భువనేశ్వర్: రాష్ట్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవుల పట్ల ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం శాసనసభ తదుపరి స్పీకర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం పలువురు సీనియర్లు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రఫుల్ల సామల్, దేవీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి, బద్రి నారాయణ్ పాత్రొ స్పీకర్ ముందున్నారు. మహిళా అభ్యర్థి స్నేహాంగిని చురియా పేరు కూడా ప్రచారంలో ఉంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రతి చోటా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అదృష్టం కలిసి రావచ్చని సర్వత్రా చర్చ సాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో అస్కా లోక్‌సభ ఎన్నికలో మహిళా కార్డు బీజేడీకి దిగ్విజయం కల్పించింది. ఈ నియోజకవర్గం మహిళా స్వయం సహాయక బృందం అధినేత ప్రమీలా బిసోయ్‌తో చేసిన ప్రయోగం పార్టీకి విశేష గుర్తింపు సాధించింది. అయితే ధామ్‌నగర్ ఉప ఎన్నికలో ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. మహిళా సాధికారత మంత్రం నిరంతరం ఫలప్రదం కావడం కష్టతరమని ఈ ఎన్నిక రుజువు చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ఆచితూచి అడుగు వేయకుంటే రానున్న ఎన్నికల్లో పార్టీ బలం పుంజుకోవడం బలహీన పడుతుందని బీజేడీ శిబిరంలో జోరుగా చర్చ సాగుతోంది.
నవీన్ నిర్ణయంపైనే..
మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో స్పీకర్ విక్రమ్‌కేశరి ఆరూఖ్‌తో రాజినామా చేయించారు. ఈ స్థానం భర్తీ తదుపరి ఎన్నికలకు లాభసాటిగా ఉండేలా అభ్యర్థి ఎంపిక పట్ల బీజేడీ అధిష్టానం పదునైన ప్రక్రియతో కసరత్తు చేస్తోంది. స్పీకర్ ఆశావహుల్లో ప్రఫుల్ల సామల్, దేబీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి తగిన అనుభవం అలాగే శాసన విధానాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రతినిధులుగా పేరొందారు.
వీరిలో ఒకరికి ప్రతిష్టాత్మక సభాపతి పదవిని కట్టబెట్టే యోచన శిబిరంలో గింగుర్లు కొడుతోంది. అయితే మహిళా మంత్రంతో ఈ నిర్ణయం ఊగిసలాడుతోంది. అయితే ప్రయోగాలు చేయడానికి సమయం కాదని, అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమర్థత కలిగిన అభ్యర్థిని మాత్రమే స్పీకర్‌గా నియమించాలని సీఎం నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment