కంపెనీలకు ‘పండుగ’!
► 40 శాతం అధిక విక్రయాలపై ఆశలు
► ఉచిత తాయిలాలతో వినియోగదారులకు గాలం
► వినియోగ వస్తువుల తయారీ కంపెనీల ప్రణాళికలు
న్యూఢిల్లీ: దసరా పండుగ దగ్గర పడుతోంది. ఆ తర్వాత దీపావళి. తర్వాత ఇంకో నెల గడిస్తే క్రిస్‌మస్, ఆ వెంటే కొత్త సంవత్సరం, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలే. ఈసారి విక్రయాల ‘పండుగ’ మరింత భారీగా జరుపుకునేందుకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు పూర్తిగా సిద్ధమయ్యాయి. గతేడాది కంటే విక్రయాలు 40 శాతం అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి. పండుగల సందడిలో భాగంగా వీలైనంత ఆదాయం రాబట్టుకునేందుకు గాను కస్టమర్లకు ఉచిత తాయిలాలు ఇచ్చేందుకూ సిద్ధమయ్యాయి.జీఎస్టీకి ముందు పన్ను పరమైన అనిశ్చితితో విక్రయదారులు, కంపెనీలు భారీ ఆఫర్లతో ఉన్న స్టాక్‌ను తగ్గించుకోవడంతో ఆ తర్వాత డిమాండ్ తగ్గింది.
అయితే, పండుగల సందర్భంగా డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని సోనీ, ఎల్జీ, పానాసోనిక్, హయర్ తదితర కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం, మార్కెటింగ్‌పై భారీగా వ్యయం చేయనున్నాయి. ఒక్క సోనీయే రూ.250 కోట్లను ఇందుకు కేటాయించగా, పానాసోనిక్ ఈ సీజన్‌లో 1.4 రెట్లు అధికంగా బ్రాండింగ్, మార్కెటింగ్‌పై వెచ్చించాలని నిర్ణయించింది. 30–40 శాతం అధిక విక్రయాలు నమోదు చేయాలన్న తలంపుతో ఉంది. ఇక హయర్ గత ఏడాది ఈ సీజన్‌తో పోల్చుకుంటే ఈ విడత 70 శాతం అధికంగా ఖర్చు చేయనుంది. 50 శాతం అధిక విక్రయాలు నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉంది. సంప్రదాయ రిటైల్ దుకాణాలతోపాటు ఆన్‌లైన్ విక్రయాలపైనా దృష్టి పెట్టింది.
25 శాతం వృద్ధిపై దృష్టి
‘‘ఈ సారి పండుగల కాలంలో ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు గతేడాది కంటే 25% విక్రయాల వృద్ధిపై ప్రణాళికలు వేసుకున్నాం’’ అని సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి తెలిపారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, పండుగల సీజన్ కావడంతో ఇది ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మార్కెటింగ్ కార్యకలాపాలపై రూ.250 కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు. పండుగల సీజన్‌లో అన్ని విభాగాల్లో మంచి విక్రయాలు నమో దవుతాయని ఆశిస్తున్నామని, ఇందుకు తాము సిద్ధమయ్యామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఎంవో అమిత్ గోయెల్ తెలిపారు.
తమ మొత్తం విక్రయాల్లో ఆన్‌లైన్ (ఈ కామర్స్) వాటా 10% ఉందని, పండుగల సమయంలో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. ఇక, ఈ సీజన్‌లో సానుకూల విక్రయాలకు ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ తయారీ దారుల సంఘం (సీమ) పేర్కొంది. జీఎస్టీ, వర్షాల కారణంగా పెరిగిన సాగు గ్రామీణంగా డిమాండ్ పెంచేవని సీమ ప్రెసిడెంట్ మనీష్ శర్మ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్స్‌లు పెంపు, ఆర్‌బీఐ రేట్ల కోతతో వినియోగదారుల్లో విశ్వాసం పెరిగి, కన్జూమర్ డ్యూరబుల్స్ విక్రయాలు అధికంగా నమోదవుతాయని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.