Minister Positions
-
హోం మంత్రి పదవి ఇవ్వాలని..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ బయటకు రావడంతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పుడు విస్తరణ జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించారని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊగాహానాలు జోరందుకున్నాయి. దీంతో మంత్రి వర్గంలో రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది.ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వస్తున్నారు. కానీ, మొదట్లో ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి తప్పకుండా అవకాశం దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. అయితే పది నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది.ఎంపీ ఎన్నికల సందర్భంలో అధిష్టానం హామీపార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ, రాష్ట్ర అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని అధిష్టానం, రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు వారి గెలుపు బాధ్యతలను జిల్లాల్లోని ముఖ్య నేతలకు అప్పగించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని దగ్గరుండీ గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే, దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ దక్కుతుందా అన్న చర్చ మళ్లీ జోరందుకుంది.హోం మంత్రి పదవి ఇవ్వాలని..!ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష, అటు అధికార పక్షాల మధ్య పోటాపోటీగా అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ వేదికలతోపాటు రాజకీయ వేదికల్లోనూ పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అధికార పక్షం, పాలన చేత కాక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్‌ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్‌రెడ్డి పలు సమావేశాల్లోనూ చెప్పుకొచ్చారు.ఎస్టీ కోటాలో బాలునాయక్‌కు!ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి వస్తుందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. -
దక్కని అమాత్యయోగం కాళింగుల అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. అచ్చెన్నాయుడితో పాటు కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష మంత్రి పదవి దక్కుతుందేమోనని ఆశించారు. పార్టీ విధేయత, సామాజికవర్గ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ కింజరాపు ఫ్యామిలీకే చంద్రబాబు పెద్దపీట వేశారు. దీంతో జిల్లాలో ప్రధాన కీలక సామాజిక వర్గమైన కాళింగులకు మొండిచేయి మిగిలింది. అటు కేంద్రంలో ఎంపీ రామ్మోహన్నాయుడికి అవకాశమివ్వగా, ఇటు రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి చోటు కల్పించడంతో మిగతా సామాజిక వర్గాలకు భంగపాటు తప్పలేదు. కూనకు నిరాశ.. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీకి కష్టకాలంలో ఎదురొడ్డి పనిచేసినందుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. గతంలో విప్‌గా పని చేసిన అనుభవంతో ఈసారి తనకు కేబినెట్లో బెర్త్ ఉంటుందని భావించారు. కేంద్ర కేబినెట్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ రామ్మోహన్నాయుడుకు అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర కేబినెట్లో తప్పకుండా కాళింగులకు చోటు దక్కుతుందని, ఆ కోటాలో తనకే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అదే సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్ కూడా మంత్రి పదవి వస్తుందని ఊహించారు.కాళింగ సామాజికవర్గంలో ఒకరికి తప్పకుండా వస్తుందని, అది ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వస్తుందని అంచనా వేసుకున్నారు. జిల్లాలోని కాళింగ సామాజిక వర్గీయులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈసారి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. అయినా వీరి మొర వినలేదు. మంత్రి వర్గంలో కాళింగులను పరిగణనలోకి తీసుకోలేదు. తనకు సన్నిహితంగా ఉన్న కింజరాపు ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చి, మంత్రి పదవులు కట్టబెట్టారు. కష్టం గుర్తించలేదంటూ.. జిల్లాలో టీడీపీ గెలుపునకు కాళింగ సామాజిక వర్గం పనిచేసినా, పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో కృషి చేసినప్పటికీ చంద్రబాబు గుర్తించకపోవడాన్ని కాళింగ సామాజిక వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్పీకర్, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ పదవులిస్తే ఈ ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి ఇవ్వలేదని రుసరుసలాడుతున్నారు. ఈ మేరకు సామాజికవర్గ వాట్సాప్ గ్రూపుల్లో ఇదే చర్చ జరుగుతోంది. టీడీపీకి అండగా నిలిచినందుకు తగిన బహుమానం ఇచ్చారని చర్చించుకుంటున్నారు. ఇంకా ఉన్నది ఒక మంత్రి పదవి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీప్ విప్, విప్ పదవులే ఉన్నాయని, వాటిలో మంత్రి పదవి, స్పీకర్ పదవి వచ్చే పరిస్థితి లేదని, ఇస్తే చీప్ విప్, విప్ ఇచ్చి చేతులు దులుపుకుంటారేమోని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూన రవికుమార్ వర్గీయులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈసారి తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని మంగళవారం అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు. తీరా జాబితా వచ్చాక పేరు లేకపోవడంతో డీలా పడిపోయారు. సంతృప్తి పరచడానికి ఏదో కంటి తుడుపు పోస్టు ఇచ్చి చేతులు దులుపుకొంటారని కూన వర్గీయులు భావిస్తున్నారు. ప్రాధాన్యం లేని పోస్టులిస్తే ఎవరికి ఉపయోగమని కూడా చర్చించుకుంటున్నారు. మంత్రి పదవి కేటాయించకపోవడంపై నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అయితే, పూర్తి మెజారిటీ ఉండటంతో వీరి మొర వినే పరిస్థితిలో చంద్రబాబు లేరని కచ్చితంగా చెప్పవచ్చు. మళ్లీ మంత్రి విస్తరణ జరిగితే అప్పుడు చూసుకోవల్సిందే తప్ప అంతవరకు అవమానకరంగానే భావించాలి. ఇక, గౌతు శిరీష పరిస్థితి కూడా అంతే. తన తండ్రి సీనియారిటీ, పారీ్టకి విధేయతను దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా చంద్రబాబు కనీసం పరిశీలించలేదు. -
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్?.. ఎన్నికలకు సతీమణి దూరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్టే అని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎంపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చేలా అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని పార్టీ ఒత్తిడి చేసినా, అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. అధిష్టానం హామీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ విషయంలో అధిష్టానం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. అయితే రాజగోపాల్‌రెడ్డికి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుండటంతో పాటు రాజగోపాల్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు మంత్రి పదవి వస్తుందని, హోం మినిస్టర్ అవుతానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ ఎన్నికల తరువాత తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. -
మంత్రి పదవికి ‘గడ్డం’ సోదరుల పోటీ.. అన్నదమ్ముల్లో గెలిచేదెవరో?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణ లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడ త కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినేట్తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానా పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ ఉంది. ‘గడ్డం’ సోదరుల పోటీ.. ‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై న మ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్‌కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చె ప్పుకున్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్‌లో చర్చ జరుగుతోంది. -
సభాపతి ఎవరు.. అనుభవం కలిగిన నేత కోసం వెతుకులాట
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవుల పట్ల ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం శాసనసభ తదుపరి స్పీకర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం పలువురు సీనియర్లు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రఫుల్ల సామల్, దేవీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి, బద్రి నారాయణ్ పాత్రొ స్పీకర్ ముందున్నారు. మహిళా అభ్యర్థి స్నేహాంగిని చురియా పేరు కూడా ప్రచారంలో ఉంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రతి చోటా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అదృష్టం కలిసి రావచ్చని సర్వత్రా చర్చ సాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో అస్కా లోక్‌సభ ఎన్నికలో మహిళా కార్డు బీజేడీకి దిగ్విజయం కల్పించింది. ఈ నియోజకవర్గం మహిళా స్వయం సహాయక బృందం అధినేత ప్రమీలా బిసోయ్తో చేసిన ప్రయోగం పార్టీకి విశేష గుర్తింపు సాధించింది. అయితే ధామ్‌నగర్ ఉప ఎన్నికలో ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. మహిళా సాధికారత మంత్రం నిరంతరం ఫలప్రదం కావడం కష్టతరమని ఈ ఎన్నిక రుజువు చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ఆచితూచి అడుగు వేయకుంటే రానున్న ఎన్నికల్లో పార్టీ బలం పుంజుకోవడం బలహీన పడుతుందని బీజేడీ శిబిరంలో జోరుగా చర్చ సాగుతోంది. నవీన్ నిర్ణయంపైనే.. మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో స్పీకర్ విక్రమ్‌కేశరి ఆరూఖ్తో రాజినామా చేయించారు. ఈ స్థానం భర్తీ తదుపరి ఎన్నికలకు లాభసాటిగా ఉండేలా అభ్యర్థి ఎంపిక పట్ల బీజేడీ అధిష్టానం పదునైన ప్రక్రియతో కసరత్తు చేస్తోంది. స్పీకర్ ఆశావహుల్లో ప్రఫుల్ల సామల్, దేబీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి తగిన అనుభవం అలాగే శాసన విధానాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రతినిధులుగా పేరొందారు. వీరిలో ఒకరికి ప్రతిష్టాత్మక సభాపతి పదవిని కట్టబెట్టే యోచన శిబిరంలో గింగుర్లు కొడుతోంది. అయితే మహిళా మంత్రంతో ఈ నిర్ణయం ఊగిసలాడుతోంది. అయితే ప్రయోగాలు చేయడానికి సమయం కాదని, అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమర్థత కలిగిన అభ్యర్థిని మాత్రమే స్పీకర్‌గా నియమించాలని సీఎం నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు సమాచారం. -
పదవులు...పడిగాపులు
ఎన్నికల సంఘం ప్రకటన కోసం నేతల ఎదురుతెన్నులు సాక్షిప్రతినిధి, నల్లగొండ: మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు కావస్తోంది.. ఈ రెండు ఎన్నికల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడడం, ప్రభుత్వం ఏర్పాటు కావడం, మంత్రి పదవులు పొందడం చకచకా జరిగిపోయింది. కానీ, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ, జెడ్పీ వైస్.... ఇంకా కోఆప్షన్ పదవుల భర్తీ జరగాల్సి ఉంది. ఇప్పుడు అందరి ఎదురుచూపులూ.. ఈ ఎన్నికల ప్రకటన కోసమే.. మరోవైపు ముఖ్య పదవులు ఆశిస్తున్న వారి దుంప తెగుతోంది. వీరి ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలు వెలువడి నెలరోజులు కావొస్తున్నా ఇంకా ఎన్నిక జరగలేదు. రాష్ట్రపతి పాలన రద్దయ్యి, కొత్త ప్రభుత్వమూ కొలువుదీరింది. వెంటనే మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నిక ఉంటుందని గతంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఐదురోజులు దాటింది. 9వ తేదీ నుంచి నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి. కానీ, ఇంతవరకు తమ ఎన్నికకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడక పోవడంతో పదవులు ఆశిస్తున్న గెలుపు వీరులు ఎదురుచూపులతో విసిగిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు మార్చి30వ తేదీన జరగగా, మే 12వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఇక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ నెలలో 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. కాగా, మే 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నిక జరిగిన నాటి నుంచి ఫలితాల కోసం నెల రోజులు, ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నెల రోజుల వెరసి రెండు నెలల పాటు వీరు పడిగాపులు గాయాల్సి వచ్చింది. మధ్యలో సార్వత్రిక ఎన్నికలు కూడా రావడంతో ఈ ఆలస్యం జరిగిందని భావించినా, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నందున మున్సిపల్ ైచె ర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరపలేదు. అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకూ ఎన్నిక జరగలేదు. మొత్తంగా ఇప్పుడు 134 పదవులు ఎన్నిక ద్వారా భర్తీ కావాల్సి ఉంది. అటు మండల, జిల్లా పరిషత్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్ సభ్యుల ఎన్నికా పెండింగులోనే ఉంది. ఈ పదవులు ఆశిస్తున్న వారంతా ఎప్పుడెప్పుడు ప్రకటన వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎంపీలు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక, ఎమ్మెల్యేలు ఈ నెల 9న జరిగే తొలి శాసనసభా సమావేశాల్లో ప్రమాణం చేయనున్నారు. కనీసం ఈ నాలుగు రోజుల సెషన్ పూర్తయ్యే నాటికైనా ప్రకటన వెలువడుతుందా, ఇంకా ఆలస్యం చేస్తారా అన్న ఆందోళన వీరిలో ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అని అంతా ఆశగా చూడడంతో పాటు ఇన్నాళ్లూ క్యాంపుల్లో ఉన్నవారు, రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాలనూ చుట్టిన వారు ఇప్పుడిప్పుడే సొంత గూళ్లకు చేరుకుంటున్నారు.