ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో వరుసగా రెండవ రోజు 18 పైసలు బలహీనపడి 74.52 వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో రూపాయి 50 పైసలు నష్టపోయింది. అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం భయాలు, సరళతర ద్రవ్య విధానానికి ముగింపు పడుతోందన్న సంకేతాలు, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలోపేత ధోరణి వంటి అంశాలు తాజాగా రూపాయి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 74.44 వద్ద ప్రారంభమైంది.
ఒక దశలో 74.59 గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివరకు బుధవారం ముగింపుతో పోల్చితే 18 పైసలు బలహీనపడి (బుధవారం ముగింపు 74.34) 74.52 వద్ద ముగిసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అమెరికాలో 1990 తర్వాత ఎన్నడూ లేనంత పెరగడంతో, వడ్డీరేట్లు పెరుగుదల అంచనాలు అధికమయ్యాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా డాలర్ పెట్టుబడులు వెనక్కు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల బలహీనతకు దారితీస్తోంది. చైనాలో కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించి ద్రవ్య్లోల్బణం అంచనాకు మించి (12.03 శాతం) 26 ఏళ్ల గరిష్ట స్థాయి 13.05 %కి పెరగడం గమనార్హం. కాగా, డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 95పైన ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర 82 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ర్రూడ్ 83 డాలర్ల పైన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment