కోపాన్ని దిగమింగినవాడే సిసలైన శూరుడు | What Is Anger Management, Know How To Control Anger And Express In A Healthy Way | Sakshi
Sakshi News home page

కోపాన్ని దిగమింగినవాడే సిసలైన శూరుడు

Published Thu, Feb 6 2025 12:01 PM | Last Updated on Thu, Feb 6 2025 5:31 PM

Anger management how to control anger and express in a healthy way

కోపం మానవుల ఆగర్భ శతృవు. అది అనేక అనర్ధాలకు హేతువు. కోపం అభివృధ్ధి నిరోధకం. కోపంలో మనిషి తనపై తాను అదుపును కోల్పోతాడు. కోపంలో మనిషి దుర్భాషలాడతాడు. కొట్లాటకు దిగుతాడు. భార్యా బిడ్డలపై చేయి చేసుకుంటాడు. అసభ్య పదజాలం ప్రయోగిస్తాడు. చిన్నాపెద్దా వయోభేదాన్ని కూడా పాటించడు. కోపంలో మనిషి ఎవరి మాటా వినే పరిస్థితిలో ఉండడు. హత్యలు చేయవచ్చు. ఆత్మహత్యకూ పాల్పడవచ్చు. కోపస్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేడు. క్షణికావేశానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. రెప్పపాటులో చేసే ఆ చిన్న తప్పువల్ల జీవిత కాలానికి సరిపడా చేదు అనుభవాలు మిగిలినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

అసలు ఒకటనేమిటి? నేడు సమాజంలో జరుగుతున్న అనేక అనర్ధాలకు కోపమే కారణమంటే అతిశయోక్తికాదు. మరి ఈ కోపమనే శత్రువును పారద్రోలాలంటే ఏం చెయ్యాలి? దీనికి దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఒక ఉపాయం చెప్పారు. కోపం వచ్చినప్పుడు నియంత్రించుకోవాలంటే, మనిషి తాను ఉన్నచోటునుండి పక్కకు జరగాలి. అంటే ఆ చోటును వదిలేయాలి. నిలబడి ఉంటే కూర్చోవాలి. కూర్చొని ఉంటే పడుకోవాలి. ఇలా చేయడంవల్ల కోపం అదుపులోకొస్తుంది. అంతకూ ఇంకా కోపం తగ్గకపోతే, వజూ చేయాలి. అంటే నియమబద్ధంగా చేతులూ, ముఖమూ, కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే, ఆగ్రహం షైతాన్‌ ప్రేరణ వల్ల కలుగుతుంది. షైతాన్‌ సృజన అగ్నితో జరిగింది. అగ్ని నీటితో ఆరుతుంది. కనుక షైతాన్‌ ప్రేరణతో కలిగిన ఆగ్రహం చల్లారాలంటే నీటిని ఉపయోగించాలి. వజూచేయాలి. ఇలాచేస్తే తప్పకుండా కోపం మటుమాయమవుతుంది.

వాస్తవానికి, కోపం రావడమన్నది మానవ సహజమే. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. కాని కోపంలో విచక్షణ కోల్పోకపోవడమే గొప్పతనం. కోపానికి లోనై జుట్టుపీక్కోవడం, చిర్రుబుర్రు లాడడం, అయిందానికీ, కానిదానికి ఎవరిపైబడితే వారిపై విరుచుకుపడడం, చేతిలో ఏముంటే అది విసిరి కొట్టడం, నోటికొచ్చినంత మాట్లాడడం, బూతులు లంకించుకోవడం ఇవన్నీ ఉన్మాదపు చేష్టలు. మానవ ఔన్యత్యానికి ఏ మాత్రం శోభించని లక్షణాలు. అసలు ఏకోశానా ఇది వీరత్వమూకాదు, ధీరత్వమూకాదు. మానవత్వమూ కాదు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్‌ (స)’కుస్తీలో ప్రత్యర్ధిని మట్టికరిపించే వాడు వీరుడు కాదు. తనకు కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా నిగ్రహించుకున్నవాడే అసలైన వీరుడు, శూరుడు’.అన్నారు.

ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వి

కనుక, కోపం మానవ సహజమే అయినప్పటికీ, దానిపై అదుపుకలిగిఉండాలి. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా ప్రవర్తించకూడదు. తాను కోపగించుకొని, కస్సుబుస్సులాడి ఏం సాధించగలనని ఆలోచించ గలగాలి. అందరికంటే బలవంతుడు దైవం ఉన్నాడని, ఏదో ఒకరోజు ఆయన ముందు హాజరు కావలసిందేనని, ఆయన అందరి మనోస్థితులూ తెలిసిన సర్వజ్ఞాని అని తెలుసుకొని, విచక్షణాజ్ఞానంతో మసలుకుంటే ఎటువంటి అనర్ధాలూ ఉండవు. కోపానికి దూరంగా ఉంటే జీవితమంతా సంతోషమే. 

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement