వచ్చే నెలలో యాదాద్రి బ్రహ్మోత్సవాలు | Next Month For Yadadri Brahmotsava | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో యాదాద్రి బ్రహ్మోత్సవాలు

Published Fri, Feb 12 2016 4:49 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

Next Month For Yadadri Brahmotsava

సాక్షి, హైదరాబాద్: యాదాద్రి బ్రహ్మోత్సవాలు మార్చి 11 నుంచి 22 వరకు జరగనున్నాయి. యాదాద్రి అభివృద్ధి పనులను బ్రహ్మోత్సవాల తర్వాత ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనులపై ఆలయాభివృద్ధి బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ గురువారం సచివాలయంలో చర్చించారు. ఆలయ అభివృద్ధితో పాటు అథారిటీ పరిధిలోకి వచ్చే పట్టణాభివృద్ధి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

హైదరాబాద్- వరంగల్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ఇప్పటికే 80 శాతం వరకు పూర్తయిందని ఆర్ అండ్ బీ అధికారులు చెప్పారు. దానికి అనుసంధానంగా ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్లను రెండు వరుసలుగా అభివృద్ధి చేయాలని సీఎస్ ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెంచాలన్నారు. అందుకు ఎక్కువ భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంత భూమి అవసరమవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆ మేరకు భూసేకరణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

బ్రహ్మోత్సవాల సమయంలో యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూల్చివేతలు, కొత్త పనులు నిర్వహించడం వల్ల భక్తులకు అసౌకర్యంగా ఉంటుందనే చర్చ జరిగింది. అందుకే బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 23 నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తొమ్మిది నెలల్లో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలంటూ సీఎస్ అన్ని శాఖలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏడాదిన్నర వ్యవధిలో పట్టణాభివృద్ధి పనులను సైతం పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement