మంత్రి వర్గంలో కాళింగ సామాజిక వర్గానికి చంద్రబాబు మొండిచేయి
తీవ్ర ఆవేదనలో కూన రవికుమార్ అభిమానులు
సామాజికవర్గ వాట్సాప్ గ్రూపుల్లో చర్చ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన ప్రాధాన్యతతో పోల్చుతున్న పరిస్థితి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. అచ్చెన్నాయుడితో పాటు కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష మంత్రి పదవి దక్కుతుందేమోనని ఆశించారు. పార్టీ విధేయత, సామాజికవర్గ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ కింజరాపు ఫ్యామిలీకే చంద్రబాబు పెద్దపీట వేశారు. దీంతో జిల్లాలో ప్రధాన కీలక సామాజిక వర్గమైన కాళింగులకు మొండిచేయి మిగిలింది. అటు కేంద్రంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడికి అవకాశమివ్వగా, ఇటు రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి చోటు కల్పించడంతో మిగతా సామాజిక వర్గాలకు భంగపాటు తప్పలేదు.
కూనకు నిరాశ..
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీకి కష్టకాలంలో ఎదురొడ్డి పనిచేసినందుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. గతంలో విప్‌గా పని చేసిన అనుభవంతో ఈసారి తనకు కేబినెట్‌లో బెర్త్ ఉంటుందని భావించారు. కేంద్ర కేబినెట్‌లో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర కేబినెట్‌లో తప్పకుండా కాళింగులకు చోటు దక్కుతుందని, ఆ కోటాలో తనకే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అదే సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్ కూడా మంత్రి పదవి వస్తుందని ఊహించారు.
కాళింగ సామాజికవర్గంలో ఒకరికి తప్పకుండా వస్తుందని, అది ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వస్తుందని అంచనా వేసుకున్నారు. జిల్లాలోని కాళింగ సామాజిక వర్గీయులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈసారి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. అయినా వీరి మొర వినలేదు. మంత్రి వర్గంలో కాళింగులను పరిగణనలోకి తీసుకోలేదు. తనకు సన్నిహితంగా ఉన్న కింజరాపు ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చి, మంత్రి పదవులు కట్టబెట్టారు.
కష్టం గుర్తించలేదంటూ..
జిల్లాలో టీడీపీ గెలుపునకు కాళింగ సామాజిక వర్గం పనిచేసినా, పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో కృషి చేసినప్పటికీ చంద్రబాబు గుర్తించకపోవడాన్ని కాళింగ సామాజిక వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్పీకర్, జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ పదవులిస్తే ఈ ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి ఇవ్వలేదని రుసరుసలాడుతున్నారు. ఈ మేరకు సామాజికవర్గ వాట్సాప్ గ్రూపుల్లో ఇదే చర్చ జరుగుతోంది. టీడీపీకి అండగా నిలిచినందుకు తగిన బహుమానం ఇచ్చారని చర్చించుకుంటున్నారు.
ఇంకా ఉన్నది ఒక మంత్రి పదవి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీప్ విప్, విప్ పదవులే ఉన్నాయని, వాటిలో మంత్రి పదవి, స్పీకర్ పదవి వచ్చే పరిస్థితి లేదని, ఇస్తే చీప్ విప్, విప్ ఇచ్చి చేతులు దులుపుకుంటారేమోని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూన రవికుమార్ వర్గీయులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈసారి తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని మంగళవారం అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు. తీరా జాబితా వచ్చాక పేరు లేకపోవడంతో డీలా పడిపోయారు. సంతృప్తి పరచడానికి ఏదో కంటి తుడుపు పోస్టు ఇచ్చి చేతులు దులుపుకొంటారని కూన వర్గీయులు భావిస్తున్నారు. ప్రాధాన్యం లేని పోస్టులిస్తే ఎవరికి ఉపయోగమని కూడా చర్చించుకుంటున్నారు.
మంత్రి పదవి కేటాయించకపోవడంపై నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అయితే, పూర్తి మెజారిటీ ఉండటంతో వీరి మొర వినే పరిస్థితిలో చంద్రబాబు లేరని కచ్చితంగా చెప్పవచ్చు. మళ్లీ మంత్రి విస్తరణ జరిగితే అప్పుడు చూసుకోవల్సిందే తప్ప అంతవరకు అవమానకరంగానే భావించాలి. ఇక, గౌతు శిరీష పరిస్థితి కూడా అంతే. తన తండ్రి సీనియారిటీ, పారీ్టకి విధేయతను దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా చంద్రబాబు కనీసం పరిశీలించలేదు.
Comments
Please login to add a commentAdd a comment