కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్లా గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరం తో విష్ణుసాయుజ్యాన్ని పొందుతాడు భీష్ముడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులూ భీష్మపంచకంగా ప్రసిద్ధికెక్కుతాయనీ, ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా... పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు.
ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈరోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్ర నామాలతో పూజించిన పాండడవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.
తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన్రపాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన ‘విష్ణుసహస్రనామస్తోత్రం’ ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే వుంది.
ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరం, సకల శుభకరం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం. భీష్మ ఏకాదశిన అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రాచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేకపూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని, ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతాయనీ పెద్దలు చెబుతారు.
ఈవేళ ఇవి నిషిద్ధం..
మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికీ దూరంగా ఉండాలి.
ఉపవాస దీక్ష చేపట్టాలి.
ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.
ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకుడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుంది.
తెల్లవారు జామునే నిద్ర లేవాలి..
మధ్యాన్నం కునుకు తీయకూడదు.
ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ.. రాత్రంతా జాగారం చేయాలి.
జుట్టు కత్తిరించకూడదు.
ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు.
విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచిది.
పేదవారికి, ఆకలి అన్నవారికి ఈ రోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం.
ఈవేళ ఇలా చేయాలి
పూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం’’ఓం నమోనారాయణాయ’’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.
భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. అభ్యంగ స్నానం చేసి.. పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించ వలసి ఉంటుంది.
--డి.వి.ఆర్
(చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!)
Comments
Please login to add a commentAdd a comment