దసరాలోపు కేబినెట్ విస్తరణ అంటూ జోరుగా చర్చ
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమంటున్న పార్టీ వర్గాలు
విస్తరణ వార్తలొచ్చిన ప్రతీసారి తెరమీదకు మునుగోడు ఎమ్మెల్యే పేరు
ఎస్టీ కోటాలో బాలునాయక్‌కు అవకాశం దక్కవచ్చంటూ చర్చ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ బయటకు రావడంతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పుడు విస్తరణ జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించారని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊగాహానాలు జోరందుకున్నాయి. దీంతో మంత్రి వర్గంలో రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వస్తున్నారు. కానీ, మొదట్లో ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి తప్పకుండా అవకాశం దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. అయితే పది నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది.
ఎంపీ ఎన్నికల సందర్భంలో అధిష్టానం హామీ
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ, రాష్ట్ర అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని అధిష్టానం, రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు వారి గెలుపు బాధ్యతలను జిల్లాల్లోని ముఖ్య నేతలకు అప్పగించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు.
ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని దగ్గరుండీ గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే, దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ దక్కుతుందా అన్న చర్చ మళ్లీ జోరందుకుంది.
హోం మంత్రి పదవి ఇవ్వాలని..!
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష, అటు అధికార పక్షాల మధ్య పోటాపోటీగా అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ వేదికలతోపాటు రాజకీయ వేదికల్లోనూ పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అధికార పక్షం, పాలన చేత కాక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్‌ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్‌రెడ్డి పలు సమావేశాల్లోనూ చెప్పుకొచ్చారు.
ఎస్టీ కోటాలో బాలునాయక్‌కు!
ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి వస్తుందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment