శాతం వృద్ధిపై దృష్టి ‘‘ఈ సారి పండుగల కాలంలో ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు గతేడాది కంటే 25% విక్రయాల వృద్ధిపై ప్రణాళికలు వేసుకున్నాం’’ అని సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి తెలిపారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, పండుగల సీజన్ కావడంతో ఇది ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మార్కెటింగ్ కార్యకలాపాలపై రూ.250 కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు. పండుగల సీజన్లో అన్ని విభాగాల్లో మంచి విక్రయాలు నమో దవుతాయని ఆశిస్తున్నామని, ఇందుకు తాము సిద్ధమయ్యామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఎంవో అమిత్ గోయెల్ తెలిపారు. తమ మొత్తం విక్రయాల్లో ఆన్లైన్ (ఈ కామర్స్) వాటా 10% ఉందని, పండుగల సమయంలో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. ఇక, ఈ సీజన్లో సానుకూల విక్రయాలకు ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ తయారీ దారుల సంఘం (సీమ) పేర్కొంది. జీఎస్టీ, వర్షాల కారణంగా పెరిగిన సాగు గ్రామీణంగా డిమాండ్ పెంచేవని సీమ ప్రెసిడెంట్ మనీష్ శర్మ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్స్‌లు పెంపు, ఆర్బీఐ రేట్ల కోతతో వినియోగదారుల్లో విశ్వాసం పెరిగి, కన్జూమర్ డ్యూరబుల్స్ విక్రయాలు అధికంగా నమోదవుతాయని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
హైదరాబాద్‌లో గ్రాబ్ఆన్రెంట్ సేవలు
• అద్దెకు ఫర్నీచర్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు • ఏడాదిలో మరో 4 నగరాలకు విస్తరణ: సీఈఓ శుభం జైన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ రెంటల్ సర్వీసెస్ సంస్థ గ్రాబ్ఆన్రెంట్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఫర్నీచర్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు వంటి 9 విభాగాల్లో ఉత్పత్తులను అద్దెకిచ్చేందుకు సిద్ధమైంది. నగరంలో 400 మంది వెండర్లతో భాగస్వామ్యమయ్యామని గ్రాబ్ఆన్రెంట్ సీఈఓ శుభం జైన్ సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఏడాది కాలంలో పుణె, ఎన్సీఆర్, ముంబై, చెన్నై నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ మీద దృష్టిపెట్టామని.. సిరీస్–ఏలో భాగంగా రూ.30 కోట్ల సమీకరణ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని పేర్కొన్నారు. పాత ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నామని మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తామన్నారు. గతంలో ఐవీకాప్, యునికార్న్ ఇండియా వెంచర్స్ నుంచి ఫండింగ్‌ను పొందామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన గ్రాబ్ఆన్రెంట్.. ఇప్పటివరకు 8,500 మంది కస్టమర్లకు సేవలందించింది. ప్రతి నెలా 35 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. -
ఈ-చెత్తతో ఆరోగ్యానికి తూట్లు!
కాంపిటీటివ్ గెడైన్స్ జనరల్ సైన్స్ 20వ శతాబ్దంలో మానవుడు సాధించిన అభివృద్ధిలో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆవిష్కృతమయ్యాయి. తర్వాత కాలంలో ప్రపంచీకరణ ఫలితంగా సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనిషి జీవితం నుంచి వీటిని విడదీయలేనంతగా కలిసి పోయాయి. ఇదే సమయంలో అపరిమితంగా వాడి పారేస్తున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అందువల్లే ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) సమస్య ముందు వరుసలో ఉంది. వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) అంటారు. పాడైన టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్చార్జర్లు, బ్యాటరీలు, మదర్‌బోర్డులు, ఏసీలు, వాషింగ్మెషిన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ), ఐపాడ్, ఫ్యాక్స్ యంత్రాలు మొదలైన వాటిని ఈ-వ్యర్థాలుగా పేర్కొంటారు. వీటి విడుదల రోజురోజుకూ అధికమవుతూ..పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ఈ-వ్యర్థాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి, భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు - వ్యాధులు ఈ-వ్యర్థాలకు సంబంధించి మదర్‌బోర్డు, చిప్, సర్క్యూట్లను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. వీటి తయారీలో ప్రమాదకరమైన సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్ మొదలైన వాటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి తయారు చేసిన వస్తువులను పారేస్తే వాటి భాగాల్లో ఉండే రసాయనాలు మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెట్టడం ద్వారా వచ్చే విష వాయువులు వాతావరణానికి హాని కలిగిస్తాయి. సీసాన్ని రీచార్జబుల్ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో అధికంగా వాడతారు. సీసంతో కలుషితమైన నీటిని తాగితే నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమాంద్యం వస్తుంది. కంప్యూటర్ మానిటర్, సర్క్యూట్ బోర్డులు, కంప్యూటర్ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాలం కాడ్మియం ప్రభావానికి గురైతే ఐ్ట్చజీఐ్ట్చజీ అనే వ్యాధి కలుగుతుంది. మూత్రపిండాలు, ఎముకలను బలహీనపరచడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. దీంతోపాటు ఈ వ్యాధి వస్తే వెన్నెముక, కీళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని (మెర్క్యూరీ) స్విచ్‌లు, పాకెట్ క్యాలిక్యులేటర్, ఎల్సీడీల తయారీలో వాడతారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలుగజేస్తుంది. సెమికండక్టర్లు, డయోడ్లు, లెడ్‌ల తయారీలో వాడే ఆర్సినిక్ వల్ల క్యాన్సర్, గుండెజబ్బు కలుగుతాయి. అమెరికా నుంచే అధికంగా.. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సరాసరి 93.5 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం అమెరికా అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడుదల చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా చైనా, జపాన్, జర్మనీ దేశాలున్నాయి. భారతదేశం సంవత్సరానికి 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వెలువరిస్త్తూ ఐదో స్థానంలో ఉంది. 2020 నాటికి భారత్‌లో 52 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు విడుదలవుతాయని అసోచామ్ అంచనా. పెరుగుతున్న జనాభా, ప్రపంచదేశాలకు భారతదేశం ప్రధాన మార్కెట్‌గా ఉండటంతో ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను ముందుగా ఇక్కడ విడుదల చేస్తున్నాయి. భారత్‌లో యువత ఎక్కువ సంఖ్యలో ఉండటం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం వంటివి కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముంబై నగరం 1,20,000 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానం (98,000 మెట్రిక్ టన్నులు), బెంగుళూరు మూడో స్థానం, చెన్నై నాలుగో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. దేశంలో విడుదలతున్న ఈ-వ్యర్థాల్లో 70 శాతం కంప్యూటర్ విడిభాగాలు ఉండగా.. 12 శాతం టెలికాం పరికరాలు, 8 శాతం ఎలక్ట్రానిక్ రంగం నుంచి వచ్చిన వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునఃశుద్ధి (రీ సైక్లింగ్ ఆఫ్ ఈ-వేస్ట్) భారతదేశంలో విడుదలయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కేవలం 1.5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు అసోచామ్ సర్వే తెలిపింది. రీసైక్లింగ్ ప్రక్రియలో ఈ-వ్యర్థాలను సుత్తెలతో కొట్టి పిండి చేయడం, ముక్కలుగా నరకడం చేస్తారు. ఈ ప్రక్రియలో వాటి నుంచి బయటపడిన రసాయన పదార్థాలు మట్టిలో చేరతాయి. వర్షం వచ్చినప్పుడు అవి నీటిలో కలిసి, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. బాసెల్ ఒడంబడిక ప్రపంచదేశాల మధ్య హానికర వ్యర్థ పదార్థాల రవాణాను నిషేధిస్తూ బాసెల్ ఒడంబడిక జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి హానికర వ్యర్థ పదార్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు రవాణా చేయడాన్ని బాసెల్ ఒడంబడిక నిషేధిస్తుంది. అయితే ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు తమ దేశాల్లో విడుదలైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆఫ్రికాలోని ఘనా, నైజీరియా, ఆసియాలోని భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నాయి. ఈ విధంగా భారత్‌లోకి ఏడాదికి 50,000 టన్నుల ఈ-వ్యర్థాలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. భారతదేశ ఎగుమతి-దిగుమతి చట్టాల ప్రకారం 10 సంవత్సరాలు వాడిన సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని ఆయా దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను భారత్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ధనిక దేశాలు ఈ-వ్యర్థాలను పేద దేశాలకు తరలిస్తున్నాయి. హానికర ఈ-వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆఫ్రికా ఖండంలోని 12 దేశాలు కలిసి బమాకో కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది 1999 నుంచి ఆఫ్రికా ఖండంలో అమల్లోకి వచ్చింది. తర్వాత కాలంలో హానికర రసాయన వ్యర్థ పదార్థాల రవాణాను మరింత కఠినతరం చేస్తూ 1998లో 140 దేశాలు రోటర్డ్యామ్ కన్వెన్షన్‌ను ఆమోదించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 2004, ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశం 2005, మే 24న దీన్ని ఆమోదించింది. హానికర రసాయన వ్యర్థ పదార్థాల వల్ల జరుగుతున్న హానిని గ్రహించిన భారత ప్రభుత్వం ఇటీవల హానికర వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళిని (మార్చి, 2016) తీసుకొచ్చింది. మాదిరి ప్రశ్నలు 1. Itai-Itai అనే వ్యాధి దేని ప్రభావం వల్ల కలుగుతుంది? 1) సీసం 2) ఆర్సెనిక్ 3) కాడ్మియం 4) పాదరసం జవాబు: 3 2. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? 1) అమెరికా 2) చైనా 3) జపాన్ 4) జర్మనీ జవాబు: 1 3. భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది? 1) ఢిల్లీ 2) కోల్‌కతా 3) చెన్నై 4) ముంబై జవాబు: 4 - ప్రవీణ్ దత్తు లెక్చరర్ ఇన్ జువాలజీ,ఎల్.హెచ్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం -
దేశీ ఎలక్ట్రానిక్స్‌కే ప్రాధాన్యమివ్వండి...
ప్రధాని కార్యాలయం సూచన న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని శాఖలు, విభాగాలు దేశీయంగా తయారైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కార్యాలయం (పీఎంవో) సూచించింది. ఇందుకు అనుగుణంగా తాము కొనుగోలుచేయదల్చుకున్న ఉత్పత్తుల జాబితాను పక్షం రోజుల్లోగా నోటిఫై చేయాలని కార్యదర్శుల కమిటీ నిర్ణయించినట్లు పేర్కొంది. దీని కోసం ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) జారీ చేసిన టెండర్ నమూనాను ఉపయోగించాలని సూచించింది. అలాగే ఆయా శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయదల్చుకున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వివరాలను సమీక్షించేందుకు ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను రూపొందించాలని డైటీకి తెలిపింది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా సుమారు 16-17 శాతంగా ఉంది. దీన్ని 2022 నాటికి 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ రంగాలు అనుసరించతగిన వ్యూహాల గురించి ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ దిగ్గజాలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి వివరించనున్నారు. రోజు పొడవునా సాగే వర్క్‌షాప్‌కు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. అలాగే చమురు..గ్యాస్, ఆటోమొబైల్, ఏవియేషన్ రంగ సంస్థల దిగ్గజాలు, ప్రభుత్వ రంగ సంస్థల చీఫ్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుంచి ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు.