Dollar Index
-
Sensex : జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద
ముంబై: స్టాక్ సూచీల నష్టాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్– ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 వద్ద నిలిచింది. నిఫ్టీ 223 పాయింట్లు బలపడి 22,643 వద్ద నిలిచింది. సెన్సెక్స్ పరుగుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.48 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.406 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని 30 షేర్లలో హెచ్‌సీఎల్ టెక్(– 6%), ఐటీసీ (–0.44%), విప్రో(–0.37%), బజాజ్‌ఫిన్‌సర్వ్(–0.10%) మాత్రమే నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగసి 74,671 వద్ద, నిఫ్టీ బలపడి 236 పాయింట్లు దూసుకెళ్లి 22,656 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఐటీ, ఆటో, రియల్టీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.79%, 0.07% చొప్పున రాణించాయి. ఆల్‌టైం హైకి బ్యాంక్ నిఫ్టీ: ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, పీఎస్బీ షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో ట్రేడింగ్‌లో బ్యాంక్ నిఫ్టీ సైతం 49,474 వద్ద ఆల్ టైం హైని నమోదు చేసింది. చివరికి 1,223 పాయింట్ల లాభంతో 49,424 వద్ద ముగిసింది. మొత్తం ఈ సూచీలో 12 షేర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(3.30%), బంధన్ బ్యాంక్(0.20%) మాత్రమే నష్టపోయాయి.ఐసీఐసీఐ బ్యాంక్ఃరూ.8 లక్షల కోట్లు క్యూ4లో నికర లాభం 18% వృద్ధితో ఐసీఐసీఐ బ్యాంకు షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో 4.5%పెరిగి రూ.1,159 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% ఎగిసి రూ.1,163 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.36,555 కోట్లు పెరిగి రూ.8 లక్షల కోట్లపైన రూ.8.14 లక్షల కోట్లకు చేరింది క్యాపిటలైజేషన్ పరంగా రూ.8 లక్షల కోట్లు దాటిన అయిదో కంపెనీగా నిలిచింది. -
22,000 దిగువకు నిఫ్టీ
ముంబై: బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను 17 ఏళ్ల తర్వాత పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు భారత్ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫెడరల్ రిజర్వ్ ద్రవ పాలసీ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్రెండ్ క్రూడాయిల్ బ్యారెల్ ఫ్యూచర్స్ ధర అయిదు నెలల గరిష్టం 85 డాలర్లపైకి ఎగిసింది. జపాన్ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఈ పరిణామాలతో మంగళవారం సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 72,012 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238 పాయింట్లు పతనమై 22,000 స్థాయిని కోల్పోయి 21,817 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు నెల కనిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం బలహీనంగా మొదలైంది. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 815 పా యింట్లు క్షీణించి 72,000 స్థాయి దిగువున 71,933 వద్ద, నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 21,793 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు కొనసాగాయి. జపాన్ ఎకానమీకి జోష్! ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ పురోగమన బాటన పడుతున్నట్లు కనిపిస్తోంది. 17 సంవత్సరాల నెగటివ్ రుణ రేటు వ్యవస్థకు 4.2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ముగింపు పలికింది. బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇచ్చే ఓవర్‌నైట్ రుణ రేటు మైనస్ 0.1 శాతం నుంచి ప్లస్ 0–0.1 శాతం శ్రేణికి పెరిగింది. రూ. 4.86 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ ఒక శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.4.86 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.373 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఈ సూచీలో 30 షేర్లకు గానూ ఏడు మాత్రమే లాభపడ్డాయి. టీసీఎస్ నిరాశ.. టీసీఎస్ షేరు రెండేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రమోటర్ సంస్థ టాటా సన్స్ బ్లాక్ డీల్ ద్వారా 2.3 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ట్రేడింగ్‌లో నాలుగున్నర శాతం క్షీణించి రూ. 3,967 వద్ద రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 4% నష్టంతో రూ.3,978 వద్ద ముగిసింది. పాపులర్ వెహికల్స్ పేలవం పాపులర్ వెహికల్స్ అండ్ సర్విసెస్ లిస్టింగ్ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.295)తో పోలిస్తే బీఎస్ఈలో 1% డిస్కౌంట్‌తో రూ.292 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% క్షీణించి రూ.263 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ.276 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,967 కోట్లుగా నమోదైంది. -
రికవరీకి అవకాశాలు
ముంబై: గతవారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, ట్రేడింగ్‌కు సంబంధించి ఈ ఏడాదికి ఇదే ఆఖరి వారం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది. కావున భారీ లాభాలైతే కనిపించకపోవచ్చు. ప్రపంచ పరిణామాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. చైనాతో పాటు పలుదేశాల కోవిడ్ కేసుల నమోదు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో గతవారంలో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. ‘సాధారణంగా ప్రతి ఏడాది చివరి రోజుల్లో ఫండ్ మేనేజర్లు ఖాతాల్లో సర్దుబాట్లు చేస్తుంటారు. అందులో భాగంగానే గతవారంలో లాభాల స్వీకరణ జరిగింది. సూచీలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలు మద్దతు లభించవచ్చు. రికవరీ జరిగితే నిఫ్టీకి 18,000 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,700 స్థాయిలో తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోతే 17400 వద్ద మరో మద్దతు స్థాయి లభించొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ► కొత్త వేరియంట్ బీఎఫ్.7 ఆందోళనలు చైనాతో పాటు పలు కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసుల నమోదు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తుంది. భారత్‌పై ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.., కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అధికార గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లపై ఈ రకం వేరియంట్ కేసలు నమోదు ప్రభావం స్వల్పకాలం పాటు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ► ఆర్థిక గణాంకాలు చైనా, జపాన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వరుస మంగళ, బుధవారాల్లో విడుదల కానున్నాయి. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం, భారత నవంబర్ ద్రవ్యలోటు శుక్రవారం వెల్లడి కానున్నాయి. అదేరోజున ఆర్బీఐ డిసెంబర్ 23 తేదీన ముగిసి వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 16వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ► ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(డిసెంబర్ 30న) నిఫ్టీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,500–17,800 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ► రెండు లిస్టింగులు, రెండు పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది ఆఖరి వారంలో రెండు ఐపీఓలు రాను న్నాయి. అలాగే పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న రెండు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నా యి. గతవారంలో (23న) ప్రారంభమైన రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ మంగళవా రం ముగిస్తుంది. షాలీ పాలీమర్స్ ఇష్యూ డిసెంబర్ 30–జనవరి 22 తేదీల మధ్య జరగనుంది. కేఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ గురువారం ఉండగా, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ షేర్ల లిస్టింగ్ శుక్రవారం ఉంది. -
ప్రపంచ మార్కెట్లు, గణాంకాల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో కనిపించే ట్రెండ్ ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచి కాగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా బుధవారం(5న) మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఆర్థిక గణాంకాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ జోరు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తీరు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ విశ్లేషకులు వివరించారు. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుండటంతో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 115ను దాటేసింది. మరోపక్క ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 3.5 శాతాన్ని మించాయి. దీంతో దేశీ కరెన్సీ రూపాయి కొత్త చరిత్ర లిఖిస్తూ 82కు పతనమైంది. ఇది రిజర్వ్ బ్యాంక్ వద్ద గల విదేశీ మారక నిల్వలను సైతం దెబ్బతీస్తోంది. ఇందుకు కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) జీడీపీలో 2.8 శాతానికి చేరడం సైతం ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వెరసి ఈ వారం మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అత్యధిక శాతం మంది నిపుణులు అంచనా వేశారు. చమురు సెగ తగ్గినా.. ఇటీవల ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్యారల్ 80–85 డాలర్ల వద్ద కదులుతున్నాయి. ఇది సానుకూల అంశమే అయినప్పటికీ డాలరు బలపడుతుండటంతో ఈ ప్రభావం ఆవిరౌతున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో సెంటిమెంటు బలహీనపడుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు మరోపక్క కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర అమ్మకందారులుగా నిలుస్తుండటం మార్కెట్లను దెబ్బతీస్తున్నట్లు ప్రస్తావించారు. దీంతో వరుసగా ఏడు రోజులపాటు క్షీణపథంలో సాగిన మార్కెట్లు గత వారం చివర్లో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 672, నిఫ్టీ 233 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకున్నాయి. కాగా.. ఈ వారం సెప్టెంబర్ నెలకు యూఎస్, జపాన్ తయారీ రంగ(పీఎంఐ) గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా ఆటో విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ఆటో షేర్లు వెలుగులో నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్ విలువకు చిల్లు గత వారం మార్కెట్ల పతనంతో టాప్–10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 1.16 లక్షల కోట్లు ఆవిరైంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 41,706 కోట్లు నీరసించి రూ. 16.08 లక్షల కోట్లకు పరిమితంకాగా.. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ విలువ రూ. 17,314 కోట్ల నష్టంతో దాదాపు రూ. 4.74 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 13,806 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 13,424 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ. 10,831 కోట్లు చొప్పున విలువను కోల్పోయాయి. ఇదేవిధంగా మార్కెట్ విలువలో బజాజ్ ఫైనాన్స్‌కు రూ. 10,241 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 8,732 కోట్లు చొప్పున చిల్లు పడింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ. 20,145 కోట్లమేర ఎగసి రూ. 5.94 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ను ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే సంగతి తెలిసిందే. ఎఫ్‌పీఐల యూటర్న్ దేశీ క్యాపిటల్ మార్కెట్లలో గత రెండు నెలలుగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. ఫలితంగా సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. వీటితో కలిపిచూస్తే 2022లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1.68 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్లు, జులైలో దాదాపు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. జులైకు ముందు అంటే 2021 అక్టోబర్ మొదలు ఎఫ్‌పీఐలు వరుసగా తొమ్మిది నెలలపాటు విక్రయాలకే కట్టుబడటం గమనార్హం! ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ట్రెజరీ ఈల్డ్స్, డాలరు జోరు వంటి అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, జర్మనీకి ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. ఇటీవల పెరిగిన ఆర్థిక మాంద్య భయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు షాకిస్తున్నట్లు వివరించారు. -
మార్కెట్లకు ఫెడ్ దెబ్బ
ముంబై: ఆర్థికవేత్తల ఆందోళనలను నిజం చేస్తూ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మూడోసారి 0.75 శాతం పెంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించింది. 59,120 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల వెనకడుగుతో 17,630 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం 3.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేట్లను ఈ ఏడాది చివరికల్లా 4.4 శాతానికి చేర్చే వీలున్నట్లు ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 111ను దాటింది. ఫలితంగా రూపాయి ఇంట్రాడేలో 100 పైసలు కోల్పోయి చరిత్రాత్మక కనిష్టం 80.96కు చేరింది. వీటికితోడు ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సైనిక బలగాలను పెంచుతుండటంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 17,723–17,532 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. అయితే ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఒక దశలో సెన్సెక్స్ నామమాత్ర లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం! మీడియా అప్ ఫెడ్ బాటలో ఇతర కేంద్ర బ్యాంకులూ కఠిన విధానాలను అవలంబించనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వర్ధమాన మార్కెట్లలో కరెన్సీలు, ఈక్విటీలు నీరసిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 1.4 శాతం నీరసించగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, ఆటో రంగాలు 1.9–0.7 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, శ్రీసిమెంట్, బీపీసీఎల్ 3–1.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టైటన్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఐషర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐటీసీ 2.8–1.4 శాతం మధ్య ఎగశాయి. చిన్న షేర్లు ఓకే.. తాజాగా చిన్న షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌క్యాప్స్ 0.5–0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,510 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 263 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► పట్టణీకరణతోపాటు వినియోగం పెరుగుతుండటంతో జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 53,225 వద్ద ముగిసింది. ► రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజిస్తుండటంతో ఐటీ సేవల కంపెనీ శాక్సాఫ్ట్ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,278 వద్ద స్థిరపడింది. ► ప్రమోటర్ సంస్థ విల్మర్ తాజాగా వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాలకు మద్దతునివ్వడంతో శ్రీ రేణుకా షుగర్స్ 6.5% ఎగసి 60.50 వద్ద క్లోజైంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి ► ఒకేరోజు 83 పైసలు డౌన్ ► 80.79 వద్ద ముగింపు అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు భారీగా 83 పైసలు బలహీనపడి, 80.79 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన ఏడు నెలల్లో (ఫిబ్రవరి 24న 99 పైసలు పతనం) రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో బలహీనపడ్డం ఇదే తొలిసారి. అమెరికా ఫెడ్ రేటు పెంపుతోపాటు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయిని వెంటాడుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. బుధవారం రూపాయి ముగింపు 79.96. ట్రేడింగ్ ప్రారంభంలోనే 80.27 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో ఆల్‌టైమ్ ఇంట్రాడేలో 80.96కు కూడా పడిపోయింది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ఇక ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌పై ఉన్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల ప్రాతిపదిక లెక్కించే డాలర్ ఇండెక్స్ 20యేళ్ల గరిష్టం 111 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ భారీ నష్టంతో 81.18 వద్ద ట్రేడవుతోంది. -
బంగారానికి ‘ద్రవ్యోల్బణం’ భరోసా
ముంబై: ద్రవ్యోల్బణం భయాలు, డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ రికార్డు స్థాయిల వైపు నడుస్తోంది. అమెరికా, చైనా, భారత్‌వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం భయాలు తీవ్రమవుతున్నాయి. దీనితో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు తక్షణం పడిడివైపు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా కదులుతోంది. ఈ వార్త రాస్తున్న 11 గంటల సమయంలో బుధవారం ముగింపుతో పోల్చితే ఔన్స్ 20 డాలర్ల లాభంతో 1,865 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ధర అంతర్జాతీయ సరళిని అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా బులిష్ ధోరణితోపాటు రూపాయి బలహీనత కూడా దేశంలో బంగారానికి వరంగా మారుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో ధర 10 గ్రాములకు రూ. 400 లాభంతో 49,250 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశంలో ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో ధర క్రితంతో పోల్చితే 99.9 స్వచ్చత 10 గ్రాముల ధర రూ.980 లాభంతో రూ.49,351 వద్ద ముగిసింది. 99.5 స్వచ్చత ధర రూ.976 పెరిగి రూ.49,153 వద్దకు చేరింది. కేజీ వెండి ధర రూ.1,814 పెరిగి రూ.66,594 వద్ద ముగిసింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పసిడి కూడా ధర రూ.883 పెరిగి రూ.48,218 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర రూ.1,890 ఎగసి రూ.65,190కి చేరింది. -
రూపాయికి క్రూడ్ సెగ
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో వరుసగా రెండవ రోజు 18 పైసలు బలహీనపడి 74.52 వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో రూపాయి 50 పైసలు నష్టపోయింది. అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం భయాలు, సరళతర ద్రవ్య విధానానికి ముగింపు పడుతోందన్న సంకేతాలు, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలోపేత ధోరణి వంటి అంశాలు తాజాగా రూపాయి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 74.44 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 74.59 గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివరకు బుధవారం ముగింపుతో పోల్చితే 18 పైసలు బలహీనపడి (బుధవారం ముగింపు 74.34) 74.52 వద్ద ముగిసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అమెరికాలో 1990 తర్వాత ఎన్నడూ లేనంత పెరగడంతో, వడ్డీరేట్లు పెరుగుదల అంచనాలు అధికమయ్యాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా డాలర్ పెట్టుబడులు వెనక్కు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల బలహీనతకు దారితీస్తోంది. చైనాలో కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించి ద్రవ్య్లోల్బణం అంచనాకు మించి (12.03 శాతం) 26 ఏళ్ల గరిష్ట స్థాయి 13.05 %కి పెరగడం గమనార్హం. కాగా, డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 95పైన ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర 82 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ర్రూడ్ 83 డాలర్ల పైన ఉంది. -
రూపాయికీ బైడెన్ ‘జో’ష్
ముంబై: డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 46వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న వార్తలతో డాలరు ఇండెక్స్ నీరసిస్తోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండు నెలల కనిష్టానికి చేరింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో తొలుత 74 దిగువన 73.96 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో రూపాయి 73.84 దిగువకు బలపడింది. ప్రస్తుతం 17 పైసల లాభంతో 74.03 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన రూపాయి 18 పైసలు జమ చేసుకుని 74.20 వద్ద ముగిసింది. బ్యాంకుల సపోర్ట్ జో బైడెన్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా తిరిగి వాణిజ్యం ఊపందుకునే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు ఇప్పటికే అమెరికన్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సరళతర మానిటరీ విధానాలకు సిద్ధమని ప్రకటించింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 190 బిలియన్ డాలర్ల అదనపు సహాయాన్ని ప్రకటించింది. దీంతో బాండ్ల కొనుగోలు ద్వారా అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ దాదాపు 900 బిలియన్ పౌండ్లకు చేరనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ అంశాల కారణంగా వాణిజ్య ఆధారిత కరెన్సీల కొనుగోలుకి ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడినట్లు తెలియజేశారు. ప్రధానంగా చైనీస్ యువాన్ 28 నెలల గరిష్టాన్ని తాకగా.. న్యూజిలాండ్ డాలరు 19 నెలల గరిష్టానికి చేరింది. కాగా.. దేశీ స్టాక్ మార్కెట్లో ఇటీవల విదేశీ పెట్టుబడులు వెల్తువెత్తుతున్నాయి. దీంతో రూపాయి బలపడుతున్నట్లు ఫారెక్స్ వర్గాలు వివరించాయి. ఈ నెల తొలి 5 రోజుల్లో నగదు విభాగంలో ఎఫ్ పీఐలు రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
రెండో రోజూ రూపాయి పరుగు
ముంబై: ఈ వారం మొదట్లో సాంకేతికంగా కీలకమైన 75 సమీపానికి నీరసించిన దేశీ కరెన్సీ వరుసగా రెండో రోజు కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో తొలుత 40 పైసలు(0.5 శాతం) జంప్ చేసి 73.98ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 74 దిగువకు బలపడింది. తొలుత ఒక దశలో 51 పైసలు పుంజుకుని 73.87 వరకూ పురోగమించింది. అయితే ప్రస్తుతం కాస్త వెనకడుగు వేసింది. 19 పైసల లాభంతో 74.19 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో మారకంలో గురువారం రూపాయి 40 పైసలు లాభపడి 74.38 వద్ద ముగిసింది. కేంద్ర బ్యాంకుల సపోర్ట్ అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరిన్ని మానిటరీ చర్యలను చేపట్టేందుకు సిద్ధమంటూ తాజా పాలసీ సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. మరోపక్క బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తాజా సమీక్షలో స్టిములస్ ను 190 బిలియన్ డాలర్ల మేరపెంచుతూ నిర్ణయించింది. దీంతో బాండ్ల కొనుగోలు ద్వారా అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ దాదాపు 900 బిలియన్ పౌండ్లకు చేరనున్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. అమెరికా ప్రెసిడెంట్ రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ అంశాల కారణంగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల కారణంగా రూపాయి సైతం బలపడినట్లు ఫారెక్స్ వర్గాలు వివరించాయి. గురువారం నగదు విభాగంలో ఎఫ్ పీఐలు రూ. 5,368 కోట్ల పెట్టుబడులను కుమ్మరించడం గమనార్హం. -
కన్సాలిడేషన్‌లో.. బంగారం- వెండి
వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో స్వల్ప నష్టాలతో ముగిసిన బంగారం, వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. కన్సాలిడేషన్ బాటలో అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 78 క్షీణించి రూ. 50,469 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 346 నష్టంతో రూ. 61,330 వద్ద కదులుతోంది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు పుంజుకోవడం, అమెరికా ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితులు వంటి అంశాలు పసిడి ధరలకు చెక్ పెడుతున్న విషయం విదితమే. సెప్టెంబర్‌లో యూఎస్ రిటైల్ సేల్స్ అంచనాలను మించుతూ 1.9 శాతం వృద్ధి చూపడంతో వారాంతాన పసిడి బలహీనపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరగడం ఆర్థిక రికవరీకి సంకేతమని విశ్లేషకులు తెలియజేశారు. శుక్రవారమిలా ఎంసీఎక్స్‌లో వారాంతాన 10 గ్రాముల పసిడి రూ. 160 నష్టంతో రూ. 50,552 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,813 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,452 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. అయితే వెండి కేజీ రూ. 118 బలపడి రూ. 61,653వద్ద నిలిచింది. ఒక దశలో 62,170 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 61,324 వరకూ క్షీణించింది. దేశీయంగా ఆగస్ట్ 7న పసిడి రూ. 56,200 వద్ద, వెండి రూ. 80,000 సమీపంలోనూ రికార్డ్ గరిష్టాలకు చేరిన విషయం విదితమే. కామెక్స్‌లో.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.1 శాతం నీరసించి 1,904 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1901 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి 0.5 శాతం నష్టంతో ఔన్స్ 24.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వారాంతాన వారాంతాన న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 0.15 శాతం నీరసించి 1,906 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో 0.5 శాతం క్షీణించి 1,899 డాలర్లకు చేరింది. అయితే వెండి మాత్రం 0.75 శాతం ఎగసి ఔన్స్ 24.41 డాలర్ల వద్ద స్థిరపడింది. వెరసి పసిడి ధరలు గత వారం 1 శాతం నష్టాలతో నిలిచినట్లు నిపుణులు తెలియజేశారు. -
డాలర్ బలం – రూపాయి బలహీనం
ముంబై: ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ట్రేడయ్యే– డాలర్ ఇండెక్స్ బలోపేతంకావడం రూపాయి సెంటిమెంట్‌పై బుధవారం ప్రభావాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ పారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు బలహీనపడి 73.03 వద్ద ముగిసింది. కరోనా తీవ్ర సవాళ్లు విసరడానికి కొద్ది రోజుల ముందు– మార్చి మధ్యస్థంలో 52 వారాల గరిష్టం 104 వరకూ వెళ్లిన డాలర్ ఇండెక్స్, అటు తర్వాత తీవ్ర ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో క్రమంగా తగ్గుతూ మంగళవారం 52 వారాల కనిష్టం 91.73ను చూసింది. అయితే బుధవారం వెలువడిన అమెరికా తయారీ పరిశ్రమ ఇండెక్స్ ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడంతో డాలర్ కనిష్ట స్థాయిల నుంచి కొంత కోలుకుంది. ఇది రూపాయి సెంటిమెంట్‌పై స్వల్ప ప్రభావాన్ని చూపినట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. అయితే భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక కొనసాగడం, స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగితే, రూపాయి మరింత బలపడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం భారీగా 73 పైసలు లాభపడి 72.87 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
రూపాయి చరిత్రాత్మక పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం భారీగా పతనమయ్యింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు రూపాయి 86 పైసలు (1.16 శాతం) బలహీనపడి 75.12 వద్ద ముగిసింది. ఇంత వరకూ రూపాయి ఈ స్థాయిని ఎప్పుడూ చూడలేదు. కోవిడ్–19 భయాందోళనకర పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు, దేశం నుంచి భారీగా వెనక్కు వెళుతున్న విదేశీ పెట్టుబడులు, ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► గడచిన ఆరు నెలల్లో (2019 సెప్టెంబర్ 3 తర్వాత) రూపాయి ఒకేరోజు 86 పైసలు బలహీనపడ్డం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది మార్చి ఒక్కనెలలోనే రూపాయి విలువ 4 శాతం పతనమయ్యింది. ► బుధవారం రూపాయి ముగింపు 74.26. గురువారం 74.96 వద్ద బలహీన ధోరణిలో ట్రేడింగ్ ప్రారంభమైంది. 74.70 గరిష్టం దాటి ముందుకు వెళ్లలేదు. ఒకదశలో 75.30 కనిష్టాన్ని కూడా చూసింది. ► భారత్ షేర్లు, బాండ్ల నుంచి ఈ నెల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. 2013 ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అనంతరం ఇంత స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ఇదే తొలిసారి. ► బుధవారం దాదాపు 18% పడిన క్రూడ్ ధర, గురువారం అదే స్థాయిలో రికవరీ అవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ► కోవిడ్–19 భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్ని పెట్టుబడుల సాధనాల నుంచీ నిధులు ఉపసంహంచుకుని డాలర్ కోసం వెంటబడుతున్న సంకేతాలు ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 103 దాటేయడం గమనార్హం. ► రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర చూస్తే ఈ నెల 12, 13 తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఈ నెల 18వ తేదీ బుధవారం వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్ ధరల భారీ పెరుగుదల నేపథ్యంలో 2018 అక్టోబర్ 9న రూపాయి ఈ (74.39) చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నాడు ఇంట్రాడేలో 74.45 స్థాయిని కూడా తాకింది. ► తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. ► కరోనా కాటు నేపథ్యంలో కొద్ది వారాల్లో 76.20 వరకూ రూపాయి బలహీనపడే అవకాశం ఉందని కొందరి వాదన. -
కొనుగోలుకు ఇది తగిన సమయమే!
అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో ఆరు వారాల నుంచీ పసిడి పడుతూ వస్తోంది. అయితే పసిడి కొనుగోలుకు ఇది తగిన సమయమని విశ్లేషణలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచీ ఔన్స్ (31.1గ్రా) 1,300 డాలర్ల పైన ఉన్న పసిడి, జూన్ నుంచి పడిపోతూ వచ్చింది. వారం క్రితం ఏకంగా 1,161 డాలర్లను కూడా చూసింది. అంటే దాదాపు ఏడాది గరిష్టాన్ని చూస్తే, దాదాపు 200 డాలర్లు పడింది. అమెరికా వృద్ధి అంచనాలు, ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, డాలర్ ఇండెక్స్ బలోపేతం దీనికి నేపథ్యం. 88.15కు పడిపోయిన డాలర్ ఇండెక్స్ క్రమంగా బలోపేతమై 95 వద్ద కీలక నిరోధాన్ని దాటి ఏకంగా దాదాపు 97 స్థాయి చూడ్డం ఇక్కడ ప్రస్తావనార్హం. వడ్డీరేట్ల పెంపు ధోరణి మామూలుగానే ఉంటుంది తప్ప, జోరుగా ఏమీ ఉండబోదని అమెరికా ఫెడ్ చీఫ్ పావెల్ చేసిన ప్రకటన, తాజాగా ముగిసిన వారంలో డాలర్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్ తాజా గరిష్ట స్థాయి నుంచి పతనమైంది. దీనితో పుత్తడి మళ్లీ పైకి ఎగసి శుక్రవారంతో ముగిసిన వారంలో 1,212 డాలర్ల వద్దకు చేరింది. వారంలో 19 డాలర్లు ఎగసింది. సమీపకాలంలో పసిడి కొంత ర్యాలీ ఖాయమన్నది నిపుణుల భావన. 1,200 డాలర్ల స్థాయి ‘స్వీట్ స్టేజ్’ అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒక దేశీయంగా చూస్తే, పసిడి ధర తగ్గినా, రూపాయి బలహీనపడుతున్న ధోరణి భారత్‌లో బంగారం మరింత తగ్గడానికి అడ్డంకిగా ఉండడం గమనార్హం. -
వాణిజ్య యుద్ధం ముదిరితే... పసిడి పైకే!
అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైతే, వృద్ధి మందగమన పరిస్థితుల్లో బంగారం ధర మరింత పెరగడం ఖాయమని కొందరు నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రత్యేకించి ఈ సందర్భంలో చైనా అమెరికా బాండ్లను విక్రయించి, బంగారం కొనుగోలుకు మొగ్గుచూపే అవకాశం ఉందని, ఇది బంగారం ధర పెరుగుదలకు సానుకూల అంశమని విశ్లేషనలు వినిపిస్తున్నాయి. ఇక డాలర్ ఇండెక్స్‌కు 95 వద్ద గట్టి నిరోధం ఎదురవుతోంది. ఇది పసిడికి బలాన్ని ఇచ్చే అంశమని విశ్లేషణ. శుక్రవారంతో ముగిసిన వారంలో డాలర్ ఇండెక్స్ 93.76 వద్ద ముగిసింది. వారం మొదట్లో 94.80 స్థాయిలో ఉంది. వారంలో భారీ ఒడిదుడుకులు... నైమెక్స్‌లో (31.1గ్రా) ధర సోమవారం ప్రారంభంలో 1,252 డాలర్ల వద్ద ఉంది. మంగళవారం భారీగా 1,238 డాలర్ల స్థాయికి పడిపోయింది. అయితే ఈ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో తదుపరి రోజుకు 1,262 డాలర్లకు చేరింది. వారం చివరకు 1,256 డాలర్ల వద్ద ముగిసింది. టెక్నికల్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలికంగా పసిడి ‘ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్ర న్లో ఉంది. నెక్‌లైన్‌పైన ఇది స్థిరీకరణ జరిగి, (1,400 డాలర్ల) బ్రేక్ అయితే, పసిడి 1,700 డాలర్ల దిశగా ముందుకుసాగే అవకాశం ఉంది. గత నెల వరకూ పసిడి 1,370–1,310 డాలర్ల మధ్య తిరిగిన సంగతి తెలిసిందే. దేశీయంగా స్వల్ప లాభాలు.. కాగా దేశీయంగా ప్రధాన ముంబై మార్కెట్లో 99.5, 99.9 స్వచ్ఛత 10 గ్రామల ధర రూ.210 చొప్పున ఎగసి రూ.30,680, రూ.30,530 స్థాయికి ఎగశాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో ధర 30,560 వద్ద ముగిసింది. ఇక డాలర్ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం 68.76 వద్ద ముగిసింది. నిపుణుల అంచనా -
బలహీనంగా ఉన్నా... బలపడొచ్చు!
అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజి– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 15వ తేదీతో ముగిసిన వారంలో 21 డాలర్లు తగ్గి, 1,282 డాలర్లకు చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ 1.25 శాతం ఎగిసి 93.55 నుంచి 94.80కి చేరడం దీనికి కారణమైంది. ఫెడ్ నిర్ణయంతో కీలక వడ్డీ రేట్లు ప్రస్తుతం 1.75–2.00 శాతానికి చేరాయి. రేట్ల పెంపు ప్రభావంతో తక్షణం ఇన్వెస్టర్లు బంగారం నుంచి కొంత పెట్టుబడులను ఉపసంహరించారని భావించవచ్చు. దీనితో పసిడి 1,280 డాలర్ల కీలక మద్దతును టెస్ట్ చేసింది. అయితే బంగారం.. తక్షణం బలహీనంగా కనబడినప్పటికీ ఇది దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. భౌగోళిక రాజకీయ, ఆర్థిక ఉద్రిక్త పరిస్తితులు.. ముఖ్యంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలను ఇందుకు కారణాలుగా ఉదహరిస్తున్నారు. ‘‘పసిడి ధరల దిగువ స్థాయిని స్వల్ప కాలికంగా మనం చూస్తే చూడవచ్చు. అయితే బంగారంలో భారీ అమ్మకాలు ఉంటాయని నేను భావించడం లేదు. గత వారం చోటు చేసుకున్న పరిణామాలతో పసిడి కొంత వెనక్కు తగ్గి ఉండవచ్చు. అయితే ఇప్పటికీ పటిష్ట స్థాయిలోనే ఉందని నేను విశ్వసిస్తున్నాను’’ అని లండన్ క్యాపిటల్ గ్రూప్‌లో రిసెర్చ్ విభాగం హెడ్ జాస్పర్ లాలెర్ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలే పసిడికి రక్షణగా ఉంటాయన్న అభిప్రాయాన్ని కామర్జ్బ్యాంక్లో కమోడిటీ విశ్లేషణా విభాగం హెడ్ ఈజిన్ వెయిన్‌బర్గ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. పసిడి ఈ ఏడాది మూడు సార్లు 1,360 డాలర్ల స్థాయిని తాకింది. మూడు వారాల క్రితమే 1,300 డాలర్ల దిగువను చూసింది. తక్షణ నిరోధం 1,310 డాలర్లు. ఇది 200 రోజుల మూవింగ్ యావరేజ్ కూడా కావడం గమనార్హం. ఇక 1,280–1,270 డాలర్ల శ్రేణి మద్దతును స్థాయిని కోల్పోతే, మరింత అమ్మకాల ఒత్తిడితో పసిడి 1,240 డాలర్ల వరకూ పడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. దేశీయంగా తగ్గింది అంతంతే... అంతర్జాతీయంగా పసిడి ధర భారీగా పడినప్పటికీ, దేశీయంగా మాత్రం ఆ స్థాయిలో తగ్గలేదు. 15తో ముగిసిన వారంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా తగ్గడమే (దాదాపు రూపాయి పతనమై 68.47 వద్ద ముగింపు) దీనికి కారణం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర వారంలో కేవలం రూ.205 తగ్గి, రూ.31,010కి చేరింది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో బంగారం ధర తగ్గకపోగా పెరిగింది. 99.9, 99.5 స్వచ్ఛత గల పసిడి ధరలు వారంలో రూ.90 చొప్పున లాభపడి రూ.31,250, రూ.31,100 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.1,290 లాభపడి రూ.41.515 వద్దకు చేరింది. -
మద్దతుపైనే పసిడి..
మార్చి 9వ తేదీతో ముగిసిన వారంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ ఎక్సే్ఛంజ్ నైమెక్స్‌లో పటిష్ట స్థాయిలో నిలిచింది. వారం వారీగా ఔన్స్‌కు (31.1గ్రా) కేవలం ఒక డాలర్ అధికంగా 1,324 వద్ద ముగిసినప్పటికీ, తక్షణ మద్దతు 1,305 పైనే నిలవడం గమనార్హం. వారంలో 1,340 – 1,324 డాలర్ల శ్రేణిలో తిరిగింది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై వరుసగా 25,10 శాతం చొప్పున అమెరికా సుంకాల విధింపు... ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ ఇండెక్స్‌పై ఈ ప్రభావం దీనితోపాటు అమెరికా– ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతల ఉపశమనం వంటి అంశాలు వచ్చే కొద్ది నెలల్లో పసిడి కదలికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయా ప్రభావ అంశాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పసిడి 1,250 డాలర్లు – 1,400 డాలర్ల స్థాయిలోనే తిరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. 1,300, 1,270, 1,240 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఎగువస్థాయిలో తక్షణ నిరోధం 1,365 డాలర్లు. ఇక డాలర్ ఇండెక్స్ గడచిన వారంలో స్వల్పంగా 0.25 సెంట్లు పెరిగి 89.95 నుంచి 90.11కు ఎగసింది. దేశంలో రూపాయి అడ్డు..: అంతర్జాతీయ ప్రభావంతోపాటు దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి బలోపేతం (వారం వారీగా 28 పైసలు లాభంతో 64.94) ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో పసిడిపై కనిపించింది. వారంలో 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.47 తగ్గి, రూ.30,401కి చేరింది. ఇక దేశీయంగా ముంబై ప్రధాన మార్కెట్లో పసిడి వారం వారీగా 99.9 స్వచ్ఛత ధర రూ.300 లాభంతో రూ.30,545కు చేరింది. -
రూపాయికి ‘ఫెడ్’ షాక్!
డాలర్ ఇండెక్స్ రయ్ రయ్... ► రూపాయికి 54 పైసలు నష్టం ► అమెరికా సెంట్రల్ బ్యాంక్ ► ‘కఠిన విధాన’ ప్రకటన నేపథ్యం ► పసిడి 24 డాలర్లు డౌన్ ముంబై: అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుందని, ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు ఫెడ్ ఫండ్ రేటు పెంపు ఖాయమని అమెరికా సెంట్రల్ బ్యాంక్ బుధవారం చేసిన ప్రకటన డాలర్ ఇండెక్స్ పెరుగుదలకు, రూపాయి పతనానికి దారితీశాయి. బంగారం కూడా అంతర్జాతీయ మార్కెట్లో భారీగా 20 డాలర్లు పైగా పడిపోయింది. వివరాలివీ.... డాలర్ ఇండెక్స్: ఫెడ్ రేటు (ప్రస్తుతం 1 – 1.25 శాతం) పెంపు తప్పదన్న నిర్ణయంతో పాటు అక్టోబర్ నుంచి నగదు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు లిక్విడిటీని వెనక్కు తీసుకునే చర్యలకు శ్రీకారం చుడతామని భారత్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30కి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడే సమయానికి డాలర్ ఇండెక్స్ 91.30 వద్ద ఉంది. ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే ఇండెక్స్ భారీగా ఒక డాలర్ మేర లాభపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తక్షణం వెలువడిన ‘బులిష్ ధోరణి’ ఫలితం ఇది. గురువారం ఈ వార్త రాసే సమయానికి డాలర్ ఇండెక్స్ గరిష్ట స్థాయి 92.46కాగా, కనిష్టస్థాయి 91.89. రూపాయిపైనా ప్రభావం... డాలర్ విలువకు జోష్ రావటం గురువారంనాడు భారత రూపాయిపై ప్రభావం చూపించింది. ఫారెక్స్ మార్కెట్లో సాయంత్రం 5 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, డాలర్ మారకంలో రూపాయి విలువ 54 పైసలు నష్టపోయింది. 64.81 వద్ద ముగిసింది. ఇది రెండున్నర నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కాగా. కడపటి సమాచారం అందేసరికి, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ మరింత బలహీనంగా 64.90 వద్ద ట్రేడవుతోంది. రూపాయి కనిష్ట–గరిష్ట స్థాయిలు 64.29 – 65.07గా నమోదయ్యాయి. జారిన బంగారం... ఉత్తరకొరియా ఉద్రిక్తత, అమెరికా ఆర్థిక అనిశ్చితులు, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాల నేపథ్యంలో, బంగారం రెండు వారాల క్రితం ఔన్స్‌కు (31.1 గ్రా.) 1,365 డాలర్ల ధరను తాకింది. లాభాల స్వీకరణతో అటు తర్వాత కిందకు దిగుతూ వస్తున్న బంగారానికి ‘ఫెడ్’ నిర్ణయం దెబ్బ గట్టిగానే తగిలింది. గురువారం ఒకానొకదశలో బుధవారంతో పోలిస్తే ఏకంగా 20 డాలర్లు తగ్గి, 1,296 డాలర్ల వద్దకు దిగజారింది. ఒక దశలో 1,292 డాలర్ల స్థాయిని సైతం తాకింది. గత ట్రేడింగ్‌లో బంగారం 1,300 డాలర్లను తాకడానికి దాదాపు రెండు వారాలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గురువారం ట్రేడింగ్ అంతా ఇలా బలహీనంగానే సాగితే 1,300 డాలర్ల కీలక మద్దతును కోల్పోయినట్లే. దేశీయంగా స్పాట్, ఫ్యూచర్స్ ఇలా...: ఇక దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్.. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర ఒకదశలో క్రితం ముగింపుకన్నా రూ.220 నష్టంతో రూ. 29,554 వద్దకు దిగజారింది. ముంబై స్పాట్లో బుధవారం 99.9 స్వచ్ఛత ధర రూ. 220 తగ్గి రూ.29,730 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.29,580కి చేరింది. వెండి కేజీ ధర రూ.600 కిందకుదిగి రూ.39,265కు పడింది. -
పసిడి ‘బుల్’ రన్!
♦ 15 డాలర్లు పడిలేచిన బంగారం ♦ ‘రేటు’ పెంపు ఉండదనే అంచనాలు ♦ భారీగా పడిన డాలర్ ఇండెక్స్ అమెరికా ఆర్థిక పరిణామాలు పసిడిని పటిష్ట స్థాయిలో ఉంచుతున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఆగస్టు 25వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో వారం వారీగా పసిడి ఔన్స్ (31.1 గ్రా.) ధర వారం వారీగా కేవలం ఒక్క డాలర్ పెరిగి 1,296 డాలర్ల వద్ద పటిష్టంగా ఉన్నప్పటికీ, పసిడిది ‘బుల్’ ధోరణే’ అన్నది నిపుణుల అంచనా. భారీ ఒడిదుడుకులు...: వారమంతా పసిడి భారీ ఒడిదుడుకుల్లో ఉంది. 25వ తేదీ శుక్రవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ చీఫ్ జానెట్ యెలెన్ ఆర్థిక వ్యవస్థపై ప్రకటన చేయనుండటం, అదే రోజు అమెరికా జూలై నెల వినియోగ వస్తువుల గణాంకాలు విడుదల కానుండటంతో వారమంతా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. శుక్రవారం కీలక నిరోధం 1,300 డాలర్ల స్థాయి వద్ద ఉన్న పసిడికి టెక్నికల్‌గా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. మరోవైపు యెలెన్ ప్రకటన నేపథ్యంలో 1,280 డాలర్ల స్థాయికి కుప్పకూలింది. అయితే యెలెన్ తన ప్రకటనలో ‘ఫెడ్ రేటు’ (ప్రస్తుతం 1.00–1.25 శాతం శ్రేణి) ప్రస్తావన చేయకపోవడంతో వారమంతా దాదాపు 93పైన కొనసాగిన డాలర్ ఇండెక్స్ దాదాపు ఒక డాలర్ కుప్పకూలి 92 స్థాయికి చేరుకుంది. దీంతో బంగారం పడినంత వేగంగానే తిరిగి 1,295 స్థాయికి లేచింది. 1,300 నిరోధం కీలకం...: గత వారం 1,303 స్థాయికి చేరి, అక్కడ నిలబడలేకపోయిన పసిడి ఈ నిరోధాన్ని అధిగమించడానికి ఈ వారమంతా ప్రయత్నించింది. 1,340 స్థాయికి చేరడానికి తక్షణ నిరోధం ఇదేనని టెక్నికల్ అనలిస్టుల అభిప్రాయం. ఇక దిగువ దిశలో 1,280, 1,242, 1,204 స్థాయిల వద్ద మద్దతు లభిస్తుందన్నది వారి అంచనా. దేశీయంగా రూపాయి ఎఫెక్ట్... నిజానికి అంతర్జాతీయంగా పసిడి దాదాపు అక్కడక్కడే ఉంది కాబట్టి దేశంలో కూడా అదే పరిస్థితి ఉండాలి. అయితే దేశీయంగా ధర పడింది. అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ వారంవారీగా దాదాపు 24 పైసలు బలపడి 63.85 వద్ద ముగియడం దీనికి కారణం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో రూ.118 తగ్గి రూ. రూ.29,167 కి చేరింది. ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.225 తగ్గి, రూ.29,060కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పడి రూ. 28,910కు చేరింది. వెండి కేజీ ధర కూడా భారీగా రూ.590 తగ్గి రూ. 38,710 కి చేరింది. -
పసిడి... 1240 వద్ద మద్దతు
♦ వారంలో స్వల్ప పెరుగుదల ♦ అదే స్థాయిలో బలహీనపడిన డాలర్ ఇండెక్స్ న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి శుక్రవారం 23వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా 2 డాలర్లు పెరిగింది. ఔన్స్ (31.1గ్రా) ధర కేవలం రెండు డాలర్లు పెరిగి 1,258 డాలర్లకు చేరింది. పది రోజుల క్రితం అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 1–1.25 శాతం) పావు శాతం పెరగటమే దీనిక్కారణంగా కనిపిస్తోంది. రేటు పెరుగుతుందన్న అంచనాలతో జూన్ 9తో ముగిసిన వారంలోనే... ఐదువారాల పరుగును ఆపి బంగారం 10 డాలర్లు తగ్గింది. ఈ అంచనాలను నిజం చేస్తూ... 14వ తేదీన ఫెడ్ తీసుకున్న రేటు పెంపు నిర్ణయంతో 16వ తేదీతో ముగిసిన వారంలో మరో 13 డాలర్లు తగ్గింది. అంటే పక్షం రోజుల్లో పసిడి దాదాపు 23 డాలర్లు తగ్గింది. డాలర్ బలహీనపడుతుందన్న అంచనాలు ఇందుకు కారణంకాగా, రేటు పెంపు డాలర్ ఇండెక్స్‌కు సానుకూలమన్న తక్షణ అంచనాలు పసిడిలో ఇన్వెస్లర్ల లాభాల స్వీకరణకు కారణమైంది. ఇక డాలర్ ఇండెక్స్ మాత్రం వారం వారీగా స్వల్పంగా తగ్గి 97.16 నుంచి 96.98కి చేరింది. అమెరికా ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అమెరికా అధ్యక్షుడి డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడి పెరుగుదలకు భవిష్యత్తులో దోహదపడతాయన్న అంచనాలూ ఉన్నాయి. పసిడికి 1,240 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. గడచిన వారంలో రెండుసార్లు ఇదే స్థాయికి పడిన పసిడి, అక్కడి నుంచి పైకి ఎగయడం గమనార్హం. పసిడి తగ్గుదల కొనుగోళ్లకు అవకాశమన్నది పలువురి విశ్లేషణ. 103.88 గరిష్ట స్థాయిని చూసిన డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 97 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌లోనూ కొంచెం ముందుకు... మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు జూన్ 23వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ. 44 పెరిగి రూ. 28,734కు చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ. 120 పెరిగి రూ. 28,940కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో లాభపడి రూ. 28,790కి చేరింది. కాగా వెండి కేజీ ధర వారం వారీగా అక్కడక్కడే రూ. 38,960 వద్ద నిలకడగా ఉంది. -
డాలర్ బలహీనతే బలంగా బంగారం
♦ వారంలో 96.61కి దిగిన డాలర్ ఇండెక్స్ ♦ 13 డాలర్లు ఎగసిన పసిడి ♦ 3 వారాల్లో 60 డాలర్ల పెరుగుదల అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి తోడు డాలర్ బలహీనత బంగారానికి బలిమిగా మారుతోంది. జూన్ 2వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) మరో 13 డాలర్లు లాభపడి 1,279 డాలర్లకు చేరింది. వరుసగా మూడు వారాల్లో పసిడి దాదాపు 60 డాలర్లకు పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా కీలక పరిణామాల నేపథ్యంలో... పసిడి పరుగు మున్ముందూ కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. తక్షణం అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.75–1 శాతం) పెంచదన్న అంచనా ఇందులో ఒకటి. కొనసాగుతున్న డాలర్ పతనం!: అమెరికాలో ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే అమెరికా అధ్యక్షుని డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే డాలర్ పతనం కొనసాగుతుండడం గమనార్హం. మే 26వ తేదీ ముగిసిన వారంలో 97.33 వద్ద ముగిసిన డాలర్ ఇండెక్స్, జూన్ 2తో ముగిసిన వారంలో 96.61కు చేరింది. 100.51, 99.75, 99.04, 98.42 ఇలా... నాలుగు వారాలుగా తగ్గుతూ వచ్చిన డాలర్ ఇండెక్స్ మే 13వ తేదీతో ముగిసిన వారంలో మాత్రం స్వల్పంగా కోలుకుని 99.05 వద్ద ముగిసింది. అయితే మళ్లీ వారం తిరిగే సరికి అంటే మే 19వ తేదీతో ముగిసిన వారంలో భారీగా 2.05 డాలర్లు పతనమై 97.00 వద్ద ముగియడం గమనార్హం. మే 26వ తేదీతో ముగిసిన వారంలో కొంత కోలుకున్నా, మళ్లీ పడిపోవడం గమనార్హం. భారత్‌లో ‘రూపాయి’ అడ్డు అంతర్జాతీయంగా పసిడి భారీగా పెరిగినప్పటికీ ఆ ప్రభావం దేశంలో గడచిన వారంలో అంతగా కనబడలేదు. డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్టత దీనికి ప్రధాన కారణం. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు జూన్ 2వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ.16 తగ్గి రూ.28,871కు పడింది. అంతక్రితం రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.900 లాభపడింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.65 తగ్గి రూ.28,920కి చేరింది. -
ఆర్థిక అనిశ్చితిలో పసిడి మెరుపు
♦ వారంలో డాలర్ ఇండెక్స్ 2.05 పతనం ♦ 27 డాలర్లు దూసుకుపోయిన పసిడి న్యూయార్క్/ముంబై: పసిడి మళ్లీ వారం తిరిగే (19వ తేదీతో ముగిసిన వారానికి) సరికి మళ్లీ రయ్యిమని 27 డాలర్ల దూకుడుతో 1,255 డాలర్లకు ఎగసింది. అమెరికా– ఉత్తరకొరియా ప్రకటనల ఉద్రిక్తతలు సడలిన నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో వరుసగా నాలుగు వారాల్లో 61 డాలర్లు పతనమై, 13వ తేదీతో ముగిసిన వారంలో 1,228 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 1,220 డాలర్ల వద్ద పసిడికి పటిçష్ట మద్దతు లభిస్తోందని, 1,260 స్థాయిలో వద్ద నిరోధం ఉంటుందని నిపుణుల అంచనా. కారణం ఇదీ... అమెరికా రాజకీయ పరిస్థితులు, తద్వారా ఆర్థిక సంక్షోభ భయాలు మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గత వారం ప్రతికూల ప్రభావం చూపాయి. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్‌పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం, గత ఏడాది అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం అవకాశాలపై విచారణకు ప్రత్యేక కౌన్సిల్ వంటి అంశాలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తద్వారా ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడంతో ఇన్వెస్టర్లు మళ్లీ తమ పెట్టుబడులకు తక్షణ రక్షణగా గత వారం బంగారాన్ని ఆశ్రయించారని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు డాలర్ ఇండెక్స్ తగ్గుదల అవసరముందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా వ్యాఖ్యలు కూడా పసిడి పుంజుకోడానికి బాటలు వేశాయి. డాలర్ మళ్లీ కిందచూపు... అమెరికాలో ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే అమెరికా అధ్యక్షుని డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. 100.51, 99.75, 99.04, 98.42 ఇలా... నాలుగు వారాలుగా తగ్గుతూ వచ్చిన డాలర్ ఇండెక్స్ మే 13వ తేదీతో ముగిసిన వారంలో మాత్రం స్వల్పంగా కోలుకుని 99.05 వద్ద ముగిసింది. అయితే మళ్లీ వారం తిరిగే సరికి భారీగా 2.05 డాలర్లు పతనమై 97.00 వద్ద ముగియడం గమనార్హం. -
బంగారం మెరుపు పదిలం!
♦ డాలర్ ఇండెక్స్ 100 డాలర్ల దిగువకు పడిన నేపథ్యం ♦ దేశంలోనూ ఇదే దూకుడు ♦ రెండు వారాల్లో రూ.500 అప్ న్యూయార్క్/ముంబై: అటు అంతర్జాతీయ మార్కెట్లో అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పసిడి దూకుడు కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ పతనం కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే 24వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో డాలర్ ఇండెక్స్ 100 డాలర్ల దిగువకు అంటే 99.59 స్థాయికి చేరింది. వారం వారీగా చూస్తే 101 డాలర్ల నుంచి ఈ స్థాయికి డాలర్ ఇండెక్స్ దిగివచ్చింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) వారం వారీగా 14 డాలర్లు పెరిగి 1,243 డాలర్లకు చేరింది. ఈ నెల 15న అమెరికా ఫెడ్– ఫండ్ రేటును 0.25 శాతం (0.75 శాతం – 1 శాతం శ్రేణికి) పెంచిన తరువాత, అనూహ్య రీతిలో డాలర్ బలహీనత– బంగారం బలోపేతం జరుగుతున్న విషయం తెలిసిందే. 17వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి దాదాపు 25 డాలర్లు పెరిగింది. డాలర్ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా... అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 24వ తేదీతో ముగిసిన వారంలో రూ.284 పెరిగి రూ.28,793కి చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.400 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.255 పెరిగి రూ.28,895కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,745కి ఎగసింది. రెండు వారాల్లో ధర దాదాపు రూ.500 పెరిగింది. వెండి కేజీ ధర రూ. 335 పెరిగి రూ.41,660కు పెరిగింది. రెండు వారాల్లో ధర రూ.550కి పైగా ఎగసింది.