![Sri Penuganchiprolu Lakshmi Tirupatamma Mangalagiri Guntur](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Tirup1.jpg.webp?itok=25tCFhYW)
భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఆమె. పెళ్లిళ్లు చేసుకునే కొత్త జంటలకు ఆమె ఆశీస్సులు చాలని భక్తుల నమ్మకం. ఆ దేవత కొలువుంటే పవిత్ర పుణ్యక్షేత్రమే ఎన్టీఆర్‌జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారి దేవస్థానం. ఇది ఉమ్మడి జిల్లాలో విజయవాడ శ్రీకనకదుర్గమ్మవారి ఆలయం తరువాత రెండవ స్థానంలో ఉంది.
విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట, నందిగామకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే భక్తులతో అలరాలుతోంది. 17వ శతాబ్దంలో పెనుగంచిప్రోలు సమీప గ్రామాల్లో సాక్షాత్తు శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వరప్రసాదినిగా జన్మించిన తిరుపతమ్మ బాల్యదశలోనే సకల శాస్త్ర΄ారంగమూర్తిగా పేరు గాంచింది.
తల్లిదండ్రులు కొల్లా రంగమాంబ, శివరామయ్యలకు పేరు తెచ్చే విధంగా తోటి బాలబాలికలకు జ్ఞానమార్గం బోధిస్తూ యుక్త వయస్సు వచ్చిన తిరుపతమ్మను పెనుగంచిప్రోలులోని సమీప బంధువులైన కాకాని వంశీయులు కృష్ణయ్య, వెంగమాంబ దంపతుల కుమారుడు గోపయ్యకు ఇచ్చి వివాహం చేశారు.
తిరుపతమ్మ రాకతో కాకాని వారి కుటుంబం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లినప్పటికీ తోటికోడలు చంద్రమ్మ అసూయ వల్ల అత్త వెంగమాంబ మనస్సు మారటంతో అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయి. అదే సమయంలో కరువు తాండవించటంతో గోవులకు మేతకోసం గోపయ్య జీతగాళ్లతో ఆవుల మందను తీసుకుని ఉత్తరారణ్యాలకు వెళ్లాడు.
కాలమహిమ అన్నట్లుగా తిరుపతమ్మకు కుష్ఠువ్యాధి సోకింది. దాంతో అత్త, తోటికోడళ్లు పట్టించుకోకుండా పశువుల పాకలోకి నెట్టేశారు. ఆ సమయంలో ముదిరాజ్ వంశానికి చెందిన పాపమాంబ ఆమెకు సేవలు చేసింది. ఆమె వంశానికి చెందిన వారే నేటికీ ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయంలో జరిగే క్రతువుల్లో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఒక్క పెనుగంచిప్రోలు ఆలయంలోనే మనకు కనిపిస్తాయి.
గోవుల మేతకోసం అడవులకు వెళ్లిన గోపయ్య పులి రూపంలో వచ్చిన పెద్దమ్మ తల్లితో పోరాడి వీరమరణం పొందారు. భర్త మరణాన్ని ముందుగానే ఊహించిన తిరుపతమ్మ ప్రాయోపవేశానికి నిర్ణయించుకుంటుంది. ఆనాటి మునసబు కర్ల ముత్యాలనాయుడు, కరణం శ్రీశైలపతి సమక్షంలో మహిమలు చూపి భర్తతోపాటు సహగమనం చేస్తుంది.
యోగాగ్నిలో తనువు చాలించిన చోట కాలక్రమంలో తన ప్రతిమతోపాటు గోపయ్య ప్రతిమ కూడా వెలుస్తుందని చెప్పింది. దానికిముందు ఆమె పతివ్రతా ధర్మాలను బోధించినట్లు చరిత్ర చెబుతోంది. తదుపరి పెద్దల సమక్షంలో ఆలయ నిర్మాణం జరగగా, నేడు కోట్లాది రూపాయలతో సుందర నిర్మాణం రూపు దాల్చింది. ఆలయం పక్కనే పవిత్ర మునేరు, మామిడి తోటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
పదుల సంఖ్యలో పెళ్లిళ్లు....
పెళ్లిళ్ల సీజన్‌లో ప్రతిరోజూ సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారికి ఆలయంలో నిత్య కల్యాణం తోపాటు ఏడాదికి ఒక సారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.
యోగాగ్నిలో ప్రవేశించిన తరువాత చితిమంటలు నుంచి తన భర్త ప్రతిమ, తన ప్రతిమతోపాటు పసుపు–కుంకుమలు వస్తాయని ఆరోజు నుంచి తనను కొలిచిన వారికి నిత్య సుమంగళితనం, సంతానం, సిరిసంపదలు ప్రాప్తమవుతాయని తిరుపతమ్మ చెప్పింది.
అందుకు తగినట్లుగా ప్రధానాలయంలోని అమ్మవారి విగ్రహం చేతిలో కుంకుమ భరిణ ఉంటుంది. అందుకే ఆమె సమక్షంలో కల్యాణం చేసుకుంటే మంచిదని భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేనివారు అమ్మ సన్నిధిలో ముడుపులు కడతారు. నిత్యం అన్నప్రాశనలు, కుంకుమపూజలు నిర్వహిస్తారు.
ఏటా ఉత్సవాలు..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అన్ని కులాల వారికి సంబంధించిన క్రతువులతో, యజ్ఞ యాగాదులతో అలరారుతున్న తిరుపతమ్మవారి అమ్మవారి పెద్ద తిరునాళ్ల ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు, చిన్న తిరునాళ్ల ఫాల్గుణమాసంలో ఐదు రోజుల పాటు విశేషంగా జరుగుతాయి.
ఆ ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఏడాది పెద్ద తిరునాళ్ల, కల్యాణ ఉత్సవాలు ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు జరగనున్నాయి. వీటితోపాటు ప్రతి రెండేళ్లకు ఒకసారి రంగుల ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతినెలా చండీహోమం, నిత్యం గోపూజ, కుంకుమపూజ, అభిషేక పూజ వంటి పూజలు జరుగుతుంటాయి. నిత్యం అమ్మవారికి భక్తులు పాలు, గంగళ్లతో బోనాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.
పులికొండ సాంబశివరావు,
సాక్షి, పెనుగంచిప్రోలు
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment