అగ్ని ప్రమాదం బాధాకరం: మంత్రి
శ్రీకాళహస్తి: అగ్నిప్రమాదం సంభవించి రాజగోపురం వద్ద యాగశాల దగ్ధం కావడం బాధాకరమని దేవాదాయశాఖ మంత్రి మణిక్యాలరావు అన్నారు. శనివారం ఆయన మహాకుంభాభిషేకంపై దేవస్థానంలో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసిన తర్వాత ఆలయంలో పనులు పరిశీలించారు. తర్వాత గాలిగోపురాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. మహాకుంభిషేకం చేస్తున్న నేపథ్యంలో ఇలా గాలిగోపురం వద్ద అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. అయితే శివపార్వతుల ఆశీస్సులతో ఎవరికి ప్రమాదం జరగలేదన్నారు. ఆయన వెంట ఈవో భ్రమరాంబ, ఆలయ మాజీ చైర్మన్ కోలా ఆనంద్, ఆలయ సభ్యురాలు కండ్రిగ ఉమ, శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, ఈఈ వెంకటనారాయణ తదితరులున్నారు.
అమ్మవారికి బంగారు మకరతోరణం
శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి బంగారు తాపడం చేసిన మకర తోరణాన్ని అమ్మవారికి కానుకగా ఇచ్చారు. బంగారు తాపడం చేయించడానికి అమ్మవారి రాగి మకరతోరణాన్ని రవిసన్నారెడ్డికి అప్పగించారు. ఆయన దానికి బంగారు తాపడం చేయించి దేవస్థానానికి శనివారం అందజేశారు.
ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ
మహాకుంభాభిషేకంలో భాగంగా ముక్కంటి ఆలయానికి విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. గోపురాలను ముస్తాబు చేశారు. ఆలయ ఆవరణలో శివపార్వతుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు.