మగపిల్లలు లేని తల్లిదండ్రులు తమకున్న ఆడపిల్లలనే మగపిల్లలుగా భావిస్తూ పెంచుతుంటారు. ఈ క్రమంలో వారికి తగినంత స్వేచ్ఛనిస్తూ, సమస్తం సమకూరుస్తుంటారు. దీంతోవారు తమకు మగపిల్లలు లేరనే లోటును మరచిపోతుంటారు. ఇదిలా ఉంచితే నేటి కాలంలో ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు చెందిన ఒక తండ్రి తన కుమార్తెలోనే కుమారుడిని చూసుకున్నాడు. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు గుర్రపు స్వారీ చేయడాన్ని చూస్తుంటాం. కానీ ఖాండ్వాలో ఒక వధువు గుర్రపు స్వారీ చేసింది. దీనిని ఆమె తన తండ్రి కోరికను నెరవేర్చేందుకే చేసింది. ఖాండ్వాకు 8 కి.మీ. దూరంలో ఉన్న సుర్గావ్ జోషి గ్రామానికి చెందిన రైతు నానాజీ చౌదరి కుమార్తె వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నానాజీ చౌదరి తన కుమార్తెను కొడుకులా భావించి పెంచిపెద్ద చేశాడు. ఇప్పుడు తన కుమార్తె పెళ్లిలోనూ తనకు కుమారుడు ఉన్న ముచ్చటను తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో తన కుమార్తెను గుర్రంపైకి ఎక్కించి, ఊరేగింపుగా వివాహ వేదికవద్దకు తీసుకువచ్చాడు. ఆమె వెనుక కుటుంబ సభ్యులు నృత్యాలు చేసుకుంటూ వచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. పెళ్లి కుమార్తె భాగ్యశ్రీ చౌదరి ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అజయ్ జిరాతిని వివాహం చేసుకున్నారు.
ఈ సందర్భంగా వధువు బంధువు రవీంద్ర చౌదరి మాట్లాడుతూ భాగ్యశ్రీని ఆమె తండ్రి.. కుమారునిలా పెంచారని, పెళ్లిలో ఆమెను గుర్రంపైకి ఎక్కించాలని అనుకున్నారన్నారు. ఆయన కోరిన విధంగానే తామంతా గుర్రాన్ని తీసుకువచ్చి ఊరేగింపు వేడుక నిర్వహించామన్నారు. వధువు భాగ్యశ్రీ మాట్లాడుతూ తాను గుర్రంపై కూర్చుని ఊరేగింపుగా వివాహవేదిక వద్దకు చేరుకోవాలనేది తన తండ్రి కల అని, అది ఇప్పుడు నెరవేరిందన్నారు.
ఇది కూడా చదవండి: ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం
Comments
Please login to add a commentAdd a comment