ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి అమాత్య యోగం దక్కుతుందంటూ జిల్లాలో చర్చ
ఎంపీ ఎన్నికలు పూర్తి కాగానే పదవి ఇచ్చేలా అధిష్టానం నుంచి హామీ
అందుకే తన సతీమణిని ఎన్నికల్లో పోటీ చేయించని రాజగోపాల్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్టే అని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎంపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చేలా అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని పార్టీ ఒత్తిడి చేసినా, అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది.
అధిష్టానం హామీ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ విషయంలో అధిష్టానం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి మంత్రిగా బాధ్యతలు అప్పగించింది.
అయితే రాజగోపాల్‌రెడ్డికి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుండటంతో పాటు రాజగోపాల్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు మంత్రి పదవి వస్తుందని, హోం మినిస్టర్ అవుతానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ ఎన్నికల తరువాత తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment