తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వులనడుమ పుప్పొడిని, పసుపుముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్నన్ని రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి.
ఆరాధనలో పూలకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తెలంగాణలోనైతే, ఆ పూలనే పూజించడం ఒక విలక్షణ సంస్కృతిగా కనిపిస్తోంది. ప్రకృతిలో భాగమైన పూలు స్త్రీల ముత్తయిదు తనానికి ప్రతీక కావడం గొప్ప విశేషం. స్త్రీల ప్రాతినిధ్యమే ప్రధానమైనప్పటికీ సమాజంలో సమిష్టితత్వానికి దోహదపడే పండుగ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వమానవాళికి భిన్నత్వంలోని అందాన్ని అందించి ఐక్యంగా ఉండాలనే అవసరాన్ని చాటి చెప్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే సమాజానికి మేలు కూర్చే విషయాలెన్నో బతుకమ్మ కూర్పులో, ఆటలో, పాటలో ఆత్మీయత పంచుకోవడంలో కనబడతాయి.
తెలంగాణలో బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకునే వేడుకగా ప్రసిద్ధి పొందింది. మొదటి రోజు భాద్రపద బహుళ అమావాస్యనాడు పారంభమవుతుంది. ఈ అమావాస్యను పితృ అమావాస్య అంటారు. ఆనాడు చేసే బతుకమ్మ పేర్పును ఎంగిలిపువ్వుల బతుకమ్మగా పిలుస్తారు. ఆనాడు గౌరమ్మకు సాధారణంగా తెలంగాణ ప్రజలు తినే ఆహారాన్ని, పిండివంటలను నైవేద్యంగా సమర్పించుకొంటారు. తొలిపూజ బతుకమ్మకు కాబట్టి పల్లె ప్రజలు ఎంగిలిపూల బతుకమ్మని అంటారు, స్త్రీలు భుజించిన తర్వాత చేసుకొంటారు కాబట్టి ఎంగిలి బతుకమ్మనే పేరొచ్చింది. బతుకమ్మను పూజించిన తర్వాత పుణ్య స్త్రీలు తమ మాంగల్యాలకు తాకించుకుంటారు. ఆ పూజనే మంగళగౌరి అని మాంగల్య గౌరి అని భావిస్తారు.
బతుకమ్మ కథనాలు ఎట్లా ఉన్నా ముత్తయిదుతనమనేదే అంతర్లీనంగా కనిపిస్తోంది. సాంప్రదాయంగా పçసుపు గౌరమ్మను చేస్తుంటారు. తంగేడు పూలు పసుపుతనానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ గౌరమ్మను చేయడంలో గొప్ప ఆచారం కనబడుతుంది. అర్ధనారీశ్వరునికి సంకేతంగా బతుకమ్మను నిలుపుకొంటారు. శివపార్వతులు ప్రకృతి– పురుషులు. నిజంగా గౌరమ్మ అనగానే పూలతో ఒక గోపురంలా పేర్చడం ఒకటే కాదు, ఆ గోపురం నడుమ ఒక నొక్కు (గుమ్మడి) ని పెట్టి ఒక పసుపు ముద్దను రెండు గోపురాలుగా రూపొందేటట్లు పూలను పేరుస్తారు. అంటే గౌరమ్మే అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట. ఇందులో ప్రత్యేకంగా గౌరీ ఆరాధన కనిపిస్తుంది.
కొందరు గౌరమ్మను తమలపాకుల్లో పెడతారు, మరికొందరు చిక్కుడు ఆకుల్లో పెట్టి పూజ చేస్తుంటారు. ‘చిక్కుడు ఆకుల్లో ఉయ్యాలా... సద్దులు కట్టి ఉయ్యాలో... అని పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. అందుకే స్త్రీల మనోభావాలను అనుసరించే బతుకమ్మను పేర్చడం జరుగుతోంది. అందులో స్త్రీల కళాతృష్ణ ఎంత గొప్పదో విదితమవుతుంది.ఎన్ని పూలతో బతుకమ్మను పేర్చినా ప్రతి వరుసకు తంగేటిపూలు ఉండడాన్ని విస్మరించరు. తంగేడు ముతై ్తదుతనం ఇవ్వడమేగాదు, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుందని నమ్మకం. అందుకే, ‘శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ’ అని జానపదం పాడుకుంటారు. సద్దుల బతుకమ్మనాడు ఆడపడుచులకు వొడిబియ్యం పోసి సాగనంపినట్లు బతుకమ్మను సాగనంపుతారు.
బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుంది. అలాగే గుమ్మడి పూలు, గునుగుపూలలో జలచరాల్లోని అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలున్నాయి. పుప్పొడి, పసుపులో గాలిలోని కాలుష్యాన్ని కడిగేసే గుణాలున్నాయి. అన్నింటికీ మించి కులమతాల కతీతంగా, పేద, గొప్ప భేదం లేకుండా బతుకమ్మ ఆటల్లో పాల్గొనడంలో సామాజిక ప్రయోజనముంది.
బృహత్ శివలింగానికీ బతుకమ్మకూ సంబంధం?
తెలంగాణ సంస్కృతిలో ప్రధాన భాగమైన బతుకమ్మ పండుగను పరిశీలిస్తే, ఆ సంస్కృతి విశిష్టత, చారిత్రకత విశదమౌతుంది. విశ్వవిఖ్యాతి చెందిన తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహా శివలింగం వేములవాడకు చెందిందనడానికి ఆధారాలున్నాయి. ఈ దేవాలయాన్ని నిర్మించిన చోళరాజైన రాజరాజు, కరీంనగర్‌లోని వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని అంటే మహా శివలింగాన్ని తంజావూరు తరలించి, బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠింపజేశాడు. తెలంగాణ ప్రజలు దీనికి బాధపడినా, పార్వతీ అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో పూలతో మేరుపర్వతంలా పేర్చి, దానిపై పసుపుతో గౌరీదేవిని రూపొందించి, దసరా సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నారని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment