మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం | Special Report on Gold Plating Of The Yadadri Lakshmi Narasimha Temple Vimana Gopuram | Sakshi
Sakshi News home page

మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం

Published Mon, Feb 17 2025 3:41 AM | Last Updated on Mon, Feb 17 2025 3:41 AM

Special Report on Gold Plating Of The Yadadri Lakshmi Narasimha Temple Vimana Gopuram

మన గుడి – మన ఉత్సవం

యాదగిరి నర్సన్న విమాన గోపురం

పూర్తి కావొచ్చిన బంగారు తాపడం  

23న మహాకుంభ సంప్రోక్షణ 

19 నుంచి హోమాలు, ప్రత్యేక పూజలు  

లక్షకు పైగా భక్తులు వస్తారని అంచనా

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ విమానగోపుర మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈనెల 19 నుంచి 23 వరకు జరిగే మహాక్రతువుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండురోజుల్లో ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులు పూర్తికానున్నాయి. 108 మంది రుత్విక్కులతో పూజలు నిర్వహిస్తారు. దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెస్తున్నారు. ఇందుకోసం కొండపైన హోమగుండాలు కూడా సిద్ధమవుతున్నాయి. 

మహాకుంభ సంప్రోక్షణకు ఈనెల 23న జరిగే మహా కుంభాభిషేకం జరుగుతుంది. ఉదయం 11.34 గంటలకు నిర్ణయించిన ముహూర్తంలో ఈకార్యక్రమం జరుగుతుంది. పీఠాధిపతి వానమామలై రామానుజ జియర్‌స్వామి పర్యవేక్షణలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. కొండపైన ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు. 19 నుంచి 22 వరకు 108 మంది రుత్విక్కులతో సుదర్శన హోమం,  నారసింహ హోమం నిర్వహిస్తారు. రామాయణ, భారత, భాగవత కథలను పారాయణం చేస్తారు.

ప్రత్యేక వసతులు, ఏర్పాట్లు... 
మహాకుంభ సంప్రోక్షణకు  దేశం నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేసి  ఇందుకోసం ప్రత్యేక వసతులు, ఏర్పాటు చేస్తున్నారు. 23న సుమారు లక్షమంది భక్తులకు పులిహోర ప్రసాదం ఉచితంగా అందించేందుకు దేవస్థానం నిర్ణయించింది. మహాకుంభ సంప్రోక్షణతోపాటు మార్చి1 నుంచిప్రారంభమయ్యే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచార కార్యకమంలో భాగంగా దేవస్థానం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఆలేరు, భువనగిరి, శంషాబాద్, మహరాష్ట్రలోని షోలాపూర్‌లో స్వాగత తోరణాలు ఏర్పాటు ఏర్పాటు చేస్తోంది.

 శ్రీస్వామివారి విమాన గోపురం బంగారు తాపడం పనులకు దేవస్థానం 68కిలోల బంగారం వాడుతుంది. ç50.5 ఫీట్ల పంచతల రాజగోపురానికి చుట్టుమొత్తం10,759 చదరపు అడుగల మేర స్వర్ణతాపడం పనులు చేపట్టారు. దేవాలయం పునర్నిర్మాణంప్రారంభించినపుడే విమాన గోపురానికి  బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. ముందుగా11వేల కిలోల రాగితో రేకులను తయారు చేశారు. ఒక చదరపు అడుగు రేకుకు 6 గ్రాముల బంగారం ఖర్చు చేస్తున్నారు. 

ఐదు యజ్ఞకుండాలు: కొండపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు హోమ కుండాల్లో  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దకుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమగుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మి హవన హోమాలు  చేస్తారు. చివరి రోజైన ఈనెల 23న విమాన రాజగోపురానికి 25 కలశాలతో  అభిషేకం, మూలమూర్తి హవనం చేస్తారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి విమాన గోపురానికిప్రాణం ΄ోస్తారు. ఇందులో 108 మంది పారాయణదార్లు పాల్గొంటారు. వివి«ద్ర పాంతాలనుంచి రుత్వికులు వస్తారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

మహాకుంభాభిషేక, సంప్రోక్షణ వివరాలు
19వ తేదీ బుధవారం: ఉదయం గం. 7.45కు భగవద్‌ అనుజ్ఞ స్వస్తి వాచన, శ్రీ విశ్వక్సేనారాధాన, పుణ్యాఃవాచన, రక్షాబంధన, బుత్విగ్వరణం, మృత్సంగ్రహణ, పర్యగ్నీకరణ, తిరువీధి సేవ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధనతో ఆరంభం అవుతాయి. సాయంత్రం 6:00 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు వారణానువాక హోమం, జలాధివాసం, నిత్యపూర్ణాహుతి, నివేదన, తీర్ధప్రసాద గోష్ఠి, తిరువీధి సేవ, ఆలయంలోకి వేంచేపు జరుగుతాయి. 

గురు, శుక్ర వారాలలో వివిధ కార్యక్రమాల అనంతరం 22 వ తేదీ శనివారం తిరువీధిసేవ,చతుస్థానార్చన, విమాన అధిష్టాన పరివార విశేష హోమం, ఏకాశీతి కలశ స్నపనం, మూల మంత్రమూర్తి మంత్ర హావనం, నిత్యపూర్ణాహుతి నివేదన, నీరాజన మంత్ర పుష్పం, శాత్తుమరై, సాయంత్రం 6:00 గంటలకు నిత్య పూర్ణాహుతి నివేదన, తీర్ధ ప్రసాద గోష్ఠి తిరువీధి సేవ ఆలయంలోకి వేంచేపుతో ముగుస్తాయి. 

ఈనెల 19 నుంచి 23 వరకు పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం జరిపి దివ్యవిమాన గోపురాన్ని శ్రీ స్వామివారికి అంకితం చేస్తారు.  23వ తేది ఉదయం 11.54 గంటలకు స్వర్ణవిమానగోపురానికి కుంభాభిషేకం చేస్తారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యవిమానం బంగారు తాపడంలో 40 రకాల విగ్రహాలు బంగారు పూతతో   చెక్కారు. విమాన గోపురంపై బంగారు రేకులపై  పంచనారసింహ క్షేత్రంలో స్వామివారి వివిధ రూపాలను చెక్కారు.

 శ్రీవిష్ణుమూర్తి దశావతారాలు,  నర్సింహస్వామి వారి వివిధ రూపాలను వివిధ ఎత్తులతో చెక్కారు. అలాగే స్వామివారి గరుడ విగ్రహాలు నాలుగు, సింహాలు 8 ఇలా మొత్తం స్వర్ణతాపడంపై ΄÷ందుపరిచారు. కాగా దేశంలోనే అతి పెద్ద స్వర్ణ విమాన గోపురంగా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారి విమానగోపురంతోపాటు ఆలయంపై ఉన్న 39 కలశాలకు కూడా బంగారు తాపడం చేశారు. ఈ సందర్భంగా రోజూ 2000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తారు.

ఏర్పాట్లు పూర్తి
శ్రీ లక్ష్మి నర్సింహస్వామి దేవాలయం విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి అయ్యాయి. దేవస్థానం పీఠాధిపతి పర్యవేక్షణలో మహాకుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 108 మంది రుత్విక్కులు ప్రత్యేక పూజలు చేస్తారు. హోమగుండాలు ఏర్పాటు చేశాం. రామాయణ, మహాభారత, భాగవత ప్రబంధాల ప్రవచనాలు పారాయణ చేస్తారు. భక్తుల వసతుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 
– ఏ. భాస్కర్‌రావు,
దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి, యాదగిరిగుట్ట

– యంబ నర్సింహులు,
సాక్షి ప్రతినిధి, యాదాద్రి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement