
యేసు ప్రభువు వారి అసాధారణ బోధ ఏమంటే, ‘నిన్ను ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల నీ గొప్పతనం ఏముంది? నీకు కలిగే ఫలం ఏమిటీ?’ అంటే సత్యవిషయమైన ప్రేమను అవలంబించుట ద్వారా దేవుని మెప్పు, సంఘ ప్రోత్సాహాలను పొందుకో గలుగు తాము. సత్యలేఖన ఆజ్ఞల ప్రేరేపణతో ఇక తప్పక అనుసరించదగిన రీతిలో ఉన్నట్టి దైవికప్రేమను చేతలపరంగా చూపుటే సత్యప్రేమ. అది క్రియలలో కనుపరచేదే తప్ప, అది ఏనాడూ తీయని నోటిమాటలతో వ్యక్తం చేయదగ్గది కానేకాదు. పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపట విశ్వాసం వంటివి ఉన్నతంగా ప్రేమించడానికి కావలసిన అర్హతలు.
ప్రేమించే వారికి తప్పక కొన్ని అర్హతలు ఉండే తీరాలని బైబిలు పదే పదే చెబుతుంది. ప్రేమ ఏనాడూ కీడు చేయక అది ఎప్పుడూ మేలే చేస్తుంది. కాబట్టి, ఆలస్యం చేయక ప్రేమించాలి. ఆతురతతో ప్రేమించాలి. ఆత్మసంబంధ ప్రేమతో ప్రేమాతురతతో వేగంగా ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రేమించడం ఇరువురి ఆత్మలకు అది బహు మేలే.
ప్రేమ పట్ల ఆతురత, క్రీస్తు ప్రేమాతురత ఎప్పుడూ మంచిదే. ఈ విధానం మంచే చేస్తుంది. క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించుకోవడం అంటే ఎలాంటి సమస్యనైనా, కీడునైనా, ప్రతికూలతలనైనా ప్రేమతో దీటుగా ఎదుర్కోవడం. యుక్తంగా, ఉన్నతంగా, అసాధారణ రీతిలో ఇలా సమాజాన్ని ప్రేమించడం. ఆత్రుతతో ప్రేమించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. అయితే ప్రేమాతురతకు కొన్ని అర్హతలు, లెక్కలంటూ ఉన్నాయి.అపొస్తలుల బోధను యెడతెగక వింటూ, వారి సువార్త ద్వారా రక్షించబడి, పరిశుద్ధాత్మను వరంగా పొందుకొని, లేఖనానుసార సంఘంతో అవినాభావ సహవాస బాంధవ్యం, భాగ్యం కలిగినవారే తమ తోటి వారిని, ఈ సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ఇలా ఉన్నతంగా ప్రేమించగలుగుతారు. వారికి అవసరమైన పరిచర్యల విషయమై సకాలంలో స్పందించి కార్యరూపంలో వాటిని అందించగలుగుతారు. ప్రేమించే వారికే ఈ అర్హతలు తప్ప అవసరార్థులకు, లబ్ధిదారులకు, బాధితులకు ఈ అర్హతలు ఉండనవసరం లేదు.
దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ దేవునిది. ప్రేమ దేవుని నుండి వస్తుంది. ప్రేమ దేవ స్వభావం. నిజమైన ప్రేమ ఆత్మ సంబంధమైనది. ప్రేమ ఆత్మకు సంబంధించిన ఫలం. ఇలాంటి దైవిక ప్రేమ ఎప్పుడూ గుర్తింపు, గౌరవాలను ఆశించదు. మాటతో నాలుకతో కాక, క్రియతో సత్యంతో ప్రేమించాలి. పవిత్ర హృదయంతో, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసంతో ప్రేమించాలి అనునదే క్రీస్తు వారి అ పొస్తలుల బోధ.
ఒక్కటే క్రీస్తుశరీరం అను లేఖనానుసార సంఘంలో చేర్చబడి ఒక్కటే అను లేఖనానుసార బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ వరం పొందుకొనునప్పుడే ఈ పై అర్హతలు అన్నీ సునాయాసంగా అందివస్తాయని గ్రంథం ఘోషిస్తోంది. వాస్తవమైన జీవాన్ని సం΄ాదించే క్రమంలో, నిజానికి ఆత్మసంబంధ ప్రేమను గూర్చి మాత్రమే ఇలా చెప్పబడుతూ ఉంది. లోకంలో ఎన్నో ప్రేమలు ఉండవచ్చు. రోజురోజుకు ఏదో ఒకటి కొత్తగా పుట్టుకురావచ్చు. ఆత్మప్రేమ ఇలాంటిది కాదు. ఈ అర్హతలు ఇప్పుడిప్పుడే తక్షణమే తాజాగా సం΄ాదించిన వ్యక్తికి తప్పక ఇక ప్రేమించకుండా ఉండలేని పరిస్థితులు తలెత్తుతాయి. అర్హతలు, అనుమతులు రాగానే అతడు ఒకచోట స్థిరంగా ఎలా ఉంటాడు? తనలోని ప్రేమను బట్టి హుందాగా పరదేశిలా, యాత్రికునిలా ప్రవర్తిస్తాడు.
‘ఒకడు తాను చూచిన తన తోటివానిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లు ప్రేమింపగలడు?’ అన్నది గ్రంథపు బోధవాక్యం. నిన్ను వలె నీ ΄÷రుగువానిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. యావత్తూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే అనేది గ్రంథపు విలువైన సమాచారం. యుక్తంగా దేవుణ్ణి ప్రేమించాలంటే అనగా సర్వమానవాళిని క్రీస్తు ప్రేమతో ఆ స్ఫూర్తితో ప్రేమించాలంటే మాత్రం ఇట్టి అర్హతలు కలిగి ప్రేమించక తప్పదు. మొదటగా ఈ అర్హతలు సంపాదించకుండా ప్రేమిస్తే అది ఇరువురి మధ్య క్షేమాభివృద్ధి కలిగించదు. ఈ అర్హతలు కలిగి వాటిని ఉన్నతంగా అమలులో పెడుతూ, చేతల పరిచర్యలతో ప్రేమించేవారే దైవికంగా తమ ప్రేమను ఇతరులకు పంచగలుగుతారు. తన తోటివ్యక్తిని ప్రేమిస్తే ఆ దేవ దేవుణ్ణి ప్రేమించినట్టే. ప్రేమ కలిగి సత్యం చెప్పే క్రీస్తు ప్రేమ ప్రచారం అను సువార్త ప్రకటన పరిచర్యలకు అర్హులనే సంఘం నియమించి అనుమతిస్తుంది. అంతియొకయలో ఉన్న సంఘం సద్భక్తితో మార్పు చెందిన పౌలు అనబడిన సౌలును అన్యజనుల పరిచర్య నిమిత్తం ప్రత్యేకంగా కేటాయించి పంపింది. అతడు భూ దిగంతముల వరకు వెళ్ళి క్రీస్తుప్రేమను వ్యాప్తి చేయడం గమనార్హం. ‘క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది’ అన్న పౌలు మహశయుని మాటలో అర్హత, ప్రేమాతురత ఈ రెండూ ఉండుటను మనం తేటగా గుర్తిస్తాము. ఈ సమాజాన్ని ఉన్నతంగా ప్రేమించాలనే సదుద్దేశం కలిగినవారమై తేటగా క్రీస్తు అడుగు జాడలను గుర్తిస్తే అవే మనలను అర్హతల బాట పట్టిస్తాయి.
– జేతమ్
Comments
Please login to add a commentAdd a comment