ముంబై: గతవారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ, ట్రేడింగ్‌కు సంబంధించి ఈ ఏడాదికి ఇదే ఆఖరి వారం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది. కావున భారీ లాభాలైతే కనిపించకపోవచ్చు. ప్రపంచ పరిణామాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.
చైనాతో పాటు పలుదేశాల కోవిడ్ కేసుల నమోదు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో గతవారంలో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు చొప్పున కోల్పోయాయి.
‘సాధారణంగా ప్రతి ఏడాది చివరి రోజుల్లో ఫండ్ మేనేజర్లు ఖాతాల్లో సర్దుబాట్లు చేస్తుంటారు. అందులో భాగంగానే గతవారంలో లాభాల స్వీకరణ జరిగింది. సూచీలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలు మద్దతు లభించవచ్చు. రికవరీ జరిగితే నిఫ్టీకి 18,000 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,700 స్థాయిలో తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోతే 17400 వద్ద మరో మద్దతు స్థాయి లభించొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
► కొత్త వేరియంట్ బీఎఫ్.7 ఆందోళనలు
చైనాతో పాటు పలు కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసుల నమోదు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తుంది. భారత్‌పై ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.., కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అధికార గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లపై ఈ రకం వేరియంట్ కేసలు నమోదు ప్రభావం స్వల్పకాలం పాటు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
► ఆర్థిక గణాంకాలు
చైనా, జపాన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వరుస మంగళ, బుధవారాల్లో విడుదల కానున్నాయి. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం, భారత నవంబర్ ద్రవ్యలోటు శుక్రవారం వెల్లడి కానున్నాయి. అదేరోజున ఆర్‌బీఐ డిసెంబర్ 23 తేదీన ముగిసి వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 16వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది.
► ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ
ఈ గురువారం(డిసెంబర్ 30న) నిఫ్టీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,500–17,800 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది.
► రెండు లిస్టింగులు, రెండు పబ్లిక్ ఇష్యూలు
ఈ ఏడాది ఆఖరి వారంలో రెండు ఐపీఓలు రాను న్నాయి. అలాగే పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న రెండు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నా యి. గతవారంలో (23న) ప్రారంభమైన రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఐపీఓ మంగళవా రం ముగిస్తుంది. షాలీ పాలీమర్స్ ఇష్యూ డిసెంబర్ 30–జనవరి 22 తేదీల మధ్య జరగనుంది. కేఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ గురువారం ఉండగా, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ షేర్ల లిస్టింగ్ శుక్రవారం ఉంది.
రికవరీకి అవకాశాలు
Published Mon, Dec 26 2022 5:34 AM | Last Updated on Mon, Dec 26 2022 5:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment