ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది.
కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నాఇంకేం కావాలి.
ఇదీ చదవండి: గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!
‘సీతారాముల్లా ఉండండి!‘ అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు! అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? ‘పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!‘ అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment