బంగారు గోపురానికి మెరుగులు
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మ కొలువై ఉన్న ఆలయ బంగారు గోపురానికి మెరుగులు దిద్దుతున్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని మెరుగులు దిద్దే పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. 2004లో అమ్మవారి ఆలయ శిఖరానికి బంగారపు తాపడం పనులు జరగగా, 2012 మహా కుంభాభిషేకం జరిగిన అనంతరం శిఖరానికి మెరుగులు దిద్దారు. ఇటీవల బంగారు తాపడం కొన్ని చోట్ల కాంతిహీనంగా కనిపించడంతో మెరుగులు దిద్దేందుకు దేవస్థాన అధికారులు నిర్ణయించారు. దీంతో బంగారు గోపురం చుట్టూ పరంజాలను ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి మెరుగులు దిద్దే పనులు ప్రారంభమవుతాయని, రెండు రోజులలో పనులను పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు ఈ నెల 14వ తేదీ నుంచి పవిత్రోత్సవాలను నిర్వహించాలని ఆలయ వైదిక కమిటీ నిర్ణయించడంతో ఈ లోగానే మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.