
ఆధ్యాత్మికత
అది తమిళనాడు రాష్ట్రం, రామేశ్వరం దగ్గరున్న ఓ చిన్న పల్లెటూరు. అక్కడ పెయింటింగ్ ని జీవనోపాధిగా చేసుకుని జీవించే ఓ పెయింటర్ ఉండేవాడు. అతడికి పెళ్ళి కావాల్సిన కూతురు ఉండేది. బి.ఏ., డిగ్రీ మాత్రమే చదివిన ఆ అమ్మాయి అందం కూడా అంతంత మాత్రమే. అయినా పెద్ద మొత్తాల్లో జీతం తీస్తున్న ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెళ్ళి చేసుకుంటామని ముందుకు వచ్చారు. పెళ్ళి కూతురు, ఆమె తల్లి వచ్చిన సంబంధాల పట్ల ఆసక్తి ప్రదర్శించినా పెయింటర్ ఒప్పుకోలేదు.
‘‘వయసైతోంది, మీరు బిడ్డకి పెళ్ళి చేయాలని ఉన్నారా, లేదా?’’ అని భర్తని గట్టిగా అడిగింది పెయింటర్ భార్య. అతడు నవ్వి ఊరకున్నాడు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పంపించేస్తున్నాడన్న విషయం తెలిసి బంధువులు అతడిని తిట్టిపోశారు. అయినా అతడు పట్టించుకోలేదు. చివరికి మిత్రుల ద్వారా తిరుపతి నుంచి ఓ సంబంధం వచ్చింది. పెళ్ళికుమారుడు చిన్న వ్యాపారి. ఆదాయం అంతంత మాత్రమే. అయినా దానికి వెంటనే అంగీకరించాడు పెయింటర్. ఆశ్చర్యపోయారు పెయింటర్ కుటుంబ సభ్యులు.
‘ఇక్కడ పెళ్ళికుమారులు దొరక్కనా, పది గంటలకు పైగా ప్రయాణ దూరమున్న తిరుపతి సంబంధం చేసుకుంటున్నాడు’ అని బంధువులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెయింటర్ ఎవ్వరి మాటలకీ స్పందించ లేదు. పెళ్ళి పనుల్లో పడ్డాడు. పెళ్ళి కూడా తిరుపతిలోనే పెట్టుకున్నారు. పెళ్ళిరోజు రానే వచ్చింది. అమ్మగారి ఇంటినుంచి వెళ్ళిపోతున్నామనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ పెళ్ళికూతురు తండ్రిని ఇలా అడిగింది.
‘‘నాన్నా... మన రామేశ్వరం పక్కనే ఎన్నో మంచిమంచి సంబంధాలు వచ్చాయి. వాటికి నువ్వు ఒప్పుకోలేదు. రాష్ట్రం కాని రాష్ట్రం. పరిచయం లేని ప్రాంతం, దూరాభారం. తెలియని భాష. అయినా ఈ కొత్త సంబంధానికి సుముఖత చూపావు, కారణమేమి?’’ అని. ఎదురుగా కనిపిస్తున్న శేషాచలం కొండల్ని చూపిస్తూ ఇలా చెప్పాడు అతడు– ‘‘ఏడాదికి ఒక్కసారైనా, పెరుమాళ్ ని చూడాలని ఉంటుంది నాకు. అయితే... నోట్లోకి నాలుగేళ్ళు పోయే సంపాదన నాది. ఆ సంపాన కోసమే నా సమయమంతా సరిపోయేది. ఉన్న ఊరు వదిలేదానికి కుదిరేది కాదు. స్వామి వారి దర్శనభాగ్యం వాయిదాలు పడేది. కూతురైన నువ్వు తిరుపతిలో ఉంటే నిన్ను చూడాలని అనిపించినప్పుడల్లా తిరుపతి వస్తాము. అలాగైనా అపుడప్పుడూ స్వామి దర్శన భాగ్యం చేసుకోవచ్చని నా ఆశ. అందుకే ఈ సంబంధం ఒప్పుకున్నాను’’అని. తండ్రికి స్వామివారి పట్ల ఉన్న భక్తికి ఆశ్చర్యపోయింది పెళ్ళికూతురు. అక్కడే ఉన్న బంధుమిత్రులందరూ శేషాచలం కొండల వైపు తిరిగి గోవిందలు పలికారు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు