సాక్షి, హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఈనెల 26వ తేదీనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పెన్షనర్లకు కూడా 26వ తేదీనే పింఛను చెల్లించనుంది. దసరా, బతుకమ్మ పండుగలుండటంతో 28వ తేదీలోగా జీతాలు, పించన్లు చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఆ తేదీ కంటే రెండ్రోజుల ముందే వేతనాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులందరికీ వేతనాలు అందేలా చూడాలని తెలంగాణ ఖజానా శాఖ సంచాలకులను ఆదేశించారు.