ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు పెరుగుతుండడం వల్ల దేశీయ సంస్థల ఉత్పత్తి ప్రమాదంలో పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హెచ్చరించింది. దీనివల్ల స్థానిక కంపెనీల స్థిరత్వంపై ప్రభావం పడుతుందని నివేదికలో పేర్కొంది.
సీఐఐ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. దిగుమతి ఆధారిత ఉత్పత్తులు పెరుగుతున్నాయి. విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఉత్పత్తులను తయారుచేసుకునేందుకు బదులుగా దేశీయంగా తయారవుతున్న పరికరాలను వినియోగించుకోవాలి. ఈ రంగంలో దేశీయ విలువ జోడింపు 15% వద్దే ఉంది. దీన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ పరిశ్రమ ఊపందుకునేందుకు ఏటా 6-8% చొప్పున వృద్ధి నమోదవ్వాలి. ఎంపిక చేసిన విడిభాగాలను స్థానిక కంపెనీలు వినియోగించేలా, అందుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందించేలా పథకాలను రూపొందించాలి. 25-40% సబ్సిడీతో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే మాడ్యూల్స్ తయారీకి అవసరమయ్యే కాంపోనెంట్స్ దిగుమతి సుంకాలను తగ్గించాలి. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.
ఇదీ చదవండి: రూ.కోట్లు సంపాదించిన శ్రేయో ఘోషల్.. ఆమె భర్త ఏం చేస్తారో తెలుసా?
‘చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు గత నాలుగేళ్లలో 15 బిలియన్ డాలర్ల (రూ.1.2లక్షల కోట్లు) మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. దాంతో పాటు 1,00,000 కొలువులపై ప్రభావం పడింది. కొన్ని చైనా కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు పెంచుతున్నాయి. అయితే ఆయా ఉత్పత్తుల్లో ఇతర దేశాల్లో తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను వినియోగిస్తున్నారు. దానివల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చైనాతో వాణిజ్య సంబంధాలను సమీక్షించాలి. యురోపియన్ యూనియన్, ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలి’ అని సీఐఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment