
ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతి
జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలి
ఆయన భారత గిరిజన ప్రజలకు ఆరాధ్య దైవం. లంబాడీలను అహింసావాదంవైపు నడిపించిన దార్శనికుడు. బ్రహ్మచర్య నిష్టను ఆచరించి ఎంతో మంది గిరిజనులను ఆకర్షించిన వ్యక్తి. ఆయనే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ (sant shri sevalal maharaj). 17వ శతాబ్దంలో అవతరించిన ఆయన, గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యారు. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను సేవాలాల్ బంజార సంఘం (Banjara Community) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవుదినంగా ప్రకటించాలని గిరిజనులు (Tribals) కోరుతున్నారు.
గిరిజన రాజుగా..
అసలు శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎవరు..? ఆయనకు మూడు దశాబ్దాలుగా గిరిజనుల్లో ఇంత ఆదరణ ఎందుకు ఉంది? ఆయన రాజా? లేక దార్శనికుడా? లేక ఆధ్యాత్మిక గురువా? అనేది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణలో గిరిజనులు ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న ఏపీలోని అనంతపురం జిల్లాలో గుత్తి సమీపంలోని ఓ మారుమూల తండాలో జన్మించారు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అప్పట్లోనే దేశమంతటా తిరిగి లంబాడీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అందుకే ఆయన వారికి ఆరాధ్య దేవుడయ్యాడు. రాజపుత్ర సంతతికి చెందిన గిరిజన జాతుల్లో లంబాడీ జాతికి చెందిన దంపతులకు జన్మించడం వల్ల ఆయనను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్‌గా, గిరిజన రాజుగా, లంబాడీ గురువుగా కొలుస్తారు. అప్పట్లోనే నిజాం రాజులకు ఎదురొడ్డి నిలిచిన ఘనత సేవాలాల్ మహారాజ్‌ది.
కఠోర నిష్ట
సేవాలాల్ మహారాజ్ పూజా విధానం చాలా కఠినతరంగా ఉంటుంది. సేవాలాల్ గుడిని దర్శించిన భక్తులందరూ ఉదయం, సాయంత్రం కలుసుకోవాల్సి ఉంటుంది. బలన్‌బోగ్ మరియు బేలన్‌బోగ్ అనే ఆధ్యాత్మిక సాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో భగవంతునికి నివేదించి ధర్మబోధన చేస్తారు. ప్రతీ బంజార యువకుడు కనీసం జీవిత కాలంలో ఒక్క సారైనా బంజార సేవాలాల్ గుడిని దర్శించాలని విశ్వసిస్తుంటారు.
చదవండి: కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయం
అనంతపురం (Anantapur) గుత్తి సమీపంలోని ఓ గిరిజన తండాలో భీమానాయక్, ధర్మిణి దంపతులకు జన్మించిన రమావత్ సేవాలాల్ క్రమక్రమంగా దార్శనికుడిగా, అహింసావాదిగా పేరు సంపాదించారు. తర్వాత కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో ఆయనకు గిరిజనులు ఆలయాన్ని నిర్మించారు. సేవాలాల్ మహారాజ్ జన్మించిన ఊరును ప్రస్తుతం పురితండాగా పిలుస్తున్నారు.
సంత్ శ్రీ సేవాలాల్ మార్గాన్ని ఆచరించాలి
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ చూపించిన మార్గాన్ని రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోని ప్రతి గిరిజనుడు ఆచరించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శాలను ప్రచారం చేస్తూ, జయంతి ఉత్సవాలకు రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు జరుపుకోవాలి.
– రమావత్ చిరంజీవి, అంగడిపేట
జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
గిరిజనులు ఎంతో భక్తితో జరుపుకునే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతోపాటు, జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.
– రమావత్ శ్రీనునాయక్, సేవాలాల్ బంజార సంఘం నాయకుడు, గుడిపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment