పదవులు...పడిగాపులు
ఎన్నికల సంఘం ప్రకటన కోసం నేతల ఎదురుతెన్నులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు కావస్తోంది.. ఈ రెండు ఎన్నికల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడడం, ప్రభుత్వం ఏర్పాటు కావడం, మంత్రి పదవులు పొందడం చకచకా జరిగిపోయింది. కానీ, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ, జెడ్పీ వైస్.... ఇంకా కోఆప్షన్ పదవుల భర్తీ జరగాల్సి ఉంది. ఇప్పుడు అందరి ఎదురుచూపులూ.. ఈ ఎన్నికల ప్రకటన కోసమే.. మరోవైపు ముఖ్య పదవులు ఆశిస్తున్న వారి దుంప తెగుతోంది. వీరి ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి.
మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలు వెలువడి నెలరోజులు కావొస్తున్నా ఇంకా ఎన్నిక జరగలేదు. రాష్ట్రపతి పాలన రద్దయ్యి, కొత్త ప్రభుత్వమూ కొలువుదీరింది. వెంటనే మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నిక ఉంటుందని గతంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఐదురోజులు దాటింది. 9వ తేదీ నుంచి నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి. కానీ, ఇంతవరకు తమ ఎన్నికకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడక పోవడంతో పదవులు ఆశిస్తున్న గెలుపు వీరులు ఎదురుచూపులతో విసిగిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు మార్చి30వ తేదీన జరగగా, మే 12వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి.
ఇక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ నెలలో 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. కాగా, మే 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నిక జరిగిన నాటి నుంచి ఫలితాల కోసం నెల రోజులు, ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నెల రోజుల వెరసి రెండు నెలల పాటు వీరు పడిగాపులు గాయాల్సి వచ్చింది. మధ్యలో సార్వత్రిక ఎన్నికలు కూడా రావడంతో ఈ ఆలస్యం జరిగిందని భావించినా, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నందున మున్సిపల్ ైచె ర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరపలేదు.
అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకూ ఎన్నిక జరగలేదు. మొత్తంగా ఇప్పుడు 134 పదవులు ఎన్నిక ద్వారా భర్తీ కావాల్సి ఉంది. అటు మండల, జిల్లా పరిషత్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్ సభ్యుల ఎన్నికా పెండింగులోనే ఉంది. ఈ పదవులు ఆశిస్తున్న వారంతా ఎప్పుడెప్పుడు ప్రకటన వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎంపీలు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక, ఎమ్మెల్యేలు ఈ నెల 9న జరిగే తొలి శాసనసభా సమావేశాల్లో ప్రమాణం చేయనున్నారు.
కనీసం ఈ నాలుగు రోజుల సెషన్ పూర్తయ్యే నాటికైనా ప్రకటన వెలువడుతుందా, ఇంకా ఆలస్యం చేస్తారా అన్న ఆందోళన వీరిలో ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అని అంతా ఆశగా చూడడంతో పాటు ఇన్నాళ్లూ క్యాంపుల్లో ఉన్నవారు, రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాలనూ చుట్టిన వారు ఇప్పుడిప్పుడే సొంత గూళ్లకు చేరుకుంటున్నారు.